“సన్యాసం స్వీకరించి తమిళనాడులోని కుర్తాళం పీఠాధిపతి గా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నా “
పీవీ నరసింహారావు గారి నోటివెంట అకస్మాత్తుగా వెలువడిన ఆ వాక్యం విని ఉలిక్కిపడ్డాడు ఆయన ఆంతరంగికుడు !
అపర చాణుక్యుడిగా పేరుపడ్డ పీవీ నోటివెంట రాజకీయల్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించాలనే నిర్ణయం ఆయన ఊహించలేదు
దేశానికి మీ సేవలు అవసరం కాబట్టి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని చెప్పాలనుకున్నాడు..కానీ గొంతుదాటి మాట బయటకు రాలేదు
ఆయనకు చెప్పేంత స్థాయి కానీ అర్హత కానీ తనకు లేదనుకుని ఆగిపోయాడు
ఆనాటి పరిస్థితుల్లో పీవీ లాంటి మేధావి దేశ రాజకీయాలకు అవసరం అని మనసులోనే అనుకున్నాడు
కానీ ఈ విషయం పీవీకి చెప్పేదెలా ?
సరిగ్గా అప్పుడు జరిగింది అద్భుతం !
దేశ ప్రధానిగా పీవీ కి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆయన చెవిన పడింది
దేశం అప్పుడున్న పరిస్థితుల్లో పీవీ గారు అయితేనే గాడిన పెట్టగలరని అందరూ భావించారు
పార్టీ వత్తిడితో పీవీ గారు 1991 జూన్ లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించకతప్పలేదు
ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే పీవీ గారు ముందు చేసిన పని ఆర్థిక పరిస్థితి సమీక్షించటం
కానీ అప్పటి మన దేశ ఆర్థిక పరిస్థితి ఇంచుమించు ఇప్పటి శ్రీలంక పరిస్థితిలా ఉంది
ఆర్థిక కార్యదర్శిని తన ఛాంబర్ కు పిలిపించుకుని ఆర్థిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు
దేశంలో అత్యవసర దిగుమతులకు కేవలం వారానికి సరిపడా మాత్రమే డాలర్లు నిల్వ ఉన్నాయి
ఇంకో వారం దాటితే చేతులు ఎత్తేసే పరిస్థితి !
చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకులో ఉన్న 47 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ బ్యాంకులో తాకట్టు పెట్టి 600 మిలియన్ల దాలర్లని అప్పు తెచ్చుకుంది
నిజానికి ఈ బంగారం తరలింపు కార్యక్రమం కూడా రహస్యంగా ప్లాన్ చేసింది అప్పటి ప్రభుత్వం
అయితే బంగారాన్ని తరలిస్తున్న వ్యాన్ టైర్ బరస్ట్ అవటంతో విషయం బయటికి పొక్కి అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది
ఇదీ అప్పటి ఆర్థిక పరిస్థితి గురించి పీవీ గారికి కార్యదర్శి చెప్పిన వివరాలు
అంతా విన్న ప్రధాని పీవీ మౌనంగా పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి కారిడార్ లో నడుస్తూ అకస్మాత్తుగా ‘ వెంటనే మన్మోహన్ సింగ్ గారిని పిలుచుకురండి ‘ అని సహాయకుడికి పురమయించారు
అప్పటికే ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పార్లమెంట్ భవనంలోనే ఉన్న మన్మోహన్ ప్రధాని పిలుపుకు ఆశర్యపడుతూ ఆయన దగ్గరికి వచ్చారు
మన్మోహన్ ను చూడగానే పీవీ అడిగిన మొట్టమొదటి మాట ,
“మన్మోహన్ జీ ! మిమ్మల్ని ఆర్థిక మంత్రిగా నియమించాలనుకుంటున్నా..మీకు సమ్మతమేనా ?” అని అడిగారు
పీవీ గారి నుంచి ఆ ప్రశ్నను ఊహించని మన్మోహన్ సింగ్ ఆశర్యపోయారు
“సర్ ! నేను ఆర్థిక విషయాల్లో సలహాలను ఇవ్వగలవాడనే కానీ రాజకీయాల్లో అస్సలు ఇమడలేను..మన్నించండి జీ ” అని వినమ్రంగా చెప్పారు
అంతా విన్న పీవీ ఒకటే చెప్పారు ,
” మన్మోహన్ జీ ! ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం తక్షణమే కొన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది .. ఈ ప్రక్రియలో విమర్శలు ఎదురైతే అవి పూర్తిగా నేను భరించటానికి సిద్ధంగా ఉన్నా..దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ధేందుకు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అయినా పూర్తి స్వేచ్చ ఇస్తున్నా.. కాదనకండి !”
పీవీ మాటలతో మన్మోహన్ చలించిపోయారు
దేశం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ముగ్దుడయ్యాడు
ఆ క్షణమే దేశ ఆర్డిక పరిస్థితి చక్కదిద్దటానికి రంగం సిద్ధం అయ్యింది
ఒక రాజనీతిజ్ఞుడు.. మరొక ఆర్థిక వేత్త కలిసి మెల్లిగా ఒకటొకటే చిక్కుముడులు విప్పుకుంటూ వారానికి సరిపడా మాత్రమే ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను రెండేళ్లకు సరిపడా పెంచగలిగారు
మనకు శ్రీలంక లాంటి ఆర్డిక సంక్షోభం రాకుండా ఆ రోజు ఇద్దరు మహానుభావులు చేసిన కృషి భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకుంటాయి
ఈరోజు మాజీ ప్రధాని .. భారత దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహా రావు గారి జయంతి !
పరేష్ తుర్లపాటి