బెజవాడ రుచులు – 5

Spread the love

బెజవాడ రుచులు – 5

టేస్ట్ బావుంటుందని తెలిసి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా గన్నవరం నుంచి విజయవాడ వచ్చి పాకలో ఇడ్లీ తిన్నారని నిన్నటి భాగంలో చెప్పా కదా

అలాగే విజయవాడలో ఐలాపురం ఇడ్లీ కోసం కూడా ఎక్కడ్నుంచో కారుల్లో వచ్చి మరీ తినేవాళ్ళున్నారు

ఐలాపురం ఇడ్లీ అనగానే గాంధీ నగర్లో హోటల్ ఐలాపురం లో కింద ఏసీ రెస్టారెంట్ లో ఇడ్లీల గురించి నేను చెప్తున్నా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే

నేను చెప్పబోయే ఐలాపురం ఇడ్లీ ,

ఇదే హోటల్ కు వెనుక భాగంలో న్యూ ఇండియా హోటల్ సెంటర్ వైపు ఉన్న ఇడ్లీ బండి గురించి

నేను విజయవాడలో ఉన్న రోజుల్లో సాయంకాలాలు ఈ ఇడ్లీ బండికి మిత్రులతో వెళ్లి వేడి వేడి చిట్టి ఇడ్లీలు తినటం చాలా రోజులు కాలక్షేపంగా నడిచింది

ధర తక్కువ ..రుచి ఎక్కువ !

తండ్రి కొడుకు ఒక వర్కరు ఈ ముగ్గురే బండి నిర్వాహకులు

ఏం కలిపి చేస్తాడో కానీ ఇడ్లీలు మెత్తగా దూది పింజల్లా ఉండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేవి
చిట్టి దోశ పొట్టలో ఉప్మా వేసి ఇవ్వటం ఇంకో స్పెషల్ !

ఆ ఫార్ములా ఏంటో కానీ ఐలాపురం హోటల్లో తిన్నా ఈ టేస్ట్ వచ్చేది కాదు

అదే విషయం కొడుకును అడిగితే ‘ అన్నా.. పిండి నానబెట్టటం రుబ్బటం అన్నీ నాన్నే చూసుకుంటారు ! ఇంటిదగ్గరే అన్నీ సమపాళ్లలో కలిపి తయారుచేసి ఇక్కడ బండి దగ్గరకు సామాన్లు తెచ్చుకుంటాం . నేను ఆయనకు అసిస్టెంట్ ని మాత్రమే..అని చెప్పాడు
అంతేకాదు ఇక్కడ ఈ బండి పెట్టుకోవడానికి స్థానికంగా చాలా మందితో పెద్ద యుద్ధమే చెయ్యాల్సివచ్చింది . చివరకు ఎలాగోలా నిలదొక్కుకుని మీలాంటి మంచి కస్టమర్ల సహకారంతో రెండు దశాబ్దాలకు పైగా నిర్విఘ్నంగా బండి కొనసాగిస్తున్నాం . ఈ బండి మీద వచ్చిన సంపాదనతోనే సత్యనారాయణ పురంలో ఇల్లు కూడా కట్టుకున్నామని ‘ చెప్పాడు !

నేను అక్కడ ఉండగానే చాలామంది కారుల్లో వచ్చి ఇతగాడి బండి లో వేడి వేడి ఇడ్లీలు తీసుకుని కార్లోనే కూచుని తినటం చూసా

స్టేటస్ కు పోకుండా రుచులు కావాలనుకునే వాళ్ళకు ఇటువంటి ఇడ్లీ బండిలోనే అమృతం దొరుకుతుంది

కానీ ఇప్పుడు అక్కడ ఇడ్లీ బండి లేదని మిత్రుల ద్వారా తెలిసింది

అంతేకాదు ఆ బండిమీద ఇడ్లీలు వేసి చక్కటి రుచులను అందించిన తెల్ల బట్టలాయన అసలు ఈ లోకంలోనే లేడని కూడా తెలిసింది

ఇదిలావుంటే కొంతమందికి రోడ్డు పక్కన బండి మీద తింటే తెలిసినవాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అన్న శంక పీడిస్తుంటుంది
ఇంకోటి ఫ్యామిలీ తో వచ్చేవాళ్ళకి కూడా రోడ్ పక్కన నిలబడి తినటం కంఫర్ట్ అనిపించదు

అందుకే చాలామంది కారులోనే కూర్చుని తింటారు

రుచి పట్టింపులు లేనివాళ్ళకి స్టార్ హోటలే బెటరు
ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ వేరు !

వెయిటర్ రావటం మన ముందు మెనూ కార్డ్ పెట్టి మాయమైపోవటం
మళ్లీ పావుగంట కు వచ్చి మనం పెట్టే రెండు ఇడ్లీలు ఆర్డర్ తీసుకోవటం !

ఈలోపు ఇంకోడు వచ్చి రెండు గ్లాసులు వాటరు..ఓ ఖాళీ పింగాణీ ప్లేటు దానిపైన పేపర్ న్యాప్కిన్ వేసి టేబుల్ మీద పెట్టిపోతాడు

కాసేపు కాలక్షేపం చేస్తే ,

ఇందాక ఆర్డర్ తీసుకున్నవాడు
రెండు కొండ రాళ్ళ లాంటి ఇడ్లీలు చట్నీలు టేబుల్ మీద సర్ది వినయంగా పక్కన నుంచుంటాడు

మొత్తానికి ఆ ఇడ్లీలని పక్కన ఇచ్చిన మరణాయుధాలు ఫోర్క్..స్పూన్లతో చిత్రవధ చేసి ఖండ ఖండాలుగా నరికి నోట్లొవేసుకుని గుటుక్కున మింగేయటమే

ఇహ ఆ చట్నీ దేంతో తయారుచేసారో కనుక్కోవటానికి పరిశోధనలు చెయ్యాలి
దానికి ల్యాబూ.. సైంటిస్టులు.. అదో ఖర్చు
అట్లుంటాయి చట్నీలు

సరే ఎలాగోలా గతకగానే బౌల్ లో నిమ్మకాయ బద్ధ వేసి వేడి నీళ్లు ఇస్తాడు పిసుక్కోవటానికి..సారీ..కడుక్కోవటానికి

బిల్లు..టిప్పు ఇచ్చిన తర్వాత నోట్లో వేసుకోవడానికి సోంపు ఫ్రీ ఇస్తాడు
ఈ ఎపిసోడ్ లో మొత్తం మీద మనకు గిట్టుబాటు అయ్యేది ఆ ఏసీ ఒక్కటే !

ఇది జోక్ కాదండీ
అన్ని హోటళ్లలో కాదు కానీ కొన్ని స్టార్ హోటళ్లలో ఇలాగే ఉంటుంది
సొంత అనుభవం !

సరే ,

మళ్లీ బళ్ల దగ్గరికి వస్తే ,

ఇలాగే వన్ టౌన్ లో కాళేశ్వరరావు మార్కెట్ వెనకాల ఓ సందులో బండి మీద ఒకతను వెన్న దోసెలు వేస్తాడు

అద్భుతంగా ఉంటాయ్
నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయ్ !

ఇప్పుడు ఉందో లేదో తెలీదు

తదుపరి విజయవాడలో కొన్నిచోట్ల దోశ క్యాంపులు అని ఓ ముప్పై నలభై రకాల దోసెలతో ప్రయోగాలు చేశారు

కానీ పెద్దగా వర్కౌట్ అయినట్టు లేదు
మెల్లిగా అవి తగ్గిపోయాయ్

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే తినేవాడు రుచులకే ప్రాధాన్యత ఇస్తాడు
ఆ రుచులకోసం ఎందాకైనా వెళ్తాడు !

మరిన్ని రుచులు తరువాయి భాగంలో ,

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!