Home » డెకాయిట్ మూవీ రివ్యూ

డెకాయిట్ మూవీ రివ్యూ

Spread the love

సినిమా ప్రారంభమే బలానికి బస్కీలు తీస్తూ కనిపిస్తాడు అడవి శేష్
ఈ సినిమా చేయడానికి తాను బాగా కష్టపడ్డానని అంతర్లీనంగా అలా చెప్పాడన్నమాట

అలాగే ఈ సినిమా చూడటానికి అవసరమైన బలం కోసం ప్రేక్షకులు కూడా బస్కీలు తీసి రావాలని దర్శకుడు కూడా బాహాటంగా కొన్ని సన్నివేశాల ద్వారా సందేశం ఇచ్చాడు

నిజానికి అడవి శేష్ నటించిన సినిమా అనగానే మనకు తెలుగు జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది

ఇతని సినిమాల గురించి చెప్పుకోవాలంటే మేజర్ ఒక్కటి చాలు

ముంబై దాడులకు ప్లాన్ చేసిన ముష్కరులను మట్టుబెట్టిన సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ హాలీవుడ్ రేంజులో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూపించాడు

దాంతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అడవి శేష్ సినిమాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయనే పేరు తెచ్చుకున్నాడు

పైగా తన సినిమాలకు చాలావరకు కధలు అతడే రాసుకుంటాడు
చిన్నప్పుడు నాలాగే మధుబాబు షాడో పుస్తకాలు , స్పై నవలలు చదివి ఉంటాడు
ఆ ప్రభావం కాబోలు అడవి సినిమాల్లో యాక్షన్ డ్రామా ఎక్కువగా ఉంటుంది

అందుకే అతడి సినిమాలు అంటే అటు ఇండస్ట్రీలోనూ , ఇటు ప్రేక్షకుల్లోనూ కొన్ని అంచనాలు ఉంటాయి

డెకాయిట్ మూవీకి కూడా అడవి శేష్ కథ రాసుకున్నాడని తెలియగానే ఆ అంచనాలు మరింత పెరిగాయి

మరి ప్రేక్షకుల అంచనాలను డెకాయిట్ మూవీ అందుకోగలిగిందా ? అనేది ఇప్పుడు చూద్దాం

కధేంటంటే ?

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన హరి ( అడవి శేష్ ) , సరస్వతి అలియాస్ జూలియట్ ను ప్రేమిస్తాడు

అయితే హరి .. సరస్వతిని ప్రేమించడం ఆమె అన్నకు ఇష్టం ఉండదు
కులాల అంతరమే ఇందుకు కారణం

అందుకే అతడు తన స్నేహితులతో కలిసి హరి స్నేహితురాలు మల్లిని అత్యాచారం చేస్తాడు
ఆమెను కాపాడటానికి వెళ్లిన హరి ఆవేశంలో సరస్వతి అన్నను హత్య చేస్తాడు

అయితే ఈ కేసులో సరస్వతి తాను ప్రేమించిన హరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడంతో అతడికి జైలు శిక్ష పడుతుంది

13 ఏళ్ళ జైలు జీవితం తర్వాత తనపై తప్పుడు సాక్ష్యం చెప్పి జైల్లో పెట్టిన సరస్వతి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఇషాద్ భాయ్ ( అతుల్ కులకర్ణి ) ద్వారా జైలు నుంచి పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు

మరోపక్క హరికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పిన సరస్వతి వేరొకరిని పెళ్లి చేసుకుని కూతుర్ని కూడా కంటుంది
అయితే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆమె భర్త ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంటాడు

ఈ పరిస్థితుల్లో జైలునుంచి తప్పించుకుని పారిపోయిన హరి ఏం చేస్తాడు ?

తనపై తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుపాలు చేసిన ప్రియురాలు జూలియట్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడా ?

అసలు తాను ప్రాణప్రదంగా ప్రేమించిన హరికి వ్యతిరేకంగా జూలియట్ ఎందుకు సాక్ష్యం చెప్పింది ?

జైలునుంచి తప్పించుకుపారిపోయిన హరిని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ రాంబాబు (అనురాగ్ కశ్యప్ ) చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ? అనేది మిగిలిన కధలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణా యాసతో చాలా సినిమాలు వచ్చాయి
గతంలో విలన్లకే పరిమితం అయిన తెలంగాణా యాస హీరోలు కూడా పలికే స్థాయికి ఎదిగింది

అయితే ఈ యాస పలకడంలో కూడా కొందరు హీరోలు తడబడ్డారు

ఇప్పుడిదంతా ఎందుకంటే డెకాయిట్ మూవీ కోసం అడవి శేష్ చిత్తూరు జిల్లా (మదనపల్లె ) యాసను ఎంచుకున్నాడు
ఇంతవరకు బాగానే ఉంది

కానీ యాసను డబ్బింగ్ లో సరిగా పలకపోతే డైలాగులు తిరగబడే ప్రమాదం ఉంది
ఈ సినిమాలో జరిగిన ప్రధాన తప్పిదం అదే

సినిమాలో అడవి శేష్ చిత్తూరు యాసలో పలికిన డైలాగులను డీ కోడ్ చేసుకోవడానికి ప్రేక్షకులు నాసాని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది

పైగా దానికి తోడు పాత్రల మధ్య కట్ డైలాగులతో మొదటి అర్ధగంట చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది
గతంలో నాని కూడా ఇలాంటి ప్రయోగం చేసి దెబ్బ తిన్నాడు

ఇంతకీ కట్ డైలాగులంటే ఏంటో అనుకుంటున్నారా ?

చెప్పాల్సిన డైలాగును పూర్తిగా చెప్పకుండా షార్ట్ కట్ లో చెప్పడమే కట్ డైలాగ్ అన్నమాట

“యోవ్..నీకే చెప్తాండా..పోతాండా..వస్తాండా..” ఇలా తండోపతండాలుగా తాండలతో పదేపదే వచ్చిన షార్ట్ కట్ డైలాగులు యాసను గుర్తు చేయడానికి పనికొచ్చాయి కానీ పలకడానికి పనికిరాలేదు

దీనికన్నా స్ట్రెయిట్ తెలుగులో డైలాగులు చెప్పి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదు
కనీసం డబ్బింగ్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది

ఇక డబ్బింగ్ సంగతి అలా ఉంచితే ఎడిటింగ్ లోపం స్పృష్టంగా కనిపిస్తుంది
మొదటి అర్ధగంట సినిమాలో ఏం జరుగుతుందో మనకు అర్ధం కాదు

ఒక ఫ్రేమ్ లో అడవి శేష్ జైలులో కట్టెను కొడతాడు
ఇంకో ఫ్రేమ్ లో నేల తుడుస్తాడు
ఇంకో ఫ్రేమ్ లో ఇషాద్ భాయ్ తో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు

వెంట వెంటనే రకరకాల ఫ్రేమ్ లు గిరగిరా తిప్పడంతో ప్రేక్షకుల కళ్ళు తిరిగాయే కానీ అసలు స్టోరీ ఏంటో , అడవి శేష్ బాధ ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు

ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా బిట్లు బిట్లు గా రివీల్ చేయడంతో కొంత ఉడికీ ఉడకని ఇడ్లీ మాదిరి తయారైంది పరిస్థితి

మొత్తానికి హరి ..జూలియట్ అనే అమ్మాయిని ప్రేమించాడని కాస్త ఆలస్యంగా మనకు అర్ధం అవుతుంది
అప్పటికీ జూలియట్ కారణంగానే హరి జైల్లో పడ్డాడని మనకు తెలియదు

డెకాయిట్ అనే టైటిల్ పెట్టారు కాబట్టి ఇతడేదో దొంగతనం చేసి జైల్లో పడ్డాడని అనుకుంటాం

ఇతడిని జైలు నుంచి తప్పించడానికి ఇషాద్ భాయ్ ( అతుల్ కులకర్ణి ) ప్లాన్ చేసినప్పుడు కూడా హరి డెకాయిట్ అనే అనుకుంటాం

కానీ నిజానికి హరి దొంగ కాదు
దొంగతనాలవీ చేయడు..అలవాటు కూడా లేదు

మరి డెకాయిట్ అనే టైటిల్ ఏంటనే కదా మీ అనుమానం?

జూలియట్ అనే అమ్మాయి మనసు కొల్లగొట్టిన డెకాయిట్ హరి అని దర్శకుడి కవి హృదయం

ఆ సంగతి అలా ఉంచితే , మీరు గమనించారా ? ఈ మధ్య చాలా సినిమాల్లో పాత సినిమాల్లోని పాటలను రీ మిక్స్ చేసుకుని వాడుకుంటున్నారు

హరి జైలునుంచి తప్పించుకుని పారిపోయే క్రమంలో కన్నె పిట్టరో..కన్ను కొట్టరో..అనే సాంగ్ రీ మిక్స్ చేసి వాడుకున్నారు

ఆ పాట సంగతి అలా ఉంచితే హరి జైలునుంచి పారిపోయిన తర్వాతనే కథ గాడిలో పడుతుంది

ఫ్లాష్ బ్యాక్ లో సన్నివేశాలు ఒకటొకటి రివీల్ అవుతూ మనకి కథ మీద క్లారిటీ వస్తుంది
దానికి తోడు అడవి శేష్ లో దాగిఉన్న యాక్షన్ హీరో పూర్తిస్థాయిలో బయటకు వస్తాడు
దాంతో కధనం ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది

తనకు కావాల్సిన డబ్బుల కోసం కరుణ హాస్పిటల్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకోవడం ,అదే దొంగతనంలో తన మాజీ ప్రియురాలు జూలియట్ ను ఇరికించి పారిపోదామని స్కెచ్ వేసుకోవడం ,ఈ క్రమంలో వీళ్ళని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ రాంబాబు రంగంలోకి దిగడం వంటి పరిణామాలతో కథ చకచకా పరుగులు పెడుతుంది

ఈ సన్నివేశాలు అన్నీ పూర్తి యాక్షన్ డ్రామాతో నిండిపోవడంతో బోర్ డమ్ నుంచి ఆక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తాం

ఇక దర్శకుడు పనిలో పనిగా కోవిడ్ కాలంలో నాటి మెడికల్ మాఫియా కుట్రలను బయటపెట్టే ప్రయత్నం చేసాడు

కానీ కోవిడ్ అని దర్శకుడికి గుర్తు వచ్చినప్పుడే పాత్రల మూతులకు మాస్కులు పెట్టడం , మిగిలిన సమయాల్లో యథేచ్ఛగా రాసుకుపూసుకు తిరగడం వంటి దృశ్యాలు సింక్ అవలేదు
ఇది దర్శకత్వ లోపం అనుకోండి

ఇన్స్పెక్టర్ రాంబాబు పాత్రలో అనురాగ్ కశ్యప్ ను తీసుకోవడం మంచి ఛాయిస్
అతడు ఎంటర్ అయిన తర్వాతనే కధనంలో వేగం పెరుగుతుంది

సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ భారీగా ప్లాన్ చేసి ఆ లోపాలనుంచి ప్రేక్షకుల దృష్టి మరల్చేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు

మొత్తమ్మీద ఈ సినిమా గురించి దర్శకుడు మూడు ఫార్ములాలు ఫాలో అయినట్టున్నాడు

మొదటిది లవ్ స్టోరీ – హరి ..జూలియట్ కథ
రెండోది యాక్షన్ డ్రామా – తనని మోసం చేసిన ప్రియురాలి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం జైలునుంచి పారిపోవడం
మూడోది ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామా – సరస్వతి వేరొకరిని పెళ్లి చేసుకోవడం ..కూతురు ఉండటం .. ఆమె తనని జైలుకు పంపడం వెనుక అసలు కారణాన్ని తెలుసుకోవడం లాంటివి

అయితే ఫార్ములా సరిగానే రాసుకున్నారు కానీ తెరమీదకు వచ్చేసరికి కొన్ని చోట్ల తడబడ్డారు

నిజానికి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే ఈ సినిమాకి క్లైమాక్స్ సన్నివేశం ఒకటి చాలు ఎమోషన్స్ తో ప్రేక్షకుల కర్చీఫులు తడిసిపోవడానికి

చక్కటి సన్నివేశాన్ని హడావుడిగా ముగించడంతో దానికి రావాల్సిన మైలేజ్ రాలేదు

క్లైమాక్స్ చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది

ఎవరెలా చేసారు ?

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి అడవి శేష్ మంచి ఛాయిస్ ..నో డౌట్
అతడి బాడీ లాంగ్వేజ్ అందుకు అనువుగా ఉంటుంది

ఇందులో కూడా జూలియట్ ను ప్రేమించిన హరి పాత్రలోనూ , డెకాయిట్ హరి పాత్రలో యాక్షన్ హీరోగానూ చక్కటి పెర్ఫార్మన్స్ చూపించాడు

అయితే యితడు చేసిన పొరపాటు ఒకటే డబ్బింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం

దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో డైలాగుకు డైలాగుకి మధ్య పదే పదే ముక్కును ఎగబీల్చడం పోకిరీలో మహేష్ బాబును గుర్తుకుతెస్తుంది
అది మినహా అడవి శేష్ నటన బాగుంది

ఇక సరస్వతి అలియాస్ జూలియట్ పాత్రలో మృణాళిని ఠాకూర్ పాత్రకు ప్రాణం పోషించింది

నిజం చెప్పాలంటే కొన్ని సన్నివేశాల్లో ఈమె అడవి శేష్ కంటే బాగా తన హావభావాలను ప్రదర్శించింది
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చక్కటి నటనతో ఆకట్టుకుంది

ఈ సినిమాలో ఇంకో క్యారక్టర్ బలమైన ప్రభావాన్ని చూపించింది
ఆ క్యారక్టర్ ఇన్స్పెక్టర్ రాంబాబు
స్వామీ అంటూ అతడు పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి

ప్రకాష్ రాజ్ నుంచి జనాలు మాములుగా ఎక్స్పెక్ట్ చేయరు
అతడున్నాడంటే చాలు కథని తనతోపాటు లాక్కెళ్లిపోతాడని అనుకుంటారు
కానీ ఎందుకో అలాంటి ప్రకాష్ రాజ్ కూడా ఇందులో అనురాగ్ కశ్యప్ ముందు తేలిపోయాడు
ఒకరకంగా దర్శకుడు ప్రకాష్ రాజ్ ను సరిగా వాడుకోలేదు అనిపిస్తుంది

ఇక సునీల్ విషయానికి వస్తే రకరకాల చిత్రవిచిత్ర ప్రయోగాల జోలికి పోకుండా చక్కగా పాత సునీల్ మాదిరి నటించాడు

సాంకేతికత

ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో బీజీఎమ్ ప్రాణం పోసింది
సందర్బానికి తగినట్టు అతడిచ్చిన బీట్ సినిమాకి ప్లస్ అవుతుంది
పాటలు కూడా బాగున్నాయి

సినిమాటోగ్రఫీ కూడా బాగుంది
కొన్ని సన్నివేశాలకు చక్కటి లొకేషన్లు సెలెక్ట్ చేసుకున్నారు
వాటిని మరింత అందంగా చూపడంలో కెమెరా పనితనం కనపడుతుంది

అన్నపూర్ణ బ్యానర్ ,సుప్రియ యార్లగడ్డ నిర్మాణ సారధ్యం అన్నప్పుడే నిర్మాణ విలువల మీద సహజ అంచనాలు ఉంటాయి
అంచనాలకు తగినట్టే నిర్మాణ విలువలు బాగున్నాయి

విశ్లేషణ

అడవి శేష్ సినిమా అనగానే ఎవరైనా యాక్షన్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తారు.. ఆ విషయంలో అతడు ఎవర్నీ డిజప్పాయింట్ చేయలేదు ..అడవి శేష్ నుంచి మనం ఎటువంటి నటన కోరుకుంటామో అది ఇందులో కనిపిస్తుంది ..కాకపోతే యాస విషయంలో ,డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది ..ఎడిటింగ్ లో లోపాలు కొంత కన్ఫ్యూజన్ సృష్టిస్తాయి ..అడవి శేష్ రాసుకున్న కథ కూడా కొత్తదేమీ కాదు ..గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ..అదే కథను అడవి శేష్ తనదైన శైలిలో రాసుకుని ప్రెజెంట్ చేసాడు ..ఇక సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ,క్లైమాక్స్ సన్నివేశాలు మనల్ని కధనం వెంట పరుగులు పెట్టిస్తుంది ..కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది ..అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమా బోర్ అయితే కొట్టదు

నటీనటులు : అడవి శేష్ ,మృణాళిని ఠాకూర్ , ప్రకాష్ రాజ్ , అనురాగ్ కశ్యప్ ,అతుల్ కులకర్ణి ,సునీల్ తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : ధనుష్ భాస్కర్
కథ ,స్క్రీన్ ప్లే : అడవి శేష్
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం : షానియల్ డియో
విడుదల : 10 -04 -2026
రేటింగ్ : 2 .75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!