కొన్ని సినిమాలు నేటివిటీ బట్టి ఆడతాయి అనుకుంటా
క్రికెట్ ఆటంటే మనకు క్రేజు
ఆ లైన్లో కపిల్ దేవ్ బయోపిక్ తీసినా ధోనీ బయోపిక్ తీసినా ఇంట్రెస్టుగా చూస్తాం
అదే క్రికెట్ ఆట లైన్లో అమెరికాలో మూవీలు రిలీజ్ చేస్తే అక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు
దానిస్థానంలో ఫుట్ బాల్ ఆటను లీడ్ చేస్తూ తీసిన మూవీని యూఎస్ లో రిలీజ్ చేస్తే మంచి క్రేజ్ ఉంటుంది
అలాగే ఒకప్పుడు రెజిలింగ్ ఫైట్స్ , కుస్తీ పోటీలు ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉండేది
పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ క్రేజ్ ఉందనుకోండి
90 ల్లో అయితే టీవీల్లో వచ్చే WWE రెజిలింగ్ ఫైట్స్ చూడటానికి కుర్రకారు ఎగబడేవారు
అప్పట్లో ఈ కుస్తీ పోటీలకు ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు
కానీ ఈ పోటీలు పాత తరం వాళ్ళకి అంతగా నచ్చవు
మన తెలుగు మల్ల యుద్ధాలతో పోలిస్తే రెజిలింగ్ ఫైట్స్ ఓవర్ గా అనిపిస్తాయి
మల్లయుద్ధంలో నిశ్శబ్దంగా ఒడుపులు పట్టుకుని పడగొట్టటాలు ఉంటాయి
కానీ ఈ రెజిలింగ్ ఫైట్స్ లో కుస్తీలకన్నా అరుపులు , కేకలు ఎక్కువగా ఉంటాయి
ఇప్పుడీ ఉపాధ్ఘాతం అంతా ఎందుకంటే దాదాపు మర్చిపోయిన రెజిలింగ్ ఫైట్స్ ను మరోసారి గుర్తు చేస్తూ ఓ మళయాళ దర్శకుడు చధా పచ్ఛా పేరుతో సినిమా తీసి వదిలాడు
ఆశ్చర్యంగా ఈ సినిమా మళయాళంలో మంచి వసూళ్లను రాబట్టుకుంది
తక్కువ బడ్జెట్ .. ఎక్కువ కలెక్షన్లు అన్నమాట
ఈ కలెక్షన్లు చూసిన తర్వాత మన తెలుగులో కూడా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందీ? అని ఆలోచన చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రైట్స్ తీసుకుని థియేటర్లలో రిలీజ్ చేసింది
కానీ ఈ మూవీ మళయాళంలో తెచ్చుకున్న రెస్పాన్స్ తెలుగులో తెచ్చుకోలేకపోయింది
ఫైనల్ గా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది
మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ మూవీలో మెరుపులా మెరుస్తాడు అని ప్రచారం కావడంతో కొంచం ఇంట్రెస్ట్ కలిగింది
అన్నట్టు చధా పచ్ఛా అంటే తెలుగులో డూ ఆర్ డై అని అర్థమట
సినిమా కుస్తీ పోటీలకు సంబంధించింది కదా అందుకే ఆ టైటిల్ పెట్టినట్టున్నారు
ఇప్పుడు కధేంటో చూద్దాం
చిన్నప్పుడు టీవీల్లో కుస్తీ పోటీలు చూసి చాలామంది పిల్లలు ఇళ్లల్లో కూడా యుద్దాలు చేసుకునేవారు కదా
అలానే కేరళలో కొచ్చిలో ఉంటున్న అన్నదమ్ములు సావియో ( అర్జున్ అశోకన్) , వెట్రి ( రోషన్ మాధ్యు ) , థామస్ లిటిల్ ( ఇషాన్ ) ముగ్గురికీ రెజిలింగ్ కుస్తీ పోటీలంటే ప్రాణం
రెజిలింగ్ ఫైట్స్ లో ఫేమస్ అయిన వ్యక్తిని వాల్టర్ ( మమ్ముట్టి ) అనే రెజ్లర్ ఓడించడంతో వీళ్ళు ముగ్గురూ అతడి దగ్గర కొంతకాలం కుస్తీ పోటీలు నేర్చుకుంటారు
అలా చిన్న వయసులోనే ఇంట్లో కూడా కుస్తీలు పడుతుండేవారు
వీళ్ళ అల్లరి భరించలేక లిటిల్ ను తీసుకుని వాళ్ళ అమ్మ వేరే ఊరికి వెళ్ళిపోతుంది
ఇదీ సినిమా ప్రారంభం
పెద్దయిన తర్వాత లిటిల్ తన సొంతూరికి వస్తాడు
అక్కడ సావి ని కలిసి చిన్ననాటి తమ కలను సఫలం చేసుకోవడానికి రెజిలింగ్ క్లబ్ పెట్టడానికి ప్రోత్సహిస్తాడు
ఈ క్రమంలో వెట్రి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకుంటాడు
అతడి కూతురు రోజమ్మ సావి దగ్గరే పెరుగుతుందని తెలుసుకుంటాడు
కొచ్చిలో మిత్రులతో కలిసి రెజిలింగ్ క్లబ్ స్థాపించి తమ లక్ష్యాన్ని సాధించుకోవాలని ప్లాన్ చేస్తారు
సరిగ్గా అదే సమయంలో జైలు నుంచి వెట్రి రిలీజ్ అవుతాడు
రెజిలింగ్ క్లబ్ స్థాపించాలనుకున్న సావి , లిటిల్ ల కల నెరవేరుతుందా ?
జైలునుంచి విడుదలైన వెట్రి వీరితో కలుస్తాడా ? లేదా ?
అన్నదమ్ములను విడగొట్టడానికి చెరియన్ చేసే కుట్రలు ఏంటి ? అనేది మిగతా కధలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
గొప్ప క్రికెటర్ కావాలనో , డాక్టర్ కావాలనో , యాక్టర్ కావాలనో , పోలీస్ కావాలనో , ఇంకా రకరకాల కెరీర్ల మీద ప్యాషన్ తో చిన్నప్పుడు చాలామంది పిల్లలు లక్ష్యాలను ఏర్పరచుకుంటారు
ఈ లక్ష్య సాధనలో కొందరు గమ్యాన్ని చేరుకుంటారు
మరికొందరు వేరే మార్గంలో సెటిల్ అవుతారు
చధా పచ్ఛా లో ముగ్గురు అన్నదమ్ముల లక్ష్యం గొప్ప రెజ్లర్లు అవ్వాలనేది
ఈ క్రమంలో అన్నదమ్ములు తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఏ విధంగా కష్టపడతారు అనేది కథ
కోచ్చిలోనే రైల్వే యార్డ్ దగ్గర పాడుబడ్డ కట్టడాన్ని తమ క్లబ్ కోసం అనువుగా మారుస్తారు
ఫ్రైడే నైట్ 9 pm పేరుతో అట్టహాసంగా షో కూడా ప్రారంభిస్తారు
ఇంతవరకు పర్ఫెక్ట్
అయితే మూవీ కుస్తీ పోటీలకు సంబంధించింది కాబట్టి పొద్దస్తమానం కుస్తీ పోటీలే చూపిస్తే చూసే ప్రేక్షకులకు టీవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు
ధోని జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలో క్రికెటర్ లక్ష్యం , ఫ్యామిలీ బాండింగ్ , ఎమోషన్స్ లాంటివాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే కధనంలోకి ప్రేక్షకుడు లీనం అయ్యాడు
అదే ఆ మూవీ మొత్తం క్రికెట్ మ్యాచులు చూపిస్తే స్టార్ స్పోర్ట్స్ చూస్తున్న ఫీలింగ్ వస్తుందే కానీ మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు
చధా పచ్ఛా లో కూడా కొంచం ఎమోషనల్ డ్రామా నడుపుదామని చూసారు కానీ సరిగా వర్కౌట్ కాలేదు
ప్రతినాయకుడిగా చెరియన్ చేసే చేష్టలు అతడు జోకరో , బ్రోకరో అర్ధం కాని స్థితిలో ఉంటాయి
ఊరి బయట రైల్వే ట్రాకుల పక్కన రెజిలింగ్ కుస్తీ పోటీల క్లబ్ పెట్టడం అసహజంగా ఉంది
పైగా ఈ కుస్తీ పోటీలను చూడటానికి జనం రైల్వే ట్రాకులకు అడ్డం పడి పరిగెత్తడం మరీ అసహజంగా ఉంది
రైల్వే ప్రాపర్టీలో బీర్లు తాగుతూ హోరాహోరీ కుస్తీ పోటీలు చేసుకోవడం లాజిక్కుకు అందదు
లక్ష్యాన్ని సాధించుకోవడానికి అక్రమ మార్గం పట్టినట్టుగా కనిపిస్తుంది కానీ అందులో నిజాయితీ కనిపించదు
గొప్ప రెజ్లర్లు కావడానికి పడాల్సిన కఠోర శ్రమ కానీ , కఠినమైన సాధన కానీ ఏమీ కనిపించదు
ఆ మధ్య రాజమౌళి తీసిన సై సినిమాలో ఫుట్ బాల్ ఆట నేపధ్యం , అలాగే నానీ జెర్సీ సినిమాలో క్రికెటర్ నేపధ్యం సినిమాటిక్ గా చూపించారు
ఇందులో అది మిస్ అయ్యింది
ఫస్టాఫ్ కొంతవరకు నయం కానీ సెకండాఫ్ పూర్తిగా టీవీ షో మాదిరి తయారయ్యింది
అంటే సెకండాఫ్ లో స్టోరీ కన్నా అరుపులు ,కేకలు , తన్నుకోవడం ఎక్కువై పోయాయి
అయితే అయ్యిందిలే పోనీ అని సరిపెట్టుకుని మమ్ముట్టి ని చూద్దామనుకునుకుని కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని చూస్తే క్లైమాక్సులో ఎవరో తలకు రిబ్బన్లు కట్టుకుని పూల చొక్కా వేసుకుని బుల్లెట్ బండి దిగితే జోకర్ ఏమో అనుకుంటాం
తీరా చూస్తే అతడే మమ్ముట్టి
దానికన్నా ఆ ఐదు నిముషాలు మమ్ముట్టి కనపడకుండా ఉన్నా బాగుండేది
కనిపించి ఆయన అభిమానుల్ని డిజప్పాయింట్ చేసాడు
కొద్దోగొప్పో సినిమాలో ఆ చిన్నపాప రోజమ్మ బాగా చేసింది
ఎవరెలా చేసారు ?
ముగ్గురు అన్నదమ్ములుగా నటించినవారిలో లిటిల్ గా నటించిన థామస్ నటన బావుంది . అతడి తర్వాత సావి పాత్ర చేసిన అర్జున్ నటన బాగుంది
వెట్రి పాత్ర పోషించిన రోషన్ మాధ్యు నటన పర్లేదు
ఇక ప్రతినాయకుడు చెరియన్ పాత్ర జోకర్ కు ఎక్కువ , జూనియర్ ఆర్టిస్టుకు తక్కువ అన్నట్టుగా ఉంది
వీళ్లందరికన్నా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ విషయంలో కానీ , డైలాగ్ డెలివరీ విషయంలో కానీ రోజమ్మ పాత్ర పోషించిన ఆ చిన్నపిల్ల నటన బాగుంది
సాంకేతికత
ముజీద్ మజీబ్ అందించిన బీజీఎమ్ బాగానే ఉంది
ఆనంద్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది
కేరళ పచ్చదనాన్ని , బీచ్ సౌందర్యాన్ని అందంగా చూపించాడు
దర్శకుడు అద్వైత్ నాయర్ కి ఇది మొదటి సినిమా అట
అందుకే స్క్రీన్ ప్లే విషయంలో తడబడినట్టు అనిపించింది
రెజ్లర్లు కావాలనే గొప్ప లక్ష్యం ఆధారంగా కథ అల్లుకున్నప్పటికీ సరైన విధంగా తెరకెక్కించలేకపోయాడు
విశ్లేషణ
సినిమా ప్రథమార్థం కొంచం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది కానీ ద్వితీయార్థం ఎక్కువగా కుస్తీ పోటీలకే రీళ్లు ఖర్చు చేయడంతో కొద్దిగా బోర్ అనిపిస్తుంది . అయితే సినిమాలో ఎక్కడా అసభ్యత , అశ్లీలతకు తావు లేకుండా సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చూడటానికి ఇబ్బంది ఉండదు . ముఖ్యంగా రెజిలింగ్ పోటీలను ఇష్టపడేవారికి ఈ మూవీ కొంచం నచ్చుతుంది
నటీనటులు : అర్జున్ అశోకన్ , రోషన్ , ఇషాన్ , మమ్ముట్టి తదితరులు
దర్శకత్వం : అద్వైత్ నాయర్
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటిటి
రేటింగ్ : 2 / 5
