Home » ఆపరేషన్ దురంధర్ లక్ష్యం ఏంటి ?

ఆపరేషన్ దురంధర్ లక్ష్యం ఏంటి ?

Spread the love

ఈ మధ్య సోషల్ మీడియాలో దురంధర్ హిందీ మూవీమీద లోతైన చర్చ నడుస్తుంది గమనించారా ?అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి

సినిమా సంగతి ఎలా ఉన్నా ఇందులోని కథ , కథనం , సన్నివేశాలు , డైలాగుల మీద రెండు వర్గాల ప్రో మరియు యాంటీ వాదనలు నడుస్తున్నాయి

గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా , ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా దర్శకుడు సంభాషణలను రాసుకుని కథలో జొప్పించాడని విమర్శలు వస్తున్నాయి

ఉగ్రవాదం అణచివేసే విషయంలో గత ప్రభుత్వం దాయాది దేశంతో కఠినంగా వ్యవహరించ లేకపోయిందనే సంకేతాలు వచ్చే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఒక వర్గం సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

దర్శకుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తే విధంగా భారీ ఎలివేషన్లతో స్క్రీన్ ప్రెజెన్స్ చేసారని వారు మండిపడుతున్నారు

దాంతో హేట్ ట్యాగ్ తో నిరసనలు కూడా చేసారు

మరోపక్క ఈ సినిమాపై రాజకీయ దురుద్దేశాలతోనే  కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ భార్య సోషల్ మీడియా వేదికలలో విమర్శిస్తున్నారు

వాస్తవాలను ఉన్నదున్నట్టుగా చూపించడం తప్పా ? అని ఆమె ప్రశ్నిస్తున్నారు

ఏది ఏమైనా ఉరి , ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలను తీసిన ఆదిత్య ధర్ నుంచి వచ్చిన మరో సినిమా దురంధర్ వివాదాల సుడిగుండంలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది

ఇంతకీ కధేంటి ?

టీజర్ చూడగానే చాలామందికి అర్ధమయ్యే ఉంటుంది

దురంధర్ స్పై జానర్ లో అల్లుకున్న కథ అని

గతంలో జరిగిన కాందహార్ విమానం హైజాక్ , పార్లమెంట్ ఉగ్రదాడుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది

ఆ నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు స్టోరీ అల్లుకున్నాడు . ప్రస్తుతానికి వస్తే దాడుల తర్వాత ఆపరేషన్ దురంధర్ కు శ్రీకారం చుడతాడు ఇండియన్ ఇంటలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ ( మాధవన్ )

ఉగ్రదాడులకు మూలం అయిన పాకిస్తాన్ లోని శత్రు స్థావరాలపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి సమూలంగా తుడిచిపెట్టేయాలన్నది అజయ్ సన్యాల్ ఆలోచన

తన ఆలోచనను ప్రభుత్వం ముందు పెట్టి అందుకు అనుమతులు కూడా తెచ్చుకుంటాడు

ఈ క్రమంలో భారత్ తరపున పాకిస్తాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయడానికి జైల్లో ఉన్న హంజా (రణవీర్ ) ను ఎంచుకుని రహస్యంగా పాకిస్తాన్ పంపుతాడు

పాకిస్తాన్ చేరుకున్న హంజా టెర్రరిస్ట్ స్థావరాలను ఎలా గుర్తిస్తాడు ?

వారి నాయకుడైన రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా ) ని ఎలా ఎదుర్కొంటాడు ?

సీక్రెట్ ఏజెంట్ గా హంజా పాకిస్తాన్ లో చేసిన సాహసకృత్యాలు ఏంటి ? అనేవి మిగిలిన కధనంలో తెలుస్తుంది

ఎలా ఉందంటే ?

స్పై యాక్షన్ థ్రిల్లర్ స్టోరీలకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది

వీరు ప్రత్యేకంగా ఇటువంటి జానర్లో వచ్చిన సినిమాలను మాత్రమే ఇష్టపడతారు

దురంధర్ కూడా ఆ నేపథ్యంలో తీసింది కాబట్టి టీజర్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది

నిజానికి గతంలో  స్పై సినిమాలు చాలా వచ్చాయి

వాటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా

అయితే ఈ జానర్లో ప్రేక్షకులు ట్విస్టులను , థ్రిల్లింగ్ సన్నివేశాలను ఎక్కువగా కోరుకుంటారు

ఆ పరంగా ప్రేక్షకులను కొంత థ్రిల్లింగ్ మోడ్ లోకి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయం సాధించాడు

సినిమా ఉగ్ర నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోతాదుని మించి వయొలెన్స్ చూపించాడు

తప్పదు .. ఆ మాత్రం ‘ఎరుపు’ చూపించకపోతే సన్నివేశాలు పండవు

ఒక్కోసారి ఈ వయొలెన్స్ చూస్తుంటే మనక్కూడా జుగుస్ప కలుగుతుంది

సరే ఈ సంగతి అలా ఉంచితే సినిమాలో ఎక్కడో మారుమూల కొండల్లో , లోయల్లో నిర్వహిస్తున్న ఉగ్ర క్యాంప్ లను చూస్తుంటే దీనివెనుక ఇంత నెట్వర్క్ ఉంటుందా ? అని మనకు ఆశ్చర్యం వేస్తుంది

కొన్ని కొన్ని లొకేషన్లు చూస్తుంటే సినిమా కోసం నిజంగా టెర్రరిస్ట్ స్థావరాలకు పోయి షూటింగ్ చేసారా ? అని అనుమానం కూడా వస్తుంది

ఈ విషయంలో దర్శకుడు మంచి ఎఫర్ట్ పెట్టాడు

విమానం హైజాక్ , పార్లమెంట్ మీద ఉగ్రదాడులతో సినిమా ప్రారంభం అవడంతో ప్రేక్షకులకు యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న కిక్ వస్తుంది

ఆ వెంటనే ఇంటలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ ఎంటరవడం , ఆపరేషన్ దురంధర్ కు శ్రీకారం చుట్టడం చకచకా జరిగిపోతాయి

ఇదంతా అసలు కథలోకి వెళ్ళడానికి ముందు కనిపించే ఇంట్రడక్షన్ సన్నివేశాలు మాత్రమే

అయితే ఇక్కడ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పుకున్నంత వేగంగా సినిమాలో రీళ్లు పరిగెట్టవు

నిడివి ఎక్కువ కాబట్టి ఒక్కో సన్నివేశాన్ని , పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు  ఎక్కువ టైమ్ తీసుకున్నాడు

ద్వితీయార్థంలో హంజా పాకిస్తాన్లో ప్రవేశించి రెహమాన్ నాయకత్వంలో నడుస్తున్న అక్కడి ఉగ్రవాద మూకల్లో రహస్యంగా చేరిన తర్వాత నుంచి అసలు కథలోకి వెళ్తాం

ఈ దశలో మనకు ఎస్పీ చౌహన్ (సంజయ్ దత్ ) అనే కొత్త పాత్ర పరిచయం అవుతుంది

సంజయ్ దత్ ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది

ఎందుకంటే రెహమాన్ ను అంతమొందించడానికి ఎస్పీ చౌహన్ , హంజా కు సాయం చేస్తుంటాడు 

ఇక్కడ్నుంచి ఎత్తుకు పైఎత్తులతో  గేమ్ స్టార్ట్ అవడంతో కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది

కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు చప్పున కెజిఎఫ్ గుర్తుకొస్తుంది

మందుగుండు సామాన్లతో సిగరెట్లు వెలిగించుకోవడం అక్కడనుంచే మొదలైంది కదా

అదలా ఉంచితే ఈ సినిమా చూసేటప్పుడు మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఓపిక 

ఎంత ఓపిగ్గా సినిమా చూస్తే అంత నచ్చుతుంది

మాములు సినిమాల్లో అయితే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రీలు గిర్రున తిప్పితే క్షణంలో అయిపోతుంది

కానీ ఇక్కడలా కాదు

ప్రతి పాత్ర యొక్క పుట్టుపూర్వోత్తరాలు , పుట్టుమచ్చలు అన్నీ వివరంగా చెప్పడంతో సినిమా కాస్తా పది నిముషాలు తక్కువ మూడున్నర గంటలు అయ్యింది

దర్శకుడు కానీ , ఎడిటర్ కానీ రీలు కత్తిరించడానికి  కత్తెరా,బ్లేడులు లాంటివి ఎక్కడా వాడినట్టు లేదు

ఈ సుదీర్ఘ ప్రహసనాన్ని భరించగలిగితే సినిమాలో పెద్ద అభ్యంతరాలు ఏమీ కనిపించవు

పోనీ ప్రేక్షకుల నుంచి టికెట్ డబ్బులూ , మూడున్నర గంటల టైం తీసుకున్నాకైనా ఏదో ఒక ముగింపు చెప్పాడా అంటే అదీ లేదు

రెండో భాగంలో ఇంకో మూడు గంటలు కూర్చుంటే అప్పుడు చెప్తా అంటున్నాడు

OS  2 మాదిరి ఆపరేషన్ కొనసాగుతుంది అనే సందేశంతో మొదటి భాగం పూర్తి చేసారు

ఎవరెలా చేసారంటే ?

ఏ సినిమాలో అయినా ఎవరెలా చేసారంటే ముందు హీరో గురించి చెప్పుకుంటాం

ఆనక మిగిలిన క్యారక్టర్లకు మార్కులు వేస్తాం

కానీ ఈ సినిమాలో గమ్మత్తు ఏంటంటే ముందు విలన్ కి మార్కులు పడి , ఆ తర్వాతనే హీరోకి పడ్డాయి

రెహమాన్ బలోచ్ గా అక్షయ్ ఖన్నా విలనిజం బ్రహ్మాండంగా పండించాడు

డైలాగులు తక్కువ , ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పాత్రకు కిక్ ఇచ్చాయి

దానికి తగ్గట్టుగానే అక్షయ్ హావభావాలు పలికించాడు

ఇప్పుడు హీరో రణవీర్ గురించి చెప్పుకోవాలంటే సీక్రెట్ ఏజెంట్ లుక్ లో బాగానే సూటయ్యాడు

సీక్రెట్ ఏజెంట్ కి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ‘యాక్షన్’ ఎక్కువగానే చేసాడు

అయితే ఇంకా రెండో భాగం కూడా ఉందంటున్నారు కాబట్టి ఆ క్యారక్టర్ అసలు స్వరూపం , ఉద్దేశ్యాలు ఏంటో తెలిసే అవకాశాలు ఉంటాయేమో చూడాలి

హీరో పక్కన గ్లామర్ అమ్మాయి ఒకరుండాలి కాబట్టి సారా అర్జున్ ను పెట్టినట్టున్నారు

పైగా ఆ గ్లామర్ సరిపోదనుకున్నారేమో సినిమాలో ఆమె ఏజ్ తగ్గించి చెప్పారు

ఇంటలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ ను చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అజిత్ దోవల్ గుర్తుకొస్తాడు

అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు విపరీతమైన హైప్ వచ్చింది

గతంలో అజిత్ దోవల్ కూడా పాకిస్తాన్లో సీక్రెట్ ఏజెంట్ ఆపరేషన్స్ చేసాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు

మాధవన్ నటన గంభీరంగా , హుందాగా బావుంది

సంజయ్ దత్ ను చూసినప్పుడల్లా ఇప్పటికీ మనకు ఖళ్ నాయక్ పాత్ర గుర్తుకొస్తుంది

నటుడిగా ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోగలడు

ఎస్పీ చౌహన్ పాత్రలో బాగా చేసాడు

స్పై థ్రిల్లర్ మూవీస్ లో కథ కన్నా కథనం బాగుండాలి

నిడివి ఎక్కువ తీసుకున్నాడు అనే లోపం మినహా దర్శకుడు ఆదిత్యధర్ యాక్షన్ సన్నివేశాలను బాగానే తెరకెక్కించాడు

సాకేతికంగా ఎలా ఉంది ?

ఇలాంటి సినిమాలకి సాంకేతికతే అన్నిటికన్నా ముఖ్యం

అదిరిపోయే బీజీఎమ్ లు ఉండాలి

డార్క్ మోడ్ లో లొకేషన్లు చూపించే అద్భుతమైన ఫోటోగ్రాఫర్లు ఉండాలి

ఆ పరంగా బానే ఉంది

శాశ్వత్ సచ్ దేవ్ సంగీతం బావుంది

ముగింపు : టోటల్ గా నిడివి సమస్య కాదనుకుని మూడు గంటలా ఇరవై నిముషాలు సీట్లలో కూర్చుని చూడగలిగితే సినిమా నచ్చుతుంది

నటీనటులు : రణవీర్ సింగ్ , అక్షయ్ ఖన్నా , సంజయ్ దత్ , మాధవన్ తదితరులు

రచన , దర్శకత్వం : ఆదిత్యధర్

విడుదల : 05 -12 -2025

రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!