రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు?
1991 మే 21 న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో మానవ బాంబు దాడిలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ దుర్మరణం అంటూ ఒక వార్త క్షణాల్లో ప్రపంచమంతా పాకింది !
రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న వార్త విన్నవాళ్ళు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు.
మానవబాంబు పేలి 12 గంటలు కూడా కాకముందే సీఆర్పీఎఫ్ డీజీ కేపీఎస్ గిల్ నుంచి హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న కార్తికేయన్ కు ఫోనొచ్చింది.
కేసు విచారించే స్పెషన్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చీఫ్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నది ఆ ఫోన్ యొక్క సారాంశం.
రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎట్టిపరిస్థితుల్లోనూ థర్డ్ డిగ్రీ ఉపయోగించను, సీఆర్పీఎఫ్ లోనే కొనసాగించాలి అనే మూడు షరతుల మీద దర్యాప్తు బాధ్యతలు స్వీకరించటానికి కార్తికేయన్ సిద్ధమయ్యారు.
ఢిల్లీ వెళ్ళాల్సిన విమానాన్ని రద్దు చేసి అప్పటికప్పుడు ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ తో చెన్నై వెళ్ళటానికి ఏర్పాట్లు జరిగిపోయాయి.
అదే రోజు.. మే 22 న ఇన్వెస్టిగేషన్ పనిమొదలైంది.
కానీ, ఎక్కడినుంచి ఎలా మొదలుపెట్టాలో తెలియని కేస్ అది. ఐబీ గాని, రా గాని ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ చేయలేకపోయాయి.
ఇది మహాత్మా గాంధీ హత్య లాగానో, ఇందిరాగాంధీ హత్యలాగానో దోషులు కళ్ళముందే కనిపించిన కేసు కాదు రెడ్ హాండెడ్ గా పట్టుబడటానికి. లోతుగా దర్యాప్తు చేసి దోషులను గుర్తించలేకపోతే అమెరికాలో కెనడీ హత్యలాగే రకరకాల ఊహాగానాలతో ఎప్పటికీ వీడని మిస్టరీలాగే మిగిలిపోయేది.
నిజానికి అప్పటిదాకా ఆ రోజుకు అది బాంబు పేలుడు మాత్రమే. రాజీవ్ గాంధీ సహా 18 మంది చనిపోయారు. వారిలో పుట్టినరోజునాడే చనిపోయిన చెంగల్పట్టు ఎస్పీ ఇక్బాల్ తోబాటు ఇంకో 8 మంది పోలీసులూ ఉన్నారు.
నేరం నుంచి నేరస్తులవైపు చూస్తూ ముందుగా జర్నలిస్టులతో భేటీ అయ్యారు కార్తికేయన్.
ఏదైనా క్లూ దొరుకుతుందన్న ఆశతో
రాజీవ్ మరణవార్తను ముందుగా ప్రపంచానికి చెప్పిన పిటిఐ రంగరాజ్ ను ఆరోజు నుంచే కార్తికేయన్ సరదాగా ‘ది కిల్లర్ ఆఫ్ రాజీవ్ గాంధీ’ అనేవారు.
జర్నలిస్టులతో భేటీ సరిగ్గా కార్తికేయన్ ఆశించిన ఫలితమిచ్చింది.
ఈ ఘటనలో ఫొటోగ్రాఫర్ హరిబాబు చనిపోవటం గురించి అతడికి ఉద్యోగమిచ్చిన శుభాసుందరానికి ఫోన్ చేస్తే హరిబాబు మరణం కంటే అతని కెమెరాలో రీల్ గురించి ఎక్కువగా కలవరపడ్డాడని ఒక ఫొటోగ్రాఫర్ చెప్పాడు.
ఆ తరువాత కాలంలో ఈ కేసులో ఈ ఫొటోగ్రాఫర్ తో బాటు మరో ఇద్దరు జర్నలిస్టులు రహస్య సాక్షులుగా ఉన్నారు.
ఘటనాస్థలంలో సేకరించిన వస్తువులనుంచి అప్పటికప్పుడు కెమెరా తెప్పించి రీల్ బయటికి తీసి ప్రింట్లు వేయించారు.
13 ఫోటోలు స్పష్టంగా ఉండగా 14వ ఫోటో మాత్రం నారింజ రంగు మెరుపులాంటి మంటతో రికార్డయింది.
పేలుడులో తాను కూడా చనిపోతానని ఊహించని హరిబాబు తీసిన ఆఖరి ఫోటో అది.
వాటిని జాగ్రత్తగా గమనిస్తే వాటిలో ఒంటికన్ను శివరాసన్, థాను, నళిని చాలా ఫోటోల్లో ఉన్నారు.
థాను చేతిలో గంధపు మాల, ఆమె రాజీవ్ కు పాదాభివందనం చేస్తున్నప్పుడే పేలుడు జరగటం గుర్తించగలిగారు.
అక్కడ దొరికిన ఛిద్రమైన ఆమె శరీరభాగాలు, బెల్ట్ బాంబ్ అవశేషాలు చూశాక గాని అది మానవ బాంబ్ అనే నిర్థారణకు రాలేకపోయారు.
అలా భారత్ లో మానవ బాంబును ప్రయోగించటం అదే మొదటిసారి.
ఇంకోవైపు శుభాసుందరం ప్రస్తావన తేకుండానే ఆయన కదలికల మీద నిఘాపెట్టారు.
ఫొటోగ్రాఫర్ హరిబాబు పాత్రమీద కూడా దర్యాప్తు చేస్తామన్న ప్రకటన తగలాల్సిన చోట తగిలింది.
శుభాసుందరం హడావిడిగా హరిబాబు తల్లిదండ్రుల సంతకాలతో ఒక పత్రికాప్రకటన తయారుచేసి పేపర్ ఆఫీసులన్నీటికీ పంపాడు.
ఆయన సూచన మీద హరిబాబు తల్లిదండ్రులు హరిబాబు వస్తువులన్నిటినీ సర్ది తెలిసినవాళ్ళ ఇంటికి పంపారు.
అది కూడా కార్తికేయన్ నిఘా నుంచి తప్పించుకోలేకపోయింది. భయపడిన హరిబాబు బంధువులు వాటిని సిట్ కార్యాలయ భవనం ‘మల్లిగై’ కి పంపారు.
ఆ సామానులో హరిబాబు డైరీ దొరికింది.
అందులో ఉన్న రశీదు అసలు రహస్యం చెప్పేసింది. అది మానవబాంబు థాను చేతిలో ఉన్న గంధపు మాల కొన్న రశీదు.
కళాత్మక వస్తువులకు పెట్టింది పేరైన ‘పూంపుహార్’ నుంచి హత్య జరిగిన రోజు కొనుగోలు చేసినట్టు చెప్పిన డాక్యుమెంట్.
ఈ పథకం హరిబాబుకు తెలుసుననటానికి అది నిదర్శనం. అదే డైరీలో ఉన్న కరెంట్ బిల్ ఆధారంగా ఒక ఇంటిని గుర్తించారు.
ఈ కుట్రలో కీలకభాగస్వాములైన భార్యాభర్తలు నళిని, మురుగన్ ఉండే ఇంటి నుంచి వారు పారిపోతుండగా అరెస్ట్ చేశారు.
కుట్రను అమలు చేయటానికి ఎల్టీటీఈ తరఫున వచ్చిన శివరాసన్ కి, అఖిలకు ఆశ్రయమిచ్చింది వీళ్ళే.
బెల్ట్ బాంబ్ అమర్చుకోవటానికి వీలుగా ఉండే బట్టలు కొనిపెట్టటమే కాదు, మానవబాంబు పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉండి కూడా ప్రాణాలతో బైటపడింది శివరాసన్, నళిని మాత్రమే.
నళిని, ఆమె భర్త మురుగన్ చెన్నై సైదాపేట బస్టాండ్ లో అరెస్టయ్యారు. అప్పుడు నళిని రెండు నెలల గర్భవతి.
ఇక మిగిలిన శివరాసన్, శుభ ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు మొదలైంది. ఆచూకీ చెప్పినవారికి బహుమతులంటూ పెద్దఎత్తున పోస్టర్లు వెలిశాయి.
శ్రీపెరంబుదూరులో ఫెయిలైతే ఢిల్లీలో ప్లాన్ బి అమలు చేయాలనుకున్నారు. ఇందులో మానవబాంబుగా మారటానికి సిద్ధమైన యువతి 17 ఏళ్ల ఆదిరై. శ్రీలంక ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రిటైరైన 65 ఏళ్ల కనకసభాపతి ఆ అమ్మాయికి తాత.
చెన్నైలో ఒక ఎల్టీటీఈ సానుభూతిపరుడి ఇంట్లో వీళ్ళిద్దరూ మకాం వేశారు. అక్కడే ఒక రేడియో స్టేషన్ ఏర్పాటుచేసి జాఫ్నా నుంచి సూచనలు అందుకుంటూ వచ్చారు.
వాళ్ళకోసం కూడా గాలింపు ఉద్ధృతంగా సాగుతోంది.
బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నిఘా పెరిగింది. రిజర్వేషన్ చార్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు. నెలరోజులు నిండక ముందే వీళ్ళిద్దరూ ఢిల్లీకి టికెట్స్ రిజర్వ్ చేసుకున్నట్టు గుర్తించి పోలీసులు అదే రైలెక్కారు.
సింహళ భాష తెలిసిన పోలీస్ తేలిగ్గానే వాళ్ళ సంభాషణను పట్టేశాడు.
వాళ్ళకోసం ఇంకెవరైనా వస్తారేమోనని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. నాగపూర్ లో అరెస్ట్ చేద్దామనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.
ఢిల్లీలో ఎవరైనా రిసీవ్ చేసుకొని ఆశ్రయమిస్తారేమో చూడాలనుకున్నారు. ఢిల్లీ పోలీసులను కూడా అలర్ట్ చేశారు.
కానీ వాళ్ళు మామూలుగానే ఆటో మాట్లాడుకొని ఏదైనా హోటల్ కి వెళ్ళాలని నిర్ణయించుకోవటంతో వాళ్ళను అనుసరిస్తూ హోటల్ దాకా వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
కానీ వాళ్ళకు మద్రాసులో వాళ్ళున్న ప్రాంతం పేరు తెలియదు. దానితో ఇల్లు గుర్తుపట్టగలిగే మార్గం పోలీసులకు కనబడలేదు.
ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు. కానీ ఈ ఆధారం చాలదు. మూడు రోజుల ఇంటరాగేషన్ తరువాత ఆ పిల్లల యూనిఫాం డిజైన్ మాత్రం పోలీసులు కనుక్కోగలిగారు.
అలాంటి యూనిఫాం చెన్నైలో ఎక్కడెక్కడ వాడుతున్నారో ఆరా తీస్తే నాలుగు స్కూళ్ళు తేలాయి.
ఆ నాలుగు స్కూళ్ళలో ఈ పేర్లతో అక్కాచెల్లెళ్ళు ఉన్న స్కూలు ఏదో గుర్తించి ఆ పిల్లల ఇంటి అడ్రస్ పట్టుకోగలిగారు.
తెలిసిన మరుక్షణం వెళ్ళి దాడిచేశారు గాని అప్పటికే ఆ ఇంటి యజమాని డిక్సన్ తప్పించుకున్నాడు. రేడియో పరికరాలు మాత్రం దొరికాయి.
పోలీసుల వేట తీవ్రం కావటంతో భయపడి, తాను అజ్ఞాతంలో ఉండలేనని అర్థం చేసుకున్న డిక్సన్ ఆ తరువాత కొద్ది రోజులకే కోయంబత్తూరులో సైనైడ్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడుతోబాటు ఢిల్లీ, కోల్ కతా లాంటి చోట్ల కూడా గాలింపు సాగుతూ ఉంది.
ఈ కేసులో అత్యంత కీలకమైన శివరాసన్, శుభ మిగిలారు.
ఒక పాల టాంక్ లో దాక్కొని శివరాసన్, శుభ బెంగళూరు పారిపోయినట్టు ఆలస్యంగా గుర్తించగలిగారు.
కార్తికేయన్ బృందానికి ఈ సమాచారం నిరాశ కలిగించినా, పట్టుదల పెంచింది. నిఘా మరింత పెంచారు.
ఎట్టకేలకు బెంగళూరు శివార్లలోని కొన్నకుంటెలో శివరాసన్ ల సహా ఆరుగురు ఉంటున్నట్టు సమాచారం అందింది.
ప్రాణాలతో పట్టుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించారు. ఆ ఇంటికి వెళ్ళే నీళ్ళపైపులలోనో, పాల పాకెట్లలోనో మత్తు మందు కలపాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చివరికి పోలీసులు చుట్టుముట్టి ఉన్నారని గ్రహించిన శివరాసన్ బృందం ఆత్మహత్యకే మొగ్గుచూపింది.
రాజీవ్ హత్య జరిగిన 90 రోజులకు… సరిగ్గా రాజీవ్ పుట్టినరోజైన ఆగస్టు 20 నాడే వాళ్ళు చనిపోవటం యాదృచ్ఛికం.
రాజీవ్ హత్య జరిగి ఏడాది పూర్తికావటానికి సరిగ్గా ఒకరోజు ముందు 1992 మే 20న పూనమల్లిలోని టాడా కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది.
అది ఎంత భారీగా ఉందంటే, వెయ్యిమందికి పైగా సాక్షుల్ని ప్రశ్నించి రికార్డు చేసిన 10 వేల పేజీల వాంగ్మూలాలు, 500 వీడియో కాసెట్లు, లక్షకుపైగా ఫోటోలు జోడించారు.
దాదాపు ఆరేళ్లపాటు విచారణ జరిగిన తరువాత 1998 లో టాడా కోర్టు తీర్పు చెప్పింది.
జనవరి 28 న పూనమల్లి జైలు/టాడా కోర్టు వెలుపల వాతావరణం ఉద్విగ్న భరితంగా ఉంది. ఆ రోజు ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించారు.
ఒక చిన్న రెస్టారెంట్ ముందు షామియానావేసి రిపోర్టర్లను కూర్చోబెట్టారు.
వార్త సీనియర్ రిపోర్టర్ గా ఈ కేసు దర్యాప్తును దగ్గరగా గమనిస్తున్న నేను ఆ రోజు పూనమల్లి వెళ్ళా.
శ్రీపెరంబుదూరు బహిరంగ సభకు వెళ్ళే అరగంట ముందు రాజీవ్ ఆవిష్కరించిన ఇందిరాగాంధీ విగ్రహం అక్కడికి చాలా దగ్గర్లోనే ఉంది.
కేసు గురించే మాట్లాడుకుంటూ దాదాపు రెండు గంటలుగా రిపోర్టర్లమ్ అక్కడే ఎదురుచూస్తూ కూర్చున్నాం.
దూరంగా కార్తికేయన్ నడుచుకుంటూ రావటం చూసిన మేమంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాం.
ఆయన రాగానే కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటూ ఒక్క క్షణం ఆగారు.
అందరం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉండగా “వాయ్ మైయే వెల్లుమ్… ట్రూత్ ఓన్లీ ట్రయంఫ్స్ .. సత్యమేవ జయతే” అని మూడు భాషల్లో చెప్పాక అసలు విషయం చెప్పారు.
మొత్తం 26 మందినీ దోషులుగా కోర్టు నిర్థారించిందని, మరణశిక్ష విధించిందని, మరిన్ని వివరాలతో మరికాసేపట్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయారు.
రోజుకు 20 గంటలపాటు కష్టపడి తయారు చేసిన ఛార్జ్ షీట్, దానికి కొనసాగింపుగా సాగిన కోర్టు విచారణ ఇచ్చిన ఫలితంతో ఆయన మొహంలో చాలా పెద్ద రిలీఫ్ కనబడింది.
కానీ ఫోటోగ్రాఫర్లలో ఒకడిగా వచ్చిన శుభాసుందరం కొడుకు అరుణ్ ఈ మాట వినగానే కుప్పకూలిపోయాడు.
వాళ్ళ నాన్న విడుదలవుతాడని, నేరుగా ఆయన్ని గుడికి తీసుకెళ్లాలని కొత్త బట్టలు తీసుకుని మరీ వచ్చినవాడికి ఇది శరాఘాతమే మరి.
బెల్ట్ బాంబుకు శక్తిమంతమైన బాటరీలు సమకూర్చిన పేరరివళన్ తల్లి అర్బుతం అమ్మాళ్ కూడా తనకొడుకు విడుదలవుతాడని ఎంతో ఆశతో అక్కడికొచ్చింది.
తీర్పు సంగతి తెలియగానే ఆమె కోపంతో ఊగిపోయింది. ఒక్క సారిగా తీర్పు మీద దుమ్మెత్తిపోస్తూ, కత్తికి శిక్ష వేయటం ఎక్కడైనా ఉంటుందా? అని మీడియా ముందు వాపోయింది.
అక్కడ తీర్పు చెప్పిన జడ్జ్ కూడా మళ్ళీ ఇలాంటి తీర్పు రాయాల్సిన అవసరం రాకూడదనే అభిప్రాయంతో న్యాయ ప్రక్రియకు అనుగుణంగానే ఆ సంతకం పెట్టిన పెన్ను పాళీ విరిచేశారు.
మరుసటి రోజు చెన్నైలోని సిట్ కేంద్ర కార్యాలయం మల్లిగై లో మీడియాకి లంచ్ ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు తీరు మొత్తం వివరించారు కార్తికేయన్.
ఆ తరువాత జస్టిస్ జైన్ కమిషన్, జస్టిస్ వర్మ కమిషన్ నియామకాల వెనుక రాజకీయ కారణాలున్నాయన్నమాట నిజం.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక దేశాలు తిరిగినా, వాళ్ళు కార్తికేయన్ కి మించి తేల్చిందేమీ లేదు.
ఈ కేసు దర్యాప్తు తీరు మీద ఇంటర్ పోల్ కి ఇచ్చిన ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఎంతగా ఆకట్టుకుందంటే దీన్నో మోడల్ గా తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
అయితే,1999 మే 11 నాడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది.
19 మందిని నిర్దోషులుగా విడుదలచేసింది. నళిని, మురుగన్, శంతన్, పేరరివళన్ తప్ప మిగిలినవారి మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చింది.
మరణశిక్ష పడినవాళ్ళకు క్షమాభిక్ష కోసం ప్రభుత్వం 2000 లో పంపిన పిటిషన్ల మీద రాష్ట్రపతి తిరస్కార నిర్ణయం 11 ఏళ్ల తరువాత వచ్చింది.
ఇప్పటికీ పూర్తిగా ఒక కొలిక్కి రాని ఈ వ్యవహారంలో ఈ మధ్యనే పేరరివళన్ ను సుప్రీంకోర్టు విడుదలచేసింది.
ఒక బిడ్డకు తల్లిగా ఉన్న నళిని ని ప్రియాంక గాంధీ జైల్లో కలిసి రావటం, నళినిని క్షమిస్తున్నట్టు సోనియా, రాహుల్, ప్రియాంక ప్రకటించటం తెలిసిందే.
దేశంలో 31 ఏళ్ళుగా జైల్లో ఉండిపోయిన మహిళాఖైదీగా ఆమెదొక రికార్డు. జైల్లోనే కూతుర్ని కని పెళ్ళికూడా చేసింది.
1999 లో విడుదలైన కనకసభాపతి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు.
ఆయన మనవరాలు ఆదిరై తన సహనిందితుడు విక్కీ అలియాస్ విఘ్నేశ్వరన్ ను పెళ్ళిచేసుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడింది.
ఈ కేసులో ఏడేళ్ళకు పైగా జైల్లో ఉండి వచ్చిన శుభాసుందరం ఆ తరువాత కొన్నేళ్ళకే చనిపోయాడు.
ఫోటో ఏజెన్సీ నడిపిన శుభాసుందరం ఒకప్పుడు పేరుమోసిన ఫొటోగ్రాఫర్. ఆయన తీసిన ఎమ్జీఆర్ ఫోటో ఒకటి కనీసం కోటి కాపీలు వాడి ఉంటారు ఆయన అభిమానులు.
తండ్రి జైల్లో ఉన్నప్పుడు కొడుకు అరుణ్ ఫొటోగ్రాఫర్ గా ఆ కుటుంబానికి అండ అయ్యాడు. అతను కొంతకాలం ఎన్డీటీవీకి పని చేశాక ఇప్పుడు టీవీ18 లో ఉన్నాడు.
2010 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న దేవరాయపురం రామస్వామి కార్తికేయన్ కోయంబత్తూర్ దగ్గర సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు.
చదువుకున్న తరువాత కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. ఆ తరువాతే సివిల్స్ కు ఎంపికై సిబిఐ చీఫ్ దాకా రకరకాల హోదాల్లో పనిచేశారు.
రాజీవ్ కేసు దర్యాప్తు సమయంలో భార్యకు గుండెపోటు వచ్చినా ఏమాత్రం తొణకాలేదాయన. ఇప్పుడు 83 ఏళ్ల వయసులో ఢిల్లీలో స్థిరపడి మెడిటేషన్, ఆహారం, యోగా లాంటి విషయాలు అధ్యయనం చేస్తూ పుస్తక రచనలో నిమగ్నమయ్యారు. హెచ్ ఎం టీవీ (అప్పట్లో టి చానల్) తొలిరోజుల్లో ఎమెస్కో ఆఫీసులో చివరిసారిగా ఆయనతో చిన్న ఇంటర్వ్యూ కూడా చేశాం.!
తదుపరి కార్తికేయన్ నిప్పులాంటి నిజం – రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు , ఒక వాస్తవ గాథ పేరుతొ రాధా వినోదరాజు తో కలిసి ఒక పుస్తకం కూడా రాసారు
ఈ పుస్తకానికి స్వేచ్ఛానువాదం తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ గారు రాసారు
ప్రస్తుతం ఈ పుస్తకం ఎమెస్కో పబ్లికేషన్ లో దొరుకుతుంది
రాజీవ్ హత్య మీద వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అయినాయి
సోనీ లైవ్ లో ఉన్న ది హంట్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు !
తోట భావనారాయణ ( సీనియర్ జర్నలిస్ట్ )