అనుబంధాలు..

Spread the love

అనుబంధాలు

ఇద్దరు మనుషుల మధ్య ఆత్మీయానుబంధం ఏర్పడటానికి రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు.. కొన్ని అనుబంధాలు వీటికి అతీతంగా పుట్టుకొస్తాయి..అలాంటి అనుబంధం కథే ఈ కథ కాని నిజం..నా స్వీయానుభవం !!

” విజయవాడ వచ్చింది దిగండి ..దిగండి..” అని డ్రైవర్ పెట్టిన కేకకు మెలుకువ వచ్చి టైం చూసుకున్నా..మార్నింగ్ ఫైవ్ అవుతుంది !

హైద్రాబాద్ నుంచి విజయవాడకు బస్ లో ట్రావెల్ చేస్తే గమ్మత్తేమిటంటే రాత్రి 11 గంటలకు బస్ బయలుదేరినా ఒంటిగంటకు బయలుదేరినా విజయవాడ చేరేది మాత్రం ఉదయం ఐదు గంటలకే !

సరే బ్యాగ్ తీసుకుని బస్ దిగగానే ఆటోవాళ్ళు తగులుకున్నారు

గాంధీనగర్ లో ఉన్న హోటల్ జగపతికి పోనిమ్మని చెప్పి కూచున్నా

ఆటోవాడు వాయువేగంతో పోనిచ్చి గాంధీనగరంలోనే ఉన్న వెల్కమ్ హోటల్కు (ఇప్పుడు లేదు )ఆనుకుని ఉన్న ఒక హోటల్ దగ్గర ఆపాడు

“అదేంటి నేను చెప్పింది జగపతి హోటల్ కదా..ఇక్కడాపావెంటి ? కమిషన్ ఇస్తారా ? “చిరాగ్గా అడిగా

“సార్ ! కమిషన్ ఇస్తారన్న మాట నిజమే కానీ హోటల్ బాగుంటుంది సార్..పైగా జగపతి కన్నా రేట్ తక్కువ..అలాగని మందు.. అమ్మాయిలను సప్లై చేసే హోటల్ కాదు సార్ .. నేనిక్కడే ఉంటా..లోనికేల్లి చూసి బావుంటేనే డబ్బులివ్వండి సార్ !”

కాన్ఫిడెన్స్టియల్ గా చెప్పాడు ఆటో డ్రైవర్

సరే..వాడి మాటల్లో నిజమెంతో చూద్దామని దిగి హోటల్ రిసెప్షన్ లోకెళ్లా

ముందు రూమ్ చూసిన తర్వాతే హోటల్లో దిగేది లేనిది చెప్తా అన్నా

బాయ్ వచ్చి రూమ్ చూపించాడు
బానే ఉందనిపించింది

కిందకొచ్చి ఆటోవాడికి డబ్బులిచ్చి పంపేసి కౌంటర్ లో డబ్బు కట్టి అలాట్ చేసిన రూంలోకెళ్లా

కాసేపు పడుకుని తొమ్మిది గంటలకల్లా స్నానం ముగించి రెడీ అయ్యా

సరిగ్గా అప్పుడు బెల్ మోగింది

తలుపు తెరిచి చూసా

బయట ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు

“తుర్లపాటి వారబ్బాయా” అన్నాడు నవ్వుతూ

అవునని తలుపుతూ ‘ మీరు..? అన్నా ప్రశ్నర్ధకంగా ,

“నా పేరు ( వారి పేరు రాయట్లేదు..క్షమించండి ) ఫలానా ఖర్జురాల హోల్ సేల్ వ్యాపారి అంటే విజయవాడలో చాలామందికి తెలుసు..అది సరే కానీ మిగతా వివరాలు నా రూంకెళ్లి మాట్లాడుకుందాం..రా..”అని పిలిచారు

ఎందుకో ఆయన మాటల్లో నాకు ఆత్మీయత కనిపించింది

రూమ్ లాక్ చేసి ఆయనతో బయలుదేరా

హోటల్ టెర్రస్ మీద ప్రత్యేకంగా ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు

“జీవితంలో ఎప్పటికైనా పనికొస్తుందని ముందు జాగ్రత్తగా ఇదిగో ఇలా టెర్రస్ పై సెపరేట్ రూమ్ కట్టించుకున్నా..”అని నవ్వుతూ చెప్పారు

ఆశర్యంగా ఆయన వంక చూసా !

“ఏంటి ? ఈ ముసలోడేంటి..హోటల్ తనదే అన్నట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదూ.. నిజమేనయ్యా..ఈ హోటల్ నాదే.. దీనికి ఓనర్ నేనే..” కూల్ గా చెప్పాడాయన

నేను షాక్ తిన్నట్టు ఆయన వంక చూసా

ఈయనేంటి హోటల్ తనదే అంటున్నాడు

మనిషి చూస్తే లుంగీ బనీను తో సింపుల్ గా ఉన్నాడు

ఆలోచనల్లో ఉండగానే ఆయనే బెల్ కొట్టి రూమ్ బాయ్ ని పిలిచి “అరేయ్..నాకు బాబుకి బాబాయ్ హోటల్ లో ఇడ్లీలు పార్సిల్ కట్టించి తీసుకురా..” అని పురమాయించాడు

వాడు అత్యంత వినయంగా తలూపి వెళ్ళిపోయాడు

నాకు ఆయనతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు

“సార్ ! మీరుండేది ఎక్కడ ? ఐ మీన్ ఫామిలీ..?” నసిగా

“ఏడాది క్రితం వరకు సత్యనారాయణపురం లో ఉండేవాడిని..తర్వాత నేను నా భార్య ఇద్దరం ఇక్కడికొచ్చేసాం..అదిగో ఆవిడే నా భార్య..” అంటూ రూంలోనే గోడకు వేలాడుతున్న ఫోటో చూపించాడు

ఫోటో వంక చూసి షాక్ తిన్నా ,

ఆవిడ ఫోటోకు దండ వేలాడుతుంది
అంతకుముందే వెలిగించారేమో అగరొత్తులు వెలుగుతున్నాయ్

నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు

“అంటే ఫ్యామిలీ..పిల్లలు..??” మళ్ళీ అడిగా చిన్నగా

“ఉన్నారు బాబూ..కొడుకు కోడలు..తను ఉండగానే పెళ్లి చేసాం..వాడి సంసారం కూడా వాడు చూసుకోవాలి కదా ! జీవితమంతా వ్యాపారాలు చేసి తన సుఖం గురించి పట్టించుకోలేదు బాబూ.. చివరికి నేను అలిసిపోయిన సమయానికి తను వెళ్ళిపోయింది..ఆ ఇంటిలో తనతో పంచుకున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని ఇంటిని కొడుకు కోడలుకు అప్పచెప్పి ఇదిగో ఇలా మా ఆవిడ జ్ఞాపకాన్ని నాతో తెచ్చుకుని కాలక్షేపం చేస్తూ శివయ్య ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నా..” ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీరు కనపడుతునేఉంది

నిజం చెప్పొద్దూ..నాకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి

అప్పుడు అర్థం అయ్యింది

ఆ ముసలాయన వృద్ధాప్యంలో ఆత్మీయానుబంధాల కోసం ఎంతగా బాధ పడుతున్నాడో అని

ఈలోపు బాయ్ బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీలు పార్సిల్ పట్టుకొచ్చాడు

ఇద్దరం టిఫిన్లు తిన్నాక ఆయన చెప్పాడు

“ఎందుకో నిన్ను చూస్తే ఆత్మీయుడిలా అనిపించావు..ఆస్తిపాస్తులెన్ని ఉన్నా వృద్ధాప్యంలో మనసు విప్పి చెప్పుకోవడానికి ఆత్మీయులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి బాబు..” అని నేనొచ్చిన పని వివరాలు కనుక్కుని బెల్ కొట్టి కౌంటర్లో క్యాషియర్ ని పిలిచి చెప్పాడు

“తుర్లపాటి వారబ్బాయి ఎప్పుడొచ్చినా రూమ్ ఇవ్వండి..డబ్బులు తీసుకోవొద్దు..రూమ్ ఖాళీ లేకపోతే నా రూమ్ కి పంపించు..”

నాకు జరుగుతున్నదేదీ అర్థం కాలేదు

ఆయనకు నాకు ఏంటి సంబంధం ?
ఇంతకుముందు ఎప్పుడూ కలిసింది లేదు?
ఎందుకు నాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు ?

ఆలోచిస్తూనే “మీరేం వర్రీ అవకండి..అంతా మంచే జరుగుతుంది..నేను పనిమీద వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూనే ఉంటా..హోటల్ లో రూమ్ కోసం కాదు..మీలాంటి పెద్దవాళ్ళ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం..” అని నమస్కారం పెట్టి బయటకు వచ్చేసా

పని పూర్తి చేసుకుని రూమ్ కి వచ్చేసరికి రాత్రి పది గంటలు అయ్యింది

రూమ్ ఖాళీ చేసి కౌంటర్ దగ్గరకు వచ్చా

“ఈ ముసలాయన ఇలా చేసే మూడొంతుల ఆస్తి హారతి కర్పూరం చేసాడు..ఇప్పుడు ఈ బిల్ గురించి చినబాబు గారేమంటారో..” కౌంటర్లో ఉన్నవాడు గొణుక్కుంటున్నాడు

“బిల్ ఏంతయింది ?” అడిగా

“అదీ..పెద్దాయన గారు చెప్పారుగా సర్..” గొణిగాడు

“పర్లేదు..బిల్ ఎంతో చెప్పండి..పే చేస్తాను..” అన్నా

క్యాషియర్ చెప్పిన బిల్ పే చేసి అడిగా “పెద్దాయన ఏరి ??” అని

“రూమ్ లో పడుకున్నారు సార్..మీరొచ్చాక చెప్పమన్నారు సార్ “

“పర్లేదు..ఆయన్ని డిస్ట్రబ్ చెయ్యొద్దు.. నేను ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోతున్నా..ఈ సారి వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పండి..” అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర హైదరాబాద్ ట్రావెల్స్ బస్ ఎక్కా

సీట్లో కూచుని కళ్ళుమూసుకుని పడుకున్నా ఎందుకో తెల్లార్లు ఆ పెద్దాయనే గుర్తుకువచ్చారు !

ఈమధ్య వచ్చిన సత్యం సుందరం సినిమాలో కార్తీ ప్రేమ తట్టుకోలేక అరవింద్ స్వామి అర్థరాత్రి అతడి ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడు

తర్వాత ఎప్పుడు చూసినా అమాయకత్వంగా కార్తీ తన మీద చూపించిన ప్రేమే గుర్తుకు వస్తుంది

అలా నాక్కూడా ఆ పెద్దాయన నామీద చూపించిన ప్రేమ ఇన్నేళ్ళయినా గుర్తుండిపోయింది

కారణాలు తెలీదు కానీ మళ్లీ ఆ హోటల్ కు వెళ్లే సందర్బమే రాలేదు ..ఇప్పుడెలా ఉన్నారో కూడా తెలీదు.. కుదిరితే మల్లోసారి ఆ హోటల్కెళ్లి ఆయన్ని కలవాలి

ఇది జరిగి మూడు దశాబ్దాలు కావొస్తోంది
అసలు ఆయన ఇప్పుడున్నారో లేదో కూడా తెలీదు

కొన్ని అనుబంధాలు అలా జ్ఞాపకాల్లోనే మిగిలిపోతాయేమో !!

ఈ రోజు ఖర్జురాలు తింటున్నప్పుడు గుర్తొచ్చిన పాత జ్ఞాపకం !!

పరేష్ తుర్లపాటి ✍️


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!