ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమం !

Spread the love

ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమం
పుస్తక పట్నంలో ఆబాలగోపాలం
వందలాది మందిని ఒక్కచోట చేర్చి పుస్తకం పట్టించిన చిన్నారుల మహా సంకల్పం
ఫన్ టైమ్స్ క్లబ్ వేదికగా సామూహిక పుస్తక పఠన వేడుక
పేజ్ క్లబ్ పుస్తక పఠనోద్యమానికి అభినందనల వెల్లువ

విజయవాడ, 03 ఆగస్టు 2025: విజ్ఞాన సముపార్జనతో పాటు, మనో వికాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరం.
డిజిటల్ ప్రపంచం రాకముందు పుస్తకపఠనం ఓ వెలుగు వెలిగింది

కానీ నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనం క్రమక్రమంగా కనుమరుగైపోతోంది.

పుస్తక పఠనమంటేనే అదో ప్రహసనంగా భావించబడుతున్న పరిస్థితుల్లో కొందరు చిన్నారుల సంకల్పం పుస్తక పఠన మహోద్యమంగా మారింది.

ప్రజల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన పేజ్ క్లబ్.. అబాలగోపాలన్నీ ఒకచోటికి చేర్చి పుస్తకం పట్టేలా చేసింది.

పేజ్ క్లబ్ ఆధ్వర్యంలో పటమట ఫన్ టైమ్స్ క్లబ్ నందు ఆదివారం జరిగిన ఈ అద్వితీయ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని పుస్తక పఠనం చేశారు.

చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు, విద్యార్థుల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల వరకు అందరూ ఒకే వేదిక పైకి వచ్చి పుస్తక పఠనం కావించారు.

ప్రభాత సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పుస్తక పఠన వెలుగులను ప్రస్ఫుటంగా ప్రసరింపజేసింది.

పుస్తక పఠనం పట్ల చైతన్య స్ఫూర్తిని కలిగించిన ‘పేజ్ క్లబ్’కు ఏడాది క్రిందట అంకురార్పణ జరిగింది.

పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరికీ అలవాటు చేయాలనే సంకల్పంతో, ప్రస్తుతం 11, 12 గ్రేడ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ‘పేజ్ క్లబ్’కు రూపకల్పన చేశారు.

పుస్తక పఠనం ఆవశ్యకతను తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాల్లో పుస్తక పఠన కార్యక్రమాలను నిర్వహించారు.

స్మార్ట్ ఫోన్ యుగంలో కనుమరుగైపోయిన పుస్తక పఠనాసక్తిని పునరుద్ధరించడం కోసం ‘పేజ్ క్లబ్’ మొక్కవోని పట్టుదలతో శ్రమించింది.

వారి ప్రయత్నం ఫలించి ఆదివారం నిర్వహించిన సామూహిక పుస్తక పఠనం విజయవంతమైంది.

పుస్తక పఠనం పట్ల సరైన రీతిలో ప్రచారం చేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని వారు నిరూపించారు

పేజ్ క్లబ్ ఆవిష్కర్తలైన విహాన్ సాయి వేములపల్లి, ఈషాన్వి నిమ్మగడ్డ, జైదేవ్ చౌదరి అవిర్నేని, మోక్షిత్, రోనక్ బగ్రేచాల స్వప్నం ఫన్ టైమ్స్ క్లబ్ వేదికగా సాకారమైంది.

పేజ్ క్లబ్ చేపట్టిన పుస్తక పఠనోద్యమానికి వివిధ వర్గాల వారి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమ గృహ సముదాయాల్లో, కార్యాలయాల్లో పుస్తక పఠన కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ‘పేజ్ క్లబ్’ నిర్వాహకులను పలువురు స్వాగతించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!