అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది
సరిగ్గా అప్పుడు మోగింది కాలింగ్ బెల్
ఈ టైంలో ఎవరై ఉంటారా ? అని ఆలోచిస్తూ వెళ్లి డోర్ ఓపెన్ చేశా
ఎదురుగా పోలీసులు
ఆశర్యపోయా !
వేళ కాని వేళలో పోలీసులు ఎందుకు వచ్చారు ? ఒకవేళ వీధిలో దొంగతనం జరిగిందా ? మర్డర్ జరిగిందా ?
అనుకుంటూ వాళ్లతో ఏదో మాట్లాడబోయేలోపు సరిగ్గా అదే సమయంలో ల్యాండ్ ఫోన్ మోగింది
మళ్ళీ ఆశర్యపోయా
సాధారణంగా అర్ధరాత్రి నాకు ఫోనులు రావు
ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో అనుకుని ఫోన్ దగ్గరికి వెళ్లబోయా
ఒక కానిస్టేబుల్ ఒక్క ఉదుటున ముందుకొచ్చి నన్ను పట్టుకుని ఫోన్ ఎత్తవద్దని సైగ చేసాడు
గబుక్కున రెండో కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ రిసీవర్ ఎత్తి హలో అని కూడా అనకుండా నిశ్శబ్దంగా చెవి దగ్గర పెట్టుకున్నాడు
ఒక్క నిమిషం అలానే చెవి దగ్గర పెట్టుకున్నాడు
అట్నుంచి కాల్ కట్ అయ్యింది
హాలీవుడ్ సినిమాని తలదన్నేలా జరుగుతున్న ఈ సన్నివేశాన్ని చూస్తే అసలేం జరుగుతుందో నాకేం అర్ధం కాలేదు
అదే పోలీసులను అడిగా ,
అప్పుడు ఆ పోలీస్ మెల్లిగా అడిగాడు ‘ వార్త జర్నలిస్ట్ మీ బ్రదరేనా ? ‘ అని
‘ అవును.. ఏం జరిగింది ?’ అని అడిగా.. రోజూ పేపర్ ప్రింటింగ్ కు వెళ్లెవరకూ ఉండి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతుంది కాబట్టి నాకు అసలు విషయం అర్ధం కాలేదు
‘ ఏమీ లేదు సర్ .. కంగారు పడాల్సింది ఏమీ లేదు .. మేము రాకముందు మీకు ఫోన్లు ఏమైనా వచ్చాయా ?’
‘ రాలేదు ‘
‘సరే మఫ్టీ కానిస్టేబుల్స్ బయటనే ఉంటారు .. ఫోన్లు వస్తే మాత్రం మీరు లిఫ్ట్ చేయకండి .. మావాళ్లని పిలవండి .. మీరేం కంగారు పడాల్సిన పనేం లేదు .. పడుకోండి ‘ అని చెప్పి కదలబోయారు కానిస్టేబుల్స్
అప్పుడు మరోసారి అడిగా అసలు ఏమైంది ? అని
అప్పుడు చెప్పాడు కానిస్టేబుల్ ‘ సార్ ! నందిగామకు చెందిన ఓ యువ నాయకుడి మాఫియా మీద వార్త రాశారట .. ఆయన కుర్రాళ్ళు సార్ మీద అటాక్ చేయడానికి తిరుగుతున్నారు .. మీరు భయపడాల్సింది ఏమీ లేదు .. సీపీ గారు ఇస్యూ ని స్వయంగా మానిటర్ చేస్తున్నారు.. సీఐ గారు .. ఎస్సై గారు ఇక్కడే రౌండ్స్లో ఉన్నారు ‘ అంటూ అసలు విషయం చెప్పి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు
నేను తలుపు తీసుకుని బాల్కనీ లోనుంచి కిందికి చూసా
కింద స్ట్రీట్ రెండు కార్నర్లలో అటో పోలీస్ జీపు .. ఇటో పోలీస్ జీపు ఉన్నాయి
బయట మఫ్టీ కానిస్టేబుల్ వైర్లెస్ వాకీటాకీలో మాటలు వినిపిస్తున్నాయి ‘ అలర్ట్ .. అలర్ట్ .. సిటీలోకి అనుమానాస్పద వాహనాలు వస్తుంటే సీజ్ చేయండి .. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే కస్టడీలోకి తీసుకోండి ‘ అనేది సారాంశం
అర్ధరాత్రి విజయవాడలో ఓ జర్నలిస్ట్ మీద అటాక్ చేయడానికి నందిగామ నుంచి ఓ నాయకుడి అనుచరులు జీపుల్లో వార్త ఆఫీసు దగ్గరికి రావడానికీ .. పోలీసులు అలర్ట్ అయి సిటీ బోర్డర్స్ మూసెయ్యడానికీ మధ్య ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది
అది కూడా 50 రూపాయల వివాదానికి సంబంధించి చిలికి చిలికి గాలి వానై ఆ నాయకుడి మాఫియా దందాను వెలికితీసి వార్త పేపర్లో న్యూస్ పడేలా చేసింది
అంతకు వారం రోజుల ముందు వార్త చైర్మన్ గిరీష్ సంఘీ హైదరాబాద్ నుంచి పనిమీద రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడ వచ్చి మర్నాడు ఉదయం హైద్రాబాదుకు తిరుగు ప్రయాణం అయ్యారు
అయితే అప్పట్లో టోల్ వసూలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతిలో ఉండేది
కీసర టోల్ కాంట్రాక్ట్ నందిగామకు చెందిన ఓ యువ నాయకుడి చేతిలో ఉండేది ( ఇప్పుడు ఆయన లేరు )
టోల్ నిబంధనల ప్రకారం టోల్ ఛార్జ్ 24 గంటలవరకు పనిచేస్తుంది
అంటే 24 గంటలలోపు అయితే రానూపోనూ అదే టికెట్ సరిపోతుంది .. అదనంగా ఏమీ పే చేయక్కర్లేదు
కానీ కీసర టోల్ కుర్రాళ్ళు వార్త చైర్మన్ గిరీష్ సంఘీ కారును ఆపి తిరిగి 50 రూపాయలు కట్టాల్సిందే అన్నారు
24 గంటల నిబంధన తమకు వర్తించదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు
అప్పటికి ఆయన అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్లాల్సి ఉండటంతో 50 రూపాయలు చెల్లించి వెళ్లిపోయారు
హైదరాబాద్ వెళ్లిన వెంటనే ఆయన విజయవాడ వార్త బ్యూరో చీఫ్ గా ఉన్న జర్నలిస్ట్ రాజేష్ కు ఫోన్ చేసి విషయం చెప్పి ‘ నువ్వేం చేస్తావో నాకు తెలీదు.. అవతలివాడు ఎంతటివాడైనా వదలొద్దు .. కీసర టోల్ వసూలు వెనుక దందా మొత్తం బయటికి రావాలి ‘ అని ఆర్డర్ వేశారు
దాంతో కీసర టోల్ దందా మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి నాంది పడింది
అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వార్త జర్నలిస్ట్ రాజేష్ తో పాటు ఇంకో ఇద్దరు సహాయకులతో పాటు కీసర టోల్ గేట్ వద్ద నిఘా పెట్టారు
జర్నలిస్టుల స్ట్రింగ్ ఆపరేషన్లలో సంచలన విషయాలు తెలిసాయి
అక్కడ కొన్ని వాహనాలకు రిసిప్ట్ లు కూడా ఇవ్వకుండా డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారు
24 గంటల నిబంధన పాటించకుండా డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు
వీటితో పాటు ఇంకొన్ని చీకటి భాగోతాలు వెలుగులోకి వచ్చాయి
వెంటనే వార్త చైర్మన్ కు విషయం చేరవేశారు
ఆయన ‘ ప్రొసీడ్ ‘ అనడంతో వార్త న్యూస్ పేపర్లో కీసర టోల్ దందా తో పాటు యువ నాయకుడి మాఫియా దందా మీద సీరియల్ కధనాలు వచ్చాయి
ఈ కధనాలు అప్పట్లో సంచలనం సృష్టించింది
సరిగ్గా రెండో రోజు రాత్రి కొంతమంది దుండగులు జీపులో వార్త ఆఫీసుకు వచ్చి ‘ సార్ ! అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి .. రాజేష్ గారు ఉన్నారా ?’ అని అడిగారు
అప్పుడు అనుమానం వచ్చింది డెస్క్ లో ఉన్న రిపోర్టర్స్ కి .. నిజంగా యాడ్ ఇవ్వాలి అనుకునేవాళ్లు నేరుగా యాడ్ సెక్షన్ కు వెళ్తారు .. కానీ పర్టిక్యులర్ గా జర్నలిస్ట్ పేరు అడిగారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉందని కిటికిలొనుంచి చూస్తే కింద జీపు … కుర్రాళ్ళు కన్పించారు
వెంటనే జర్నలిస్టును వెనుక దోవనుంచి బయటికి పంపేసి అక్కడనుంచే వార్త చైర్మన్ గిరీష్ సంఘీకి ఇన్ఫార్మ్ చేసారు
గిరీష్ సంఘీ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డికి స్వయంగా ఫోన్ చేసి ‘ మీరు ఏం చేస్తారో తెలీదు.. వెంటనే విజయవాడలో ఇస్యూస్ కంట్రోల్ చేయమని లోకల్ పోలీస్ కు చెప్పండి .. ఒకవేళ మా జర్నలిస్ట్ మీద చేయి పడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి‘ అని సున్నితంగా హెచ్చరించడంతో హోమ్ మినిస్టర్ విజయవాడ సీపీ కె ఎస్ ఎన్ మూర్తికి ఫోన్ చేసి సిట్యుయేషన్ కంట్రోల్ లోకి తీసుకోమని చెప్పారు
దాంతో పోలీసులు జర్నలిస్ట్ రాజేష్ ను ప్రైవేట్ కారులో ఎక్కించుకుని గాంధీనగర్లో ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్ లో షెల్టర్ ఇచ్చి సిటీ బోర్డర్స్ క్లోజ్ చేసి సెర్చ్ చేస్తే తెల్లవారి మూడు గంటలకు జీపులో దుండగులు దొరకడంతో అరెస్ట్ చేసారు
దుండగులు దొరకడంతో తెల్లవారి ఐదు గంటలకు జర్నలిస్ట్ రాజేష్ ను పోలీస్ ఎస్కార్ట్ తో ఇంటి దగ్గర దింపారు
మర్నాటి నుంచి జర్నలిస్ట్ ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఓ గన్ మెన్ ను ఎస్కార్ట్ కూడా ఇచ్చారు సీపీ
ఇదిలా ఉండగా జర్నలిస్ట్ మీద దాడికి ప్రత్నించిన సంఘటన మీద విజయవాడలో జర్నలిస్ట్ సంఘాలు .. న్యాయవాద సంఘాలు నిరసనలు చేయడంతో ,హోమ్ మినిస్టర్ చొరవ తీసుకుని ఆ యువనాయకుడిని పిలిచి జర్నలిస్టుల మీద అటాక్ చేయడం సరైన విధానం కాదని ఈ విషయం సీఎం కు తెలిస్తే సీరియస్ అవుతారని మందలించడంతో వివాదం సద్దుమణిగింది
వారం తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో గన్ మెన్ ను కూడా ఉపసంహరించారు
ఇలా ఉంటాయి విధి నిర్వహణలో కొంతమంది జర్నలిస్టుల అనుభవాలు
న్యూస్ కవరేజ్ లో భాగంగా ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా రిస్క్ తీసుకుంటారు
ఇవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు
జర్నలిస్ట్ లైఫ్ అంటే పూల పాన్పు అనుకుంటారు .. కానీ విధినిర్వహణలో ఒక్కోసారి ముళ్లబాట మీద కూడా నడవాల్సి ఉంటుంది !!
ఈ యధార్థ సంఘటన జరిగి మూడు దశాబ్దాల పైనే అయ్యింది !