మాస్టారూ! నాకో డౌట్?”
“మొన్న సిందూర్ విషయంలో చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది కదా?”
“అవునూ.. అయితే?”
“మన శత్రువు అయిన పాకిస్తాన్ తో చేతులు కలిపింది అంటే చైనా కూడా మనకు శత్రువు కిందే లెక్క కదా?”
“అవునూ.. అయితే?”
“ఇంకా అయితే ఏంటటా ? అని మెల్లిగా అంటారేంటండీ బాబూ.. నే చెప్పే సంగతి వింటే మీరు షాక్ అవుతారు”
“అయితే చెప్పకండి..ఆ షాక్ ట్రీట్మెంట్లవీ నాకెందుకు?”
“అబ్బబ్బా షాక్ అంటే కరెంట్ షాక్ కాదండీ..భయపడకండి.. అసలేం జరిగిందంటే.. అదేదో మీటింగట.. అక్కడ మన మోడీ గారు..ఆ చైనా జింగ్ పింగ్ గాడు కలిసి మాట్లాడుకున్నారు తెలుసా?”
“ఏం మాట్లాడుకున్నారటా?”
“తెలీదు మాస్టారూ.. కానీ ఇద్దరూ ఒకటే పకపకలు ఇకఇకలు”
“జోకులేసుకున్నారేమో ? లేకపోతే పక్కనుంచి ఎవడన్నా కితకితలు పెట్టారేమో?”
“అదేంటి మాస్టారూ? ఇది జోకులకు సమయమా? అసలుకు పాక్ కు సపోర్ట్ చేసిన ఆ చైనా జింగ్ పింగ్ గాడితో మనం జోకులేసుకుని నవ్వుకునే సమయమా అంటా?”
“మరేం చేయాలంటారూ ? ఎన్టీఆర్.. కైకాల సత్యనారాయణల మాదిరి ఒకరినొకరు కిందపడి దొర్లుకుంటూ కొట్టుకుంటారనుకుంటున్నారా ? అసలు మీకు ఇంకో విషయం తెలుసా?”
“ఏంటి మాస్టారూ?”
“జిన్ పింగే కాదు సాక్షాత్తు మన శత్రు దేశం పాక్ ప్రధాని ఎదురొచ్చినా అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.. అలాగే నవ్వుకుంటారు కూడా “
“హవ్వ “
“హవ్వ లేదు బువ్వ లేదు.. దేశాలతో శత్రుత్వాలు ఉన్నా కూడా నాయకులు ఎదురుపడితే షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు.. హాయిగా నవ్వుకుంటారు కూడా.. విభేదాలను దౌత్యపరమైన మార్గాల ద్వారా హుందాగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు.. అంతే కానీ మీ ఫేస్ బుక్ మనుషుల్లా ఒకరినొకరు బండ బూతులు తిట్టుకోరు “
“మరి ఈ యుద్దాలు.. శత్రువులకు సాయం చేయటాలూ?”
“అవి యథాప్రకారం నిరంతరం నడుస్తూనే ఉంటాయి.. బయట ఎవడి వ్యూహాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటారు.. పాక్ కు చైనా సాయం చేస్తూనే ఉంటుంది.. చైనా వస్తువులు బ్యాన్ చేయాలనే నినాదాలు మనం ఇస్తూనే ఉంటాం.. ఫేస్ బుక్ లో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూనే ఉంటాం”
“సరే ఇంకో విశేషం ఏంటంటే రష్యా పుతిన్ మన మోడీ గారిని చైనా జింగ్ పింగ్ గారికి దగ్గరుండి మరీ షేక్ హ్యాండ్ ఇప్పించారు “
“ఇందులో విశేషం ఏముంది? శత్రువు శత్రువు మరొకడికి మిత్రుడు అవుతాడు కదా.. అలాగే ఓ కొత్త పిచ్చోడి దెబ్బలకు తట్టుకోలేక బాధితులంతా ఓ చోట చేరి మాట్లాడుకోవడం కొత్త విషయమేమీ కాదే? పిచ్చోడి గోల అలా ఉంది మరి?”
“సరే ఆఖరి డౌట్? పుతినూ, జింగ్ పింగూ, మన మోడీ గారూ మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇంకో ముగ్గురు తలకాయలు పెట్టి వింటున్నారు..వాళ్లెవరు? గూఢచారులా?”
“నా తలకాయ్.. వాళ్ళు గూఢచారులు కాదు. ట్రాన్స్లేటర్లు.. ఒకరి భాష మరొకరికి అర్థం కాదుగా.. అందుకే ఆ ఏర్పాటు?”
“ఓహో ఇప్పుడర్ధమైంది మాస్టారూ?”
“ఏవనీ?”
“నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్తే భాష అర్థమై చావక పక్కోడు నవ్వితే నేను కూడా పగలబడి నవ్వేవాడ్ని.. అట్టనే ఎదుటోడు ఏవన్నాడో అర్థం కాక ముందు ఒకళ్ళనొకళ్ళు పగలబడి నవ్వేసుకునుంటారు.. ట్రాన్స్లేటర్లు చెప్పాకనే ముగ్గురికీ అసలు విషయం అర్థమై ఉంటుంది “
“వార్నీ.. నీకలా అర్థమైందా??”