బెజవాడ రుచులు – 3
నిన్న గాంధీనగరం వెల్కమ్ హోటల్ రుచుల గురించి చెప్పుకున్నాం కదా
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బుద్ధవరపు రామకృష్ణ గారు వెల్కమ్ హోటల్ గురించి తన అనుభవాలను రచ్చబండ కబుర్లు తో పంచుకున్నారు
‘ ఆంధ్ర రాష్ట్రంలో తోలి ఉడిపి ఫలహారశాల విజయవాడ గాంధీనగరంలోని వెల్కమ్ హోటల్ . 1950 దశకంలో తుళు వంశస్తులైన భోజారావు రావు గారు ఈ వెల్కమ్ హోటల్ స్థాపించారు . ఆ తరువాతనే బెజవాడలో మిగతా ఉడిపి హోటల్స్ ప్రారంభం అయ్యాయి
విస్తరణలో భాగంగా వెల్కమ్ హోటల్ కు ఆనుకునే ఎస్కిమో ఏసీ రెస్టారెంట్ కూడా ప్రారంభించారు . ఆ రోజుల్లో విజయవాడ ఏసీ రెస్టారెంట్లలో ఎస్కిమో మొదటిది . ఇక వెల్కమ్ హోటల్ రెస్టారెంట్ లో అందరికీ ఫుడ్ అందుతుందా లేదా ? అని కనుక్కునే తెల్లదుస్తుల వ్యక్తి పేరు గోపాలరావు గారు . ఈయన మేనేజర్ గా వ్యవహరించేవారు
ఇప్పుడు విజయవాడ బస్సు స్టాండ్ ఎదురుగా ఉన్న మమత , మనోరమ రెస్టారెంట్ల రుచుల గురించి చెప్పుకుందాం
హోటల్ మమత వారి సమయం ఉదయం తొమ్మిది గంటలు.. ఒకప్పుడు రేడియోలో ఈ ప్రకటన రాగానే బంధువులు పలకరించినంత ఫీల్ అయిపోయేవాళ్ళు అప్పట్లో కొంతమంది విజయవాడ వాసులు
హోటల్ మమత విజయవాడ భోజన ప్రియుల మదిలో చక్కటి స్థానాన్ని సంపాదించుకుంది
అలాగే మనోరమ హోటల్ కూడా
సాధారణంగా ఏ ఉరికైనా బస్ స్టాండ్..రైల్వే స్టేషన్ ఎదురుగా రెస్టారెంట్లు..లాడ్జీలు ఖచ్చితంగా ఉంటాయి
విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా ఈ హోటళ్లు వెలిశాయి కానీ రైల్వే స్టేషన్ ఎదురుగా మాత్రం పెద్దగా హోటళ్లు రాలేదు
దీనికి కారణం రైల్వే స్టేషన్ ఎదురుగా రైల్వే వారి క్వార్టర్స్..ఆఫీసులు..ఆడిటోరియం..గ్రౌండ్ లు ఉండటం
రైల్వే స్టేషన్ బయటికి వచ్చి కొద్దిగా ముందుకు వస్తే కరుణా హోటల్ ఒక్కటే కనిపిస్తుంది
అక్కడ రైల్వే ఎంప్లాయీస్ తాకిడే ఎక్కువగా ఉండేది
నాకు ఎందుకో అక్కడ కొంచెం పరిశుభ్రత తక్కువగా ఉందనిపించింది
కాఫీలు..సిగరెట్లు తాగేవాళ్ళు ఎక్కువ కావడంతో ఫ్యామిలలతో వెళ్ళేవాళ్లకు కొంచెం ఇబ్బందే
ఇక మమత..మనోరమ హోటళ్ల విషయానికి వస్తే స్థల ప్రభావం కూడా కలిసొచ్చింది
సరిగ్గా బస్ స్టాండ్ ( ఇప్పుడు బస్ స్టాండ్ వేరే చోటికి మార్చారు ) ఎదురుగానే మమత..మనోరమ హోటళ్లు ఉన్నాయ్
అప్పట్లో విజయవాడ వాణిజ్య జంక్షన్ గా ఉండటం వల్ల చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే జనాలు బస్ దిగగానే మమతకో.. మనోరమకో ఫుడ్ కోసం వెళ్ళేవాళ్ళు
అందువల్ల ఈ రెండు హోటళ్లకు జనాల తాకిడి ఎక్కువగానే ఉండేది
ఈ హోటళ్ల నిర్వాహకులు కూడా ఫుడ్ నాణ్యతలో రాజీ పడకుండా చక్కటి రుచులను అందించటంతో ఇక వారు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది
ఇంకో విశేషమేంటంటే రెస్టారెంట్ ఎంత చక్కగా మెయింటైన్ చేసేవాల్లో లాడ్జి కూడా అంతే చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళు
సాధారణంగా బస్ స్టాండ్..రైల్వే స్టేషన్ దగ్గర్లో లాడ్జీల్లో దిగాలంటే ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో అని ఫ్యామిలీలు భయపడిపోతారు
కానీ మమత..మనోరమ హోటళ్లు అటువంటి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా లాడ్జీలు కూడా చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళు
దానితో ఈ రెండు హోటళ్లలో రూములు కూడా ఖాళీ ఉండేవి కావు
ఇప్పుడంటే స్టార్ హోటళ్లు వచ్చాయి కానీ ఒకప్పుడు మద్రాస్ నుంచి సినిమా హీరోలు..హీరోయిన్లు..ఇతర సెలెబ్రిటీలు మనోరమ హోటల్లో ఎక్కువగా దిగేవాళ్ళు
బస్ స్టాండ్ ఎదురుగా హోటల్ అంటేనే రకరకాల మనస్తత్వాలు ఉన్న జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది
అదేంటో కానీ ఈ హోటళ్లలో క్లాసు..మాసు.. కూడా కంఫర్ట్ ఫీల్ అయ్యేవాళ్ళు
దీనికి కారణం హోటల్ నిర్వాహకుల ప్రత్యేక శ్రద్ధ మాత్రమే
రెస్టారెంట్లో చక్కటి క్వాలిటీ ఫుడ్ అందించటం..పరిసరాల పరిశుభ్రతకు ప్రియారిటీ ఇవ్వటం వారి విజయ రహస్యానికి కారణం
అందుకే నేటికీ ఆ రెస్టారెంట్లు రన్ అవుతున్నాయ్
కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా క్వాలిటీ తగ్గిందని కంప్లైంట్స్ వస్తున్నాయి
నా మటుకు అప్పట్లో టిఫిన్లు మమతలోనూ.. భోజనం మనోరమలోనూ బాగుండేవనిపించింది
మమతలో భోజనం కొంచెం మద్రాసు వారి స్టైల్లో ఉన్నట్టు అనిపించేది
మషాలా లేకుండా కూరలు .. పప్పు .. సాంబార్ చక్కటి రుచులతో ఉండేవి
ఈ సందర్భంగా ఓ పాత సంగతి గుర్తొచ్చింది
ఓ రోజు ఉదయాన నేను మమతలో టిఫిన్ చేస్తుంటే పక్క టేబుల్ మీద నాకు తెలిసిన గాంధీ నగర్‌లోని ఇంకో వెజ్ రెస్టారెంట్ ఓనర్ టిఫిన్ చేస్తున్నాడు
ఆయన ఆ రెస్టారెంట్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు
నాకు ఆశర్యం వేసింది
ఇదేంటి గాంధీ నగర్లో ఈయనకు సొంత రెస్టారెంట్ ఉండి కూడా బస్ స్టాండ్ దాకా వచ్చి మమతలో టిఫిన్ చేస్తున్నాడేంటా అనుకున్నా ?
అదే విషయం ఆయన్ని అడిగా ,
“చూడు పరేష్..మా రెస్టారెంట్లో ఫుడ్ నేను టేస్ట్ చేసి కానీ కస్టమర్లకు సర్వ్ చెయ్యనివ్వను..అది ఒక రెస్టారెంట్ ఓనర్‌గా నేను చేసే పని..కానీ రెస్టారెంట్ ని విజయవంతంగా నడపటానికి అదొక్కటీ సరిపోదు..కస్టమర్‌కి నా హోటల్లో దొరకని రుచులు ఇంకెక్కడైనా దొరుకుతున్నాయా ? నా రెస్టారెంట్లో ఫుడ్ కి ఇతర రెస్టారెంట్లో ఫుడ్ లకు వ్యత్యాసం ఏంటీ అని కూడా ఆలోచిస్తా..అందుకే ఒక కస్టమర్ గా కూడా ఇతర రెస్టారెంట్లకు వెళ్లి ఐటమ్స్ టేస్ట్ చేస్తా..అప్పుడు బిజినెస్ పరంగా నేను ఎక్కడ ఉన్నానో తెలిసిపోతుంది “అన్నారు
అక్కడే నేను ఓ గొప్ప వ్యాపార సూత్రం తెలుసుకున్నా
మరిన్ని రుచుల గురించి తరువాయి భాగంలో ,
పరేష్ తుర్లపాటి