2026 టి 20 ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆట ఆటకు చెలరేగిపోయి ఆడి ఆదివారం న్యూజీలాండ్ తో ఫైనల్స్ ఆడటానికి అహ్మదాబాద్ స్టేడియం గ్రౌండ్లోకి ప్రవేశించిన భారత జట్టు మీద కోట్లాదిమంది భారతీయుల చూపు నిలిచింది
ఆట ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరిలో ఎన్నో అంచనాలు , నమ్మకాలూ , భయాలు , ఉద్వేగాలు
అటుపక్క చూస్తే న్యూజీలాండ్ జట్టు
ఈ టోర్నమెంటులో అత్యంత ప్రతిభావంతంగా ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించి ఫైనల్ కి కూడా సై అంటూ స్టేడియంలోకి దిగింది
ఇటు చూస్తే భారత జట్టులో ఒక్కొక్కరు ఒక్కొక్క శతఘ్నులై కదన రంగంలోకి దిగారు
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో చూస్తే ఇసకేస్తే రాలని జనాలు
స్టేడియంలోకి నీలి సముద్రం ఉప్పొంగుతూ వచ్చిందా అన్నట్టు ఎటు చూసినా నీలి జర్కిన్లే
క్రికెట్ అభిమానుల అందరి ఆలోచనలు ఒకటే
ఫైనల్ భారత్ గెలవాలి
ముచ్చటగా మూడోసారి కప్పుచేత బట్టాలి
ఎటు చూసినా ఇండియా , ఇండియా నినాదాలు
మూడు రంగుల జెండాలు
ఇరుపక్షాలకు ఇది తుది పోరు కాబట్టి
యుద్ధం హోరాహోరీగా ఉంటుందని అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు
చావో రేవో మరికొద్ది గంటల్లో తేలిపోతుందని ప్రతి ఒక్కరిలో ఉద్విగ్నత
కోట్లాదిమంది టీవీలకు అతుక్కుపోయి కళ్లప్పగించి మ్యాచ్ చూస్తున్న వేళ
అద్భుతం జరిగింది
హోరాహోరీ అనుకున్న యుద్ధం టర్న్ తీసుకుని వార్ వన్ సైడ్ అయిపోయింది
భారత్ బౌలర్లు విసురుతున్న బంతులను తట్టుకోలేక న్యూజీలాండ్ మేటి బ్యాట్స్ మెన్లు సైతం నిస్సహాయ స్థితిలో చేతులెత్తేశారు
ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరిగిన తీరును విశ్లేషణ చేసుకుందాం
విధ్వంసం
న్యూజీలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు
ఇండియన్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ , సంజు సాంసన్ లు క్రీజులోకి వచ్చారు
ఇద్దరిలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ మీద ఎవరికీ ఆశలు లేవు
ఈ టోర్నమెంటులో అతడు ఫామ్ లో లేకపోవడమే అందుకు కారణం
అభిషేక్ శర్మ బ్యాటు పట్టుకుని క్రీజులోకి వచ్చినా ఎలాగూ షరా మాములుగా డకౌట్ అవడమో , మహా అయితే సింగిల్ డిజిట్ రన్స్ కొట్టి స్పీడుగా పెవిలియన్ కి వెళ్లిపోవడమో చేస్తాడులే అని చాలామంది అనుకున్నారు
అందుకే అతడి మీద క్రికెట్ అభిమానులు ఎవరూ పెద్ద హోప్స్ పెట్టుకోలేదు
కానీ ఆ సంజు సాంసన్ ఉన్నాడే
చిచ్చర పిడుగు
సైలెంట్ కిల్లర్
బంతితో చెడుగుడు ఆడుకుంటాడు
క్రీజులో అతడు నిలబడి బౌలర్ వంక చూస్తే సింహం గర్జిస్తున్నట్టుగా ఉంటుంది
చాలా సైలెంటుగా ఉంటాడు
అంతే వయోలెంటుగా బంతిని బౌండరీ లైన్ దాటిస్తాడు
ఇండియా ఫైనల్ చేరుకోవడానికి అతడు కూడా ఒక కారణం
అందుకే కోట్లాది క్రికెట్ ప్రేమికుల చూపులు సాంసన్ మీదే ఉన్నాయి
కానీ ఇక్కడ అనుకోకుండా ఓ అద్భుతం జరిగింది
డకౌట్ అవుతాడు అనుకున్న అభిషేక్ శర్మ డెక్కులు పగిలిపోయేలా బ్యాటుతో బంతులను ఎడాపెడా బాది స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు
ఇది ఎవరూ ఊహించని యుద్ధం
భారతీయులే కాదు , న్యూజీలాండ్ క్రికెట్ ప్రేమికులు కూడా అభిషేక్ చెలరేగుడు ఊహించలేకపోయారు
ఒకరకంగా సర్జికల్ స్ట్రైక్ చేసాడన్నమాట
ఇటుపక్క అభిషేక్ , అటుపక్క సంజు సాంసన్ వచ్చిన బంతిని వచ్చినట్టు విచ్చలవిడిగా బాదారు
పూనకాలు వచ్చినట్టు బ్యాటుతో ఊగిపోయారు
వీళ్లిద్దరి బంతాట ఎంత విధ్వంసకరంగా సాగిందంటే బంతి విసరాలంటే న్యూజీలాండ్ బౌలర్ చేయి వణికేంత
బౌండరీ లైను దగ్గర కాపు కాసిన ఫీల్డర్లు గాల్లోకి లేచిన బంతి హైట్ చూసి కళ్ళు తిరిగేంత
ఇది మాములు ఆట కాదు క్రికెట్ సునామీ
ఇది ఎవరూ ఊహించని పరిణామం
క్యాచు లేస్తుందన్న భయం లేదు
స్టంపు కూలుతుందన్న భయం లేదు
చాలా నిర్భయంగా , ధీమాగా ఆడేసారు
సాధారణంగా ఫైనల్ మ్యాచ్ అంటే ఆటగాళ్ల మీద ఒత్తిడి ఉంటుంది
ఫ్రీ హ్యాండ్ గా ఆడలేరు
ఏ మాత్రం పొరపాటు చేసినా ఈ టోర్నమెంటులో ఇప్పటిదాకా పడిన కష్టం వృధా పోతుంది
అయితే అంత టెన్షన్ లోనూ ఇద్దరూ చెలరేగిపోయి ఆడారు
అభిషేక్ సంగతి అలా ఉంచితే సంజు బ్యాటింగ్ తీరు చూడండి
ఒక్కోసారి సునీల్ గవాస్కర్ గుర్తుకొస్తాడు
ఒక్కోసారి కృష్ణమాచారి శ్రీకాంత్ గుర్తుకొస్తాడు
గ్యాపులు చూసుకుని బంతిని బౌండరీలు దాటిస్తాడు
లూజు బాల్ దొరికితే సిక్సులు లేపుతాడు
అతడి ఆట తీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది
అంతేకానీ అడ్డదిడ్డంగా ఆడడు
దీన్నే గురి చూసి కొట్టడం అంటారు
సంజు 46 బంతుల్లో 89 రన్స్ చేసాడు (ఇందులో ఐదు ఫోర్లు , ఎనిమిది సిక్సులు ఉన్నాయి )
మరోపక్క ఇప్పటిదాకా పెద్దగా ఫామ్ లో లేని అభిషేక్ సరైన సమయంలో సరైన స్ట్రైక్ తీసుకున్నాడు
అదీ మాములుగా కాదు కేవలం 21 బంతుల్లో 52 పరుగులు తీసాడు (ఇందులో ఆరు ఫోర్లు ,మూడు సిక్సులు ఉన్నాయి )
ఇషాన్ కిషన్ కూడా ఇదే రకంగా చెలరేగిపోయాడు
25 బంతుల్లో 54 రన్స్ సాధించాడు (ఇందులో నాలుగు ఫోర్లు , నాలుగు సిక్సులు ఉన్నాయి )
తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ అయి పెవిలియన్ బాట పట్టాడు
శివమ్ దూబే 26 , తిలక్ వర్మ 8 , హార్దిక్ పాండ్య 18 పరుగులు చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి న్యూజీలాండ్ బాట్స్మెన్ల మీద భారీ లక్ష్యాన్ని పెట్టారు
న్యూజీలాండ్ బ్యాటింగ్
నిజానికి న్యూజీలాండ్ జట్టుకు ఇది గట్టి టార్గెటే
భారం అంతా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ల మీదే ఉంటుంది
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజీలాండ్ ఓపెనర్లు సిఫర్డ్ , ఫిన్ అలెన్ లు దూకుడుగా ఆడి మూడు ఓవర్లలో 31 పరుగులు చేయడంతో మొదట్లో వార్ టూ సైడ్స్ అన్న ఫీలింగ్ వచ్చింది
అయితే అక్సర్ పటేల్ వేసిన బంతిని అలెన్ గాల్లోకి లేపి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఇండియాకు తొలి వికెట్ బోణీ ఇచ్చాడు
ఆ తర్వాత వచ్చిన న్యూజీలాండ్ బ్యాట్స్మెన్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ రన్స్ కే పెవిలియన్ బాట పట్టారు
ఈ పరిణామాలతో వార్ వన్ సైడ్ అని అందరికీ అర్థమైపోయింది
వాళ్లలో సిఫర్డ్ ఒక్కడే నిలకడగా ఆడి 52 పరుగులు సాధించాడు
వరుణ్ చక్రవర్తి బౌలింగులో ఇషాన్ కు క్యాచ్ ఇచ్చి అతడు కూడా ఔట్ అవడంతో కెప్టెన్ శాంట్నర్ క్రీజులోకి వచ్చాడు
ఇతడికి మిచెల్ తోడయ్యాడు
ఈ ఇద్దరూ నిదానంగా ఆడుతూ 52 పరుగుల భాగస్వామ్యం సాధించారు
16 వ ఓవర్లో బంతిని తీసుకున్న బుమ్రా వరుసగా నిషన్ , హెన్రీ , శాంట్నర్ లను వికెట్లను కూలగొట్టాడు
అభిషేక్ శర్మ బౌలింగులో డఫీ క్యాచ్ ఇవ్వడంతో ఆఖరి వికెట్ కూడా కోల్పోయి న్యూజీలాండ్ 96 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది
ముచ్చటగా మూడోసారి టి 20 ప్రపంచ కప్ భారత్ చేతుల్లో వాలింది
అర్షదీప్ – మిచెల్ ల గొడవ
అర్షదీప్ బౌలింగులో ఐదో బంతిని మిచెల్ క్రీజు దాటి భారీ షాట్ కు ప్రయత్నించాడు
కానీ బంతి గురితప్పి అక్కడే పడటంతో అర్షదీప్ ఆ బాల్ ని వేగంగా వికెట్ల వైపుకు విసిరాడు
కానీ అనుకోకుండా ఆ బాల్ మిచెల్ కాలికి తగలడంతో అతడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు
కోపంగా అర్షదీప్ వైపు వస్తూ పెద్దగా అరిచాడు
కానీ అర్షదీప్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బంతిని తీసుకుని కామ్ గా వెనక్కి వెళ్ళిపోయాడు
ఎంపైర్ మాత్రం అర్షదీప్ ను ఆపి ఏదో చెప్పడం కనిపించింది
ఈలోపు దూరంగా ఉన్న కెప్టెన్ సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి మిచెల్ కు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది
తన ఓవర్లో ఆఖరి బంతిని వేసిన తర్వాత అర్షదీప్ ప్రత్యేకంగా మిచెల్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పాడు
అంతేకాదు మ్యాచ్ ముగిసి ఇండియా గెలిచిన తర్వాత అర్షదీప్ ఎటువంటి ఈగోలకు పోకుండా మిచెల్ దగ్గరికి వెళ్లి అప్పాలజీ చెప్పి అతడి భుజం మీద చేయి వేసి సెల్ఫీలు దిగడంతో వివాదం సామరస్యంగా పరిష్కారం అయ్యింది
ముందు కోపగించుకున్న మిచెల్ కూడా తర్వాత అర్షదీప్ భుజం మీద చేయి వేసి నవ్వుతూ ఫోటోలు దిగడం చూపరులను ఆకర్షించింది
సెలెబ్రిటీల సందడి
టి 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
అందులో అహ్మదాబాద్ స్టేడియం
స్టేడియం ఆల్రెడీ క్రికెట్ అభిమానులతో నిండిపోయింది
వీఐపీ గ్యాలరీలు చూస్తే సెలెబ్రిటీలతో నిండిపోయింది
అందరిలోకి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎక్కువగా సందడి చేసారు
మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మ్యాచ్ చూస్తూ కేరింతలు కొట్టారు
ఇండియా గెలిచిందని తెలియగానే లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంతోషంతో చిన్న పిల్లాడిలా ఊగిపోయారు
ఆయన మ్యాచ్ చూస్తున్న సమయంలోనే ఇండియా జెర్కిన్ తో వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్ అమిత్ షా వద్దకు వచ్చి కలిసి వెళ్లారు
స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ తన మిత్రుడితో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసారు
ఎంఎస్ ధోని ,రోహిత్ శర్మలు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మ్యాచ్ చూసారు
అభిషేక్ శర్మ బౌలింగులో న్యూజీలాండ్ ఆఖరి వికెట్ డఫీని క్యాచ్ పట్టి ఔట్ చేయడంతో జయజయ ధ్వనులతో స్టేడియం మారుమోగిపోయింది
భారతమంతా బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు
