“మిలియన్స్ ఆఫ్ వ్యూస్”
అంతా ఒక మిధ్య!
–దిల్ రాజు
రిలీజ్ చేసిన క్షణాల వ్యవధిలో లక్షల లక్షల వ్యూస్ వచ్చేశాయంటూ… ముందుగానే డిజైన్ చేయించుకున్న పోస్టర్స్ విడుదల చేస్తుండడం గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ కొనుగోలు చేసిన వ్యూస్ అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. లక్షకు ఇన్ని వ్యూస్ చొప్పున కొనుగోలు చేసే ఈ వ్యూస్ వల్ల పైసా ప్రయోజనం లేదని, ఇకపై వాటికి తన నిర్మాణ సంస్థ చాలా దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బహిరంగంగా ప్రకటించారు. ఒకరితో ఒకరు పోటీలు పడి… తమ టీజర్ లేదా ట్రైలర్ లేదా పాటలకు ‘ఇన్ని మిలియన్స్.. అన్ని మిలియన్స్” వ్యూస్ వచ్చాయని ప్రకటించుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అవన్నీ పెయిడ్ వ్యూస్ మాత్రమేనని… ఆర్గానిక్ వ్యూస్ కావని… ఆ వ్యూస్ వల్ల సినిమాలకు ఎంతమాత్రం ఉపయోగం కావనే వాదనను.. దిల్ రాజు కుండ బద్దలు కొట్టినట్లుగా మీడియా సాక్షిగా సమర్ధించేశారు. అగ్ర నిర్మాతగానే కాకుండా… తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్న దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యల పుణ్యమా… మన టాలీవుడ్ లో ఇటీవల కాలంలో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న ఈ “మిలియన్స్ ఆఫ్ వ్యూస్” అనే ఓ అనారోగ్యకర ధోరణికి పెర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలు ఇకనైనా ఈ విషయంలో అవగాహన పెంచుకుని- ప్రెస్టేజ్ కోసం… తమ ప్రచార చిత్రాలకు అనవసరంగా బోలెడు డబ్బులు పోసి వ్యూస్ తెచ్చుకోవడం మానుకోవాలి. పెద్ద హీరోలకు వచ్చే వ్యూసే ఒరిజినల్ కానప్పుడు… తమ చిత్రాలకు వ్యూస్ కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయడం, వాటిని మళ్లీ ఘనంగా ప్రచారం చేసుకోవడం… అందు నిమిత్తం మళ్ళీ చమురు వదిలించుకోవడం శుద్ధ దండగ అన్న విషయం తెలుసుకోవాలి!
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ