మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి విముక్తి లభించనుంది!

Spread the love

ఇన్సులిన్ ఇంజెక్షన్లకు వీడ్కోలు
త్వరలో అందుబాటులోకి ఇన్సులిన్ ఇన్హేలర్లు
ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు
మధుమేహ చికిత్సల్లో ఆధునిక ఆవిష్కరణలపై చర్చించేందుకు డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు
యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కార్యక్రమం
సదస్సుకు హాజరుకానున్న వివిధ రాష్ట్రాల వైద్య ప్రముఖులు.. 500 మంది ప్రతినిధులు
డాక్టర్ అమర్ పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం

విజయవాడ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి విముక్తి లభించనుంది.

ఇన్సులిన్‌ను సులభంగా తీసుకునేందుకు వీలుగా ఇన్సులిన్ ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (వైడీఆర్ఎఫ్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు.

మధుమేహ చికిత్సలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణలు, నవీన చికిత్సా విధానాలపై చర్చించేందుకు వైడీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సదస్సు ఆగస్టు 24న లబ్బీపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని ఆరిజన్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ సదాశివరావు సదస్సు వివరాలను తెలియజేశారు.

ఈ జాతీయ స్థాయి సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వైద్య ప్రముఖులు, 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని డాక్టర్ సదాశివరావు తెలిపారు.

ఆధునిక వైద్య చికిత్సలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది డాక్టర్ అమర్ పాల్ సింగ్‌కు గోల్డ్ మెడల్ ప్రదానం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ’ ప్రస్తుతం మధుమేహ నియంత్రణలో శరీర బరువు నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. బరువును క్రమబద్ధీకరించడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని వివరించారు.

కొత్తగా వచ్చిన ఇంజెక్షన్లతో స్వల్ప వ్యవధిలో 20 శాతం వరకు బరువు తగ్గించుకోవచ్చని తెలిపారు.

ప్రజలు మధుమేహం గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక చికిత్సలతో రోగుల ఆయుర్ధాయాన్ని పెంచవచ్చని, సాధారణ మనుషుల్లా జీవించేలా చేయవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక ఆవిష్కరణల గురించి వైద్యులకు జ్ఞానాన్ని అందించే అద్భుతమైన వేదికగా ఎండో డయాబ్ కాన్ 2025 సదస్సు నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుంచి రెండు సీఎంఈ క్రెడిట్ పాయింట్లు కూడా లభించాయని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైడీఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమన యలమంచి, సెక్రటరీ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ అమూల్య యలమంచి డయాబ్ ఎండో కాన్ 2025 బ్రోచర్లను ఆవిష్కరించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!