Home » సీరియల్ హత్యలకు ఆర్యన్ కు సంబంధం ఏంటి ? ఆర్యన్ మూవీ రివ్యూ

సీరియల్ హత్యలకు ఆర్యన్ కు సంబంధం ఏంటి ? ఆర్యన్ మూవీ రివ్యూ

Spread the love

“ఎవరు మీరు ? లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా ఆడియన్స్ ఇలా ప్రోగ్రాం మధ్యలోకి రాకూడదు?”

ప్రముఖ తమిళ హీరో తో బిగ్ విజన్ టీవీ స్టూడియోలో లైవ్ డిబేట్ చేస్తున్న యాంకర్ అరిచింది

“నేనొక రైటర్ని .. నా గురించి వివరాలు లైవ్ లో చెప్తా కానీ క్రిమినల్ ఆరోపణలున్న ఇలాంటి హీరోలను ఇంటర్వ్యూలు చేసి రేటింగులు పెంచుకోవడం అవసరమా ?” అంటూ అతడు జేబులోనుంచి పిస్టల్ తీసి హీరో కాలి మీద కాలుస్తాడు

హీరో కాలి గాయంతో కిందపడిపోతాడు

అప్పుడు ఆ రైటర్ కుర్చీలో కూర్చుని యాంకర్ వైపు చూస్తూ ” లైవ్ ఆపొద్దు .. ఈరోజు నుంచి నేను వరుసగా రోజుకొకరి చొప్పున మొత్తం ఆరుగుర్ని మర్డర్ చేయబోతున్నాను ..హత్య చేయడానికి గంట ముందు వాళ్ళ పేరు చెప్తాను ..పోలీసులు ఎంత ప్రయత్నించినా ఈ హత్యలను ఆపలేరు .. వారిలో మొదటివాడి పేరు ఇప్పుడు చెప్తాను.. ప్రస్తుతం అతడు ఇక్కడే ఉన్నాడు ..” అంటూ ఆ పేరు చెప్తాడు

ఛానల్ వాళ్ళు స్టూడియోలో ఉన్నవాళ్ళ పేర్ల లిస్ట్ చూస్తే అందులో ఆ రైటర్ మినహా మిగిలినవాళ్లలో ఆ పేరు కలవాళ్ళు లేరు

అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది

కొంపదీసి ఈయన చంపుతానని చెప్పిన మొదటి పేరు ఈయనదేనా ? అని

అనుకున్నట్టుగానే మొదటిపేరు రైటర్ దే అవుతుంది
అందరూ షాక్ అవుతారు

ఇదేంటి ఈ రైటర్ మొత్తం ఆరుగుర్ని చంపుతా అంటున్నాడు ? అందులో మొదటి పేరు ఈయనదే ఉంది ? ఇదెలా సాధ్యం అనుకుంటుండగానే రైటర్ లైవ్ లోనే కాల్చుకుని చనిపోతాడు

ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది?

చనిపోయిన ఈ రైటర్ బతికున్న మిగిలిన ఆ ఐదుగురిని ఎలా చంపగలడు ?
సాధ్యం కాదు అనుకుంటారు

అంతలోనే రెండో రోజు తాను హత్య చేయబోయే వ్యక్తి పేరు చెప్తూ ఆ రైటర్ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు

ఇదెలా సాధ్యం ?
ఆశ్చర్యంగానూ , ఇంట్రెస్టింగ్ గానూ , థ్రిల్లింగ్ గానూ ఉంది కదా ?

ఇదే ఆర్యన్ మూవీ బిగినింగ్

ఏ కథ కైనా , సినిమాకైనా ప్రారంభం ఆకట్టుకునేలా ఉండాలి

మొదటి పేజీలోనే రీడర్ కనెక్ట్ అయ్యేలా రచన ఉంటే చివరి పేజీ వరకు చదవడానికి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది

అలాగే మొదటి సన్నివేశంలోనే గ్రిప్పింగ్ ఉంటే ప్రేక్షకులు మూవీకి కనెక్ట్ అవుతారు
ఆర్యన్ మూవీలో దర్శకుడు చేసిన ప్రయోగం అదే

మొదటి సన్నివేశంలోనే సస్పెన్స్ క్రియేట్ చేసి ప్రేక్షకులు తర్వాతి సన్నివేశాల కోసం క్యూరియాసిటీగా ఎదురుచూసేలా చేసాడు

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల్లో సరికొత్త ప్రారంభాన్ని సృష్టించాడు

ఆర్యన్ కధేంటి ?

నయన ( శ్రద్ద శ్రీనాథ్ ) బిగ్ విజన్ టీవీ న్యూస్ ఛానల్లో ప్రెజెంటర్ గా పనిచేస్తూ ఉంటుంది

ఓరోజు తమిళ హీరో కైలాష్ తో లైవ్ డిబేట్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తారు

ఆ హీరోని యాంకర్ నయన ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టగానే ఆడియన్స్ లో కూర్చున్న ఆత్రేయ (సెల్వ రాఘవన్ ) లేచి లైవ్ మధ్యలోకి వస్తాడు

ఊహించని ఈ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోతారు

కానీ ఆత్రేయ మాత్రం కూల్ గా జేబులోనుంచి రివాల్వర్ తీసి ఆ హీరో కాలి మీద కాలుస్తాడు

అతడేం చేస్తున్నాడో అర్ధం కాని యాంకర్ ఎందుకిలా చేస్తున్నారని అడిగేసరికి లైవ్ లోనే తన గురించి చెప్తాడు

తానొక రైటర్నని , ఈ రోజు నుంచి రోజుకొకరి చొప్పున మొత్తం ఆరుగుర్ని చంపబోతున్నానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు

కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ రైటర్ ముందుగా తనని తాను రివాల్వర్ తో కాల్చుకుంటాడు

అయితే అతడు అంతకుముందు స్టూడియో లైవ్ లో చెప్పినట్టుగానే రోజుకొకర్ని చంపుతూ ఉంటాడు

ఇదెలా సాధ్యం ?

చనిపోయిన వ్యక్తి మిగిలిన ఐదుగురిని ఎలా చంపగలడు ?

అసలు మిగిలిన ఐదుగురిని యితడు ఎందుకు చంపాలనుకుంటాడు ?

ఈ సీరియల్ హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?

ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన డిసిపి నంది ( విశాల్ విష్ణు ) ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తాడు ? అనేవి మిగతా కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

గుర్తు తెలియని సీరియల్ కిల్లర్ హత్యలు చేయడం , పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి క్లైమాక్సులో అసలు నేరస్తుడ్ని పట్టుకోవడం గతంలో చాలా సినిమాల్లో చూసాం

కానీ ఆర్యన్ లో కొత్త పాయింట్ ఏంటంటే సీరియల్ కిల్లర్ ఎవరో ముందే తెలిసిపోవడం , పైగా చనిపోయి కూడా అతడు ఐదు హత్యలకు ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది

ఆర్యన్ మూవీకి ప్రధానమైన అస్సెట్ కథలో ప్రారంభమే
ఈ బిగినింగ్ సినిమా మీద క్యూరియాసిటీ కలిగిస్తుంది

సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు రాసిన ఓ రైటర్ తన కథలో పాత్రలనే తాను హత్య చేయబోతున్నట్టు చెప్పడం కొత్తగా ఉంది

ఈ విషయంలో దర్శకుడు ఇంట్రెస్టింగ్ పాయింటునే పట్టుకున్నాడు

చనిపోయిన వ్యక్తి మిగిలిన ఐదుగురిని ఎలా చంపగలడు ? అనే క్యూరియాసిటీని మూవీలో ఉన్న పాత్రలతో పాటు ప్రేక్షకులకు కూడా కలిగేలా చేసాడు

అదే టెంపో లో ఒకటొకటిగా రైటర్ ఆత్రేయ ముందుగానే చెప్పినట్టు సీరియల్ హత్యలను ప్లాన్ చేసి అమలుచేసిన విధానం ప్రేక్షకులకు కన్విన్సింగ్ గానే చెప్పాడు దర్శకుడు

హంతకుడు ఏ విధంగా సాంకేతికతను వాడుకుని హత్యలు చేసాడు అనే పాయింటుని జాగ్రత్తగానే ఎస్టాబ్లిష్ చేసాడు

రైటర్ చనిపోయేముందు రాసిన ఆర్యన్ నవలకు ,సినిమాలో జరుగుతున్న సంఘటనలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం కూడా బాగుంది

పోలీసులు డిసిపి నంది ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఆత్రేయ చేస్తున్న హత్యలను ఆపలేకపోతారు

ఆఖరి టార్గెట్ ను మాత్రం నంది మిస్సింగ్ చేయడం వరకు ఓకే కానీ ఇంతా చేసి దర్శకుడు ముగింపు కన్విన్సింగ్ గా తీయలేకపోయాడు

చనిపోయిన రైటర్ ప్రీ ప్లాన్డ్ గా మర్దర్లు చేయడం వరకు బాగానే ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు అసలు రైటర్ ఆ హత్యలు చేయడం వెనుక ఒక బలమైన కారణాన్ని చూపలేకపోయాడు

చివరిదాకా టెంపో మెయింటైన్ చేసిన మూవీ క్లైమాక్సులో గాడి తప్పింది
అదే ఈ సినిమాకు మైనస్

సీరియల్ కిల్లర్ వరుస హత్యలు చేయడం వెనుక ఒక బలమైన కారణాన్ని చూపించి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది

పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న డిసిపి నందికి ఈ కేసు అప్పగించడం వరకు బానే ఉంది కానీ భార్యతో అతడి గొడవలు కథకి అస్సలు అవసరం లేని , సంబంధం లేని సాగతీత సన్నివేశాలు మాత్రమే
సినిమాలో ఆవిడ పాత్ర లేకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు

ఇక ఈ కేసులో పోలీసులకన్నా యాంకర్ నయనే ఎక్కువ క్లూలు ఇచ్చినట్టుంది
అయినా పర్లేదు కథలో భాగంగానే కొనసాగింది

ఎవరెలా చేసారు ?

ఆర్యన్ మూవీలో ఎవరెలా చేసారంటే ముందు హీరో పేరు చెప్పడం కన్నా సెల్వ రాఘవన్ పేరు చెప్పడమే న్యాయం

ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్ రైటర్ ఆత్రేయగా నటించిన సెల్వ రాఘవన్

చెప్పదల్చుకున్న విషయాన్ని చాలా కూల్ గా ముఖంలో అదొక రకమైన హావభావాలను ప్రదర్శిస్తూ చెప్పాడు

ఒక్కోసారి అతడి ముఖం చూస్తుంటే మనకే ఒళ్ళు జలదరిస్తుంది
కొన్నిసార్లు మాత్రం జాలేస్తుంది

అతడు మంచివాడో , సైకోనో క్లారిటీగా చెప్పలేని సందిగ్ధంలో పడిపోతాం
కనిపించినంతసేపు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు

ఇక డిసిపి నంది గా నటించిన విశాల్ విష్ణు నటన కూడా బాగానే ఉంది
శ్రద్దా శ్రీనాథ్ కు కథలో ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది
యాంకర్ నయన పాత్రలో ఆమె ఒదిగిపోయింది

సాంకేతికత :

ఆర్యన్ మూవీకి జిబ్రాన్ అందించిన బీజీఎమ్ బాగుంది
సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు

హరీష్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది

ఈ సినిమాకి కథ రాసుకున్న దర్శకుడు ప్రవీణ్ కె బిగినింగ్ లో మంచి గ్రిప్పింగ్ తో తెరకెక్కించినప్పటికీ క్లైమాక్సులో మాత్రం తడబడ్డాడు

విశ్లేషణ :

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు చూడటానికి ఇష్టపడేవాళ్ళకు ఆర్యన్ మూవీ నచ్చుతుంది . ముగింపు కన్విన్సింగ్ గా లేదు అన్న పాయింట్ పక్కనబెడితే బిగినింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ గానే తీసాడు . అసభ్యత , అశ్లీలతలు లేవు కాబట్టి ఇంట్లోనే ఓటిటీ లో నిరభ్యంతరంగా చూడొచ్చు

నటీనటులు : విశాల్ విష్ణు , శ్రద్దా శ్రీనాథ్ , సెల్వ రాఘవన్ తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్
రేటింగ్ : 2.75 /5
విడుదల : నెట్ ఫ్లిక్స్


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!