“ఈ పోలీసులకు పనీపాటా ఉండదు.. ఎప్పుడు పడితే అప్పుడు చలాన్ల కోసం రోడ్డుమీద బీట్ కొడుతుంటారు.. చూడండి.. ఈ టైమ్ లో ట్రాఫిక్ ఉంటుందని తెలుసు.. ఇప్పుడు చలాన్లు రాయడం అవసరమా?” ఓ బైక్ వాలా విసుక్కుంటున్నాడు
మొన్న రాత్రి ఏడు గంటల సమయంలో నేను బోడుప్పల్ వైపునుంచి కారులో వస్తుంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది
పక్కన ఎవడో బైక్ వాలా పోలీసుల మీద విసుక్కుంటూ అరుస్తున్నాడు
ట్రాఫిక్ స్లోగా ముందుకు కదులుతుంది
అవునూ.. బిజీ ట్రాఫిక్ వేళల్లో ఈ చలాన్లు రాయడం అవసరమా? అని నాకూ విసుగొచ్చింది
పోలీసుల మీద కోపం కూడా వచ్చింది
కొద్దిగా ముందుకు వెళ్ళాక రోడ్ సైడ్ కనిపించిన ఫ్లెక్సీ చూసిన తర్వాత అసలు విషయం తెలిసి పోలీసుల మీద గౌరవం ఏర్పడింది
ఆ ఫ్లెక్సీ మీద ఇలా రాసి ఉంది
మీకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం..డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి.. దయచేసి సహకరించండి
హైదరాబాద్ పోలీస్
అక్కడ రోడ్ మీద ఒక బారికేడ్ అడ్డుగా పెట్టి అనుమానం వచ్చిన ప్రతి ఒక్క వాహనదారుని ఆల్కహాల్ ఎనలైజర్ మెషిన్ తో పరీక్షలు చేస్తున్నారు
చాలామంది పోలీసులు ఉన్నారు
ఏ ఒక్కడి తప్పు వల్లో అమాయక ప్రాణాలు బలి కాకూడదని బాధ్యత తీసుకుని అంతమంది పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు
కారులోనుంచి చూసిన నేను పోలీసులకు మనసులోనే అభినందనలు తెలుపుకున్నాను
ఎందుకంటే కొన్నేళ్ల క్రితం హైదరాబాదులో తాగి కార్ డ్రైవ్ చేసిన ఒక తాగుబోతు వల్ల ఎదురుగా ఇంకో కారులో వస్తున్న అన్నెంపున్నెం ఎరుగని ఎనిమిదేళ్ల పాప చనిపోయింది..గుర్తుందా?
చాలామంది మర్చిపోయి ఉంటారు
కానీ ఆ పాప కుటుంబం మాత్రం ఆ భయంకరమైన దుర్ఘటనను నేటికీ మర్చిపోయి ఉండదు
అలాగే జూబ్లీ హిల్స్ పబ్ లో పార్టీకి వచ్చిన ఓ మైనర్ బాలిక మీద ఐదుగురు మైనర్ బాలురు అత్యాచారం చేసిన సంఘటన గుర్తుందా?
ఉన్నత స్థానాల్లో ఉన్న బాగా పలుకుబడి గల కుటుంబాలకు చెందిన పిల్లలు కాబట్టి ఆ కేసు ఏమైందో తెలీదు?
చాలామంది మర్చిపోయారు
కానీ ఆ పిల్ల ఆ సంఘటనను తల్చుకుని ఇప్పటికీ భయంతో వణికిపోతూ ఉంటుంది
ఆ దుర్ఘటనలు గుర్తున్నవారు మాత్రం పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మెచ్చుకోకుండా ఉండలేరు
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం వల్ల జరిగే రెండు నిమిషాల ఆలస్యాన్ని చాలామంది తట్టుకోలేరు
వారి తనిఖీ ల వల్ల ఎన్ని ప్రాణాలు నిలబడతాయో అనేది వాళ్లకు అక్కర్లేదు
హైదరాబాద్ సీపీ సజ్జనార్ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఇకపై తమ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తాగుబోతులను హెచ్చరించారు
అలాగే కఠినంగా ఉంటున్నారు కూడా
సరే ఇప్పుడు పోలీసులు చేస్తున్న ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లకూ , యుఫోరియా సినిమాకి లింకేంటి అంటారా ?
ఆ లింక్ ఏమిటో తెలియాలంటే ఈ మూవీ చూడాలి
ఇదే విషయాలను జనం మర్చిపోకుండా , మైనర్ల విషయంలో తల్లితండ్రుల బాధ్యత గుర్తు చేస్తూ దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా అనే సినిమా తీశారు
ఫిబ్రవరిలో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది
ఈ సినిమా చూసి కొంతమంది తల్లితండ్రులలో అయినా మార్పు వస్తే సినిమా లక్ష్యం నెరవేరినట్టే
యుఫోరియా కథేంటంటే?
చైత్ర (సారా అర్జున్) తల్లి తండ్రుల గారాల పుత్రిక
ఓరోజు తన స్నేహితురాలు పబ్ లో బర్త్ డే పార్టీకి పిలిస్తే తల్లితండ్రుల అనుమతితో వెళ్తుంది
అక్కడ స్నేహితురాలి ద్వారా పరిచయం అయిన వికాస్ ( విఘ్నేష్) అండ్ అతడి నలుగురు స్నేహితులు చైత్ర మీద కన్నేస్తారు
కారులో బయటకు వెళ్దామని ఆమెను నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తారు
తనకు జరిగిన అన్యాయం తల్లితండ్రులకు చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని ధైర్యంగా అంటుంది
ఈ కేసును పోలీస్ కమిషనర్ జయదేవ్ ( గౌతమ మీనన్) టేకప్ చేస్తాడు
ఆ ఐదుగురు పిల్లలు వీఐపీ కొడుకులు అని తెలుసుకుంటాడు
అయినా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఐదుగురు పిల్లలను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు
ఇదిలా ఉండగా ఆ పిల్లల్లో ఒకడైన వికాస్ తల్లి వేములపల్లి వింధ్య ( భూమిక) వికాస్ స్కూల్స్ డైరెక్టర్ హోదాలో ఉంటుంది
కొడుకు చేసిన నేరానికి ఆమె తన పదవిని కోల్పోతుంది
పోలీసులు, సమాజం కూడా పిల్లల నేర ప్రవృత్తికి తల్లితండ్రుల పెంపకమే కారణమని ఆమెను కూడా దూషించడంతో కొడుకులో పరివర్తన తీసుకురావడానికి ఒక తల్లిగా రంగంలోకి దిగుతుంది
మరి వింధ్య తన కొడుకులో పరివర్తన తీసుకు రాగలిగిందా?
ఐదుగురు పిల్లలను అరెస్ట్ చేసిన పోలీస్ కమిషనర్ జయదేవ్ వారిలో మార్పు రావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు?
డ్రగ్స్ బెడదకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన ఆపరేషన్ యుఫోరియా ఎంతవరకు లక్ష్యాలను సాధించింది ?
మద్యానికి, మత్తుమందు కి బానిస అవుతూ నేర ప్రవృత్తికి దిగుతున్న పిల్లల పెంపకంలో తల్లితండ్రుల పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది?
2022 లో హైద్రాబాదులో యధార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా గుణశేఖర్ యుఫోరియా మూవీ తీశారు
సాధ్యమైనంతవరకు 90 శాతం సినిమా వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది
ఓ పదిశాతం మాత్రం దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు
చైత్ర అనే మైనర్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పాప భవ్య అనే మరణానికి కారణం అయిన సైకో సాహిల్ సన్నివేశాలు కానీ వాస్తవ సంఘటనల నుంచి తీసుకున్నవే
అయితే ఈ సినిమా ద్వారా మనకు కొత్తగా తెలిసింది ఏంటంటే పోలీస్ ప్రొసీజర్
ఈ ప్రొసీజర్ కాస్తంత కఠినంగా కరకుగా అనిపించినా నిందితుల మీద మనకు జాలి వేయదు
సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరిట నిందితులను నేర స్థలానికి తీసుకెళ్లి వాళ్ళు ఆ అమ్మాయిని ఎలా రేప్ చేశారో చూపించమని సీపీ జయదేవ్ అడిగిన సన్నివేశం , అలాగే నిందితుల సెక్సువల్ పోటెన్షిటీ తెలుసుకోవడం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా డాక్టర్ వాళ్ళని ప్యాంట్లు విప్పి చూపించమని అడిగే సన్నివేశం చూడటానికి కొద్దిగా ఇబ్బంది పడతాం
కానీ నిజానికి కఠినమైన నేరాలు చేసిన నిందితుల పట్ల పోలీస్ ప్రొసీజర్ అలాగే ఉంటుంది కాబట్టి అందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు
చదువులో ఫస్ట్ అయిన వికాస్ డ్రగ్స్ మూలంగా దారి తప్పాడని తెలుసుకున్న తల్లి వింధ్య అతడిలో పరివర్తన తీసుకు వచ్చి తిరిగి ఐఐటీ ఇంజనీరింగ్ పరీక్షలకు ప్రిపేర్ చేయించడం కోసం జైలు నుంచి పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ప్రయత్నాలు చేయడం వరకు కథనం సరైన గాడిలోనే వెళ్తుంది
ఫస్టాఫ్ వరకు స్టోరీ థీమ్ ప్రకారమే ముందుకు సాగుతుంది
పిల్లల పెంపకంలో తల్లితండ్రుల బాధ్యత గురించి, మైనర్లలో నేర ప్రవృత్తి పెరగడానికి వాళ్ళు మాత్రమే కారకులు కారని , ఇందులో తల్లితండ్రుల పాత్ర కూడా ఉంటుందని సిపి జయదేవ్ తో చెప్పించి మంచి మెసేజ్ ఇచ్చిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి కథనంలో గాడి తప్పాడు
వికాస్ జైల్ ఎపిసోడ్లు, సైకో సాహిల్ ఎపిసోడ్లు ,బైక్ రేస్ ఎపిసోడ్లు కథనాన్ని సాగతీసాయి అనిపిస్తుంది
దానికి తోడు కొడుకులో పరివర్తన తీసుకురావడం కోసం ప్రయత్నాలు మొదలెట్టిన భూమిక ఆ ప్రయత్నంలో విఫలం అయి మద్యానికి బానిస అవడంతో కథ ఎటో వెళ్ళి పోయింది
సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి
మళ్ళీ క్లైమాక్సు కు వచ్చేసరికి తల్లీ కొడుకుల బాంధవ్యం, బాధితురాలే నిందితుడి కెరీర్ కు సాయపడటం వంటి సన్నివేశాలతో ఎమోషన్స్ బాగా పండించారు
ఓవరాల్ గా ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తీసింది కాబట్టి అక్కడక్కడా మనకు డాక్యుమెంటరీ ఫిల్మ్ లా అనిపించవచ్చు .. ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే కాదు
కానీ ఇందులోని సందేశం ప్రతి ఒక్క తల్లితండ్రులను , పిల్లలను ఆలోచింపచేస్తుంది
ఎవరెలా చేశారు?
ఈ మూవీలో ఎవరెలా చేశారంటే ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్పుకోవాలి
మొదటగా వేములపల్లి వింధ్య గా తల్లి పాత్ర పోషించిన భూమిక సినిమాకి ప్రాణం పోసింది
ఉన్నత విద్యా సంస్థలను నడుపుతున్న బాధ్యత గలిగిన వ్యాపారవేత్తగా, కొడుకును తీర్చిదిద్దటం కోసం తపన పడే తల్లిగా, ఆ ప్రయత్నంలో విఫలమై మద్యానికి బానిసైన మహిళగా డిఫరెంట్ షేడ్స్ లో అత్యుత్తమ నటన ప్రదర్శించింది
ఇక భూమిక కొడుకుగా నటించిన విఘ్నేష్ కూడా చక్కటి నటన ప్రదర్శించాడు
ఇతడిది కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రే
చదువులో టాపర్ అయిన విద్యార్ధిగా,మత్తుమందుకు బానిసై కెరీర్ ను పాడుచేసుకున్న కుర్రాడిగా, తప్పుని సరిదిద్దుకున్న వ్యక్తిగా అన్ని షేడ్స్ లోనూ ఒదిగిపోయాడు
వీరి తర్వాత పోలీస్ అధికారి జయదేవ్ పాత్ర పోషించిన గౌతమ్ మీనన్ గురించి చెప్పుకోవాలి
చాలా సెటిల్డ్ గా పెర్ఫెక్ట్ గా చేసాడు
మిగిలిన పాత్రలు పర్లేదు
సాంకేతికత
ఈ సినిమాకి కాలభైరవ అందించిన సంగీతం బాగుంది
సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది
నిర్మాణ విలువలు పర్లేదు
విశ్లేషణ
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు కాబట్టి కొన్నిచోట్ల డాక్యుమెంటరీ మూవీలా అనిపిస్తుంది.. దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ భావన తప్పదు.. పిల్లల పెంపకంలో తల్లితండ్రుల బాధ్యత గుర్తు చేసే మూవీ అయినప్పటికీ పోలీస్ ప్రొసీజర్లో కొన్ని సన్నివేశాలు కుటుంబంతో కలిసి చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.. అది మినహా మిగిలిన కథనం ఒక ఫ్లోలో సాగిపోతుంది
నటీనటులు: భూమిక, విఘ్నేష్, నాజర్ తదితరులు
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కుమార్
దర్శకత్వం: గుణశేఖర్
విడుదల: ఈటీవీ విన్ (02-04-2026)
రేటింగ్: 2.5/5
