అవును .. ఒక మళయాళం సినిమా విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకువచ్చింది !
తరతరాలుగా తరగతి గదుల్లో విద్యార్థులు ఒకటెనుక ఒకటిగా వేసిన బెంచీల్లో కూర్చోవడం మనం చూస్తూనే ఉన్నాం
ఈ విధానంలో ఫ్రంట్ బెంచర్లు అని బ్యాక్ బెంచర్లు అని విద్యార్థులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది
ఫ్రంట్ బెంచ్ లో కూ ర్చునేవాళ్ళు తెలివైనవారనీ , బ్యాక్ బెంచర్స్ చదువులో వెనకబడేవారని కొన్ని అభిప్రాయాలు చాలామందిలో పాతుకుపోయాయి
సాధారణంగా తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుల దృష్టి మొదటి బెంచ్ విద్యార్థుల మీదే ఎక్కువగా ఉంటుంది
చదువులో వెనకబడిపోతున్నాం అని ఆత్మ న్యూనతతో బాధ పడే వాళ్ళు , అల్లరి చేయాలనుకునే వాళ్ళు వెనుక బెంచీలను ఆశ్రయిస్తారు
ఉపాధ్యాయుడి దృష్టి కూడా ఫ్రంట్ బెంచ్ విద్యార్థుల మీదే ఉంటుంది కాబట్టి వెనుక బెంచి విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి
తరతరాలుగా నలుగుతున్న ఈ సమస్యకు ఒక మళయాళం సినిమా పరిష్కారం చూపించింది అంటే ఆశ్యర్యంగా ఉంది కదూ !
ఎస్ .. ‘స్థానార్ది శ్రీకుట్టన్’ అనే ఓ మళయాళ సినిమాలో దర్శకుడు ఈ సమస్యకు ఓ వినూత్నమైన పరిష్కారం చూపించారు
అదే U టైపు బెంచ్ విధానం
తరగతి గదుల్లో ఒకదాని వెనుక ఒకటి బెంచీలు వేసే విధానం మార్చి ఆంగ్ల అక్షరం U ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేయాలనీ ఆ సినిమాలో చెప్తాడు
ఈ పద్దతి వల్ల తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడికి విద్యార్థులు అందరూ ముఖాముఖి కనిపిస్తారు
దానితో పిల్లలందరి మీద సమ దృష్టి పెట్టే అవకాశం ఉపాధ్యాయుడికి దక్కుతుంది
పిల్లల్లో కూడా ఆత్మ న్యూనతా భావం తగ్గి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
టీచర్ దృష్టి తమమీద ఉంటుందని తెలుసుకుని చదువులో రాణించటానికి మరింత కృషి చేస్తారు
ఈ సినిమాని ప్రేరణగా తీసుకుని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన జిల్లాలోని అన్నిప్రభుత్వ రెసిడెన్షియల్ , ఆశ్రమ పాఠశాల తరగతి గదుల్లో U ఆకారంలో బెంచీలు ఏర్పాటు చెయ్యాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు
ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు విజయవంతం అవడంతో తెలంగాణా మొత్తం అన్ని స్కూళ్లలో ఇదే పద్దతి అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు ఇవ్వనున్నారు
2024 నవంబర్ లో విడుదలైన స్థానార్థి శ్రీకుట్టన్ మళయాళ సినిమా ప్రభావం ఎంతలా మారిందంటే కేరళ రాష్ట్రం మొత్తం తరగతి గదుల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు
కేరళ స్పూర్తితో ఒడిస్సా , పంజాబ్ , తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు
స్థానార్థి శ్రీకుట్టన్ సినిమాలో హీరోది బ్యాక్ బెంచ్ .. అయినా తన తెలివితేటలతో చదువుల్లో ఎలా రాణించాడో అన్న పాయింట్ ఆధారంగా కథ రాసుకుని సినిమా చూపించాడు దర్శకుడు
అలాగే బ్యాక్ బెంచెస్ వల్ల విద్యార్థుల్లో ఏర్పడే ఆత్మ న్యూనతా భావాన్ని టచ్ చేస్తూ పరిష్కార మార్గాలు కూడా చూపించాడు
ఏదిఏమైనా సినిమా మాధ్యమం అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే కాకుండా సామజిక సమస్యల పరిష్కార మార్గాలను కూడా చూపించగలదని మరోసారి రుజువైంది !