బెజవాడ రుచులు – 2

Spread the love

బెజవాడ రుచులు – 2

బెజవాడ రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే ముందు మమత.. మనోరమ..వెల్ కం..ఎస్కిమో..అజంతా..మోడరన్ కేఫ్ లాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి

చైనా వాడు ఎడం పాదం ఇండియాలో పెట్టి చైనీస్ ఫుడ్ పేరిట మన నోట్లో మన్ను కొట్టక పూర్వం టిఫినీలంటే ఇడ్లీ సాంబార్..దోశ..మళ్లీ ఆ దోశలో ఓ ఇరవై రకాలు..ఉప్మా..పొంగల్..వడ..మైసురు బోండాం ఇత్యాది కొన్ని రకాలు ప్లేటులో నోరువిందు చేసేవి

మైసూర్ బోండాం కూడా లేటెస్ట్ వెర్షన్ అనుకుంటా
అంతకుముందు ఇడ్లీ సాంబార్ మకుటం లేని మహారాజులా వెలిగింది

ఓ గుంట ప్లేటులో రెండు ఇడ్లీలు వేసి పైన పెద్ద గరిటతో సాంబార్ ఒలకపోస్తే..సాంబార్లో జలకాలాడుతున్న ఇడ్లీలు స్పూన్ తో క్యాచ్ చేసి నోట్లో వేసుకుంటే మేనక విశ్వామిత్రుడి దగ్గరికి కూడా వెళ్లకుండా ఇట్నుంచి ఇటే వచ్చేది

వెల్ కం హోటల్లోనూ..మోడరన్ కేఫ్ లోనూ ఈ ఇడ్లీ సాంబార్ జంటలు ఎక్కువగా హల్చల్ చేసేవి

గాంధీనగర్లో వెల్ కం హోటల్లో చాలామంది టిఫినీ ప్రియులు పొద్దున్నే రెండు సాంబార్ ఇడ్లీలు తిని ఓ ఫిల్టర్ కాఫీ తాగి సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు ఓ బర్కీలీ సిగరెట్ వెలిగించుకుని రోజుని ఉల్లాసంగా ప్రారంభించేవాళ్ళు

దోశలైతే చట్నీ కోసమే ఇంకో రెండు తినాలి అనిపించేట్టు ఉండేవి
కొబ్బరి చట్నీ..అల్లం చట్నీలు అంత రుచిగా ఉండేవి

వెల్ కం హోటల్లో అతిధి మర్యాదలు కూడా బాగానే జరిగేవి

నాకు బాగా గుర్తు ,

తెల్లబట్టలు వేసుకున్న ఒక నడివయసాయన ఆడపిల్ల పెళ్ళిలో కనుక్కున్నట్టు టిఫిన్ చేసే బల్లల దగ్గరకొచ్చి ఎవరికేం కావాలో కనుక్కునేవారు

ఏదో హోటల్కెళ్లినట్టు కాకుండా బంధువుల ఇంటికి బ్రేక్ ఫాస్ట్కెళ్లినట్టు ఉండేది వాతావరణం

రుచికి రుచి పరిశుభ్రతకు పరిశుభ్రత అన్న సూత్రాన్ని ఎక్కువగా పాటించేవాళ్ళు
దీనికి ఆనుకునే ఎస్కిమో ఉండేది

అప్పట్లోనే ఎస్కిమో లో ఏసీ సదుపాయం ఉండేది

అలా కొన్ని దశాబ్దాల పాటు విజయవాడ వాసులకు ప్రతి ఉదయం వెల్ కం చెప్తూ చక్కటి రుచులను అందించింది వెల్ కం హోటల్
ఏమైందో తెలీదు కానీ వెల్ కం చెప్పిన నోటితోనే బై చెప్పేసి ఎటో వెళ్ళిపోయింది వెల్ కం హోటల్

ఇప్పుడు వెల్ కం హోటల్ ఉన్న ప్రాంతంలో వేరే బిల్డింగ్ ఏదో కట్టారు
ఇన్నేళ్లయినా కానీ ఇప్పటికీ బెజవాడ వాసుల హృదయాల్లో వెల్ కం హోటల్ నిలిచిపోయింది !

మరిన్ని రుచులు తరువాయి భాగంలో ,

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!