వంగవీటి స్టాండ్

Spread the love

వంగవీటి స్టాండ్

వంగవీటి స్టాండ్ ఏంటా ? ఆశర్యపోతున్నారు కదూ !

ఈ స్టాండ్ వెనుక కధ తెలుసుకోవాలంటే రీలు నాలుగు దశాబ్దాల వెనక్కి తిప్పాలి

విజయవాడ గాంధీ నగర్లో జ్యోతి కాలేజీ అని ఓ జూనియర్ కాలేజీ ఉంది . జూనియర్ కాలేజీ అంటే జూనియర్ ఇంటర్ కాలేజీ మాత్రమే కాదు నిధుల లేమి వల్ల వసతులలో కూడా జూనియర్ కాలేజీనే .. ఇప్పుడు నేను చెప్పబోయే స్టాండ్ ఉదంతం ఆ కాలేజీ లో జరిగిందే

1970-80 లలో విజయవాడ గాంధీనగర్ లో ఏలూరు కాలువ ఒడ్డులో స్థలం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకుని జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఖమ్మం కు చెందిన ఎన్.రామ్మోహనరావు గారు అదే క్యాంపస్ లో కాలేజీతో పాటు స్కూల్ కూడా రన్ చేస్తుండేవారు

అప్పటికే విజయవాడలో ఆ కాలేజీ , స్కూళ్ళు మంచి పేరు తెచ్చుకున్నాయ్ . అయితే సమస్య అల్లా నిధుల లేమి మాత్రమే

కాలవ ఒడ్డునే రేకుల షెడ్డు కట్టించి అందులోనే విద్యా సంస్థలు నడిపేవాళ్ళు
కనీస సౌకర్యాలు ఉండేవి కావు

కాలేజీకి వచ్చే విద్యార్థుల సైకిళ్ళు , బైకులు బయటనే పార్క్ చేయాల్సివచ్చేది
దీంతో ఎండకు ఎండి వానకు తడిసి వాహనాలు తుప్పట్టిపోయేవి

అప్పట్లో నేను విద్యార్థి సంఘంలో ఉండటంతో సైకిల్ స్టాండ్ గురించి మా ప్రిన్సిపాల్ మేజర్ బసవలింగం గారిని అడిగితే కాలేజీకి ఫండ్స్ లేకపోవటంతో తన చేతిలో ఏమీ లేదని చేతులెత్తేశారు !

సరే , విషయం చైర్మన్ దగ్గరే తేల్చుకుందామని రామ్మోహనరావు గారిని హనుమాన్ పేటలో ఆయన దిగే గెస్ట్ హౌస్ లో కలిసాం

గుర్తింపు పొందిన విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ తో అతి కష్టం మీద జీతాలు ఇచ్చి నడుపుతున్నాను కాబట్టి ప్రస్తుతం తను చేయగలిగింది ఏమీ లేదని ఆయన కూడా చేతులెత్తేశారు

అప్పుడు మాకు వంగవీటి మోహన రంగా గారు గుర్తుకొచ్చారు
అప్పటికే ఆయన విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గా ఉన్నారు
కాలేజీ ఆయన కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఉంది

నేను కొంతమంది మిత్రులతో కలిసి ఆంధ్రరత్న భవన్ లో ఆయన్ని కలిసాం
యధాలాపంగా నవ్వుతూ అందరినీ పలకరించారు.

ఆయనకు జ్యోతి కాలేజీ అంటే ప్రత్యేకమైన అభిమానం..ఆయన సోదరుడు స్వర్గీయ వంగవీటి రాధా గారు స్థాపించిన స్టూడెంట్ యూనియన్ యుఐ వరుసగా పదేళ్లబట్టి ఆ కాలేజీలో గెలవడం ఆయన అభిమానానికి కారణం.

సరే , మాటామంతీ అయినతర్వాత మెల్లిగా ఆయనకు అసలు విషయం చెప్పాను
కాలేజీ లో సైకిల్ స్టాండ్ లేకపోవటంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని.

వెంటనే ఆయన పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచి ,

“కాలేజీలో వెంటనే సైకిల్ స్టాండ్ ఏర్పాట్లు చూడు..ఇంకో విషయం స్టాండ్ గురించి స్టూడెంట్ల దగ్గర పైసా కూడా తీసుకోవొద్దు..మొత్తం ఎంతైందో బిల్లు నాకు పంపమని చెప్పు..” అని అప్పటికప్పుడు పురమయించారు

సరిగ్గా మూడు రోజుల్లో కాలేజీ లో సైకిల్ స్టాండ్ రెడీ అయ్యింది
కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు ఆశర్యపోవటం మా వంతు అయ్యింది

స్టాండ్ పూర్తయిన తర్వాత వంగవీటిని కలిసి ‘ స్టాండ్ ప్రారంభోత్సవం మీ చేతుల మీదే జరగాలని..స్టాండ్ కు కూడా వంగవీటి స్టాండ్ అని పేరు పెడతామని ఆయనతో అంటే ఆయన నవ్వి ” నా పేరు వద్దుగానీ జ్యోతి కాలేజీ స్టూడెంట్స్ అసోషియేషన్ అని మీ పేర్లే పెట్టుకోండి..”అన్నారు

అలా వంగవీటి సహకారంతో సౌజన్యంతో మా కాలేజీ లో సైకిల్ స్టాండ్ ప్రారంభోత్సవానికి నోచుకుంది

ప్రభుత్వ నిధులతో కట్టించే సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ కు కూడా ఏదో తన సొంత జేబులో డబ్బులు ఖర్చుపెట్టి కట్టించినట్టు ఫ్లెక్సిలతో ఆర్భాటంగా ప్రారంభించే నాయకులున్న ఈ రోజుల్లో ఎటువంటి ప్రచార పటాటోపాలకు పోకుండా ఆ రోజుల్లోనే తన సొంత నిధులతో కాలేజీ లో సైకిల్ స్టాండ్ కట్టించిన ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు అభినందనీయులు !

ఈరోజు వంగవీటి మోహన రంగా జయంతి !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!