ప్రేమ సాగరం
1983 లో విజయవాడ అప్సరా ధియేటర్లో వచ్చింది
టైటిల్ బావుంది
ప్రేమసాగరం అంటున్నాడు
సబ్జెక్ట్ మనకి సంబంధించిందే అయి ఉంటుంది
పైగా అప్పట్లో మనం యూతు ఆయే
కానీ
స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు
పైగా అరవ డబ్బింగు
అరవ యాక్టర్లు..అరవ దర్శకుడు అని మొదటి రోజు టాకు
భాషాభిమానంతో మనోళ్లది కాదు కదా ఏం వెళ్తాంలే అని అరవకుండా గమ్మున ఉండిపోయాం
రెండో రోజు ఎవడ్ని కదిపినా ,
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
అని ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ పాడుతున్నారు
అందాలోలికే సుందరి రాతిరి కలలో వచ్చెనూ అంటూ ఎవడ్ని చూసినా నిద్దట్లో ఒకటే కలవరింతలు
మెల్లిగా వైరల్ ఫీవర్ ఊరంతా పాకింది
ఎక్కడ చూసినా అవే పాటలు
మాలాంటి యూతూ లో ఈ ఫీవర్ ఎంతలా పాకిందంటే ,
కనిపించిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేంత
సరే ,
అందరూ సాగరంలో ఈత కొడుతున్నారు కదా మనకేం తక్కువ అనుకుని ఓ శుభ ముహూర్తంలో అప్సరా ధియేటర్లో లెగ్గు పెట్టి ఆ ప్రేమ సాగరంలో మునిగి తేలి ఈతకొట్టి బయటపడితిమి
ఆహా ఏం సినిమా
ఎవడ్రా బాబూ ఆ డైరెక్టర్ చించేసాడు
అసలు ఆ హీరో
చూడటానికి బక్క పల్చగా గ్లామరేమాత్రం లేకుండా అలా ఎలా జీవించేసాడ్రా నా హైడ్రా అని అప్పట్లోనే మూతిమీద వేలేసుకున్నాం (ఈ హైడ్రా అనే పదం అప్పట్లోనే కనుగొనబడిందని మనవి)
ఎవడ్రా బాబూ వీడు తమిళనాడు నుంచి వచ్చి తెలుగు దేశంలో సునామీ సృష్టించేసాడు
పాటలు ఒకటో రెండో బావుంటాయ్ అనుకుంటే ఇదేం సినిమారా బాబూ అన్ని పాటలూ బావుండి చచ్చాయ్
అనుకుంటూ ,
కుదిరినప్పుడల్లా అప్సరా కి వెళ్ళి ఈత కొట్టి వచ్చేవాళ్లం
అలా ఈత కొట్టి కొట్టీ సినిమాని వంద రోజులు ఆడించేసాం
కాబట్టి కళ కు ప్రాంతీయ భాషా బేధాలు లేవని ..ఉండకూడదనీ ఆనాడే ప్రపంచానికి ఎలుగెత్తి చాటాం
ఈ మధ్య మనోళ్లు మన తెలుగును కాదనీ ఓ మలయాళం సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారనీ ఎఫ్ఫ్బీలో నిప్పు రవ్వలు విసురుతున్న వారికి నే చెప్పొచ్చేది ఒకటే
భాష ఏదైతేనేమి భావం బాగుంటే ఆదరిద్దాం
నో పోలికాస్ ప్లీజ్
అలా అని మన తెలుగును తక్కువ చేయట్లేదు
విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం ప్రపంచంలో మరే దర్శకుడూ అంత బాగా తీయలేడు !
అదీ సంగతి 😃
పరేష్ తుర్లపాటి ✍️