- padmaja veliganti
 
ఒంట్లో ఓపిక మిగిలి ఉన్నప్పుడే ఈ పనులు చేయడం మర్చిపోకండి.
- ప్రపంచ పర్యటనకి వెళ్ళడం
 - మారథాన్లో పరుగెత్తడం
 - తల్లకిందులుగా తపస్సు చేయడం
ఇలా ఏవో చెప్తూ ఉంటారు కదా,
ఆ list కి నా తరపున కొత్త item ఒకటి చేర్చా,
‘IKEA కి వెళ్ళడం‘. 
ఈ మాటను ఇంతిలా నొక్కి చెప్పడానికి, ఈ ఏడాదిలోనే ఆరుసార్లు వెళ్ళడం వలన నేను గడించిన అపారమైన అనుభవం సరిపోతుందనే అనుకుంటున్నా.
ఆ మధ్య ఒక ఆదివారం నాడు,
ఇల్లాలే ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ కనుక, ఆధునికీకరణ పనుల్లో భాగంగా రెండు బల్బులు, నాలుగు కర్టెన్లు, మూడు మొక్కలు, ముప్పై మేకులు కొనాలని నిర్ణయించాను.
“ఇదిగో, ఇవన్నీ కొనాలిగానీ, ఈరోజు IKEA కెళ్ళొస్తా” అన్నా.
నేను కూడా వస్తానన్నాడు.
వద్దు, నువ్వు వస్తే ‘అదెందుకూ, ఇదెందుకూ’ అని confuse చేసి విసిగిస్తావు. నేనే వెళ్తాను.
“ఒక్కదానివే వెళ్తావా, అదీ IKEA కి.
తిరిగి తిరిగి తప్పిపోతే ??” భయపెట్టాలని చూసాడు.
“నాది తప్పిపోయే వయసు కాదుగా”.
“నేననేది కూడా ఆ తప్పిపోవడం కాదు, స్పృహ తప్పిపోయే వయసని అంటున్నా.”
మంచి మాట మొగుడు చెప్పినా వినమన్నారు పెద్దలు.
సరే పోనీ, సామాన్లు మోయడానికైనా సాయం కావాలిగా అనుకుని, కలిసి బయల్దేరాం.
ఆకలితో ఉన్న customer అరుంధతిలో సోనూ సూద్ వంటి వాడు. ఎప్పుడెప్పుడు బద్దలు కొట్టుకుని బయటకి పోదామా అని చూస్తుంటాడు.
ఆ విషయం IKEA వాడికి బాగా తెలుసు.
అందుకే లోపలికి అడుగుపెట్టగానే పొడవైన escalator ఒకటి ఎక్కించి సరాసరి restaurant చేరేలా డిజైన్ చేశాడు.
ఆకులూ, కేకులూ, కోకులతో కడుపు నింపి, తర్వాత వాడి ‘వ్యూహాత్మక డబ్బా‘లోకి వదిలిపెట్టాడు.
ఆ డబ్బా బిల్డింగుకి,
తలుపులు ఉన్నాయా – తెలియట్లేదు.
కిటికీలు – కనబడట్లేదు.
దారి చూపే బాణం గుర్తులు – ఉన్నాయి. పైన పెడితే ఎక్కడ చూసేస్తామో అని నేలబారుగా అమర్చాడు.
ఇంత పకడ్బందీగా సెట్ చేశాక ఈ కస్టమర్ కుంక ఇక ఎక్కడికి పోతాడు?
అసలే తిండి తలకెక్కిన మత్తుతో , దారులు తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నవాడిని, ఈ ఫర్నిచర్ పద్మవ్యూహంలో పడేస్తే, ఆ తికమకలో స్పూన్ కొందామని వచ్చిన వాడు సోఫా కొనుక్కు పోతాడు.
అటువంటి మార్కెటింగ్ చాణక్యమూ, సృజనాత్మక చాతుర్యమూ IKEA వాడికి మీట్ బాల్స్ తో పెట్టిన విద్య!
సమయం: ఉదయం 11 గంటలు
IKEA వారు గీసిన కక్ష్యలోనే భూప్రదక్షిణ మొదలుపెట్టాం.
అలా ఉపగ్రహాల్లా ఊరికే తిరగడం ఎందుకని చేతికి దొరికిన అత్యంత అనవసరమనిపించే వస్తువులు ట్రాలీలో వేస్తూ ముందుకి పోతున్నా.
అనుకున్నట్టే పెద్ద వస్తువుల ఎంపికపై పరస్పర ఒప్పందం కుదరట్లేదు మా ఇద్దరికీ.
‘ఈ dining table అందంగా ఉంది, కొందా’మన్నాడు.
‘అది మనింట్లో ఉన్న place కి మందంగా ఉంటుంది, వద్ద‘న్నాను.
‘ఇదే కాదు, నేనేది చూపించినా వద్దంటున్నావు. కావాలనే కాదంటున్నావ‘ని సందేహపడ్డాడు.
“సందేహపడవలదు నాథా,
మన భోజనశాల కోసం ఓ చెక్క రంగు బల్లను, దానిపైన ఓ చక్కని పూల మొక్కను ఊహించి, మూడు నెలల కిందటే నా మనోఫలకం మీద ముచ్చటైన బొమ్మేసాను. వీక్షింపుము” అని వినయంగా వివరించాను.
మనోఫలకం మసకగా ఉన్నందున సరిగ్గా కనిపించట్లేదన్నాడు.
చేయి పట్టుకొని బరబరా లాక్కుపోయి నాకు నచ్చిన design చూపించాను.
చప్పట్లు కొట్టాల్సింది పోయి, చప్పగా ఉందని చప్పరించాడు.
చిర్రెత్తుకొచ్చింది నాకు, నా మీదే!!
అసలు మా ఆడాళ్ళకి ఎంత వెర్రిబాగులదనం లేకపోతే, షాపింగు తపస్సుకి వెళ్తూ, తెలిసి తెలిసి ఇలా మగ(డు) మేనకలని వెంటబెట్టుకెళ్తాం చెప్పండి?!
ఇక సాధనేం సాగుతుంది? సామానెక్కడ కొంటామూ?
నాకు అటువైపుగా ఉన్నావిడ పరిస్థితి మరీ దారుణం!!
ఓ పిల్ల మేనకడిని వెంట తీసుకొచ్చింది.
నాలుగేళ్ళుంటాయిలా ఉంది వాడికి.
ఆ వయసుకే వాడికి వంటబట్టిన విద్యలు చూసి విస్తుపోయాను.
షాపింగ్ ట్రాలీలోనే నిలబడి ఒంటి కాలు మీద వృక్షాసనం వేశాడు, ఔరా Yoga!
కాసేపటికే దాంట్లో నుండి కిందకి బంగీ జంప్ కూడా చేశాడు, wow , adventure sports!!
ఆపై నడిచే వాళ్ళ కాళ్ళకడ్డం పడుతూ పొర్లు దండాలు పెట్టాడు. Amazing, గంగమ్మ జాతర dance.
పైకి లేవమని వాళ్ళ అమ్మ వాడికి దండాలు పెట్టింది.
కుదరదని పంతం పట్టాడు.
వాడి కళ్ళు గప్పి పక్కకెళ్ళి, చేతికి దొరికిన కోతి బొమ్మనొకదాన్ని తీసుకొచ్చి, వాడి చేతికిచ్చింది.
మళ్లీ బుట్టలోకెక్కి కూర్చుని దాని తోక పీకే పనిలో పడ్డాడు.
వాడికి లేనిది దానికి ఉండడం వాడికి నచ్చలేదనుకుంటా!
“వాడిని చూడు, పాపం వాళ్ళ అమ్మని ఎలా తిప్పలు పెడుతున్నాడో” generous గా జాలిపడ్డాడు ఇంటాయన.
“అవును పాపం, అయినా షాపింగులకి పిల్లలని, పిల్లులని చంకనెట్టుకు రాకూడదని వీళ్లైనా బయట బోర్డ్ పెట్టాలి కదా” అన్నా.
గుర్రుగా చూసాడు.
సమయం: ఎవరికి తెలుసు?
(ఆ Nolan సినిమాల్లో
మన నిన్నటి మనల్ని, రేపటి మనం కలిసి ఇప్పటి మనల్ని రక్షిస్తూ ఉంటారు కదా, వాళ్లంతా కలిసే place మాత్రం ఖచ్చితంగా IKEAనే! కాలాతీతమైనది.)
కిచెన్ సెక్షన్లో మూడవ భూప్రదక్షిణ చేస్తుండగా నాకు తెలియని, ఇంటాయన ఫ్రెండొకాయన కలిశాడు.
“Heyy, what a surprise.! World is so small రా”, అంటూ నావైపు చూసి పలకరింపుగా నవ్వాడు.
‘ప్రపంచం చిన్నదే కానీ దానిలో ఉన్న IKEA మాత్రం చాలా పెద్దదండీ‘ అందామనిపించింది కానీ అనలేదు.
బాగోదని కాదు, ఓపిక లేక.
నవ్వి ఊరుకున్నా.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు.
కొంత కాలం గడిచింది. ఎంతో తెలీదు.
నిల్చుని నిల్చుని నా కాళ్ళు పాదాల నుండి పైకి రెండంగుళాల మేర మొద్దుబారాయి. నేను వాటిని మోస్తున్నానో, అవి నన్ను మోస్తున్నాయో కూడా తెలియట్లేదు.
వాళ్ళింకా మాట్లాడుతూనే ఉన్నారు.
చూస్తుండగానే మరో రెండు అంగుళాలు శిలలుగా మారాయి.
భయమేసింది, పూర్తిగా శిలావిగ్రహంలా మారిపోతానా?
అసలే ఇంటాయనకి ‘శివ శంకరీ’ పాట కూడా రాదు.
ఏదోకటి చెయ్యాల్సిందే!
మనసులోనే టెలీపతి మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టా.
“అపరిచితన్నయ్య గారూ,
ఆల్రెడీ అరగంట నుండి నా ముందున్న ఈ షాపింగ్ ట్రాలీలోకెక్కి కూర్చోవాలనే
బలమైన ఆలోచనను, బలవంతంగా నిగ్రహించుకుంటున్నాను. మరికాసేపు ఇలాగే నుంచుంటే ఆదివారం పూట ఇలా సోదరీ సమానురాలిని శిలా విగ్రహాన్ని చేసిన అపఖ్యాతి మీకంటగలదు.
అంతగా కావాలంటే మీరు ఇంటికి వస్తే నేను నాలుగు రకాలు వండి వడ్డిస్తాను. మీరిద్దరూ కూర్చుని తింటూ ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.”
‘కూర్చుని‘ అనే పదాన్ని bold letters లో రాసి underline చేసాను.
టెలీపతి message టక్కున చేరినట్టుంది.
“సరేరా, మళ్లీ కలుద్దాం” అని చకచకా వెళ్ళిపోయాడాయన.
ఇదంతా తనకి చెప్పి ‘నాకేమైనా శక్తులున్నాయంటావా‘ అని అడిగా.
“నడవడానికే శక్తి లేదు కానీ, ఆ పనికిమాలిన శక్తులు మనకెందుకురా బుజ్జే” నవ్వాడు.
అలా రాజమౌళి, మహేష్‌ల Globe trotter రిలీజ్ అవ్వకముందే , మా Globe trotting విజయవంతంగా పూర్తి చేసి ఇంటికి చేరాము.
ఇంతకీ ఈ IKEA కి వచ్చేవారంతా నాలాగా కొత్త ఇల్లు కోసం ఫర్నిచర్ కొనడానికి వస్తారా లేక కొన్నవన్నీ పెట్టడానికి కొత్త ఇల్లు కొనుక్కుంటారా!?
