Home » అమ‌రావ‌తి కేంద్రంగా యోగా అకాడ‌మీ ఏర్పాటు!

అమ‌రావ‌తి కేంద్రంగా యోగా అకాడ‌మీ ఏర్పాటు!

Spread the love

కామ‌న్‌వెల్త్‌, ఒలింపిక్స్ గేమ్స్‌లో ఏపి నుంచి స‌త్తా చాటుతాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంక‌ట రామ‌కృష్ణ ప్ర‌సాద్ వెల్ల‌డి

6వ యోగాసన ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో ప్ర‌తిభ చూపి ప‌సిడి, ర‌జిత ప‌త‌కాలు సాధించిన రాష్ట్ర క్రీడామ‌ణులు

విజ‌య‌వాడ‌:- యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన 6వ జాతీయ జూనియర్, సీనియర్-సి యోగాసన ఛాంపియన్‌షిప్ త‌మ‌లో కొత్త ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని నింపింద‌ని అదే స్ఫూర్తితో అమ‌రావ‌తి కేంద్రంగా యోగా అకాడ‌మీ ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.

శ‌నివారం ఉద‌యం టీచ‌ర్స్ కాల‌నీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్‌లో ఉన్న సాయి జ్యూయ‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్ షిప్ 2025-26 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12,13,14 తేదీల్లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

గతంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటార‌ని త‌ద్వారా పోటీల్లో గెలుపొందిన విజేత‌లు జనవరి 5,6,7,8 తేదీల్లో యోగాసనా భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుంద‌ని చెప్పారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 28, 29, 30 అక్టోబర్ 1 తేదీల్లో విజ‌య‌వాడ‌లో నిర్వహించిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్‌షిప్ 2025-26 జూనియర్స్ మరియు సీనియర్ సి లో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళ విభాగంలో నెల్లూరుకు చెందిన పి.ప్రసూనకు స్వర్ణం, తిరుప‌తి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.సుజాతకు ర‌జిత ప‌త‌కం ల‌భించాయ‌న్నారు.

అలాగే చత్తీస్‌ఘ‌డ్‌లో సెప్టెంబర్ 13,14,15,16 తేదీలలో నిర్వహించిన సీనియర్ ఏ మహిళా విభాగంలో విజయవాడకి చెందిన శిరీషకు ప్రథమ బహుమతి వ‌చ్చింద‌న్నారు.

నేటి నుండి పోలీస్ నేష‌న‌ల్ యోగాస‌న పోటీలు- 2025-26 ప్రారంభం

ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు పోలీస్ నేష‌న‌ల్ యోగాస‌న పోటీలు- 2025-26 అమ‌రావ‌తిలో విట్ యూనివ‌ర్శిటీలో జ‌రుగుతాయ‌ని తెలిపారు.

ఈ గేమ్స్‌ను రాష్ట్ర డీజీపీ కార్యాల‌యంలో డీజీపి హ‌రీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమ‌వారం ప్రారంభిస్తార‌ని పేర్కొన్నారు.

ఇందులో యోగాసనా భారత్ మరియు యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త‌ర‌ఫున న్యాయ‌నిర్ణేత‌లు, టెక్నికల్ ఆఫీషియ‌ల్స్‌ను పంపించి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నామ‌ని చెప్పారు.

ప్ర‌తి ఒక్క‌రూ యోగాను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సంద‌ర్భంగా గొట్టిపాటి వెంక‌ట రామ‌కృష్ణ ప్ర‌సాద్ పిలుపునిచ్చారు.

ఈ ఏడాది జూన్ నెలలో విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సుమారు 2.50 కోట్ల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నార‌ని నాటి నుండి యోగాకు ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు విస్త‌రించ‌డం గ‌ర్వకార‌ణ‌మ‌న్నారు.

ఇదే స్ఫూర్తితో అమ‌రావ‌తి కేంద్రంగా యోగా అకాడ‌మీని ఏర్పాటు చేసి క్రీడాకారుల‌కు ప్ర‌త్యేక త‌ర్ఫీదును ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చెప్పారు.

2032లో జ‌రిగే కామ‌న్‌వెల్త్ గేమ్స్‌, 2036లో జ‌రిగే ఒలింపింక్ గేమ్స్‌లో ఏపీ నుండి క్రీడాకారుల‌ను పంపించి స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

విజ‌య‌వాడ‌లో నిర్వహించిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్‌షిప్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం, ప‌త‌కాలు సాధించ‌డం ప‌ట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు అభినంద‌న‌లు తెలిపార‌ని పేర్కొన్నారు.

విలేక‌రుల స‌మావేశంలో యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.ప్రేమ్ కుమార్‌, ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు కొంగ‌ర సాయి, భారత్ స్వాభిమాన ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపి టీమ్ మేనేజ‌ర్ బెన‌ర్జీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా 6వ జాతీయ యోగాసనా చాంపియన్‌షిప్‌లో స్వ‌ర్ణ‌, ర‌జిత ప‌త‌కాలు సాధించి క్రీడామ‌ణుల‌ను యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున ఘ‌నంగా స‌త్క‌రించి అభినంద‌న‌లు తెలిపారు. యాపిల్ ఎలివేట‌ర్స్ త‌ర‌ఫున విజేత‌ల‌కు రూ.5వేలు చొప్పున ప్రోత్సాహ‌క న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *