బెజవాడ రుచులు – 4

Spread the love

బెజవాడ రుచులు – 4

అవ్విధంగా అటుపక్క మమత..మనోరమ..ఇటుపక్క అజంతా మధ్యలో వెల్ కం..మోడరన్ కేఫ్ లు విజయవాడ రెస్టారెంట్ రంగంలో మకుటం లేని మహారాజులా వెలిగాయి

విజయవాడ వాసులు ఈ హోటళ్లని ఎంతలా ఓన్ చేసుకున్నారంటే కుదిరితే టిఫిన్ కుదరకపోతే కప్పు కాఫీ అయినా తాగి రావటానికి వెళ్ళేవాళ్ళు

ఆ ఆదరణ అలా ఉండేది కాబట్టి అవి కూడా అలా వెలిగిపోయాయ్

ఏమైందో తెలీదు కానీ ఏలూరు రోడ్ కొత్తవంతెన సెంటర్లో అజంతా..గాంధీ నగర్లో ఉన్న వెల్ కం హోటళ్లు కనుమరుగైపోయి మిగిలినవి మిగిలాయి

అప్పట్లో ఇడ్లీ..దోశ..వడ..ఉప్మా..పొంగల్ టిఫిన్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి

వీటికి తోడు సామంత రాజులా ఫిల్టర్ కాఫీ నవ్వుతూ పలకరించేది

మోడరన్ కేఫ్ లో ఫిల్టర్ కాఫీ మద్రాస్ తరహాలో స్టీలు పాత్రలో ఉంచిన స్టీలు గ్లాసులో ఇచ్చేవారు
పింగాణీ కప్పులో కన్నా ఇదే బావుండేదనిపించేది

ఇక ఇడ్లీ సామ్రాజ్యంలో గాంధీ నగర్లో ఉన్న బాబాయ్ హోటల్ ది ప్రత్యేక రాజ్యం
రాజ్యమంటే హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు

ఒక చిన్న రేకుల షెడ్డు..నాలుగు బల్లలు..రెండు ఫ్యాన్లు అంతే
అయితేనేమి ఇక్కడి ఇడ్లీ రుచుల కోసం ఎక్కడ్నించో కారుల్లో వరుస కట్టేవారు

ప్లేటులో అరిటాకు దానిపైన అప్పుడే వాయ దించిన వేడి వేడి ఇడ్లీలు..పైన వెన్నపూస..పక్కన కొబ్బరి చట్నీ..అల్లపు చట్నీ..నెయ్యిలో మునిగి తేలే కారప్పొడి

అంతే ,

అలా నంచుకుని నోట్లో పెట్టుకుంటే రెండు ఇడ్లీలు కరిగిపోయేవి
కరిగిపోవటంలో ఇడ్లీ..వెన్న పోటీ పడేవి !

దోశ ఉంటుంది కానీ నాకు ఎందుకో ఇడ్లీనే బాగుందనిపిస్తుంది

బాబాయ్ హోటల్లో తినే రెండు ఇడ్లీలకు కడుపేమీ నిండిపోదు గానీ చక్కటి రుచులను ఆస్వాదించామనే ఫీలింగ్ రోజంతా ఉండేది

ఓసారి హాస్యనటుడు రాజబాబు గారు షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చి మనోరమ హోటల్లో దిగారట

సరే, షూటింగ్ టైమైపోతుందని నిర్మాణదారులు మనోరమ రెస్టారెంట్ టిఫిన్లు పార్సెల్ కట్టించి రాజబాబు గారి రూమ్ కే పంపించారట

రాజబాబు గారు మాత్రం బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీలు వస్తేనే తింటాను..లేకపోతే ఇలాగే షూటింగ్ కి వెళదాం అన్నారట

దాంతో వెంటనే రాజబాబు కోసం బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీలు పార్కిల్ తెప్పించి ఇస్తే ఆవురావురు మంటూ తిని హుషారుగా షూటింగ్ కి బయలుదేరారట

ఒక్క రాజబాబే కాదు ఆ రోజుల్లో సినిమా నటులు కానీ సెలెబ్రిటీలకు కానీ పార్సెల్ బాబాయ్ హోటల్ నుంచి వెళ్లాల్సిందే

ఎన్టీఆర్ కూడా అంతే ,

షూటింగ్ నిమిత్తం కానీ , సినిమా ఫంక్షన్ల సందర్భంగా కానీ విజయవాడ వస్తే బాబాయి హోటల్ నుంచి అన్ని రకాలూ క్యారేజీలో రావాల్సిందే

అలా అందరూ బాబాయ్ అని పిలుచుకునే ఓనర్ సాంబమూర్తి గారిని నేను చూడలేదు గానీ ఆయన స్థాపించిన హోటల్లో రెగ్యులర్ గా ఇడ్లీలు తిని రుచులను ఆస్వాదించే అవకాశం అప్పట్లో విజయవాడలో ఉండటం వల్ల నాకు కూడా కలిగింది

సాంబమూర్తి గారి తర్వాత వారసులు
రేకుల షెడ్డు పడగొట్టి బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహిస్తున్నారు

కానీ అప్పటికన్నా కొద్దిగా క్వాలిటీ తగ్గిందనే మాట మిత్రుల ద్వారా తెలిసింది
ఆ రకంగా అప్పట్లో విజయవాడలో ఇడ్లీ ఒక ఊపు ఊపింది !

ఆ మధ్య మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రుచికరమైన ఇడ్లీల కోసం ప్రత్యేకంగా గన్నవరం నుంచి వచ్చి విజయవాడ మొగల్ రాజ పురంలో ఉన్న ఇడ్లీ పాకలో తిని టేస్ట్ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు
ఈ ఇడ్లీ పాకలో నేను కూడా తినలేదు

బహుశా ఈమధ్య కాలంలో ఓపెన్ చేసారేమో
కుదిరితే ఈసారి వెళ్లి తినాలి

తినే ఐటమ్ బాగుండాలే కానీ అది పాకా.. ఏడంతస్తుల మేడా అని కూడా చూడకుండా మైళ్ళ దూరం నుంచి కూడా కష్టమరు వెతుక్కుంటూ వస్తాడు

దానికి మాజీ ఉపరాష్ట్రపతే సాక్ష్యం

మరిన్ని రుచులు తరువాయి భాగంలో ,

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!