సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అధికారిక బంగ్లా ఖాళీ చేయకపోవడం వెనుక హృదయాలను పిండేసే కన్నీటి గాథ ఉంది !
2024 నవంబర్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేసారు
సాధారణంగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు అధికారిక బంగ్లా ఖాళీ చేసి ప్రభుత్వానికి స్వాధీనపరచాల్సి ఉంటుంది
ప్రత్యేక కారణాలు ఉంటే ఖాళీ చేసే గడువు 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు
అయితే 6 నెలల గడువు ముగిసినా కూడా మాజీ సీజేఐ ఢిల్లీలోని కృష్ణ మార్గ్ లో ఉంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఆయన్ని ఖాళీ చేయించాల్సిందిగా ఈమధ్య సుప్రీం కోర్ట్ కేంద్రానికి ఘాటు లేఖ రాసింది
ఏడాది క్రితం వరకు అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత ధర్మాసనంలో కూర్చుని తీర్పులు ఇచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఇల్లు ఖాళీ చేయాలని అదే సుప్రీం కోర్ట్ నుంచి కేంద్రానికి లేఖ వెళ్లడం గమనార్హం
పదవీ విరమణ చేసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రోల్ అయ్యారు
ఇతరులకు చెప్పేందుకే నీతులు అని .. తమవరకు వచ్చేసరికి అన్నీ ఫ్రీగా కావాలని మాజీ సిజెఐ మీద నెటిజన్లు విమర్శించారు
అయితే తాను బంగ్లా ఖాళీ చేయకపోవడం వెనుక అసలు కారణాన్ని ఆయన ఇప్పుడు బయటపెట్టారు
జస్టిస్ చంద్ర చూడ్ కు ఇద్దరు ఆడపిల్లలు .. ఇద్దరికీ చిన్నతనంలోనే అనుకోని అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి ( కండరాల వ్యాధి ) వచ్చింది
ప్రస్తుతానికి ఈ వ్యాధికి దేశ విదేశాల్లో కూడా ట్రీట్మెంట్ లేదు
ఈ వ్యాధి వల్ల పిల్లలు సరిగా మాట్లాడే పరిస్థితి ఉండదు .. ఆహరం తీసుకోవడంలోనూ .. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఉంటాయి
అందుకని పిల్లలకు ఇంట్లోనే శ్వాసకోశ , నరాల సంబంధిత నిపుణులచే ధెరపీ ఇప్పిస్తున్నట్టు ఆయన చెప్పారు
తమ దంపతులకు పిల్లలే ప్రపంచం అనీ అందుకే వాళ్ళిద్దరి ఆరోగ్యం కోసం చేయని ప్రయత్నాలు అంటూ లేదని చెప్పారు
ఇప్పుడుంటున్న బంగ్లాలో కూడా సొంత ఖర్చులతో పిల్లల ఆరోగ్య చికిత్సకు అవసరమైన మినీ ఐసియు ,ఇతర ఎమర్జెన్సీ వైద్య పరికరాలను అందుబాటులో ఉంచామని అన్నారు
అందుకే పిల్లల ఆరోగ్య చికిత్సలకు అనువుగా కిరాయి ఇంటిలో ఏర్పాట్లు చేసేసరికి బంగ్లా ఖాళీ చేయడం ఆలస్యం అయిందనీ .. రేపో మాపో ఈ బంగ్లా ఖాళీ చేసి కిరాయి ఇంటికి వెళ్లిపోతామని .. అందుకు తగ్గట్టుగా మా సామాన్లు కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నామని ఆయన బాధాతప్త హృదయంతో చెప్పారు
అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రస్తుతం మాజీ సిజెఐ కుటుంబం మీద సానుభూతి చూపిస్తున్నారు
జస్టిస్ చంద్ర చూడ్ బంగ్లా ఖాళీ చేయకపోవడం వెనుక హృదయాలను పిండేసే గాథ ఉందని బయటికి రావడంతో కొంతమంది కంట తడి పెడుతున్నారు !
పరేష్ తుర్లపాటి