శనివారం హైటెక్స్ లో జరిగిన గద్దర్ అవార్డ్ ఫంక్షన్లో అందరి దృష్టి అల్లు అర్జున్.. సీఎం రేవంత్ రెడ్డి ల మీదే ఉంది!
అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోబోతున్న ఇదే పుష్ప 2 సినిమా రిలీజు సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో పిల్లవాడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవ్వగా తల్లి మరణించిన సంఘటన తీవ్ర వివాదాస్పదం అయ్యి ఆఖరికి అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళింది
ఆ టైంలో అల్లు అర్జున్ ను కేసునుంచి తప్పించేందుకు అల్లు అరవింద్ తో సహా పలువురు సినీ పెద్దలు ప్రభుత్వ పెద్దలతొ రాయబారాలు నడిపారు
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ‘ ఆయనేమన్నా సైన్యంలో పనిచేశాడా? దేశానికి సేవ చేశాడా? సినిమా నటుడైనంత మాత్రాన అరెస్ట్ చేయకూడదని రూలేమన్నా ఉందా? చట్టం ముందు అందరూ సమానమే ‘ అని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు
దాంతో చేసేదేమీ లేక న్యాయ పోరాటం చేసి బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటపడ్డాడు అల్లు అర్జున్
దరిమిలా దిల్ రాజు నేతృత్వంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వెళ్ళి సీఎం ను కలిశారు.. తర్వాత ఎందుకో అల్లు అర్జున్ వ్యవహారంలో స్పీడు తగ్గింది
మళ్ళీ ఇదిగో ఇన్నాళ్ళకు పుష్ప 2 సినిమాకు గానూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడానికి గద్దర్ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చాడు బన్నీ
గత వివాదాల నేపద్యంలో సహజంగా అందరి చూపు వీళ్లిద్దరి మీదే పడింది
అయితే ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వచ్చిన అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు
పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పమని అభిమానులు ఒత్తిడి చేయడంతో బన్నీ సీఎం వైపు తిరిగి ‘ సార్! ఇది సినిమా ఫంక్షన్ కదా.. ఒక డైలాగ్ చెప్తా ‘ అని మైక్ తీసుకుని పుష్ప సినిమా డైలాగ్ చెప్పాడు
వేదిక మీద ఉన్న సీఎం కూడా బన్నీ డైలాగ్ పూర్తి కాగానే చప్పట్లు కొట్టడం విశేషం!
ఈ దృశ్యం సభికులను ఆకట్టుకుంది
తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగంలో పరోక్షంగా అల్లు అర్జున్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘ పాలనలో భాగంగా ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తుంది.. అదే సమయంలో అభివృద్ధి విషయంలో సినీ పరిశ్రమ నుంచి పరస్పర సహకారం ఆశిస్తుంది..’ అని మనసులో మాట బయటపెట్టారు
ఈ వ్యాఖ్యలు సూటిగా అల్లు అర్జున్ ఉదంతం గురించే అని అక్కడే ఫిలిం జనాలు గుసగుసలాడుకున్నారు.. తప్పులు చేస్తే ఎంతటి వాడైనా వదిలేది లేదనీ.. అలా అని ఎవరి మీదా కక్ష పూరితంగా వ్యవహరించమని.. తెలంగాణా అభివృద్ధిలో సినీ పరిశ్రమ కూడా భాగస్వాములు కావాలని రేవంత్ స్ట్రెయిట్ గానే సంకేతాలు ఇచ్చాడని అనుకున్నారు
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు.. తమ అభిమాన నాయకుడి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే మీసం మెలేసి మరీ పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడని ఉప్పొంగిపోతున్నారు.. అవార్డ్ అందుకోవడమే కాదు అదే సీఎం ముందు పుష్ప డైలాగ్ రప్పా రప్పా పలకడం కూడా వారిలో ఫుల్ జోష్ నింపింది !
పరేష్ తుర్లపాటి