సంబంధం చూసేటప్పుడు తమ పిల్లను చేసుకోబేయే పిల్లవాడు గవర్నమెంట్ జాబ్ చేస్తుండాలి అనీ .. ఆ కుటుంబం బాగా స్థితిమంతులు అయి ఉండాలనీ , సాధ్యమైనంతవరకు చిన్న కుటుంబం అయి ఉండాలనీ ఇలా కొన్నిరకాల పారామీటర్స్ పెట్టుకుని వరుడి కోసం వెతుకుతారు ఆడపిల్ల తల్లితండ్రులు
ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్స్ వచ్చాక ప్యాకేజీల మోజులో పడ్డారు కానీ ఒకప్పుడు సంబంధాల విషయంలో గవర్నమెంట్ జాబే క్రైటీరియా గా ఉండేది
ఈ పరిస్థితి పెళ్లికాని ప్రసాదులకు ఇబ్బందిగా ఉండేది
సంబంధాలు చూసేటప్పుడు అడిగే మొదటి ప్రశ్న కుర్రాడిది గవర్నమెంట్ జాబా ? ప్రైవేట్ జాబా ? అని
ఎవడైతే ప్రైవేట్ జాబ్ అని చెప్తాడో ఆడికి గిరాకీ తగ్గిపోతుంది
గవర్మెంట్ జాబ్ అని చెప్పినోడికి రాజమర్యాదలు దక్కుతాయి
చదువు పూర్తి అయి ఉద్యోగాలు వెతుక్కుంటున్న పెళ్లికాని ప్రసాదులు అందరూ ఎదుర్కునే ఇబ్బందే ఇది
సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా కథ రాసుకుని తెరకెక్కించాడు హీరో కం దర్శకుడు విప్లవ్
పెళ్లికాని అబ్బాయిలందరిదీ ఇదే సమస్య కాబట్టి యూతుకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది
ఇక కథ విషయానికి వస్తే రాజు ( విప్లవ్ ) చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు
అదే ఊరిలో శిరీష ( అశ్విని ) గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తుంది
అదే సమయంలో రాజు శిరీషను ప్రేమిస్తాడు
అయితే వీరి ప్రేమకు అడ్డుపడుతూ గవర్నమెంట్ జాబ్ వస్తేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు శిరీష తండ్రి
రాజు కూడా ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని మూడు సార్లు ప్రయత్నించినా సాదించలేకపోతాడు
చివరికి రాజు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుని తన ప్రేమను గెలిపించుకుంటాడా ? లేదా అనేది మిగిలిన సినిమా
సినిమా ఎలా ఉంది ?
సినిమాకి ప్లస్ పాయింట్ చక్కటి అందమైన పల్లెటూరి లొకేషన్స్ .. లొకేషన్స్ బాగుండటంతో చూసే ప్రేక్షకులకు ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది
ఇక రాజు , శిరీష మధ్య లవ్ ట్రాక్ చక్కగా నడిపించాడు దర్శకుడు
రాజు ముందు రెండు లక్ష్యాలు ఉంటాయి .. ఒకటి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడం .. రెండు తన ప్రేమను గెలిపించుకోవడం
ఈ క్రమంలో కథ ముందుకు సాగుతుంది కాబట్టి ప్రధమార్ధంలోనే కథ తాలూకూ థీమ్ ప్రేక్షకులకు అర్థమైపోయింది
చదువు పూర్తి అయిన యువకుడు గవర్మెంట్ జాబ్ పొందటం అనే లక్ష్యానికి ప్రేమను జోడించి కథ రాసుకున్న విధానం బావుంది
ఎవరెలా చేసారు ?
ఈ సినిమా కోసం కథ , నిర్మాత , ఎడిటర్ , దర్శకత్వం లతో పాటు హీరోగా మొత్తం బాధ్యత భుజాన వేసుకుని విప్లవ్ చేసిన ప్రయత్నం అభినందనీయం
తన సినిమాలో తానే నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం అంటే పెద్ద టాస్కే
చిన్న చిన్న లోపాలు మినహా విప్లవ్ ఈసారైనా సినిమాని తెరకెక్కించిన విధానం బాగుంది
రాజు పాత్రలో విప్లవ్ పెరఫార్మెన్సు బాగుంది
శిరీష పాత్రలో నటించిన అశ్విని పల్లెటూరి అమ్మాయిగా సహజంగా కనిపించింది .. కొన్ని సన్నివేశాల్లో ఆమెలో మన పక్కింటి అమ్మాయి కనపడుతుంది
కధలో భాగంగా తీసిన కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి
హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన ప్రదీప్ రాపర్తి చక్కటి నటనను ప్రదర్శించాడు
సాంకేతిక విషయాల్లో కూడా విప్లవ్ కష్టం కనిపిస్తుంది
మైనస్ : సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించింది .. కథ కోసం తీసుకున్న పాయింట్ గట్టిదే అయినప్పటికీ స్క్రిప్ట్ వర్క్ లో దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది
సాధారణంగా ఏ సినిమా అయినా ఫెమిలియర్ గా ఉండటం అనేది ముఖ్యం
ఇక్కడ ఫెమిలియర్ అంటే నటీనటుల గురించి అన్నమాట
ఈ సినిమాలో కొన్ని పాత్రలు చూసినప్పుడు ఈ పాత్రకు ఫలానా నటుడు అయితే బాగుండేది అనిపించింది
అందరూ కొత్తవాళ్లు అవడం కన్నా ప్రేక్షకులు అలవాటు పడిన తెలిసిన నటులు ఉండటం వల్ల కూడా సినిమాకి కొంత ప్రాముఖ్యత పెరుగుతుంది
ముగింపు : సినిమా నిర్మాణంలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఒకే యువకుడు రచయితగా , హీరోగా , ఎడిటర్ గా , దర్శకుడిగా అన్ని బాధ్యతలు ఏక కాలంలో భుజాన వేసుకుని యూతుకు కనెక్ట్ అయ్యేలా సినిమా తీయడం అభినందించదగ్గ విషయం !
సినిమా నవంబర్ 2024 లోనే థియేటర్లలో రిలీజ్ అయ్యింది
ప్రస్తుతం ఆన్లైన్ ప్లాటుఫార్మ్స్ లో చూడొచ్చు!
పరేష్ తుర్లపాటి