Home » దురంధర్ (రివెంజ్ ) మూవీ రివ్యూ

దురంధర్ (రివెంజ్ ) మూవీ రివ్యూ

Spread the love

ఈ మధ్య కాలంలో దురంధర్ సినిమాకి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ మరే సినిమాకీ రాలేదు
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎటు చూసినా దురంధర్ మూవీ గురించిన చర్చలే మార్మోగాయి

చర్చల సంగతి అలా ఉంచితే కలెక్షన్ల సునామీని సృష్టించి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త వైభవానికి నాంది పలికింది

రామ్ గోపాల్ వర్మ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇకపై సినీ పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే దురంధర్ కు ముందు దురంధర్ కు తర్వాత అని చెప్పుకోవాలి అని ప్రశంసల వర్షం కురిపించారు

భాషలకు అతీతంగా దేశంలోని అన్ని ఉడ్ లు దురంధర్ విజయాన్ని ప్రశంసించాయి
సినిమాలో సత్తా, దమ్ము ఉంటే నిడివి సమస్య కానే కాదని దురంధర్ నిరూపించింది

దురంధర్ మేనియా దేశమంతటా వ్యాపించిన తరుణంలోనే మొదటి భాగానికి కొనసాగింపుగా ఇప్పుడు దురంధర్ రివెంజ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది

మరి ఈ రివెంజ్ కూడా మొదటి భాగం స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందా ?

షుమారు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ మూవీ చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగిందా ?

అసలు ఈ రివెంజ్ లో హింస ఏ స్థాయిలో ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

కథా పరిచయం

రెండో భాగం చూడాలనుకునేవారు మొదటి భాగం చూస్తే కథ తేలిగ్గా అర్థమౌతుంది

మొదటి భాగంలో ఇండియాలో మారణహోమం సృష్టిస్తున్న పాక్ టెర్రరిస్టులను ఎరివేసే ఆపరేషన్ దురంధర్ లో భాగంగా హంజా (రణవీర్ సింగ్) అనే ఖైదీని భారత ఇంటిలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ ( మాధవన్) సీక్రెట్ ఏజెంట్ గా పాకిస్తాన్ పంపిస్తాడు

పాకిస్థాన్ వెళ్లిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ హంజా టెర్రరిస్టుల్లో కలిసిపోయి బలోచ్ తెగకు చెందిన నాయకుడు రెహమాన్ డెకాయిత్ కు ముఖ్య అనుచరుడిగా మారతాడు

అక్కడ్నుంచి వాళ్ళ రహస్యాలను ఇండియాకు చేరవేస్తుంటాడు

మొదటి భాగమంతా టెర్రరిస్ట్ స్థావరాలను కనుక్కోవడం, వారిలో నమ్మకాన్ని కలిగించడం, స్పై ఆపరేషన్లు నిర్వహించడం వంటి చాప్టర్లు ఉంటాయి

ఇక రెండో భాగంలో భారత్ కు అన్యాయం చేస్తున్న ఉగ్ర మూకల మీద ప్రతీకారం తీర్చుకునే చాప్టర్లు ఉంటాయి

రెండో భాగం – దురంధర్ రివెంజ్ కథ

ఇందులో మొత్తం ఆరు చాప్టర్లు ఉంటాయి
రెండో భాగం మొదటి చాప్టర్ రివెంజ్ తో మొదలౌతుంది

తన కుటుంబానికి అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే పై జస్కరత్ సింగ్ ( రణవీర్ సింగ్) ప్రతీకారం తీర్చుకోవడం కోసం తుపాకీ చేతబట్టి వారిలో పన్నెండు మందిని కాల్చి చంపుతాడు

ఈ నేరానికి గానూ అతడికి ఉరి శిక్ష పడుతుంది
ఈ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని అప్పీల్ కు వెళ్తారు

ఈ పరిస్థితుల్లో జస్కరత్ సింగ్ ను ఇంటలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ పోలీసుల చెర నుంచి తప్పించి ఇండియాలో మారణహోమం సృష్టిస్తున్న టెర్రరిస్టులను ఏరివేయడానికి పాక్ వెళ్లడానికి ఒప్పిస్తాడు

ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా పాక్ లో అడుగుపెట్టిన జస్కరత్ సింగ్ అలియాస్ హంజా ముందుగా రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) ను చంపేస్తాడు

తన మీద అనుమానం రాకుండా రెహమాన్ తమ్ముడ్ని నమ్మించి అతడ్ని దుబాయ్ పంపించి రెహమాన్ కుర్చీలో కూర్చుంటాడు

బలోచ్ తెగ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుని శత్రువులతో మైండ్ గేమ్ ఆడటం మొదలు పెడతాడు

బలోచ్ తెగకు నాయకత్వం వహించిన హంజా శత్రువులను ఏరివేయడానికి ఎటువంటి ఎత్తులు వేస్తాడు?

రెహమాన్ డెకాయిత్ కు వర్గ శత్రువైన అర్షద్ పప్పు అడ్డు ఎలా తొలగించుకుంటాడు ?

తన మీద అనుమాన పడిన ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) కు ఎలా చెక్ పెడతాడు?

భారత పార్లమెంట్, ముంబై దాడుల్లో పాల్గొన్న టెర్రరిస్టులను ఏ విధంగా మట్టుపెడతాడు? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది

ఎలా ఉంది?

మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో హింస ఎక్కువగా ఉంటుంది

రెండో భాగంలో మొదటి చాప్టర్ ప్రారంభమే జస్కరత్ సింగ్ టపాకాయలు కాల్చడంతో మొదలౌతుంది ( టపాకాయలు కాల్చడం అంటే దీపావళి టపాకాయలు అనుకునేరు.. ఏకే 47 లే)

అలా ఓ అర్థగంట పాటు అక్కడున్న అన్ని గన్నుల్లో మొత్తం బుల్లెట్లు అయిపోయేదాకా యధేచ్ఛగా కాలుస్తాడు
ఇది మొదటి భాగానికి లీడ్ అన్నమాట

ఆ తర్వాత అజయ్ సన్యాల్ ఇతడ్ని పాక్ పంపడంతో కాసేపు టపాకాయలు కాల్చడానికి విరామం వచ్చింది

ఈ గ్యాప్ లో హంజా ఆడే మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది

రెహమాన్ కుర్చీని ఇతడు అక్రమించుకోవడం , పాక్ పీఎం షరీఫ్ తో చేతులు కలపడం, మేజర్ ఇక్బాల్ దగ్గర నమ్మకం సంపాదించి బడే సాబ్ అనబడే దావూద్ ఇబ్రహీం ను కలవడం , ఇండియాకి ఫేక్ కరెన్సీ తరలిస్తున్నారని తెలుసుకుని అజయ్ సన్యాల్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వంటి సన్నివేశాలతో కథ ఊపు అందుకుంటుంది

ముఖ్యంగా ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా వెతుకుతున్న దావూద్ ఇబ్రహీం ను అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నట్టు చూపించిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఇంట్రెస్టింగ్ కలుగచేస్తాయి

ఫేక్ కరెన్సీ ఇండియాకి తరలించడానికి పాక్ టెర్రరిస్టులు పన్నిన పన్నాగాన్ని చేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ టీవీల్లో డీ మానిటైజేషన్ ప్రకటన చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నప్పుడు థియేటర్లలో ఈలలు మారుమోగాయి

కథనం మొత్తం సీరియస్ గా సాగితే బోర్ కొడుతుంది అనుకున్నారేమో మధ్యలో జమీల్ జమాలీ చేత కొంత కామెడీ ట్రాక్ నడిపించే ప్రయత్నం చేశారు

ఇక సెకండాఫ్ వచ్చేసరికి మళ్ళీ టపాకాయలు కాల్చడం మొదలౌతుంది
ఈసారి ఈ నిడివి మరింత ఎక్కువగా ఉంటుంది

తుపాకులు, బాంబుల మోతలతో డాల్బీ సైతం అదురుతుంది
అదే పనిగా మరీ అన్నన్ని టపాకాయలు కాల్చటంతో కొద్దిగా బోర్ గా కూడా అనిపిస్తుంది

ఓవరాల్ గా రివెంజ్ లో హంజా శత్రువులతో మైండ్ గేమ్ ఆడే ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు బాగుంటాయి

అజయ్ సన్యాల్ పాక్ isi చీఫ్ కు ఫోన్ చేసి మా కుర్రాడ్ని వదిలేయకపోతే? అంటూ కూల్ గా వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఉత్కంఠత కలిగిస్తుంది

ఇండియన్ ఏజెంట్ ను పట్టుకున్నట్టు isi కి తెలిసిపోయింది.. మరి వాళ్ళకి నేను ఎవర్ని చూపించాలి అని అక్కడి చీఫ్ అన్నప్పుడు హంజా ఇచ్చే సమాధానం ఈలలు వేయిస్తుంది

అలాగే అజయ్ సన్యాల్ జస్కరత్ సింగ్ తో మాట్లాడుతూ ఒకవేళ నువ్వు శత్రువుల నుంచి తప్పించుకుని పాక్ బోర్డర్ దాటి ఇండియాకు రావాలంటే ఒక వ్యక్తి నీకు సాయం చేస్తాడు అని చెప్తాడు

ఆ వ్యక్తి ఎవరనేది క్లైమాక్సులో చూసి చాలామంది థ్రిల్ అవుతారు
మూవీలో ఊహించని మేజర్ ట్విస్ట్ అదే

ఆ వ్యక్తి ఎవరనేది రివ్యూలో చెప్పేకంటే మూవీలో చూస్తేనే థ్రిల్ అవుతారు

ఏతావాతా సెకండాఫ్ లో టపాకాయలు కాల్చటం తగ్గించి , కొంత ఎడిటింగ్ కి పని చెప్పి ఉంటే మూవీ మూడు గంటల్లోనే అయిపోయేదేమో అనిపిస్తుంది

అయినా ఆశ్చర్యం ఏంటంటే ప్రేక్షకులు ఓపిగ్గా నాలుగు గంటలు పాటు సీట్లలోనుంచి కదలకుండా చూడటం

ఈ క్రెడిట్స్ అంతా దర్శకుడు ఆదిత్య ధర్ కు దక్కుతుంది
పటిష్టమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను థియేటర్లలో నాలుగు గంటల పాటు కూర్చోబెట్టాడు

ఎవరెలా చేశారు?

దురంధర్ మూవీ రెండు భాగాలను రణవీర్ సింగ్ తన భుజాన వేసుకుని నడిపించాడు
ఈ మూవీకి వన్ మ్యాన్ ఆర్మీ రణవీర్ సింగ్ అవుతాడు

సినిమాలో అతడి పాత్ర ఏ కాస్త పక్కకు జరిగినా ప్రేక్షకులు రణవీర్ కోసం మాత్రమే ఎదురుచూసేలా నటించాడు
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రణవీర్ విశ్వ రూపం చూపించాడు

రెహమాన్ డెకాయిత్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా నటన బాగానే ఉంది
కానీ పాత్రకు అతడి ఆహార్యం కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తుంది
బలిష్టమైన మనుషుల మధ్య బక్క పల్చగా కనపడుతూ అక్షయ్ తేలిపోయాడు
దానికి తోడు ఎప్పుడు కనిపించినా ఒకే రకమైన ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం మైనస్ అవుతుంది

ఇక ఎస్పీ అస్లాం చౌదరి పాత్రలో సంజయ్ దత్ నటన కూడా పర్లేదు
కానీ సినిమా మొత్తానికి ఒక్క మెడల్ తీసుకున్నప్పుడు మినహా ఇతడు యూనిఫాం వేసుకోడు
పాక్ కు తానే సర్వ సైన్యాధ్యక్షుడు అన్నట్టుగా ఉంటాడు
ఇతడు నటించడం కన్నా సిగరెట్లు తాగటానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు

మేజర్ ఇక్బాల్ గా నటించిన అర్జున్ రామ్ పాల్ నటన బాగుంది

జమీల్ జమాల్ పాత్ర పోషించిన రాకేష్ బేడీ నటన బాగుంది
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది

సాంకేతికత

ఈ మూవీకి ప్రాణం పోసిన వాటిలో బిజీఎం మొదటి వరుసలో ఉంటుంది
పాక్ టెర్రరిస్టులతో తలపడే యుద్ధ సన్నివేశాల్లో బిజీఎం అత్యుత్తమ పాత్ర పోషించింది

దాని తర్వాత స్థానాన్ని సినిమాటోగ్రఫీ ఆక్రమిస్తుంది
ల్యారీ పట్టణాన్ని చూస్తుంటే నిజంగా షూటింగ్ పాకిస్తాన్ లో తీసారా? అనిపిస్తుంది
అంత సహజంగా కొన్ని లొకేషన్లు కళ్ళకు కట్టినట్లు చూపించారు

సహజత్వం ఉట్టిపడేలా సెట్టింగులు వేసిన కళా దర్శకుడికి కూడా మంచి మార్కులు పడతాయి

నాలుగు గంటల నిడివి అయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగేలా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ అభినందనీయుడు

విశ్లేషణ

స్పై థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి దురంధర్ నచ్చుతుంది.. అయితే స్పై థ్రిల్లర్ కథాంశం తో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి.. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం , అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలు కూడా దాదాపు ఇలాంటి నేపథ్యంలో రూపు దిద్దుకున్నవే.. కానీ గత సినిమాలు వేటికీ రాని హైప్ దురంధర్ కి వచ్చింది.. ఇది కేవలం సోషల్ మీడియా హైప్ అనుకుందామా అంటే బద్దలు కొడుతున్న కలెక్షన్ల రికార్డులు అసలు వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.. హింసాత్మక సన్నివేశాలు, నిడివిని భరించగలిగితే దురంధర్ మూవీ ఒక ఫ్లో లో సాగిపోతుంది

నటీనటులు: రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్ , మాధవన్ తదితరులు
నేపథ్య సంగీతం: సచ్ దేవ్
సినిమాటోగ్రఫీ : వికాస్ నౌలఖా
రచన, దర్శకత్వం: ఆదిత్య ధర్
విడుదల: 19-03-2026
రేటింగ్: 3.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!