“హలో సుధాకర్ ! హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉంది ?”
అవతల్నుంచి లైనులో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం శుభలేఖ సుధాకర్ ని ఉద్దేశిస్తూ ఫోనులో అడిగిన మాటలు అవి
” నో ప్రాబ్లమ్ .. అంతా బాగానే ఉందండీ” సుధాకర్ సమాధానం
“ఓకే.. అయితే నేను బయలుదేరుతున్నాను ” అంటూ ఫోన్ కట్ చేసారు ఎస్పీ బాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యానికి , ఆయన బావమరిది , ఎస్పీ శైలజ భర్త అయిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇది
బాలుగారి ఫోన్ కాల్ వెనుక చిన్న నేపధ్యం ఉంది
అవి భారత దేశంలో కోవిడ్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న రోజులు
ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితం అయిన ఘడియలు
ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలు హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీలో పాడుతా తీయగా ప్రోగ్రాం కి హాజరు కావాల్సి వచ్చింది
కానీ అప్పటికే కోవిడ్ మహమ్మారి హైదరాబాదులో కూడా ఉధృతంగా విస్తరిస్తుందని వార్తలు వస్తున్నాయి
పాటలోనే పుట్టి పాటలోనే పెరిగిన మనిషి బాలు
పాడకుండా క్షణం ఉండలేని బలహీనత ఆయనది
కోవిడ్ నిబంధనల వల్ల ఆయనకి చెన్నైలోని ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి
మాములు పాట కచేరి అయితే ఎస్పీ బాలు ఇల్లు కదిలేవాళ్ళు కాదేమో
కానీ పాడుతా తీయగా ప్రోగ్రాం ఆయన మానస పుత్రిక
ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది వర్ధమాన గాయనీ ,గాయకులను ఆయన వెలుగులోకి తెచ్చారు
చిన్నపిల్లనుంచి యువకుల వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లకు ప్రోగ్రాంలో అవకాశం కల్పించి వాళ్లలోని ప్రతిభను బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
ఆయన ప్రోగ్రామ్ వల్లనే ఎంతోమంది కళాకారులు టీవీ ప్రోగ్రాముల్లోనూ , సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించుకున్నారు
ఆ ఒక్క ప్రోగ్రామే కొన్ని వందలమంది గాయకులను వెలుగులోకి తెచ్చింది
అందుకే ఎస్పీ బాలుకి పాడుతా తీయగా కచేరి అంటే అంత మక్కువ
ఆయన ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి డబ్బు సంపాదించటం కోసమే పాటలు పాడుతారని ఆరోపణలు చేసేవాళ్ళు ఒక్కసారి బాలు గారి ప్రోగ్రామ్ వల్ల వృద్ధిలోకి వచ్చిన ఔత్సాహిక గాయనీ ,గాయకులను అడిగి చూడండి
బాలు చేసిన సాయం విలువ తెలుస్తుంది
గాయకుడిగా ఆయన ఎప్పుడో సంపాదించేసారు
కొత్తగా ఇప్పుడు సంపాదన అవసరం లేదు
అందుకే గాయకుడి స్థానం నుంచి గురువు స్థానంలోకి మారి ఎంతోమందికి వర్ధమాన కళాకారులకు ఓనమాలు నేర్పారు
సరే , ఇప్పుడు మళ్ళీ ఇందాకటి ఫోన్ కాల్ దగ్గరికి వస్తే , శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాటల ప్రోగ్రాం లో పాడటానికి ఎస్పీ బాలు వెంటనే చెన్నై నుంచి హైదరాబాదుకి ఫ్లైట్ లో వచ్చేసారు
ఇదే విషయం మీద శుభలేఖ సుధాకర్ పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ బాధ పడుతూ ఉంటారు
ఆ రోజు కోవిడ్ ఇష్యూని పెద్ద సీరియస్ గా తీసుకోకుండా అంతా బాగానే ఉంది , మీరు రావొచ్చు అని తొందరపాటులో బాలుగారికి చెప్పి పెద్ద తప్పు చేసానని ఆయన బాధపడుతూ ఉంటారు
ఆ రోజు నేను ఆయన్ని రావొద్దని అనుంటే సేఫ్ అయ్యేవారేమో ,ఈ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతూ ఉంటుందని వాపోయారు
అందుకే చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా మహానుభావుడి విగ్రహావిష్కరణకు తనవంతు ఉడుతా భక్తిగా సాయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు
రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం – వివాదం
ఈ నేపథ్యంలో ది మ్యూజిక్ గ్రూప్ అనే సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతిలో ఘంటసాల విగ్రహం పక్కన బాలు విగ్రహాన్ని ఆవిష్కరించటానికి ఏర్పాట్లు చేసింది
ఈ ఏర్పాట్లలో భాగంగా పనులను పర్యవేక్షించటానికి కొద్ది రోజుల క్రితం ఆడిటోరియం కి వచ్చిన శుభలేఖ సుధాకర్ ను కొంతమంది తెలంగాణా వాదులు అడ్డుకుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించటానికి వీల్లేదని గొడవ చేయడంతో సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి
తెలంగాణా వాసులు సైతం ఎస్పీ బాలు విగ్రహ ప్రతిష్టాపనకు మద్దతుగా ప్రకటనలు ఇచ్చారు
ఈ విషయంలో రాజకీయ పార్టీలు తొందరపడి వ్యాఖ్యానాలు చేయకుండా సంయమనం పాటించాయి
ఈ దశలో రవీంద్ర భారతిలో డిసెంబర్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు ఆహ్వాన పత్రాల్లో పేర్కొన్నారు
బాలు విగ్రహావిష్కరణ
ఇన్విటేషన్ డిసెంబర్ 15 ఉదయం 10.౩౦ గంటలకు విగ్రహావిష్కరణ ఉంటుందని పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నందున ఆయన రాకకు వీలుగా కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు
అయినప్పటికీ సీఎం రావడానికి మరింత సమయం పట్టొచ్చన్న సమాచారంతో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో విగ్రహావిష్కరణ చేయించారు
నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు అదే జిల్లాకు చెందిన బాలుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు
నెల్లూరులో ఎస్పీ బాలు తండ్రి సాంబమూర్తి గారు త్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహించేవారని , దానికి తాను కూడా హాజరయ్యేవాడినని పాత రోజులను గుర్తు తెచ్చుకున్నారు
బహుశా అందువల్లనేమో తనకు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో అంతటి అనుబంధం ఏర్పడిందని అన్నారు
ప్రాంతాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తాను నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడి కోటాలోనూ , ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను కాబట్టి తెలంగాణా కోటాలోనూ తనని కూడా అందరివాడిగా భావించవచ్చని ఆయన చమత్కారంగా అన్నారు
ఏమైనా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు
తన రోజువారీ జీవితం ఎస్పీ బాలు పాడిన పాటలు వినడంతోనే మొదలౌతుందని ఆయన అన్నారు
ఇప్పటికీ తాను బాలు , ఘంటసాలలు పాడిన త్యాగరాజ ,అన్నమయ్య కీర్తనలను వింటుంటానని వెంకయ్య నాయుడు చెప్పారు
బాలుకి ప్రాంతాలతో సంబంధం లేదు .. ఆయన అందరివాడు – దుద్దిళ్ళపాటి శ్రీధర్ బాబు
నిజానికి ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు హాజరు కావాల్సింది
కానీ సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటం , మంత్రి స్థానిక ఎన్నికల పర్యవేక్షణలో ఉండటంతో ఇరువురు హాజరు కాలేకపోయారు
వారి తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి దుద్దిళ్ళపాటి శ్రీధర్ బాబు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ స్థాయి గాయకుడిని ఏ ఒక్క కులానికో , మతానికో ,ప్రాంతానికో పరిమితం చేయలేమని , బాలు అందరివాడని కొనియాడారు
అటువంటి ప్రతివంతుడైన గాయకుడిని గౌరవించడం అంటే తెలంగాణాని గౌరవించంతో సమానమని ఆయన అన్నారు
కళలను ప్రోత్సహించడంలో భాగంగా తమ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఆయన విగ్రహ ఏర్పాటుకి అనుమతులు ఇచ్చిందని శ్రీధర్ బాబు చెప్పారు
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి , కొడుకు చరణ్ , కూతురు శైలజ , శుభలేఖ సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
బాలు గారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం తమ అదృష్టం – ది మ్యూజిక్ గ్రూప్ ప్రతినిధులు
నిజానికి రవీంద్ర భారతిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించాలనే తమ ప్రయత్నం ఈనాటిది కాదని , నాలుగేళ్ళబట్టి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని మ్యూజిక్ గ్రూప్ నిర్వాహకుల్లో ఒకరు చెప్పారు
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చాలామంది నేతలను కలిసి విగ్రహ ప్రతిపాదనలు అందచేశామని , కానీ ఎందుకో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని వారు చెప్పారు
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ తమ ప్రయత్నాలు ఆపలేదని వారన్నారు
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ళపాటి శ్రీధర్ బాబు , ఎంపీ మల్లు రవి సోదరుడు ప్రసాద్ లు తమ ప్రయత్నాలకు అండగా నిలబడ్డారని తెలిపారు
వారి చొరవతో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి కలవగా , ప్రభుత్వం నుంచి తమ శాఖ తరపున కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో తమ ప్రయత్నం కార్య రూపం ధరించిందని , ఇందుకు గాను తెలంగాణా ప్రభుత్వానికి సంస్థ తరపున ధన్యవాదాలు తెలియచేసారు
తల్లితండ్రుల విగ్రహాలను చెక్కిన శిల్పే కుమారుడి విగ్రహం చెక్కారు
రవీంద్ర భారతిలో ప్రతిష్టించిన ఎస్పీ బాలు గారి విగ్రహాన్ని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి కి చెందిన శిల్పి వడయార్ తయారు చేసారు
అయితే బాలు గారి విగ్రహం తయారుచేసిన శిల్పికి గమ్మత్తైన అనుభవం ఎదురైంది
బతికున్న రోజుల్లో బాలు గారు ఈ శిల్పి దగ్గరికి వెళ్లి తన తల్లితండ్రుల విగ్రహాలను తయారుచేసి ఇవ్వాల్సిందిగా కోరారట
అంతటి గాన గంధర్వుడు స్వయంగా వచ్చి అడగటంతో శిల్పి సంతోషానికి అవధులు లేవు
ఈ సందర్భంగానే బాలు గారికి తన తల్లితండ్రుల మీద ఉన్న ప్రేమ ఆయనకు తెలిసింది
ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా జన్మనిచ్చిన తల్లితండ్రులను మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న బాలు గారంటే మరింత గౌరవం పెరిగిందని ఆయన అన్నారు
అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని చెక్కే బాధ్యత తనకు రావడం అదృష్టమని వడయార్ సంతోషం వ్యక్తం చేసారు
ఏపీలో కూడా బాలు పేరుతో ఆడిటోరియాలు – థమన్
పద్నాలుగు భాషల్లో షుమారు నలభై వేల పాటలు పాడి చరిత్ర సృష్టించిన బాలు తాను మొట్టమొదటి పాటని పాడింది కూడా డిసెంబర్ పదిహేనే కావడంతో సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎస్పీ చరణ్ , శైలజ , సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ తదితరులు బాలుగారి పాటలను ఆలపించారు
ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలు గారి పేరుతో ఆడిటోరియాలు నిర్మించటానికి ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు
అందులో తనవంతుగా ఐదు ఆడిటోరియాలు నిర్మిస్తానని చెప్పారు
ముగింపు
ఏదిఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు బాలుకి ప్రాంతీయత ఆపాదించకుండా ఆయన పేరుతో కార్యక్రమాలు చేయడం ముదావహం
నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది
ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు బాలు గారి సంస్మరణార్థం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల బాలు గారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు!
