జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా భుజాన వేసుకుని అన్న తరపున ప్రచారం చేసింది షర్మిల
వైఎస్ఆర్సీపీ పార్టీకి తల్లి గౌరవాధ్యక్షురాలు.. అన్న కార్యనిర్వహక అధ్యక్షుడు
షర్మిలకు కూడా పార్టీ పదవి ఉన్నట్టు గుర్తు
జగన్ అధికారంలోకి వచ్చాడు
ఆస్తి గొడవలో.. అధికారంలో వాటాలు దక్కలేదనో.. పార్టీలో ప్రాధాన్యత లేదనో కారణాలు ఏమైనా కానివ్వండి అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం పెరిగింది
అందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు రాజకీయాలు అంటేనే ఇలా ఉంటాయి కదా
ఫ్యామిలీ గొడవలు కాబట్టి రచ్చ ఎందుకనుకుందో ఏమో కానీ షర్మిల తెలంగాణాలో సొంత పార్టీ పెట్టుకుంది
ఆ పార్టీ హిట్ అయ్యుంటే కథ వేరేలా ఉండేది
అన్న ఏపీలోనూ. చెల్లి తెలంగాణలోనూ ఎవరి పనులు వాళ్లు చేసుకునేవాళ్ళు
కానీ షర్మిల పెట్టిన పార్టీ వర్కౌట్ కాలేదు
అక్కడ ఏపీలో అన్న హాయిగా అధికార పీఠం మీద కూర్చుంటే ఇక్కడ తెలంగాణాలో నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది షర్మిలకు
ఆక్రోశం వచ్చింది
ప్లాన్ బి స్టార్ట్ చేసింది
ఇది నేరుగా అన్నతోనే యుద్ధం
ఈ యుద్ధంలో తన గెలుపు కన్నా అన్న ఓటమినే ఆమె కోరుకుంది షర్మిల
అప్పుడు ఆమె చెప్పిన మాట ‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడు..ఆ దేవుడి పేరు చెప్పుకుని కొందరు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు ‘ అని
నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవిత కూడా ఇంచుమించు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చింది
” కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి “అని
ఈ స్టేట్మెంట్లు ఫ్యామిలీ తగదాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను సూచిస్తుంది అన్నమాట
మళ్ళీ షర్మిల విషయానికి వస్తే గతంలో ఆవిడ కూడా అన్న తీరును విమర్శిస్తూ ఓ ఘాటైన లేఖ రాసి మీడియాకు లీక్ చేసింది
ఈ మధ్య కవిత కూడా కొన్ని విషయాల్లో తండ్రి తీరును విమర్శిస్తూ ఓ లేఖ రాసి మీడియాకు లీక్ చేసింది
ఈ లేఖల ప్రహసనం రెండో ప్రమాద హెచ్చరికను సూచిస్తుంది
ఏతావాతా జగన్ నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి అన్న మీద రాజకీయ యుద్ధం ప్రకటించింది
అంతకుముందు తన తెలంగాణా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసింది
చెల్లి కోరిక అయితేనేమి
చెల్లి పోరు అయితేనేమి
మారిన రాజకీయ సమీకరణాలు అయితేనేమి
ఏపీలో జగన్ ఓడిపోయాడు
పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు అన్నా చెల్లెళ్ళ పోరులో కూటమి నాయకులు అధికారం దక్కించుకోవడంలో ఇది కూడా ఒక కారణం
ఇది ఏపీలో జరిగిన చరిత్ర
ఇప్పుడు తెలంగాణాలో కూడా అటువంటి కథే పునరావృతం కాబోతుందా?
కవిత వాలకం చూస్తుంటే తొలినాళ్లలో షర్మిల వాలకం మాదిరే ఉంది
కవిత పైకి నవ్వుతూ కనపడుతున్నా లోపల అగ్ని పర్వతాలు పేలుతున్నాయి ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా అర్థమౌతుంది
మే 2వ తేదీన కేసీఆర్ ను ఉద్దేశిస్తూ డాడీ అని లెటర్ రాసింది తానే అని ఒప్పుకుంది
రాజకీయ ఫ్యామిలీలలో ఉత్తరాలు రాయడం అనేది గ్యాప్ ను సూచిస్తుంది
ఉత్తరంలో రాసిన విషయాలే ఫామ్ హౌస్ కి వెళ్ళి తండ్రితో నేరుగా చర్చించే చొరవ కవితకు ఉంది
కానీ లెటర్ రాసింది
ఏంచేతా ?
ఆ లెటర్లో పొగడ్తలతో పాటు నేరుగా తండ్రి మీద విమర్శనాస్త్రాలు కూడా సంధించింది
అది ముఖాముఖి చెప్పే విషయాలు కావు
ఒకవేళ చెప్పినా కేసీఆర్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది
ఇప్పటిదాకా కేసీఆర్ నాయకత్వాన్ని పార్టీలో ఉండి ప్రశ్నించిన ధైర్యస్తులు ఎవరూ లేరు
మొదటిసారి కూతురు ఆ పని చేసింది లేఖ రాయడం ద్వారా
కవితకు తండ్రి మీద బయటికి కనబడని అసంతృప్తి ఉండటానికి కారణం ఉంది
బీజేపీ ప్రభుత్వం తనను జైలు పాలు చేసి పెట్టిన ఇబ్బందులు గుర్తు చేస్తూ వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేస్తూ బలంగా మాట్లాడి ఉండాల్సింది డాడీ అని తన మనసులో మాటను బయట పెట్టింది
అదే కారణం లెటర్లో కూడా రాసింది
ఇక నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు మొట్టమొదటిసారిగా భిన్నమైన స్వాగత ఏర్పాట్లు జరిగాయి
BRS పార్టీ క్యాడర్.. నాయకులు. జెండాల స్థానంలో బీసీ సంఘాల నాయకుల స్వాగతం లభించింది
పార్టీకి కవితకు గ్యాప్ పెరుగుతుంది అనటానికి ఇదో ఉదాహరణ
షర్మిల మాదిరి కవిత కూడా త్వరలో సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు
(అల్లుళ్ళ గిల్లుడు అలా ఉంటుంది మరి)
ఆల్రెడీ తెలంగాణా జాగృతి సంస్థ తరపున కవిత తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది
ఆ పరంగా ఆవిడకు సొంత క్యాడర్ కూడా ఉంది
ఎయిర్పోర్టులో కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి.. అని ఆవిడ మనసులో ఉన్న దయ్యాల్ని టార్గెట్ చేస్తూ విమర్శించింది
ఇది గతంలో వైఎస్ఆర్ దేవుడు.. కానీ ఆయన వారసుడు కాదు అని షర్మిల చెప్పినట్టు లేదూ?
ఫైనల్గా కవిత BRS పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం పట్ల అసంతృప్తిగా ఉందన్న మాట వాస్తవం
కవిత చెప్పిన దయ్యాలు కేటీఆర్ అనీ.. హరీష్ రావు అనీ..సంతోష్ కుమార్ అనీ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి
అయితే ఆ దయ్యాల పేర్లు కూడా కవిత తన నోటితోనే చెప్తే కానీ నిర్ధారణ కాదు
అది సరే గానీ పార్టీలో ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ సైలెంటుగా ఎందుకున్నడు?
ఇదేవన్నా ఇంకో వ్యూహమా?
చూద్దాం ఏం జరుగుతుందో??
పరేష్ తుర్లపాటి