బెజవాడ రుచులు – 6
విజయవాడలో సత్యనారాయణ పురం ఏరియా ఎప్పుడూ పెళ్ళివారి ఇల్లులా కళకళలాడుతూ ఉంటుంది
సత్యనారాయణ పురం రైల్వే గేటు (ఇప్పుడు లేదు) దాటినతర్వాత అదో అగ్రహారంలా ఉంటుంది
రోడ్డుకి అటూఇటూ కింద దుకాణాలు..పైన నివాసాలు
అన్ని దుకాణాలు సందడిగానే ఉంటాయ్ !
అలా ముందుకు వెళ్తే మూడో నంబర్ బస్ మలుపు తిరిగేచోట సత్యనారాయణ పురానికే ల్యాండ్ మార్క్ అయిన శివాజీ కేఫ్ కనిపిస్తుంది
పేరుకి హోటలే కానీ పెళ్ళివారి విడిది ఇల్లులా వచ్చేపోయే వారితో కళకళలాడుతూ ఉంది !
దాదాపు సత్యనారాయణ పురంలో ఉన్నవారి నోళ్ళలో శివాజీ కేఫ్ కాఫీ..టీ..టిఫిను ఏదో ఒకటి పడాల్సిందే
అంతగా వాళ్ళు శివాజీ కేఫ్ ను ఓన్ చేసుకున్నారు !
అలా అనతికాలంలోనే శివాజీ కేఫ్ సత్యనారాయణ పురం వాసుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది
వెనుకే శివాలయం గంటలు గణగణ మోగుతూ ఉంటాయ్
ఇళ్లలో పూజాది క్రతువులు నిర్వహించటానికి బ్రాహ్మణులు దొరికేచోటు కూడా అదే కావటంతో వచ్చేపోయేవాళ్ళ సందడి ఎక్కువ !
నాలుగు రోడ్ల జంక్షన్ కావటంతో శివాజీ కేఫ్ కు మంచి అడ్వాంటేజ్ అయ్యింది
నేను శివాజీ కేఫ్ కి వెళ్ళినప్పుడల్లా నాకెందుకో అక్కడి వాతావరణం సందడిగా అనిపించేది
కొన్ని రెస్టారెంట్లు చక్కటి రుచులు అందించటం ద్వారా కానీ స్థల ప్రభావం వల్ల కానీ మన అనుకునే ఫీలింగ్ కలిగిస్తాయ్
మరి కారణాలు తెలీదు కానీ ఇప్పుడు అక్కడ శివాజీ కేఫ్ లేదని తెలిసింది
ఇక శివాజీ కేఫ్ టర్నింగ్ లో శివాలయం ఎదురుగా మినప పుణుగులు వేసే స్టాల్ ఉంది
మినప పుణుగులు అంటే చిట్టి మినప కాదు
మైసూర్ బోండా సైజులో ఉంటాయ్
ఉల్లి..పచ్చిమిర్చి పుణుగులో ఉంటాయ్
దీనికి చట్నీ ఉండదు
తింటే కారం కారంగా భలే ఉంటుంది
ఇప్పుడు ఉందో లేదో తెలీదు
ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు ఆ పక్కనే పది రూపాయలకు ఫిల్టర్ కాఫీ అనే స్టాల్స్ నాలుగైదు కనపడ్డాయ్
తమిళనాడు తరహాలో గ్లాసు.. బౌల్ లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తున్నారు
చక్కటి రుచులను అందించిన శివాజీ కేఫ్ మాత్రమే కాదు సత్యనారాయణ పురం గొప్ప వ్యక్తులను కూడా అందించింది
జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు
ఆయన మనవడు ఎన్కౌంటర్ మ్యాగజైన్ ఎడిటర్ పింగళి దశరథ రామ్ గారు
గాయకుడు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు
ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు సత్యనారాయణ పురం వాళ్లే
సత్యనారాయణ పురం గేటుకి ఇటుపక్కే కాదు అటుపక్క కూడా చక్కటి రుచులు ఉన్నాయ్
ఊర్వశి థియేటర్ సెంటర్లో ముంత కింది పప్పు బండ్లు ఉంటాయ్ !
చిన్న కొబ్బరి చిప్పలో ముంత కింది పప్పు మిగిలినవి వేసి గిరగిరా తిప్పి చిన్నదొప్పలో వేసి పైన తాటాకు పుల్ల వేసిస్తాడు
నోట్లో పెట్టుకోగానే ఊర్వశి కనిపిస్తుంది
ఎదురు థియేటర్ కాదు
సాక్ష్యాత్తు ఇంద్రలోక ఊర్వశి యే
కావాలంటే మీరోసారి ట్రై చెయ్యండి !!
మరిన్ని రుచులు తరువాయి భాగంలో ,
పరేష్ తుర్లపాటి