1980 లలో చాలామందికి ఎన్కౌంటర్ మ్యాగజైన్ గురించి తెలిసే ఉంటుంది.. ఆ పత్రిక వ్యవస్థాపకుడు 23 ఏళ్ల యువకుడు పింగళి దశరథ రామ్.. విజయవాడ సత్యనారాయణ పురంలోని తన ఇంటినుంచే వంద కాపీలతో ఎన్కౌంటర్ మ్యాగజైన్ ప్రారంభించాడు.. అనతి కాలంలోనే మ్యాగజైన్ ఐదు లక్షల సర్కులేషన్ కు చేరుకుంది.. ఇందుకు కారణం పింగళి దశరథ రామ్ తన పదునైన కలంతో రాజకీయ నాయకుల చీకటి భాగోతాలను వెలికి తీయడమే!
అప్పట్లో పింగళి దశరథ రామ్ మ్యాగజైన్ చూస్తే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టేవి..ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులను ఏకి పారేసే వాడు.. దాంతో పింగళి దశరథ రామ్ కు శత్రువులు పెరిగిపోయారు.. ఏ క్షణాన ఎవరు దాడి చేస్తారో తెలీదు.. అయినా భయపడకుండా పత్రికను నడిపారు
ఈ సందర్భంగా దశరథ రామ్ తో నా అనుభవం ఒకటి చెప్తాను.. విజయవాడ కాలేజీ విద్యార్ధి సంఘంలో ఉన్న నేను మా కాలేజీ ఫంక్షన్ కు గెస్టుగా పిలుద్దామని తోటి విద్యార్ధులతో కలిసి పింగళి దశరథ రామ్ ను ఆయన ఇంటిలో కలిసి విషయం చెప్పాం.. గుబురు గడ్డం.. చురుకైన కళ్ళు.. చూడగానే టి కృష్ణ సినిమాలో హీరోలా ఉన్నారు
మేము విషయం చెప్పగానే పెద్దగా నవ్వి నన్ను పిలిస్తే ఏమొస్తుంది తమ్ముడు? ఏ మినిస్టర్నో పిలవండి.. వాడు స్పీచ్ ఇచ్చేటప్పుడు పది సార్లు చప్పట్లు కొట్టండి.. అదే వేదిక మీద మీ కాలేజీ డెవలప్మెంట్ కు ఏం కావాలో అడగండి.. చచ్చినట్టు చేస్తాడు.. ఒకవేళ చేయలేదనుకో.. నేనున్నాను కదా ఎన్కౌంటర్ చేసి పడేస్తాను ” అని రావడానికి సున్నితంగా తిరస్కరించారు
నిజానికి ఎన్కౌంటర్ మ్యాగజైన్ జర్నలిస్టుగా పింగళి దశరథ రామ్ అప్పటికే పాఠకుల్లో బాగా పాపులారిటీ సంపాదించారు.. అయినా నేటి కొంతమంది ఎర్నలిస్టుల మాదిరి ఏ రాజకీయ పార్టీ పాదాల కిందో తాకట్టు పెట్టి అమ్ముడుపోలేదు .. అలా అమ్ముడుపోయి ఉంటే దశరథ రామ్ కథ వేరేలా ఉండేది ..29 సంవత్సరాలకే కన్ను మూసేవాడు కాదు
1985 అక్టోబర్ 21 వ తేదీ రాత్రి రిక్షాలో సత్యనారాయణ పురంలోని తన ఇంటికి వెళ్తుండగా గిరి వీథిలో దుండగులు దారి కాచి పింగళి దశరథ రామ్ ను హత్య చేశారు.. దాంతో ఒక కలం వీరుడు నేలకు ఒరిగాడు
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రిక్షాలో పింగళి దశరథ రామ్ ను దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.. కొన ఊపిరితో ఉన్న దశరథ రామ్ ను హస్పిటల్ కు తరలించడంలో ఆలస్యం అవడం వల్లనే పింగళి దశరథ రామ్ మరణించాడని అప్పట్లోనే ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు
దశరథ రామ్ మరణానంతరం ఆయన భార్య కొన్నాళ్ళు ఎన్కౌంటర్ పత్రిక నడిపినప్పటికీ ఆర్ధిక వనరుల లేమితో ఆపేశారు.. దశరథ రామ్ కు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు
విత్తనం ఒకటైతే చెట్టు మరోటి అవుతుందా అన్న చందాన పింగళి దశరథ రామ్ కూతురు పింగళి చైతన్య మ్యాగజైన్స్ కు బోలెడు ఆర్టికల్స్ రాసి రచయిత్రిగా పేరు సంపాదించుకుంది .. చైతన్య రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకానికి 2016 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రధానం చేసింది
దర్శకుడు శేఖర్ కమ్ముల ద్వారా పింగళి చైతన్య సినీ రంగంలోకి కూడా ప్రవేశించారు.. ఈమె కో రైటర్ గా పనిచేసిన ఫిదా సినిమా హిట్ అయ్యింది.. అందులోనే చైతన్య రాసిన రెండు పాటలు కూడా హిట్ అయ్యాయి.. అవే కాదు నేల టికెట్.. మసూద వంటి సినిమాలకు కూడా పాటలు రాసింది
తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున.. ధనుష్ నటించిన కుబేర సినిమాకి కో రైటర్ గా పని చేసి మంచి పేరు తెచ్చుకుంది!
అన్నట్టు పింగళి దశరథ రామ్ ఎవరో కాదు మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి మనవడు!!
పరేష్ తుర్లపాటి ✍️