Home » “ఈ వయసులో బరువులు ఎత్తడం నీకవసరమా ఆంటీ ?” అని హేళన చేసిన నోళ్లను అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మరీ మూయించింది !

“ఈ వయసులో బరువులు ఎత్తడం నీకవసరమా ఆంటీ ?” అని హేళన చేసిన నోళ్లను అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మరీ మూయించింది !

Spread the love

మగువా .. ఓ మగువా
లోకానికి తెలుసా నీ విలువా
అటుఇటు అన్నింటా , నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటాబయటా
అలుపని రవ్వంత అననేఅనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా
మగువా .. ఓ మగువా .. నీ సహనానికి సరిహద్దులు కలవా

అని ఓ సినీ కవి చిన్న పాటలోనే మహిళల గొప్పతనాన్ని గురించి చెప్పాడు

ఆ మాటలు అక్షరాలా నిజం

జాన్సీ లక్ష్మి బాయ్ నుంచి ఇందిరా గాంధీ వరకు అనేకమంది మహిళలు లోకానికి తమ విలువ తెలియచేసారు

ప్రస్తుతానికి వస్తే ,

ప్రగతి క్యారక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

తమిళనాట హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె తెలుగునాట క్యారక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉలవపాడుకి చెందిన ప్రగతి చిన్ననాడే తండ్రిని కోల్పోవడంతో తల్లితో కలిసి మద్రాసుకి మకాం మార్చింది

కార్టూన్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది

ప్రగతి ఒక పక్కన చదువుకుంటూనే మరోపక్క కుటుంబ పోషణ కోసం వాణిజ్య ప్రకటనల్లో నటించేది
ఆలా చెన్నైలోని మైసూర్ సిల్క్స్ ప్యాలస్ వారి యాడ్ లో నటించింది

ఆ వాణిజ్య ప్రకటన తమిళ దర్శకుడు భాగ్యరాజా దృష్టిలో పడింది

వెంటనే ఆయన తన సినిమా వీట్ల విశేషం లో ప్రగతికి హీరోయిన్ అవకాశం ఇవ్వడం జరిగింది

ఆ సినిమా తర్వాత షుమారు రెండు సంవత్సరాల్లో కొన్ని తమిళ , మలయాళం సినిమాల్లో నటించింది

అదృష్టం కలిసి రాలేదో , అవకాశాలు కలిసిరాలేదో తెలీదు కానీ ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది

సరిగ్గా ఆ టైం లోనే ఆమెకు పెళ్లి కావడంతో సినీ కెరీర్ కు బ్రేక్ పడింది

తిరిగి మూడు సంవత్సరాల తర్వాత ముందుగా కొన్ని తెలుగు సీరియళ్ళలో నటించడం మొదలుపెట్టింది

ఈ పరిస్థితుల్లో ప్రగతికి తెలుగుచిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టు అవకాశాలు వచ్చాయి

వచ్చిన ఛాన్సును వదులుకోకుండా ఆయా పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది

అలా ఆమె బృందావనం ,రేసు గుర్రం , బాద్ షా , జులాయి , ఎఫ్ 2 మొదలైన సినిమాల్లో నటించారు

ఏమైంది ఈ వేళ మూవీలో ఈమె పోషించిన హీరో తల్లి పాత్ర కు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం లభించింది

నటిగా ఆమె గురించి చాలామందికి ఇంతవరకే తెలుసు

కానీ నటనే కాకుండా ఆమెలో మరో టాలెంట్ కూడా ఉందని సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ తెలుసు

ఇన్స్టా గ్రామ్ లో ఆక్టివ్ గా ఉండే ఈ క్యారక్టర్ నటి జిమ్ లలో తాను చేస్తున్న పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు

మొదట్లో చీరలోనే జిమ్ వర్కౌట్లు చేసినప్పటికీ అసౌకర్యంగా ఉండటమే కాకుండా కోచ్ కూడా ట్రాక్ డ్రెస్ కంపల్సరీ అని చెప్పడంతో ఆమె మరోమాట లేకుండా గురువు చెప్పిన సూచనలు ఫాలో అయ్యింది

50 ఏళ్ళ వయసులో కూడా ఫిట్ గా ఉండటమే కాకుండా అత్యంత క్లిష్టమైన బరువులను సునాయాసంగా లిఫ్ట్ చేస్తున్న ఆమె తెగువకు మెచ్చుకుంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు

కానీ కొంతమంది మాత్రం ‘ ఈ వయసులో ఈ బరువులవీ ఎత్తడం నీకవసరమా ఆంటీ ” అంటూ హేళనగా కామెంట్లు పెట్టారు

‘హాయిగా ఏ తల్లి పాత్రలో , బామ్మ పాత్రలో చేసుకోక మగరాయుడిలా ఈ జిమ్ములు , కసరత్తులు అవసరమా ?’ అని మరికొందరు హేళన చేసారు

మొదట్లో ఈ ట్రోలింగులకు ప్రగతి చాలా బాధపడింది
వీటిని ఎదిగిన తన కూతురు చూస్తే ఎంబ్రాసింగ్ గా ఉంటుందని భావించింది . భయపడింది

వర్కౌట్లు మానేసి తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోదామని ఆలోచన కూడా చేసింది
ఒక పక్క సోషల్ మీడియాలో ట్రోలింగులు , మరోపక్క ఎలాగైనా సరే పవర్ లిఫ్టింగ్ లో పతకం సాధించాలని అంతర్మధనం తో సంఘర్షణ అనుభవించింది

అంతిమంగా ఆమెలోని క్రీడాకారిణి ఈ హేళనలను పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది
అందుకే ఆ అవమానాలను తల్చుకుంటూ అక్కడే ఆగిపోలేదు

రెట్టించిన ఉత్సాహంతో ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లి గోల్డ్ మెడల్ సాధించింది

దరిమిలా తెలంగాణా రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది

బెంగుళూరులోని ఇంజనీర్స్ అసోషియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది

2025 లో కేరళలో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా బంగారు పతాకం సాధించింది

అంతటితో సంతృప్తి పడి ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు

2025 డిసెంబర్ 6 న టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొని 84 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ , డెడ్ లిఫ్ట్ , బెంచ్ , స్కాడ్ విభాగాల్లో ఒక గోల్డ్ , రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది

టర్కీ లో జరిగిన పోటీల్లో ప్రగతి గోల్డ్ , సిల్వర్ తో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించారు

ఈ విజయాలను ఆస్వాదిస్తూ ప్రగతి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు , ఫోటోలు షేర్ చేసారు

ఈ వయసులో ఈ బరువులు ఎత్తడం నీకవసరమా ఆంటీ అని హేళన చేసిన నోళ్లు మూతపడ్డాయి

ఈ వయసులోనే కాదు మహిళలు తల్చుకుంటే ఏ వయసు అయినా సరే ప్రతిభకు అడ్డంకి కాదని ప్రగతి నిరూపించింది

ఇదిలా ఉండగా వ్యక్తిగత జీవితంలో తాను ఫేస్ చేసిన సంఘటనలు తనని రాటుదేల్చాయని గతంలో అనేక ఇంటర్వ్యూలలో ప్రగతి చెప్పారు

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాలనే ఆలోచన వెనుక ఆమె దృఢ మనస్తత్వం కూడా ఉంది
చిన్న తనంలోనే తండ్రి చనిపోవడం , కుటుంబ బాధ్యతలు మీద పడటం , సినిమా రంగంలో అనుభవాలు ఆమెను మరింత దృడంగా మార్చాయి

కెరీర్ పరంగా తనకు సినిమాల్లో బ్రేక్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పింది

మొదటిది తెలిసీతెలియని వయసులో 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడంతో సినిమా అవకాశాలు తగ్గాయని తెలిపింది

రెండోది నిర్మాత కమ్ హీరో అయిన ఓ వ్యక్తి తన తమిళ సినిమాలో వాన పాటలో అభ్యంతరకర కాస్ట్యూమ్స్ వేసుకుని నటించాలని కోరాడు

అగ్రిమెంటులో ఈ విషయం లేదు . అయినా అలాంటి క్యాస్టూమ్స్ వేసుకుని సినిమాలో నటించనని కోపంతో చెప్పేసి వచ్చా

కానీ అతడి మీద కోపం ఇండస్ట్రీ మీద చూపించి సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పింది

తర్వాత రియలైజ్ అయి తిరిగి సీరియళ్ళలో నటించడం ద్వారా పరిశ్రమలోకి వచ్చానని ప్రగతి చెప్పింది

ఏమైనా సినీ నటిగానే కాదు పవర్ లిఫ్టింగ్ లో కూడా తన సత్తాను చాటిన ప్రగతి అభినందనీయురాలు

మహిళలు లక్ష్యాలను బలంగా నిర్దేశించుకుంటే ఏజ్ ఈజ్ ఓన్లీ నంబర్ అని ఆమె నిరూపించింది

కేరళకు చెందిన 84 ఏళ్ళ బామ్మ ఇప్పటికీ అక్కడి విద్యార్థినిలకు కత్తి యుద్ధంలో మెళుకువలు నేర్పిస్తుందని గతంలో ఇదే రచ్చబండ కబుర్లలో ఆర్టికల్ కూడా రాసా !

ప్రగతికి అభినందనలు !!


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!