2001 సెప్టెంబర్ 11 న ఎప్పటిలానే అమెరికాలో జనజీవనం మొదలైంది
యూఎస్ ప్రెసిడెంట్ జార్జి బుష్ ఓ స్కూలులో జరుగుతున్న చిన్నపిల్లల కార్యక్రమానికి అటెండ్ అయ్యారు
ప్రెసిడెంట్ స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్న సమయంలో ఓ CIA ఆఫీసర్ దగ్గరకొచ్చి మెల్లిగా ఆయన చెవిలో ఏదో చెప్పాడు
వెంటనే షాక్ తిన్నట్టు ఆఫీసర్ వంక చూసాడు ఆయన
ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది
ఇంతకీ ఆ ఆఫీసర్ ప్రెసిడెంట్ చెవిలో చెప్పిన రహస్యం ఏంటో తెలుసా ?
“మిస్టర్ ప్రెసిడెంట్ ..వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఎవరో ఉగ్రవాదులు విమానంతో కూల్చి నేలమట్టం చేసారు “
ఈ సమాచారం యూఎస్ ప్రెసిడెంట్ ఊహించనిది
ప్రపంచంలోనే అగ్ర దేశంగా చెప్పుకుంటున్న తమ దేశంలోకి ఉగ్రవాదులు నేరుగా విమానాలతో వచ్చి ట్విన్ టవర్స్ కూల్చివేశారంటే ఆయన నమ్మలేకపోయారు
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న తమ దేశంలోకి టెర్రరిస్టులు నేరుగా విమానాలతో రావడాన్ని ఆయన నమ్మలేకపోయారు
కానీ నమ్మకతప్పలేదు
చెప్పింది తన భద్రతా వ్యవహారాలు చూసే చీఫ్ ఆఫీసర్
కానీ క్షణంలో తేరుకుని వెంటనే సిఐఏ మీటింగ్ కి ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు
చూసారుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న అమెరికన్ మ్యాన్ హంట్ -ఒసామా బిన్ లాడెన్ వెబ్ సిరీస్ లో యూఎస్ ప్రెసిడెంట్ కే ముచ్చెమటలు పట్టించిన 9 /11 అటాక్ ఉదంతం బిగినింగ్ ఇది
యూఎస్ అంటే ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుందని పేరు
మరి అలాంటి కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఉగ్రవాదులు నేరుగా విమానాలతో ఎలా రాగలిగారు ?
ఈ ఘటనను యూఎస్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ముందుగానే పసిగట్టలేకపోయాయా ?
ఉగ్ర దాడులను అరికట్టడంలో అమెరికన్ టాప్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఐఏ వైఫల్యం ఉందా ?
ట్విన్ టవర్స్ ను కూల్చివేసి మూడువేలమంది మరణాలకు కారకుడు అయిన ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు ఏంటి ? అనేవి ఈ వెబ్ సిరీస్ లో కళ్ళకు కట్టినట్టు వివరించారు
9 /11 అటాక్ తర్వాత నుంచి బిన్ లాడెన్ను మట్టుబెట్టేంత వరకు జరిగిన పరిణామాలను యదార్థంగా జరిగిన సంఘటనల క్లిప్పింగులను యాడ్ చేస్తూ వెబ్ సిరీస్ తీసిన విధానం చాలా బావుంది
ఇందులో ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు
ఉన్నది ఉన్నట్టు చూపించారు
అగ్ర రాజ్యం కాబట్టి వాస్తవాలను కప్పిపెట్టి వీరోచితంగా బిన్ లాడెన్ను హతమార్చినట్టు సిరీస్ లో ఎక్కడా చూపించలేదు
పైగా బిన్ లాడెన్ తమను మూడు చెరువుల నీళ్లు తాగించినట్టు ఒప్పుకున్నారు
అతడ్ని పట్టుకోవడానికి అమెరికా వంటి అగ్ర రాజ్యానికే పదేళ్లు పట్టిందంటే ఇది పూర్తిగా తమ వైఫల్యమే అని ఆనాటి సిఐఏ అధికారులు ఒప్పుకున్నారు
బిన్ లాడెన్ను మట్టుబెట్టిన ఆనాటి స్పెషల్ టీమ్ లో ఉన్న అధికారులు ఒకరొకరుగా ఈ ఆపరేషన్ లో తమ అనుభవాలను పంచుకున్నారు
9 /11 అటాక్ తర్వాత ఏం జరిగింది ?
ప్రెసిడెంట్ బుష్ సిఐఏ అధికారుల అత్యవసర సమావేశం నిర్వహిస్తాడు
ఈ ఘటనను ఏజెన్సీలు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాయి అని ప్రశ్నిస్తాడు
ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పు పొంచి ఉందని మూడు నెలల ముందే ఇంటలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలు ప్రెసిడెంట్ టేబుల్ మీద పెడతారు
అప్పుడే ఈ దాడుల వెనుక ఆల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ ఉన్నాడని అధికారులు తెలుసుకుంటారు
ప్రెసిడెంట్ సిఐఏ అధికారుల వంక చూస్తూ ” మీరేం చేస్తారో నాకు తెలీదు .. బిన్ లాడెన్ను సజీవంగా కానీ నిర్జీవంగా కానీ యూఎస్ కు పట్టుకురావాలి .. ఈ ఆపరేషన్ మొత్తం 6 నెలల్లో పూర్తికావాలి ” అని ఆదేశిస్తాడు
“ఆరు నెలలు అవసరం లేదు ప్రెసిడెంట్ .. ఆరు వారాల్లో అతడ్ని పట్టుకొస్తాం ” అని భరోసాగా చెప్తాడు సిఐఏ ఆఫీసర్
కానీ అతను ఊహించినట్టు బిన్ లాడెన్ అంత ఈజీగా దొరకలేదు
పదేళ్ళపాటు సిఐఏ ముప్పతిప్పలు పెట్టాడు
రాత్రికి రాత్రే ఒక దేశాధ్యక్షుడ్ని లేపుకొచ్చిన అమెరికన్ రక్షణ వ్యవస్థకు బిన్ లాడెన్ను లేపేయడానికి మాత్రం పదేళ్లు పట్టింది
ఈ ఎపిసోడ్ లో అమెరికన్ ఇంటలిజెన్స్ అండ్ సిఐఏల వైఫల్యం గురించి వివరిస్తారు
హూ ఈజ్ బిన్ లాడెన్ ?
బిన్ లాడెన్ కోసం సిఐఏ అండ్ యూఎస్ మిలిటరీ జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాయి
సోవియట్ – ఆఫ్ఘన్ వార్ లో బిన్ లాడెన్ నేతృత్వంలో ఆల్ ఖైదా మిలిటెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలుసుకుని యూఎస్ దళాలు ఆఫ్గనిస్తాన్ వెళ్లి బిన్ లాడెన్ ఆచూకీ కోసం అడుగుతారు
ఆశ్చర్యంగా వాళ్ళు ” హూ ఈజ్ బిన్ లాడెన్ ?” అని ఎదురు ప్రశ్నించడంతో అమెరికన్ దళాలు షాక్ తింటాయి
లాడెన్ ను పట్టుకోవడం అంత తేలిక కాదని ఆ క్షణానే వాళ్లకు అర్థమైంది
డబ్బులకోసమైనా అతడి ఆచూకీ చెప్తారేమో అని లాడెన్ ఆచూకీ తెలియచేసినవారికి 25 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటిస్తారు
అయినా ఒక్కళ్ళు కూడా పెదవి విప్పరు
ఈ ఎపిసోడ్ ద్వారా లాడెన్ క్రిమినల్ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది . స్థానిక పౌరులు కూడా అతడికి ఏ విధంగా సాయం చేస్తున్నారు అన్న అంశాలను చూపించారు
తోరబోరా ఆపరేషన్ ?
దాంతో చేసేది లేక యూఎస్ దళాలు అతి కష్టమ్మీద ఆఫ్ఘన్ లోని ఎత్తైన పర్వతాలను చేరుకొని అక్కడ్నుంచి బైనాక్యులర్ల సాయంతో చూస్తే తోరబోరా పర్వత సానువుల్లో మిలిటెంట్ల ఆనవాళ్లు కనిపిస్తాయి
దాంతో బిన్ లాడెన్ ఖచ్చితంగా తోరాబోరా పర్వత ప్రాంతాల్లో ఉన్న బంకర్లలో ఉండి ఉంటాడని భావించి అప్పటికప్పుడు యుద్ధవిమానాలను పిలిపించి బాంబులు వేస్తారు
కానీ ఈ దాడులనుంచి బిన్ లాడెన్ సురక్షితంగా తప్పించుకుని పోవడంతో యూఎస్ ఏజెన్సీలు తమ వైఫల్యాన్ని అంగీకరిస్తాయి
శత్రువు కదలికలను అంచనా వేయడంలో ఆరితేరిన సిఐఏ కూడా తప్పులో కలిసిందని ఈ ఎపిసోడ్లో చూపిస్తారు
తప్పించుకుని పారిపోయిన బిన్ లాడెన్ ఎక్కడికెళ్ళాడు ?
తోరాబోరా ఆపరేషన్ నుంచి బిన్ లాడెన్ తప్పించుకుని పారిపోయాడన్న విషయం తెలుసుకుని సిఐఏ షాక్ అయ్యింది
దాంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది
అతడికోసం ఎక్కడని వెతకాలి ?
అతడి తల మీద రివార్డ్ అమౌంట్ పెంచినా ఒక్కళ్ళు కూడా అతడి ఆచూకీ తెలియచేయడం లేదు
ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవటానికీ , ఏజెన్సీలకు దొరక్కుండా ఉండటానికీ లాడెన్ సాంకేతికతను వాడుకుంటున్నాడని అర్థమైంది
లాడెన్ టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నాడు అనే విషయాలను ఈ ఎపిసోడ్లో చూపిస్తారు
లాడెన్ కు సాంకేతికంగా సాయం చేస్తున్న మాస్టర్ మైండ్ ఎవరు ?
లాడెన్ తన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టెక్నాలజీని వాడుకుంటున్నాడని అర్థమైంది
ఈ నెట్ వర్క్ వెనుక టెక్నాలజీ మీద బాగా పట్టున్న మాస్టర్ మైండ్ ఇంకెవరో ఉన్నారని పసిగడతారు
ఆ నెట్ వర్క్ ను ఛేదిస్తే కానీ లాడెన్ ను బంధించలేమని తెలుసుకుంటారు
లాడెన్ వీడియో టేపుల్లో మాట్లాడిన విధానం ద్వారా మాస్టర్ మైండ్ ఎవరిదో గుర్తిస్తారు
అతడ్ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తే ఆశ్చర్యంగా బిన్ లాడెన్ వివరాలు మినహా మిగిలిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు
లాడెన్ తన నేర సామ్రాజ్యంలో కరడుగట్టిన మిలిటెంట్లను తయారుచేసుకున్నాడని ఈ ఎపిసోడ్లో చూపించారు
యూఎస్ లో ఏం జరుగుతుంది ?
ఇలా ఉండగా ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా బిన్ లాడెన్ ను పట్టుకోలేకపోవడంతో యూఎస్ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి
ఇది పూర్తిగా సిఐఏ వైఫల్యమే అని విమర్శలు చెలరేగడంతో అధికారులు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి
ఈ పరిణామాల నేపథ్యంలో బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు
ఆయన పదవిలోకి రావడంతోనే బిన్ లాడెన్ను పట్టుకునే ఆపరేషన్ కోసం కొత్త సిఐఏ ఆఫీసర్ను అప్పాయింట్ చేస్తాడు
ఎలాగైనా సాధ్యమైనంత తొందరలో బిన్ లాడెన్ ను బందించి తీసుకురావాలని ఆదేశిస్తాడు
బిన్ లాడెన్ను పట్టుకోవడంలో ఒక టర్మ్ ప్రెసిడెంట్ కాలంలో కూడా సాధ్యం కాకపోవడంతో రెండో టర్మ్ ప్రెసిడెంట్ ఒబామా నేతృత్వంలో ఫ్రెష్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు ఈ ఎపిసోడ్లో చూపిస్తారు
ఖోస్తాలో ఏం జరిగింది ?
ఇదిలాఉండగా బిన్ లాడెన్ ఆచూకీ తెలియచేస్తామని కొంతమంది ఇన్ఫార్మర్ల నుంచి కబురు రావడంతో సిఐఏ అధికారులు ఆఫ్గనిస్తాన్ లోని ఖోస్తా అనే ప్రాంతంలో రహస్య సమావేశం ఏర్పాటు చేస్తారు
అక్కడ సిఐఏ అధికారులు ఊహించని విధంగా బిన్ లాడెన్ మనుషులు కారులో బాంబులు పేల్చడంలో ఏడుగురు అధికారులు స్పాట్ లో చనిపోతారు
ఇది సిఐఏ అస్సలు ఊహించని సంఘటన
బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి వీళ్ళు వేస్తున్న ఎత్తులకు వెంటనే వాళ్ళు పై ఎత్తులు వేస్తున్నారు
దాంతో ఒకానొక దశలో సిఐఏ అధికారుల్లో కూడా లాడెన్ ను పట్టుకుంటామనే నమ్మకాలు సన్నగిల్లాయి
లాడెన్ వేస్తున్న ఎత్తులకు సిఐఏ సైతం ఎలా ఇబ్బందులు పడింది ? ఈ ఎపిసోడ్లో వివరిస్తారు
యూఎస్ ప్రెసిడెంట్ సైతం టెన్షన్ పడిన వేళ ?
రోజురోజుకీ యూఎస్ ప్రజలనుంచి పెరిగిపోతున్న నిరసనలు ఒకపక్క , ఎలాగైనా బిన్ లాడెన్ను పట్టుకోవాలని కొత్త ప్రెసిడెంట్ ఆదేశాలు మరోపక్క ముసురుకోవడంతో సిఐఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది
వారికి నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి
ఎట్టకేలకు వారికి లాడెన్ పాకిస్తాన్ లోని అట్టోబాబాద్ లోని ఒక భవంతిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది
అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది
బిన్ లాడెన్ నిజంగా ఆ భవంతిలో ఉన్నాడో ? లేడో తెలీదు
ఒకవేళ నిజంగా ఉంటే ఓకే
కానీ ఇంతా చేసి మిలిటరీ ఆపరేషన్ తర్వాత ఆ భవంతిలో బిన్ లాడెన్ లేడని తేలితే అంతర్జాతీయ సమాజంలో అమెరికా నవ్వులపాలు అవుతుందని అధికారులు భయపడ్డారు
పైగా ఆ భవంతికి దగ్గర్లోనే పాకిస్తాన్ మిలిటరీ బేస్ ఉంది
అదే విషయాన్ని ఒబామాకు చెప్పి నిర్ణయం అడిగారు
అంతటి ప్రెసిడెంట్ సైతం వెంటనే ఒప్పుకోలేదు
ఈ ఆపరేషన్ పరిణామాలతో అంతర్జాతీయ సమాజంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడకూడదు
అందుకే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఒక రోజు సమయం అడిగారు
ఆ మరుసటి రోజు మాత్రమే ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
అగ్ర రాజ్యం ప్రెసిడెంట్ అయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఒత్తిడికి గురవుతారు అన్న అంశాన్ని ఈ ఎపిసోడ్లో చూపించారు
ముగింపు :
ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యూఎస్ నుంచి ఆరు ట్రూపులు యుద్ధ హెలీకాఫ్టర్లలో పాకిస్తాన్ లో అట్టోబాబాద్ లోని భవంతి వైపు దూసుకుపోయాయి
అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు యూఎస్ హెలికాఫ్టర్లు ఆ భవంతిపైకి చేరుకున్నాయి
అందులోనుంచి బిల్డింగ్ లోకి వెళ్లిన కమెండోలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్ వరకు అడ్డు వచ్చిన వాళ్ళని కాల్చుకుంటూ వెళ్లారు
ఫైనల్లీ బిన్ లాడెన్ మూడో ఫ్లోరులో దొరకడంతో అక్కడికక్కడే కాల్చి చంపారు
తర్వాత అతడి శవాన్ని జిప్ బ్యాగులో ఉంచి సముద్రంలో విడిచిపెడతారు
ప్రైవేట్ రూమ్ నుంచి సిఐఏ అధికారులతో కలిసి ఈ తతంగం అంతా చూసిన తర్వాత ఒబామా మీడియా ముందుకొచ్చి సింపుల్గా బిన్ లాడెన్ షాట్ డెడ్ అని చెప్పడంతో అమెరికన్లు వైట్ హౌస్ బయట చేరి హర్షధ్వనాలు చేస్తారు
విశ్లేషణ :
ఈ వెబ్ సిరీస్ ద్వారా 9 /11 అటాక్ మొదలు బిన్ లాడెన్ను మట్టుబెట్టేంతవరకు జరిగిన అన్ని సంఘటనలను మేకర్స్ ఉన్నదున్నట్టుగా చూపించారు. ఈ సిరీస్ చూడనంతవరకు సిఐఏ వీరోచితమైన ఆపరేషన్ చేసి లాడెన్ను తేలిగ్గా మట్టుబెట్టారని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు . అంత పెద్ద ఏజెన్సీని లాడెన్ ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు . అతడ్ని మట్టుబెట్టడాన్ని అమెరికన్ ప్రభుత్వం మిలియన్ డాలర్లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టింది. డబ్బుల సంగతి అలా ఉంచితే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫోర్స్ ఉండి కూడా లాడెన్ను చంపడానికి వాళ్లకు షుమారు పదేళ్లు పట్టింది . ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనకు మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు . రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్న అనుభూతి వస్తుంది . ఇందులో ప్రత్యేకించి మూవీ ఆర్టిస్టులు ఎవరూ లేరు . నిజ జీవితంలోని పాత్రలనే ఇందులో వాడుకున్నారు . ముఖ్యంగా ఖోస్తా డీల్ , అట్టోబాబాద్ బిల్డింగ్ సీన్లు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది . మూడు భాగాలుగా తీసిన సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో చాన్నాళ్ల క్రితం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది . వీలున్నవాళ్ళు చూడండి. ఒక స్పై థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది
