బెజవాడ రుచులు – 7

Spread the love

బెజవాడ రుచులు – 7

రోటీ కోసం అటు గుంటూరోళ్లని..ఇటు బెజవాడ వాసులని ఇరవై మైళ్ళు రప్పించిన ఘనత శర్మ గారిదే
ఎవరీ శర్మ అనుకుంటున్నారు కదూ

ఆయనే శర్మ డాబా ఓనర్ !

ఎనబైల్లో విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేదారిలో మంగళగిరి బ్రిడ్జి ఇవతల నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కన శర్మ డాబా వెలిసింది

డాబా అంటే డాబా అనుకునేరు.. ఓ పెద్ద పాక..అంతే !

కళ్ళు మిరమిట్లుగొలిపే జిగేల్ జిగేల్ లైట్లు..డీజే సౌండ్లు..పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏమీ ఉండవు

సాదాసీదాగా ఓ పాక
బయట ఓ పది నులక మంచాలు !

ఆ నోటా ఈ నోటా శర్మ దాబాలో రోటీలు బావుంటాయనే మౌత్ టాక్ విని ( అప్పుడు ఇప్పట్లా సోషల్ మీడియా లేదు ) నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో మిత్రులతో కలిసి బైకుల మీద శర్మ డాబా కి వెళ్ళాను

ఏసీ రెస్టారెంట్లో తినటానికి అలవాటు పడ్డ నాకు పాకలో నులకమంచం మీద కూచుని తినటం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది
తిన్న తర్వాత అర్థం అయ్యింది !

నులక మంచం మీద కూచుని తినటానికి కూడా జనం ఎగబడి వస్తున్నారంటే అక్కడి రోటీల రుచి మహత్యమే అని !

పాకలో తెల్ల జుబ్బా..లాల్చీ వేసుకున్న ఓ పెద్దాయన..సర్వ్ చేయటానికి మరో నలుగురు కుర్రాళ్ళు
ఈ పాకకు ఆనుకుని ఉన్న కిచెన్ కూడా పాకలోనే

రోటీ..డాల్..ఉల్లిపాయలు

రోటీ అయితే అప్పుడే పుట్టిన బిడ్డ బుగ్గల్లా మృదు మధురం గా ఉండేవి
నోట్లో పెట్టుకుంటే దూదిపింజలే

మనకి కొన్నిచోట్ల ప్లేట్లో వేసినవి రోటీలో..అప్పడాలో తెలీక పిసికి నలిపి నరికి కుస్తీ పట్టిన సందర్భాలు ఉన్నాయ్

ఇక్కడ డాల్ ఏమేసి చేస్తాడో కానీ ఆ టేస్ట్ అద్భుతం అనుకునేవాళ్ళం

అదే విషయం కడుపుబ్బరం ఆగక ఆ పెద్దాయన్ని అడిగా !

రాజస్థాన్ నుంచి వచ్చి డాబా పెట్టామని చెప్పినట్టు గుర్తు
వీళ్ళ ఫ్యామిలీలు అక్కడే విలేజ్ లో ఉంటారని చెప్పారు !

మరి పుల్కాలు అంత మెత్తగా ఉండటం వెనుక రహస్యమేంటని అడిగా ,
గోధుమలే విజయ రహస్యం అని చెప్పాడాయన

విలేజ్ లో తమ కుటుంబాలు పండించిన గోధుమలే ఇక్కడ వాడతాం
దానివల్ల మెత్తగా ఉండటంతో పాటు రుచిగా కూడా ఉంటాయ్

అంతేకాదు ఉల్లిపాయలు కూడా అక్కడ్నించే వస్తాయ్
కొన్ని ఉల్లిపాయలు ఘాటు ఎక్కువగా ఉండి కళ్ళంబడి నీళ్లు కూడా వస్తాయ్

దానివల్ల తినే ఫుడ్ మంటెక్కిపోయినట్టు ఉంటుంది

ముడి పదార్దాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటమే రుచుల విజయ రహస్యమని నవ్వుతూ చెప్పాడాయన

మరి ఇంత బ్రహ్మాండమైన రుచులను అందించేవారు ఇలా ఉరి బయట రోడ్డు పక్కన పెట్టేబదులు ఊళ్ళో పెట్టుంటే మాలాంటి తిండి ప్రియులం అంతా కలిసి మీ డాబాలోనే పాటలు పాడుకునేవాళ్ళం కదా అంటే ,

ఊళ్ళో పెట్టాలంటే పెట్టుబడి ఎక్కువ కావాలి ..పైగా ఒక్క రోటీలు పెడితే నడవదు..వెజ్..నాన్ వెజ్ అన్నీ పెట్టాలి
తెలియని దాంట్లో వేలు పెట్టేకన్నా తెలిసింది చెయ్యటం బెటర్ కదా అని ఇదిగో ఇక్కడ పాకలో ఏర్పాటు చేశాం

అయినా రుచులు బావుంటే స్థలం ఎక్కడన్నది పెద్ద పాయింట్ కాదు
కస్టమర్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాడు అన్నారు

నాకు ఆయన చెప్పింది నిజమే అనిపించింది

అప్పటినుంచి వీలున్నప్పుడల్లా శర్మ డాబాకి వెళ్లి రుచులను ఆస్వాదించడం అలవాటు అయ్యింది

మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఈ మధ్య శర్మ డాబా కు వెళ్ళాను

రూపురేఖలు మారిపోయాయి
పాక స్థానంలో ఏసీ బిల్డింగ్ వచ్చింది

ఆరుబయట నులక మంచాలు మాత్రం అలానే ఉన్నాయ్

శర్మ కు పోటీగా చుట్టుపక్కల నాలుగైదు డాబాలు వెలిసాయ్

అక్కడ వాతావరణం తిరనాళ్ళలా ఉంది
ఎటుచూసినా ఆరుబయట మంచాలు..కార్లు..

మేము వెళ్లేసరికి శర్మ డాబా లో ఆరుబయట మంచాలు కూడా ఖాళీ లేవు
ఇక తప్పనిసరై ఏసీలోకి వెళ్ళా

తర్వాత కథ మీలో చాలామందికి అర్ధమయ్యే ఉంటుంది

వెయిటర్ రావటం
మెనూ కార్డు ఇచ్చి పోవటం
మనం ఆర్డర్ పెట్టటం
గతకగానే బిల్లు ఇవ్వటం
బిల్ పే చేసి టిప్ ఇవ్వగానే సోంపు ఫ్రీ ఇవ్వటం చకచకా జరిగిపోయాయ్ !

బయటికొచ్చి కారెక్కి కూర్చున్నాక ఓసారి వెనక్కి చూస్తే నాకు కాలేజీ రోజుల్లో శర్మ డాబా పాక గుర్తొచ్చింది
ఆ రుచులు గుర్తొచ్చాయ్ !

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అంటే ఇదే కదూ

మరిన్ని రుచులు తరువాయి భాగంలో ,

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!