బెజవాడ రుచులు – 9 (ముగింపు)
బెజవాడ రుచులు అంటే హోటళ్లు..రెస్టారెంట్లు మాత్రమే అనుకుంటున్నారా ?
కాదు..కానేకాదు
బెజవాడ కు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్న రుచులు ఇంకోటి ఉంది
అదే మిర్చి బజ్జీ..పుణుగులు !
హైద్రాబాదులో పానీ పూరీ ఎంత ఫేమసో బెజవాడలో బజ్జీ పుణుకులు అంత ఫేమస్
స్థానికులే కాకుండా ఇతర ఊర్లనుంచి పనిమీద విజయవాడ వచ్చినప్పుడు చాలామంది ఈ బజ్జీ పుణుకులు రుచి చూడకుండా వెళ్ళరు
సాయంత్రం అయితే వీధి వీధికి మిర్చిబజ్జీ లు వేసే బళ్లు రెడీ అయిపోతాయి
అప్పటికప్పుడు వేడి వేడిగా వేసే మిర్చి బజ్జీ కోసం కొన్ని చోట్ల రష్ ఎక్కువగా ఉంటుంది
బీసెంట్ రోడ్ లో మోడరన్ కేఫ్ దాటి కొద్దిగా ముందుకు వెళితే నాలుగు రోడ్ల కూడలిలో బజ్జీల్లో రకాలు కూడా దొరుకుతాయి
సాయంకాలక్షేపాల కోసం బీసెంట్ రోడ్ లో సైట్ సీయింగ్ కు వచ్చే వాళ్ళు..వెరైటీ రుచులు కోరుకునేవాళ్ళు ఈ బండి దగ్గర చేరతారు
మిర్చి బజ్జీతో పాటు వంకాయ బజ్జీ..టమోటా బజ్జీ..క్యాప్సికం బజ్జీ..ఉల్లి బజ్జీ ..రోస్టెడ్ బజ్జీ లు వేయటం ఈ బండి ప్రత్యేకత
సామాన్యుడి నుంచి సెలెబ్రిటీ వరకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైములో బెజవాడ మిర్చి బజ్జీల ఘాటు రుచి చూసినవాళ్లే
సాయంత్రం కాగానే దాదాపు ప్రతి సెంటర్లోనూ బజ్జీ బండ్లు ప్రత్యేకం అవుతాయి
రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని మిర్చి బజ్జీ ఘాటు వాసనలతో రా రమ్మని ఆకర్షిస్తాయ్
శనగ పిండిలో ముంచిన మిర్చి స్విమ్మింగ్ పూల్ లో దూకినట్టు నూనె మూకుడులో దూకగానే వచ్చే స్మెల్ ఉంటుంది చూసారూ ,
హెల్త్..శుభ్రత ఇట్లాంటి మంతెన సత్యన్నారాయణ గారి టీవీ సందేశాలు పక్కనబెట్టేసి ఆ బలహీన క్షణాన చటుక్కున బండి దగ్గర వాలిపోయి మూకుడులో జలకాలాడి ట్రే లోకి ల్యాండ్ అయిన బజ్జీలను చూస్తూ ‘ ఏవోయ్..బజ్జీ వేడిగా ఉందా ? అనే ఓ రొటీన్ డైలాగ్ వేసి ‘ఓ ప్లేటు బజ్జీ ఇలా ఇచ్చి ఆ పుణుగు వాయ కూడా దిగిన తర్వాత అది కూడా ఓ ప్లేటు కొట్టు ‘ అని దర్జాగా ఆర్దరేయకుండా ఉండలేరు తిండి ప్రియులు !
బెజవాడ వాసులకు సాయంత్రం బజ్జీ పుణుగులు మంచి తిండి కాలక్షేపం
మిత్రులతో ఓ ప్లేటు పుణుగులు తినేలోపు జాతీయ అంతర్జాతీయ విద్యుత్ ఎఫైర్స్ బోలెడు తెలుసుకోవొచ్చు
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కానీ ఎప్పుడో తినే బజ్జీ లు పుణుగుల వల్ల లివర్లు వరదల్లో కొట్టుకుపోవు కాబట్టి కుదిరితే ఎప్పుడైనా బెజవాడ బజ్జీలు ఓ పట్టు పట్టండి
ఆగండాగండి ,
ఇంకో బ్రహ్మాండమైన రుచుల గురించి చెప్పటం మర్చిపోయాను
సాయంత్రం అలా ఊర్వశి థియేటర్ సెంటర్ కు వెళితే కార్నర్లో నాలుగు ముంత మషాలా బండ్లు కన్పిస్తాయి
ఆల్ మిక్చర్ .. బజ్జీ మిక్చర్ .. కట్ బజ్జీ మిక్చర్ లాంటి రకరకాల వెరైటీలు దొరుకుతాయి
చిన్న కొబ్బరి చిప్పలో ఆల్ మిక్చర్ వేసి గిరగిరా తిప్పి విస్తరాకు పేపర్లో వేసి తాటాకు పుల్ల పెట్టి మన చేతికి ఇస్తాడు
తాటాకు పుల్లతో అంత మిక్చర్ నోట్లో వేసుకోగానే మనకు నిజంగానే రంభ ఊర్వశి మేనకలు కన్పిస్తారు
అసలు నా అనుమానం ఈ బండ్ల దగ్గర మిక్చర్ తిన్నవాళ్ళ నోటివెంట ఊర్వశి అనే మాట వచ్చిన తర్వాతనే ఆ థియేటర్ కాంప్లెక్స్ కు ఊర్వశి అని పేరు పెట్టరేమో !
ఇలా చెప్పుకుంటూ పోతే బెజవాడ రుచులకు అంతు ఉండదు…ముగింపు అసలే ఉండదు
మరిన్ని కొత్త రుచుల సమాచారం తెలిసిన తర్వాత మరోసారి రచ్చబండ కబుర్లలో ముచ్చటించుకుందాం !
పరేష్ తుర్లపాటి