తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. సినీ కళాకారుడు కత్తుల కాంతారావు అంటే అందరూ చప్పున గుర్తుపడతారు.. ఈయన్నే అభిమానులు అప్పట్లో ఆంధ్రా ఎంజీఆర్ అని పిలుచుకునే వాళ్ళు
ఒకటా రెండా 450 కి పైగా చిత్రాల్లో నటించారు కాంతారావు.. ముఖ్యంగా పౌరాణిక, జానపద సినిమాల్లో కత్తులు తిప్పాలంటే కాంతారావు తర్వాతే ఎవరైనా అని పేరు తెచ్చుకున్నారు.. ఆ రోజుల్లో కాంతారావు చరిష్మా ఎలా ఉండేదంటే NTR , ANR లతో పాటు సమానంగా ఈయన పారితోషికం తీసుకునేవారు.. అందుకే దాసరి కాంతారావు గురించి చెప్తూ తెలుగు సినీ పరిశ్రమకు NTR, ANR లు రెండు కళ్ళు అయితే కాంతారావు వాటి మధ్య తిలకం లాంటి వారు అని ప్రశంసించారు
సినిమాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించినందుకు గానూ కాంతారావుకు రఘుపతి వెంకయ్య, నంది అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డ్ కూడా లభించింది.. 1923 నవంబర్ 16 న జన్మించిన కాంతారావు పేరిట 2023 లో అప్పటి ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించింది
తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పేరిట పేరు మార్పు చేశారు.. అందులో భాగంగా కాంతారావు పేరిట కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.. గద్దర్ అవార్డ్స్ కమిటీ విజయ్ దేవరకొండ కు కాంతారావు అవార్డ్ ఇవ్వాలని సిఫార్స్ చేసింది.. దరిమిలా ఇటీవల నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో కాంతారావు అవార్డ్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయ్ దేవరకొండ అందుకున్నారు.. అవార్డ్ తో పాటు పది లక్షల రూపాయల చెక్కు కూడా ఇస్తారు
ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే ఎన్నో జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన కత్తుల కాంతారావు 2009 మార్చి 22 న తన 85 వ ఏట కాన్సర్ తో కన్నుమూశారు.. కాంతారావుకు నలుగురు మగపిల్లలు.. ఒక కూతురు.. వీరిలో ఒక కొడుకు రాజా సుడిగుండాలు సినిమాలో ఉత్తమ బాల నటుడిగా అప్పట్లోనే నంది అవార్డు అందుకున్నాడు
కాంతారావు మరణంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది.. ఆర్ధిక పరిస్థితి కుంటుపడి అప్పుల పాలయ్యారు.. సాటి కళాకారులు కొంతమంది చిన్నాచితకా సాయం చేసినప్పటికీ అప్పుల బాధ తీరలేదు
ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్న కాంతారావు కుమారుడు రాజా ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్తితుల్లో ఉన్నాడని తెలుసుకున్న ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ రఘుపతి వెంకయ్య అవార్డులో తనకొచ్చిన పారితోషికంలో లక్ష రూపాయల చెక్కును రాజా కు అందచేసి ఆదుకున్నారు.. కాంతారావు కుటుంబానికి యండమూరి చేసిన సాయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి
ఇదిలా ఉండగా కాంతారావు పేరిట అవార్డ్స్ ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ కు రావడానికి ఆయన కుటుంబ సభ్యులకు వెయ్యి రూపాయలు దారి ఖర్చులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వార్తలు రావడంతో కమిటీ తీరుపై పలువురు కాంతారావు అభిమానులు విమర్శిస్తున్నారు
కాంతారావు పేరిట ఇచ్చే అవార్డుకు పది లక్షల రూపాయలూ.. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు వెయ్యి రూపాయలా? పోనీ అవన్నీ పక్కన బెడితే నంది అవార్డు అందుకున్న ఉత్తమ బాల నటుడిగా అయినా కాంతారావు కొడుకు రాజాకి కనీస గౌరవం ఇచ్చి ఉండాల్సిందని వాళ్ళు ఫైర్ అవుతున్నారు
ఇప్పటికయినా తెలుగు సినీ పరిశ్రమ కు చెందిన పెద్దలు కానీ.. ప్రభుత్వం కానీ కాంతారావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు!!
పరేష్ తుర్లపాటి ✍️