గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన A 1171 విమానం ప్రమాదానికి గురై కూలిపోయిన సంగతి తెలిసిందే
ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా మిగిలిన అందరూ మరణించారు
వారిలో విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కూడా ఉన్నారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎటు చూసినా కన్నీటి వెతలే కనిపిస్తున్నాయి
ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న బంధువుల వేదనలు .. రోదనలు మిన్నంటుతున్నాయి
కనీసం తమ వారి ఆఖరి చూపుకు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో డిఎన్ఏ పరీక్షల తర్వాత ఇచ్చే మాంసపు ముద్దల కోసం ఆసుపత్రుల బయట పడిగాపులు కాస్తున్నారు
అయినవారిని కోల్పోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ
చేతికి అంది వచ్చాడు అనుకున్న చెట్టంత కొడుకు గాల్లో కలిసిపోయాడని తెలిసి పైలట్ సుమిత్ తండ్రి పడుతున్న ఆవేదన ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తోంది .. కంట తడి పెట్టిస్తుంది
కెప్టెన్ సుమిత్ తండ్రి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్స్ లో ( DGCA ) పని చేసి రిటైర్ అయ్యారు
ప్రస్తుతం వయోభారంతో , అనారోగ్యంతో ముంబైలోని పోవై ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు
తండ్రి పరిస్థితి తెలుసుకుని పైలట్ సుమిత్ ఈమధ్యనే ఆయన దగ్గరికి వెళ్లి ” నాన్నా! ఇకపై మీరు ఒంటరిగా ఉండక్కర్లేదు .. త్వరలో పైలట్ ఉద్యోగం మానేసి మీ దగ్గరే ఉండిపోతా ” అని మాటిచ్చి వెళ్ళిపోయాడు
ఆ మాటతో ఒంటరితనంలో ఎదిగివచ్చిన కొడుకు తోడు ఉంటాడని ఆశ పడిన ఆ తండ్రి ఆశలు అడియాశ అయ్యింది
జీవితంలో ఇంకెప్పటికీ తిరిగిన రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు !
పరేష్ తుర్లపాటి