Home » పాత ప్రేమ కధే ..కానీ నడిపించిన తీరు బాగుంది- కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

పాత ప్రేమ కధే ..కానీ నడిపించిన తీరు బాగుంది- కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

Spread the love

సంతోష్ శోభన్ లో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది

ఈ యువహీరో గతంలో కొన్ని సినిమాలు చేసాడు కానీ ఏదీ పెద్దగా క్లిక్ అవ్వలేదు
అందుకే కపుల్ ఫ్రెండ్లీలో కొంచం ఎక్కువ జాగ్రత్తలు పడినట్టున్నాడు
నటన పరంగా మంచి మార్కులే సాధించాడు

ఇన్నాళ్లకు కపుల్ ఫ్రెండ్లీ మూవీ ద్వారా ఇతడికి మంచి పాత్ర దక్కింది
అందులోనూ నటనకు స్కోప్ ఉన్న లవ్ స్టోరీ మూవీ ఇది

ఇదిలా ఉండగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కనీసం ఒక్కటైనా ప్రేమ కధలు చేయని హీరో , హీరోయిన్లు దాదాపు ఉండరు

అసలు ప్రేమ కథలకే కొంతమంది హీరో హీరోయిన్లు పుట్టుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు

లవ్ స్టోరీల్లో ప్రేక్షకులను మెప్పించటం అంత తేలికైన విషయం కాదు
ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా మూవీని మలచాలంటే దర్శకుడు గట్టి కసరత్తులే చేయాలి

ప్రేమను ,విరహాన్ని సమానంగా ప్రదర్శించగల హీరో హీరోయిన్లు ఉండాలి
ఇద్దరి ప్రేమ మధ్య బలమైన సెంటిమెంటు ఉండాలి

ప్రేమ ప్రయాణంలో భావోద్వేగాలను పండించగలిగే హీరో ఉండాలి
కళ్ళతోనే భావాలను పలికించగలిగే హీరోయిన్ ఉండాలి

మూవీ చూడటం మొదలుపెట్టినప్పుడు ప్రేక్షకులకు ఓ ఫ్రెష్ ఫీల్ రావాలి
అన్నిటికన్నా ముగింపు బాగుండాలి

ఎందుకంటే ఎక్కువ ప్రేమ కధలు ట్రాజడీగా ఎండ్ అవుతాయి
కొన్ని మాత్రమే సుఖాంతం అవుతాయి
రెండు ముగింపుల్లో ఏది తీసుకున్నా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే విధంగా మలచాలి

అప్పుడు అన్నీ కుదిరితే ,అన్నీ బాగుంటే ,

ఆ సినిమా ఓ ప్రేమాభిషేకం అవుతుంది ..మరో చరిత్ర సృష్టిస్తుంది
గీతాంజలి అయి చాన్నాళ్లు గుర్తుండిపోతుంది

కపుల్ ఫ్రెండ్లీ కొత్త స్టోరీ ఏమీ కాదు
గతంలో ఈ తరహా స్టోరీలతో చాలా మూవీలు వచ్చాయి
ముందు ముందు కూడా వస్తాయి

అయితే స్టోరీ పాతదే అయినా ప్రస్తుత నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి సరికొత్తగా తీసుకొస్తే ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనటానికి కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఒక ఉదాహరణ

ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీ కధేంటో చూద్దాం

నెల్లూరుకు చెందిన శివ ( సంతోష్ శోభన్ ) చదువు పూర్తి చేసుకుని ఇంటీరియర్ డిజైనర్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అతడి ప్రయత్నాలకు తగ్గ పని దొరక్కపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక చెన్నై వచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటాడు
ఈలోపు ఖర్చులకోసమని రాపిడో తరహాలో బైక్ రైడింగ్ చేస్తుంటాడు

చిత్తూరుకు చెందిన మిత్రాది (మానస వారణాసి ) కూడా ఇదే పరిస్థితి
ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండటంతో జాబ్ కోసమని చెన్నై వచ్చి ఓ హాస్టల్లో ఉంటూ ప్రయత్నాలు చేస్తుంటుంది

ఇద్దరి లక్ష్యం ఒకటే
జీవితంలో సెటిల్ అవ్వాలని

మిత్రా హాస్టల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడంతో అనుకోకుండా ఈ ఇద్దరూ కలుస్తారు
రెంట్ షేరింగ్ బేసిస్ మీద ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు

అయితే మిత్ర రాకతో శివ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి ?

స్నేహంతో మొదలైన వీరి జీవిత ప్రయాణం ప్రేమగా ఎలా మారింది ?

వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం దొరికేవరకు వచ్చే గ్యాప్ మహా చెడ్డది

చదివిన చదువుకు వెంటనే సరైన కొలువు దొరక్క ఇబ్బందులు పడే నిరుద్యోగికి కావు కావు మంటూ లోకం పొడిచే పొడుపులు అంతాఇంతా కావు

ఉద్యోగం దొరికిందా ? లేదా ?
ఇంకా ఖాళీగానే ఉంటున్నావా ?
ఏదైనా చిన్న జాబ్ చేసుకోవచ్చుగా ? లాంటి సూటీపోటీ మాటలతో కుళ్ళబొడిచేసి వాళ్ళ ఇష్టాయిష్టాలు ,అభిరుచులు ,ఏంటో తెలుసుకోకుండా అసలు లక్ష్యాలకు చేరుకోవడానికి కొద్దిపాటి సమయం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను ఊపిరి ఆడకుండా ఫ్రై చేసేస్తారు

పోనీ వీళ్ళేమన్నా ఉద్యోగాలు ఇప్పిస్తారా ? అంటే అదీ ఉండదు

ఆఖరికి సమాజం గోల పడలేక తమ అభిరుచులను చంపుకుని ఏదో ఒక రంగంలో దూరిపోతారు
దాదాపు ప్రతి నిరుద్యోగి జీవితంలో ఇటువంటి ఇబ్బందులు పడే ఉంటాడు

సరే ప్రస్తుతానికి వస్తే ,

శివ కూడా అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటాడు

ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఖర్చుల కోసం బైక్ రైడింగ్ చేస్తున్న శివను చూస్తుంటే చాలామందికి తమని తాము చూసుకున్నట్టు అనిపిస్తుంది
ఈ ఆకలి రాజ్యం కరువు చాలామంది అనుభవించే ఉంటారు

ఈ మూవీలో ఓ సన్నివేశంలో శివ ” నాన్న ఉద్యోగం చేసినన్నాళ్లు నా ఖర్చులకు లోటు రానివ్వలేదు . కానీ ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాడు .రిటైర్ అయిన తర్వాత కూడా నాన్న ను ఖర్చులు అడగటం సరికాదనిపించింది .అందుకే సెటిల్ అవ్వాలని చెన్నై వచ్చేసా ” అని అంటాడు

ఇవన్నీ మూవీ ప్రారంభంలో కనిపించే సన్నివేశాలు
అందుకే ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ కాగలిగారు

ఇక శివ కెరీర్ కోసం మిత్ర ప్రోత్సహించడం , శివ జీవితంలో సెటిల్ అవడం , వీరి స్నేహం ప్రేమగా మారటం గతంలో చాలా సినిమాల్లో మనం చూసిందే

జాలీగా సాగిపోతున్న ప్రేమ కధలో అనుకోకుండా మిత్రా ఆరోగ్య సమస్య రావడంతో ఎమోషనల్ టచ్ అందుకుంటుంది

హీరోకో ,హీరోయిన్ కో సడెన్గా హెల్త్ ఇన్స్యూ రావడం స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకోవడం ,హృదయాలు బరువెక్కడం గతంలో చాలా సినిమాల్లో చూసేసాం

కాకపోతే తిప్పి తిప్పి అవే రోగాలు చూపిస్తే స్టోరీలో కొత్తదనం ఉండదని గ్రహించారేమో లేటెస్టుగా సినిమా సినిమాకి మెడికల్ టెర్మినాలజీకి అందని సరికొత్త రోగాలను తీసుకొచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరికి తగిలిస్తున్నారు

దాదాపు సెకండాఫ్ అంతా సంఘర్షణలు ,భావోద్వేగాలతోనే నడుస్తుంది
చివరిగా ఇచ్చిన ముగింపు చాలామంది ముందుగానే ఊహించిందే

కాకపోతే ఫస్టాఫ్ లో ఆ కేరళ సన్నివేశాలు కొంత గందరగోళాన్ని సృష్టించాయి
చెన్నై నుంచి కేరళకు కెమెరా అటూఇటూ తిరగడంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది
నిజానికి ఆ సన్నివేశాలు అవసరం లేదు

ఒకవేళ ఉంచాలి అనుకుంటే ఆ సన్నివేశాలను మరింత క్లారిటీగా పిక్చరైజ్ చేసి ఉంటే బాగుండేది

మిత్రా స్నేహితురాలు ప్రీతి జంట ల సన్నివేశాలు కూడా అనవసరమే
ఫ్యామిలీ స్టోరీ మాదిరి సాగిపోతున్న కధనంలో ప్రీతి బాయ్ ఫ్రెండ్ బాత్ రూమ్ సన్నివేశాలు పంటికింది రాయిలా తగులుతాయి

ఎవరెలా చేసారు ?

సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు సంతోష్ శోభన్ ,మానస వారణాసి ల చుట్టూనే తిరుగుతాయి

స్టోరీ పాతదే అయినప్పటికీ కొత్తగా అనిపించడం ,కనిపించడం వెనుక వీళ్లిద్దరి చక్కటి నటన ఉంది

జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేసే నిరుద్యోగిగా సంతోష్ చాలా ఈజ్ తో నటించాడు

ఈ మూవీలో మనకు సంతోష్ శోభన్ ఎక్కడా కనిపించడు
చెన్నైలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్న నెల్లూరు కుర్రాడు శివ కనిపిస్తాడు
చాలా సహజంగా పాత్రలో జీవించేసాడు

ఇక మిత్ర పాత్రలో నటించిన మానస వారణాసి కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది
నేటి కొంతమంది హీరోయిన్లకు మాదిరి ఆర్టిఫిషియల్ తళుకులు బెళుకులు లేకుండా చాలా నాచురల్ గా అందంగా ఉంది

సినిమాలో ఎక్కడైనా బోర్ కొట్టినా ఈ ఇద్దరి జంటను చూస్తూ కొంత మర్చిపోవచ్చు

ఇక రాజీవ్ కనకాల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టున్నాడు
ఈ మధ్య విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు
ఇందులో కూడా రాజీవ్ నటన బాగుంది

మరో పాత్రలో గోపరాజు రమణ కూడా బాగానే చేసాడు

తమిళ కమెడియన్ యోగిబాబు కామెడీ పర్లేదు
కానీ దర్శకుడు అతడ్ని పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది

సాంకేతికత

లవ్ స్టోరీ కదా హీరో హీరోయిన్ల మధ్య ఇంటర్వెల్ కు ముందు ఓ మూడు ,తర్వాత ఓ మూడు పాటలు ఉంటాయని ఎవరన్నా అనుకుంటే తప్పులో కాలేసినట్టే
పెద్దగా పాటలవీ లేవు

బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కాకుండా కనీసం ఆ కేరళలో అన్నా ఇద్దరి మధ్య ఓ రెండు మాంచి డ్యూయెట్లు పెట్టి ఉండాల్సింది
కాబట్టి నేపధ్య సంగీతానికి యావరేజ్ మార్కులే పడతాయి

సినిమాటోగ్రఫి బాగానే ఉంది
కాకపోతే ఇంకాస్త మెరుగ్గా తీసుంటే బాగుండేది

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

విశ్లేషణ

గతంలో ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలు చాలామంది చూసే ఉంటారు . కాకపోతే సంతోష్ శోభన్ ,మానస వారణాసి పెయిర్ నటన వల్లనో , లేకపోతే దర్శకుడి స్క్రీన్ ప్లే నైపుణ్యమో తెలీదు కానీ మూవీలో ఫ్రెష్నెస్ కనిపిస్తుంది . కుటుంబ సంఘర్షణలను ,ప్రేమికుల భావోద్వేగాలను సమపాళ్లలో రంగరించి చూపించారు .కాకపోతే హడావుడి ముగింపు కాకుండా ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది . ఒకట్రెండు లిప్ లాక్ సన్నివేశాలు మినహా ‘ అతి ‘ ఎక్కడా లేదు కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో అమెజాన్ ప్రైమ్ ఓటిటీ లో హాయిగా చూడొచ్చు

నటీనటులు : సంతోష్ శోభన్ , మానస వారణాసి , రాజీవ్ కనకాల , రమణ గోపరాజు తదితరులు
సంగీతం : ఆదిత్య రవీంద్రన్
రచన ,దర్శకత్వం : అశ్విన్ చంద్రశేఖర్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!