పడిలేచిన కెరటం పవన్ కళ్యాణ్
కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుగానే అభిమానులకు తెలుసు
ఎప్పుడైతే సినీ ప్రయాణం మొదలుపెట్టాడో అప్పుడే మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అని అభిమానులు చెప్పుకోవడం మొదలుపెట్టారు
చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువే
ఆ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయినవి కూడా తక్కువే
కానీ అతడిలో ఏదో పవర్ ఉంది
ఆ పవరే అశేషమైన అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టింది
అతడి డైలాగులకు , అతడి స్టెప్పులకు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి
పవన్ ఫైటింగుల్లో హీరోయిజాన్ని చూసి థియేటర్లలో అభిమానులు ఈలలతో దద్దరిల్లచేసారు
పవన్ గురించి చెప్పుకోవాలంటే రాజకీయాల్లోకి రాకముందు , రాజకీయాల్లోకి వచ్చాక అని రెండు భాగాలుగా విభజించుకుని చెప్పాలి
రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ లో దేశం కోసం ఏమైనా చెయ్యాలనే ఆవేశం ఉండేది
ఆ ఆవేశంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కూడా అయ్యాయి
తన ఆలోచనలను అమలుపెట్టడం కోసం సినీ కెరీర్ ను కూడా పక్కనబెట్టేందుకు ఆయన సిద్ధపడ్డారు
అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా తన ఆశయాలను సాధించుకునే అవకాశం వచ్చిందని సంతోషంతో ఊరూరా తిరిగి ప్రచారం చేసాడు
కొద్దికాలంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో పవన్ అసంతృప్తితో నీరుకారిపోయిన మాట వాస్తవం
అంతలోనే తేరుకుని సొంతంగా జనసేన పార్టీ స్థాపించి ఏపీ ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్ళాడు
కానీ ఎన్నికల్లో అన్న పార్టీ ప్రజారాజ్యం కన్నా జనసేన ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది
నిజంగా ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి డైలమాలో పడింది
ఒకపక్కన సినీ కెరీర్ కు బ్రేక్ పడింది
మరోపక్క రాజకీయాల్లో పరాజయం పలకరించింది
అయినా పవన్ కళ్యాణ్ ముందుకెళ్లటానికే నిర్ణయించుకుని ఐదేళ్లు వేచి చూసాడు
గత ఎన్నికల్లో చక్రం తిప్పాడు
ఫలితంగా కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో ఏపీకి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టాడు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో ఆవేశం లేదు
ఆలోచన మాత్రమే ఉంది
రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టూ పైకి ఎక్కుతూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నాడు
ఈ అవకాశాలను పవన్ కళ్యాణ్ వాడుకుని నిజాయితీగా ఏపీ అభివృద్ధికి పాటుపడితే ఆయన్ను అభిమానులే కాదు ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుంటారు
ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు
పరేష్ తుర్లపాటి