150 కోట్లతో మంచు వారు తీసిన కన్నప్ప టైటిల్ చూసినప్పుడు మనకు 49 ఏళ్ళ క్రితం 20 లక్షలతో తీసిన భక్త కన్నప్ప ఖచ్చితంగా గుర్తుకొస్తాడు
ఎందుకంటే బాపు రమణలు మనసు పెట్టి తీసి భక్త కన్నప్పను అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు
కృష్ణం రాజు అయితే ఏకంగా కన్నప్ప పాత్రలో జీవించాడు
అసలు కృష్ణంరాజు భక్త కన్నప్ప తీయాలనుకోవడమే పెద్ద సాహసం .. అయితే కృష్ణంరాజు అదృష్టం బావుండి నాటకీయంగా ఆఖరి క్షణంలో కన్నప్ప స్క్రిప్ట్ బాపు రమణల చేతిలో పడింది
దాంతో కన్నప్ప అతి పెద్ద సూపర్ హిట్ సినిమాకు తెరలేచింది
అసలు కృష్ణంరాజు భక్త కన్నప్ప ప్రాజెక్టు స్టార్ట్ చేయడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది
70 వ దశకంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కాంతారావు లాంటి నటులు పౌరాణిక పాత్రలు చేస్తూ వెండి తెర మీద కత్తులు ఝులిపిస్తూ నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తున్న రోజులు అవి
మరోపక్క సంఘక పాత్రలలో రౌద్ర రసం కురిపిస్తూ ప్రేక్షకుల మెప్పును కృష్ణం రాజు పొందుతున్న రోజులు
అయితే కృష్ణంరాజు మనసులో చక్కటి పౌరాణిక పాత్రను తన సొంత బ్యానర్ లో చేయాలనీ కోరిక
సరిగ్గా అదే సమయంలో కన్నడ రాజ్ కుమార్ నటించిన ‘ బెడ ర కన్నప్ప ‘ రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది
ఇక కృష్ణంరాజు క్షణం ఆలస్యం చేయలేదు .. తెలుగులో కన్నప్ప చేసి తీరాలని దర్శకుడి గురించి ఆలోచించాడు
సరిగ్గా అదే సమయంలో కృష్ణంరాజు కథానాయకుడిగా , వాణిశ్రీ నాయికగా మధుసూధనరావు దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ గోపి కృష్ణా మూవీస్ బ్యానర్ లో తీసిన కృష్ణవేణి రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది
దాంతో కృష్ణంరాజు కన్నప్ప మూవీ కూడా మధుసూదనరావు దర్శకత్వంలోనే తియ్యాలని డిసైడ్ అయ్యాడు
మధుసూధనరావు కూడా ఒప్పుకోవడంతో కన్నప్పను సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది
ఈ పరిస్థితుల్లో అనుకోకుండా మధుసూదన రావు కన్నప్ప దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు
దానితో కథ మళ్ళీ మొదటికి వచ్చింది
కానీ ఆ క్షణాన కృష్ణంరాజుకు తెలీదు .. కన్నప్ప ప్రాజెక్టు త్వరలో ఓ అద్భుత వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి సూపర్ హిట్ అవుతుందని
సరే కన్నప్ప తీయగల దర్శకుడు ఎవరా అని కృష్ణంరాజు వెతుకుతుండగా ఆయన కళ్ళలో బాపు పడ్డారు
బాపు కృష్ణంరాజు కళ్ళలో పాడటానికి ఓ కారణం ఉంది
అదే సమయంలో బాపు తీసిన ముత్యాలముగ్గు సినిమా సూపర్ హిట్ అయ్యింది
దాంతో కృష్ణంరాజు తనదగ్గరున్న స్క్రిప్ట్ పట్టుకుని బాపు దగ్గరికి వెళ్ళాడు
స్క్రిప్ట్ చదివిన బాపు కన్నప్ప అంటే ఇలా కాదు మా రవణ చూసుకుంటాడు అని స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకట రమణ చేతిలో పెట్టాడు
ఇంకేముంది స్క్రిప్ట్ రాత గీత ల చేతుల్లో పడి భక్త కన్నప్ప దృశ్య కావ్యం రెడీ అయ్యింది
ఇక షూటింగ్ మొదలు పెడదాం అనుకుని ముందు శ్రీకాళహస్తి ప్రాంతం పరిశీలించారు
కానీ అప్పటికే శ్రీకాళహస్తి లో అటవీ ప్రాంతం తరిగిపోయి పట్టణీకరణంగా రూపాంతరం చెందింది
ఇప్పుడు కథ మళ్ళీ మొదటికొచ్చింది
కన్నప్ప షూటింగ్ తీయాలంటే కథ ప్రకారం సహజ అటవీ ప్రాంతం ఉండాలి .. యెంత సెట్టింగులు వేసినా కొంత సహజ వాతావరణం కూడా ఉండాలని బాపు గారు పట్టుబట్టడంతో కృష్ణంరాజు తన సొంత జిల్లా గోదావరి జిల్లా పరివాహక ప్రాంతాలు చూపించాడు
ఆఖరికి బాపు గారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం తాలూకా బుట్టాయ గూడెంలో షూటింగ్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
అక్కడే ఎందుకంటె బుట్టాయ గూడెం నుంచి ఓ పదికిలోమీటర్లు లోపలి వెళ్తే అటవీ ప్రాంతం వస్తుంది
అవసరమైన సన్నివేశాలు అక్కడ తీసుకుని మిగిలిన భాగం బుట్టాయ గూడెంలో వేసిన అమ్మవారి ఆలయం , శివాలయం ,కుటీరం సెట్టింగులు వేసి షూటింగ్ చెయ్యాలని నిర్ణయించారు
షూటింగ్ మొదలైన రోజే కృష్ణంరాజు బాపుకి ‘ ఖర్చు కోసం వెనకాడవద్దు .. యెంత ఖర్చయినా పర్లేదు .. కన్నప్ప చరిత్రలో నిలిచిపోవాలి ‘అన్నారు
దానితో బాపు నవ్వుతు శుభం అన్నారు
ఆ విధంగా ఒక చారిత్రాత్మక సినిమాకు బుట్టాయ గూడెంలో కొబ్బరికాయ కొట్టి మొదలెట్టారు
మాములుగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ , కాంతారావు వంటి హీరోలతో తీసే పౌరాణిక సినిమాలకు మొత్తం 15 లక్షల ఖర్చుతో అయిపోయేది
కానీ కృష్ణంరాజు మొదటిసారిగా కన్నప్ప సినిమా కోసం ఇరవై లక్షలు ఖర్చుపెట్టాడు
ఇక షూటింగ్ మొదలైంది .. బాపు లైట్సాన్ అంటూ మొదలెట్టి ఏకధాటిగా 70 రోజులు షూటింగ్ చేసారు
ఆ రోజుల్లోనే యూనిట్ అంతా వారానికి ఆరు రోజులు పనిచేసింది
బాపు రమణల కృషి ఫలించి కృష్ణంరాజు , వాణిశ్రీలు మనసుపెట్టి నటించిన భక్త కన్నప్ప సూపర్ హిట్ అయ్యింది
ముఖ్యంగా కన్నప్ప శివ లింగం మీద తన కాళ్ళను పెట్టి రక్తం కారుతున్న శివుడి కంటికి తన కన్ను పెరికి అతికించిన సన్నివేశం చూసి కంట తడి పెట్టని ప్రేక్షకుడు లేడు
భక్త కన్నప్పాలో పాటలన్నీ సూపర్ హిట్
ముఖ్యంగా శివ శివ శంకరీ , కండ గెలిచింది పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి
భక్తకన్నప్ప 1976 లో రిలీజ్ అయ్యింది
వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది
అయినా ఇప్పటికీ భక్తకన్నప్పను ప్రేక్షకులు మనసులోనే నిలుపుకున్నారు
మళ్ళీ ఇన్నేళ్లకు మంచు విష్ణు తిన్నడి పాత్రలో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప ఈ నెల 27 న థియేటర్లలో రిలీజ్ కానుంది
మహాభారత్ సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు
చూడాలి ఎలా ఉంటుందో !!
పరేష్ తుర్లపాటి