ఆదివారం జెపి నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది
జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే
అప్పటినుంచి తదుపరి తమ అభ్యర్థిగా బీజేపీ ఎవరి పేరును ప్రకటిస్తుంది అని దేశ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది
కాకపోతే బీజేపీ ఖచ్చితంగా ఆరెస్సెస్ నేపధ్యం కలిగిన వారినే తమ అభ్యర్థిగా ప్రకటిస్తారని రాజకీయ పండితులు ముందుగానే విశ్లేషించారు
ఊహించిన విధంగానే జనసంఘ్ నాయకుడినే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది
అసలు ఎవరీ సీపీ రాధాకృష్ణన్ ?
67 సంవత్సరాల చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు
సిపి రాధాకృష్ణన్ అంటే అందరికీ తెలుసు
తమిళనాడులోని కోయంబత్తూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రెండు దఫాలు గా గెలిచి ప్రాతినిధ్యం వహించారు
ఆరెస్సెస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన రాధాకృష్ణన్ 1974 లోనే భారతీయ జనసంఘ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యారు
1996 లో బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖకు కార్యదర్శిగా నియమితులు అయ్యారు
తదుపరి ఈయన తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పని చేసారు
1957 మే 4 న తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ బిఎ చదివారు
గతంలో ఝార్ఖండ్ , పుదుచ్చేరి , తెలంగాణా రాష్ట్రాల్లో కొద్దికాలం పాటు గవర్నర్ బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ప్రకటించడం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి ?
జనసంఘ్ నేతగా రాధాకృష్ణన్ కు తమిళనాడులో మంచి పేరు ఉంది
ఆయన్ని అభిమానులు తమిళనాడు మోడీ అని కూడా పిలుచుకుంటారు
గతంలో సనాతన ధర్మం మీద హేళన వాఖ్యలు చేసిన డీఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ కు ధీటైన సమాధానం ఇచ్చి ఈయన వార్తల్లో నిలిచారు
సనాతన ధర్మం , హిందుత్వం ల మీద బలమైన వాదనలు వినిపించారు
మరోపక్క తమిళనాడులో కూడా బీజేపీని అధికారంలోకి తేవాలని అధిష్టానం ఇప్పటినుంచే పావులు కదుపుతుంది
ఈ పరిస్థితుల్లో ఆయన బీజేపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు
ఆ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడం వెనుక తమిళుల మనసులను గెలుచుకోవాలనే వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు
అంతేకాకుండా రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేయడం వెనుక ఉత్తరాది , దక్షిణాది సమతుల్యతను కూడా బీజేపీ బేరీజు వేసుకుంది
ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాది వారు కాగా రాధాకృష్ణన్ దక్షిణాదికి చెందిన వారు
అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే మోదీ ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును సూచించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి !
పరేష్ తుర్లపాటి