ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్
ఎస్ఎస్ కన్వెన్షన్ లో మూడు రోజుల సదస్సు ప్రారంభం
దక్షిణాది రాష్ట్రాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరు
విజయవాడ: ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు.
ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు శుక్రవారం ప్రారంభమైంది.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరిరావు. ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య చికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాల గురించి అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు లభించేలా కృషి చేయాలని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య చికిత్సలను చేరువ చేయాలని పిలుపునిచ్చారు.
వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రదేశ్ నెఫ్రాలజీ సొసైటీకి అభినందనలు తెలియజేశారు.
దక్షిణాది రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఈ సదస్సు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్ గా వ్యవహరించిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న మాట్లాడుతూ ” నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, నూతన ఆవిష్కరణల గురించి సదస్సులో చర్చిస్తామని అన్నారు.
ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెఫ్రాలజీ చికిత్సలను అందించేందుకు, ఆధునిక వైద్య చికిత్సలకు సంబంధించి వైద్యులు నైపుణ్యత పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని వివరించారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులుపాల్గొన్న ఈ సదస్సులో వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు.
కార్యక్రమంలో ఐఎస్ఎన్ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డాక్టర్ జి. శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.