మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీ నగర్ లో 93 ఏళ్ల వృద్ధుడు తన భార్య శాంతాబాయి తో కలిసి జ్యువలరీ షాపుకు వెళ్ళారు
వీరి ఆహార్యం చూసిన షాపు కుర్రాడు గుమ్మంలోనే ఆపి ‘ ఏం కావాలి? అని అడిగాడు
దానికి ఆ వృద్ధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్య వైపు ప్రేమగా చూస్తూ ‘ నా పెళ్ళానికి మంగళ సూత్రం కావాలి బాబూ ‘ అన్నాడు
కానీ ఆ కుర్రాడు మాత్రం వీళ్ళ వాలకం చూసి చిరాకుతో ‘ బంగారం లేదు ఏం లేదు పొద్దున్నే బోణీ బేరం.. డబ్బులు పెట్టుకుని కొనుక్కునే ముఖాలేనా? వెళ్ళండి ఇక్కడనుంచి..” అని విసుక్కున్నాడు
దాంతో వృద్ధుడు ఆత్మాభిమానంతో ‘ ఊరికినే ఇవ్వక్కర్లేదు బాబూ.. ఇవిగో డబ్బులు ” అంటూ తన చేతి సంచిలో చిల్లరతో కలిపి ఉన్న 1120 రూపాయలు బల్ల మీద బోర్లించాడు
ఆ చిల్లర చూసిన కుర్రాడికి కోపం నషాళానికి అంటుంది.. ముందు ఇక్కడనుంచి వెళ్తారా? లేదా? అని గట్టిగా కేకలు వేశాడు
ఈ అరుపులకు లోపలినుంచి గోల్డ్ షాప్ యజమాని బయటికి వచ్చి విషయం ఏంటని ఆ వృద్ధ దంపతులను అడిగాడు
అప్పుడు ఆ వృద్ధుడు ‘ బాబూ.. పెళ్ళైన ఇన్నేళ్లలో కూడా నా భార్యకు మిల్లీ గ్రాము బంగారం కూడా కొనలేదు.. అదీ నన్ను బంగారం కొనమని ఎప్పుడూ అడగలేదు.. మెడలో ఆ పసుపు తాడు మినహా దానికి నేను ఇచ్చింది ఏమీ లేదు.. నాకు దేవుడి పిలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేము.. అందుకే నేను ఉండగానే దాని మెడలో బంగారు మంగళ సూత్రం చూడాలని కోరిక.. అది కూడా ఉరికే ఇవ్వవద్దు.. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఎంత వస్తే అంత ఇవ్వండి ” అని టేబుల్ మీద ఉన్న 1120 రూపాయలను చూపిస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు
ఇన్నేళ్ల కాపురంలో భార్య మీద 93 ఏళ్ల ఆ వృద్ధుడి ప్రేమకు గోల్డ్ షాప్ ఓనర్ కళ్ళు చెమర్చాయి .. వెంటనే గుమాస్తా కు చెప్పి మంగళ సూత్రాలు తెప్పించి 1120 రూపాయలతో పాటు బంగారం కూడా వృద్ధుడి చేతిలో పెట్టాడు
ఉచితంగా తీసుకోవడానికి ఆ వృద్ధ దంపతులకు ఆత్మాభిమానం అడ్డు వచ్చింది.. డబ్బులు తిరిగి షాపు యజమాని చేతిలో పెడుతూ ‘ ఈ డబ్బులు ఉంచు బాబూ ‘ అని బలవంత పెట్టబోయారు..
“ఈ బంగారం నేను మీకు ప్రేమతో కానుకగా ఇస్తున్నాను.. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇందులో 20 రూపాయలు మాత్రమే తీసుకుంటా ” అని 20 రూపాయలు తీసుకుని మిగిలిన డబ్బులూ.. బంగారం ఆ వృద్ధుడి చేతిలో పెట్టాడు
మంగళ సూత్రం చేతిలోకి తీసుకుని ప్రేమగా భార్య వంక చూశాడు ఆ వృద్ధుడు.. అప్పటికే శాంతాబాయి సిగ్గుల మాలచ్చిమి అయిపోయింది!
ఈ తతంగం మొత్తం షాపు కుర్రాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ తో వైరల్ అయ్యింది
అవును ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ఎవరు మాత్రం ఫిదా అవకుండా ఉండగలరు!!
పరేష్ తుర్లపాటి ✍️