ఆ పిల్లాడు ఇంట్లోనుంచి పారిపోయి అర్ధరాత్రి రైలెక్కి మద్రాస్ లో సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి చేరుకున్నాడు .. అప్పుడు కృష్ణ ఏం చేసాడు ..?

Spread the love

1971 లో తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు కృష్ణ గారిని కలవాలని మద్రాస్ పారిపోయాడు . ఆ కుర్రాడికి సినిమాలంటే వల్లమాలిన ఇష్టం .. కృష్ణ గారంటే ప్రాణం .

7 వ తరగతి పరీక్షలు రాసి రాత్రి సెకండ్ షో సినిమా చూసి 20 రూపాయలతో మద్రాస్ రైలెక్కాడు .. రైలు దిగి ఎటెళ్ళాలో తెలియక అక్కడే రోడ్డు పక్కన  బండి మీద రెండు ఇడ్లీలు తిని రోజంతా తచ్చట్లాడుతూ ఉండగా చీకటి పడిన తర్వాత ఒక డ్రైవర్ ఆ కుర్రాడ్ని చూసి  ఆరా తీస్తే తన వివరాలు ఏమీ చెప్పలేదు . కానీ కృష్ణ గారంటే అభిమానమని ఒక్క ముక్కే చెప్పాడు . సరే అప్పటికే చీకటి పడటంతో ఆ కుర్రాడ్ని తన షెడ్ లోనే పడుకోమని చెప్పాడు

మరుసటిరోజు ఉదయం ఆ కుర్రాడు కృష్ణ గారి అడ్రస్ సంపాదించి ఆయనింటికి చేరుకున్నాడు . కానీ బయట సెక్యూరిటీ వాళ్ళు ఆ కుర్రాడ్ని లోపలికి పంపలేదు . ఆ కుర్రాడు మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు . ఈలోపు విజయనిర్మల మూడు నాలుగు సార్లు బాల్కానీలోనుంచి అతడ్ని  చూసి లోపలికి వెళ్లిపోయారు

విజయనిర్మల కృష్ణ గారికి చెప్పరేమో , కృష్ణ బయటికి వచ్చి ఆ కుర్రాడ్ని దగ్గరికి తీసుకుని ఎవరు బాబూ నువ్వు ? అని అడిగారు . తన గురించి నిజం చెప్తే కృష్ణ గారు తనను తిరిగి ఇంటికి పంపేస్తారేమో అని భయపడి తానొక అనాధ అని తనకెవరూ లేరని అబద్దం చెప్పాడు . దాంతో కృష్ణ గారు బాధతో ఆ కుర్రాడ్ని దగ్గరకు తీసుకుని ఇవాల్టినుంచి నువ్వు ఇక్కడే ఉందువుగాని బాబూ .. ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు అని ప్రేమగా  ఇంట్లోకి తీసుకెళ్లాడు .

ఆ కుర్రాడి బట్టలు మాసిపోయి ఉండటం గమనించిన విజయనిర్మల అప్పటికప్పుడు డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి కొత్తబట్టలు తెప్పించి కట్టించింది

ఆ మరుసటిరోజు దీపావళి కృష్ణ విజయనిర్మల దంపతులు తమతో పాటు ఆ కుర్రాడిచేత కూడా టపాసులు కాలిపించారు . ఆ రోజు ఆ కుర్రాడి జీవితంలో మరపురాని రోజు .. కనీసం ఒక్కసారి చూస్తే చాలు అనుకున్న అభిమాన నటుడి ఇంట్లో ఆయనతోనే పండుగ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు

ఆ తర్వాత కృష్ణ గారికి వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని ఎవరెవరు ఫోన్ చేసారో నోట్ చేసుకుని కృష్ణ కు తెలియచేసే బాధ్యత అప్పగించారు విజయనిర్మల . అది మొదలు కృష్ణ షూటింగులకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఆ కుర్రాడే ఫోన్లు రిసీవ్ చేసుకుని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్పేవాడు .  ఓ రోజు కృష్ణ ఆ కుర్రాడ్ని  మంచివాళ్లకు మంచివాడు షూటింగుకు కూడా తీసుకెళ్లాడు..  అలా మూడున్నర నెలలు గడిచిపోయాయి

మరోవైపు తప్పిపోయిన కొడుకు ఆచూకీ గురించి ఆ కుర్రాడి తల్లితండ్రులు చేయని ప్రయత్నం లేదు . పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు .. పేపర్లలొ ప్రకటనలు ఇచ్చారు .. ఆ రోజుల్లోనే కొడుకు ఆచూకీ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసారు . అయితే అప్పట్లో తెలుగు న్యూస్ పేపర్లు మద్రాస్ లో తక్కువగా కన్పించేవి . దానితో ఈ ప్రకటన మద్రాస్ లో ఎవరి దృష్టిలోనూ పడలేదు

కానీ తెనాలిలో ఉండే కళా దర్శకులు రామలింగేశ్వర రావు గారి తల్లి గారు ఈ ప్రకటన చూసారు . అంతకుముందు ఆవిడ మద్రాస్ వెళ్ళినప్పుడు ఈ కుర్రాడ్ని కృష్ణ ఇంట్లో చూసారు . వెంటనే విషయాన్ని కుర్రాడి తల్లితండ్రులకు చేరవేశారు

దానితో కొంతమంది బంధువులు కృష్ణ గారింటికి చేరుకొని అసలు విషయం చెప్పారు

అప్పుడు కృష్ణ గారు ఆ కుర్రాడ్ని దగ్గరకు తీసుకుని అమ్మానాన్నలను బాధ పెట్టడం తప్పు బాబూ .. ముందు అమ్మానాన్నల దగ్గరకెళ్ళి బాగా చదువుకో .. ఆ తర్వాతే సినిమాలు అని ప్రేమగా మందలించి బాగా చదువుకుంటానని ఆ కుర్రాడి దగ్గర మాట తీసుకుని పంపేశారు

కృష్ణకు ఇచ్చిన మాట ప్రకారం ఆ కుర్రాడు బాగా చదువుకుని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో  అధికారిగా వుద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని కొడుకు , కూతుర్ని కన్నాడు

సినిమాల మీద తండ్రికి ఉన్న ప్యాషన్  ను ఆ కుర్రాడి కొడుకు సాధించాడు .. బీటెక్ చదివి మొదటి సినిమా దర్శకత్వంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ విజయాన్ని  తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చాడు

కొన్నేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఫ్యామిలీతో వెళ్లి కృష్ణ గారిని కలిసి మీరు చెప్పినట్టే బాగా చదువుకుని వుద్యోగం సంపాదించుకుని పిల్లల పెళ్లిళ్లు చేసి రిటైర్ అయ్యానని .. తన కొడుకు దర్శకత్వం వహించిన మొదటి సినిమా సువర్ హిట్ అయిందని చెప్పినప్పుడు కృష్ణ విజయనిర్మల దంపతులు చాల సంతోషంతో ఆ కుర్రాడి భుజం  తట్టారు 

ముగింపు : కృష్ణ గారి మీద అభిమానంతో ఆ కుర్రాడు తన కొడుక్కి విమల్ కృష్ణ అనీ .. కూతురికి రమ్యకృష్ణ అనీ .. మనవరాలికి కృష్ణ వింధ్య అని కృష్ణ పేరు కలిసొచ్చేలా పేర్లు పెట్టుకున్నాడు

అన్నట్టు ఆ కుర్రాడు ఎవరో చెప్పలేదు కదూ ?

ఆ కుర్రాడి పేరు పింగళి శ్రవణ్ కుమార్ .. నాకు అన్నయ్య అవుతాడు ( పెద్దమ్మ కొడుకు )

శ్రవణ్ కుమార్ కొడుకు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన DJ Tillu సినిమా దర్శకుడు విమల్ కృష్ణ

బీటెక్ చదువుకుని తండ్రిలా సినిమాల మీద ప్యాషన్ తో  సూపర్ హిట్ సినిమా తీసి సక్సెస్ అయిన విమల్ కృష్ణ విజయ గాధ ఇంకో కధనంలో చెప్పుకుందాం !

పై ఫోటోలో కృష్ణ గారి పక్కన కూర్చున్నది తప్పిపోయిన కుర్రాడు , కింద ఎడమవైపున ఆ కుర్రాడి కొడుకు , కృష్ణ పక్కన కూతురు , విజయనిర్మల పక్కన కుర్రాడి భార్య ఉన్నారు

పరేష్ తుర్లపాటి


Spread the love

2 thoughts on “ఆ పిల్లాడు ఇంట్లోనుంచి పారిపోయి అర్ధరాత్రి రైలెక్కి మద్రాస్ లో సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి చేరుకున్నాడు .. అప్పుడు కృష్ణ ఏం చేసాడు ..?

  1. Super Paresh. Nee modati article in Rachabanda Hero Krishna garitho start cheyatam Shubhasuchikam. GR Maharshi garu Magna TV lo Krishna garitho naa chinnappati anubhavalu interview chesthe 35000 views vachayi. That is the power of Krishna. Nee Rachabanda kuda super success avuthundi. Naathoti start chesinanduku chala thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!