మాయాబజార్ తీసి ఆరోజుల్లోనే గొప్ప అద్భుతాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన కెవి రెడ్డి గారి జయంతి ఈరోజు !

Spread the love

మనకు యస్.యస్. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, వెట్రిమారన్, ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరాణీ, బాసిల్ జోసెఫ్, జేమ్స్ కామెరూన్, హిచ్ కాక్, అకీరా కురసోవా, శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల గురించి తెలుసు

వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ దర్శకులు, కొరియన్ దర్శకులు, హాలీవుడ్ దర్శకులు తెలుసు

ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్, ఒక్కో దర్శకుడిది ఒక్కో విజన్

అయితే వీరందరి శైలిని ఒక్క డైరెక్టర్ లో చూస్తే ఆయనే దర్శక దిగ్గజం K.V. Reddy గారు
చాలా నిరాడంబరంగా కనిపించే వ్యక్తి, ఆయన మేధస్సు మాత్రం వంద హాలీవుడ్ సినిమాల ఇంపాక్ట్ ఇస్తుంది

మాస్ పల్స్ పట్టుకున్న మొదటి దర్శకుడు,
మాస్ హీరోలకు మోడల్ తయారు చేసిన ఘనుడు

మాస్ ట్రెండ్ సెట్టర్. విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడని చేసి చూపించిన దార్శనికుడు.(Ex : పాతాళ భైరవి), కమర్షియల్ సినిమాల్లో విలన్ ను కమెడియన్ చేసిన ఘనాపాటి (Ex : జగదేక వీరుని కథ)

మాయా బజార్ గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది
తరాలు మారుతున్నా ఎప్పటికీ నిత్యనూతనంగా నిలిచే చిత్రాలు కొన్నే ఉంటాయి, వాటిల్లో ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే సినిమా మాయాబజార్ (1956)

ఈరోజుకి మాయాబజార్ సినిమా రీ రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకులకు సంభ్రమమే
ఆమధ్య ఆధునిక సాంకేతికత సాయంతో మాయాబజార్ ను తెలుపు నలుపు నుంచి పంచ రంగులలోకి మార్చారు కానీ బ్లాక్ అండ్ వైట్ లోనే బాగుందనిపించింది

సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరా మేన్ మార్కస్ బార్ట్ లీ, గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్ తో సృష్టించిన మాయాజాలాన్ని చూసిన ప్రేక్షకులు నివ్వెరపోయారు.

ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో, లడ్డూలు అన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ ఎవరూ కదల్చకుండానే వాటికవే కదలడం సీన్లను ఎలా తీసారో ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు

కేవీ రెడ్డి గారు రాయలసీమ వాసి జూలై 1- 1912 న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించిన కదిరి వెంకట రెడ్డి గారు, సీమలో పుట్టిన గొప్ప దర్శకుడు

1943 లో భక్తపోతనతో మొదలై, 1971 లో
శ్రీకృష్ణసత్యతోముగిసిన ఆయన కెరీర్ లో తీసింది
14 సినిమాలు

అందులో 10 మూవీస్ అద్భుత విజయాలు.
భక్త పోతన(1943)
యోగి వేమన(1947)
గుణసుందరి కథ(1949)
పాతాళ భైరవి(1951)
పెద్దమనుషులు(1954)
దొంగరాముడు(1955)
మాయాబజార్(1956)
పెళ్ళినాటి ప్రమాణాలు(1959)
జగదేక వీరుని కథ(1961)
శ్రీకృష్ణార్జున యుధ్ధం(1963)
సత్య హరిశ్చంద్ర(1965)
ఉమా చండీ గౌరీ శంకరుల కథ(1968)
భాగ్య చక్రం.(1968)
&
శ్రీకృష్ణ సత్య(1971)

వీటిలో పెళ్ళినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుధ్ధం & భాగ్య చక్రం సినిమాలకు నిర్మాత కూడా కె.వి.రెడ్డి గారే, జయంతి పిక్చర్స్ అని సొంత బానర్ లో తీశారు

గొప్ప దర్శకుడు & నిర్మాత కదా
కోట్లకు పడగెత్తాడేమో అనుకునేరు

అదే చిత్రం

అసలు ఈ జనరేషన్ కు కె.వి.రెడ్డి ని పరిచయం చెయ్యాలి, బి.ఎన్.రెడ్డి ఎవరు? బి.నాగి రెడ్డి ఏవరు?

రోహిణీ ప్రొడక్షన్స్, వాహినీ ప్రొడక్షన్స్, విజయా ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎవరివి? అని ఓ కన్ ఫ్యూజన్, సినిమా ప్రేమికులకు కూడా ఇది ఎప్పట్నుంచో చిక్కు ప్రశ్న

హెచ్.ఎం.రెడ్డి గారని టాకీ పులి, ఈయన లేకపోతే మనం మాట్లాడే సినిమాలను చూసేవాళ్ళం కాదేమో

మూకీల సినిమాను టాకీలలోనికి మార్చిన మహానుభావులు H.M. Reddy గారు, హేట్సాఫ్ హెచ్. యం. రెడ్డి, ఈయన బి.ఎన్.రెడ్డి & మూలా నారాయణ స్వామితో కలిసి…రోహిణీ ప్రొడక్ష్సన్స్ స్థాపించి 1938 లో గృహలక్ష్మి మూవీ తీశారు.

దానికి క్యాషియర్ గా పనిచేశారు, మన కె.వి.రెడ్డి గారు, సినిమా బాగా ఆడింది. కాకపోతే కాంచనమాల వ్యాంప్ అందులో, ఆవిడతో కాస్త ఆ కాలంలోనే అభ్యంతరకరమైన యాక్షన్ చేయించారని

బి.ఎన్.రెడ్డ్ గారు హెచ్.ఎం.రెడ్డి గారితో విబేధించి, మూలా నారాయణస్వామితో కలిసి విడిగా స్వంత సంస్థ వాహినీ ప్రొడక్షన్స్ స్థాపించారు, అప్పుడు వారితో కలిసి కె.వి.రెడ్డి గారు కూడా వచ్చేశారు, అలా వాహినీ స్టూడియో ఆవిర్భవించింది

వాహినీ సంస్థ లో బి.ఎన్.రెడ్డి గారు తీసిన 3 మూవీస్ కు ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.

ఆ 3 సినిమాలు

వందేమాతరం(1939)
సుమంగళి(1940)
దేవత(1941)

అవి కళా ఖండాలనిపించుకున్నా కాసులు అట్టే రాలలేదు

ఈ లోగా కె.వి.రెడ్డి గారు భక్త పోతన స్క్రిప్ట్ రెడీ చేసుకుని డైరెక్షన్ ఛాన్స్ అడిగితే తక్కిన ఇద్దరికీ నమ్మకం కలగలేదు
అయినా పారితోషికం వద్దని కేవలం లాభాల్లో వాటా చాలని అతి కష్టంతో తీశారు భక్త పోతన(1943)

అదే వాహినీ ని నిలబెట్టింది
విశేష లాభాలనార్జించి పెట్టింది.

ఆ తరువాత బి.ఎన్.రెడ్డి & కె.వి.రెడ్డి
ఒకరి తరువాత ఒకరు మూవీస్ డైరెక్ట్ చేసేట్లు అనుకుని కొనసాగారు

కానీ…1949 లో వాహినీ మూల స్తంభాలలో..మూలమైన…మూలా నారాయణ స్వామి ఆర్ధికంగా చితికి పోయి సంస్థను
అప్పుడే స్థాపించిన విజయా ప్రొడక్షన్స్ లో విలీనం చేశాడు. అలా ఏర్పడిందే విజయా – వాహినీ ప్రొడక్ష్సన్స్ సంస్థ…
క్రమేణా విజయా ప్రొడక్షన్స్ అయ్యింది

అది నాగిరెడ్డి – చక్రపాణి లది.
ఈ నాగిరెడ్డి ఎవరో కాదు
బి.ఎన్.రెడ్డి గారి సొంత తమ్ముడే.

బి.ఎన్.రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
బి.నాగిరెడ్డి – బొమ్మిరెడ్డి నాగిరెడ్డి.
కె.వి.రెడ్డి గారికి వీరికి ఆర్ధిక లావాదేవీలు తప్ప
బంధుత్వం ఏమీలేదు

కే.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1965), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో,

ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది.

ఈ స్థితిలో కె.వి.ని గురువుగా భావించే ఎన్.టి.రామారావు ఆయన పై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించాడు.

పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ…
ఆ సినిమా మంచి విజయం సాధించింది.

మంచి సినిమా తీసిన విజాయానందంతో
1972లో కె.వి.రెడ్డి గారు, ఓ విధంగా సంతృప్తి తో దివంగతులయ్యారు.

కేవలం కళ కోసం తపించారు కె.వి.రెడ్డి గారు.
కాసు కోసం ఏనాడు పరితపించలేదు.
గొప్ప వ్యక్తిత్వం గల దర్శకుడు

జూలై 1-1912 న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించిన కదిరి వెంకట రెడ్డి గారు
15- 9 -1972 లో కీర్తి శేషులయ్యారు 60 ఏళ్ళ వయసులో..
.
ఒక్క మాయాబజార్ చాలదా!
వారి ప్రతిభకు తార్కాణంగా, తరతరాలుగా అలరిస్తుంది, రాబోయే తరాలనూ మురిపిస్తుంది

ఈరోజు దర్శక దిగ్గజం శ్రీ K.V. Reddy గారి జయంతి
విశ్వ టాకీస్ తరుపున ఆయనకు ఘన నివాళి🙏🏿

విశ్వ టాకీస్


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!