గత వారం రోజులుగా విమానయాన రంగంలో జరుగుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ కుదుపుల సంగతి అందరికీ తెలిసిందే
మొదట్లో ఇండిగో విమానం క్యాన్సిలేషన్ సంగతి విమానయాన మంత్రిత్వ శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదు
కానీ ఒకటికాదు రెండు కాదు ఏకంగా 4 ,500 విమాన సర్వీసులు రద్దుచేయడంతో సంబంధిత అధికారులు స్పందించక తప్పలేదు
ఒక దశలో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వైఫల్యం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి
మంత్రి కూడా మీడియా ఎదుట స్పందిస్తూ త్వరలో సంక్షోభం పరిష్కారం అవుతుందని చెప్పారు
అసలు వివాదం ఏంటి ?
విమానయాన రంగం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA ) పర్యవేక్షణలో ఉంటుంది
ఈ మంత్రిత్వ శాఖ గత నవంబర్ నుంచి పైలట్లకు విధిగా వారంలో రెండు రోజులు విశ్రాంతినివ్వాలనే నిబంధనను అమలులోకి తెచ్చింది .
ప్రతి పైలట్ కి వరుసగా 48 గంటలపాటు విరామం ఇవ్వాలని ఈ నిబంధన స్పృష్టం చేస్తుంది
గతంలో వారికి వారానికి 36 గంటల విశ్రాంతి మాత్రమే ఉండేది
ఆ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో పైలట్లతో సహా మొత్తం ప్రయాణీకులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే
అప్పట్లో ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది
ప్రాధమిక దర్యాప్తులో విమానం ఇంజిన్ కి ఇంధనం సరఫరా చేసే వాల్వ్ క్లోజ్ అయినట్టు అధికారులు గుర్తించారు
బ్లాక్ బాక్స్ డీ కోడ్ చేస్తే ఇదే విషయం మీద పైలట్ చేసిన సంభాషణ కూడా బయటికి వచ్చింది
DGCA ఈ విమాన ప్రమాదం మీద నివేదికను కోరుతూ నిపుణులతో కూడిన బృందంతో దర్యాప్తు అధికారులను నియమించింది
ఇదిలా ఉండగా భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి నివేదికను కోరుతూ అత్యున్నత స్థాయి అధికారులతో కమిటీ కూడా వేసింది
ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రధానమైన అంశం 48 గంటల విశ్రాంతి
పైలట్లకు ప్రస్తుతం ఉన్న పనిగంటల విశ్రాంతి సరిపోవడం లేదని భావించి కమిటీ ఈ సూచనలు చేసింది
డ్యూటీ వత్తిళ్లతో వాళ్ళు అలసిపోవడం కూడా విమాన ప్రమాదాలకు కారణం అవ్వొచ్చన్న ఆలోచనతో ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు
నిజానికి ఈ నిబంధన కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చింది కాదు
ఏడాది క్రితమే DGCA ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది
సదరు ఉత్తర్వులను అమలుచేయాల్సిందిగా విమాన సర్వీసులు అందిస్తున్న అన్ని ఎయిర్ లైన్స్ యాజమాన్యాలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది
అయితే ఆయా సంస్థలకు ఇక్కడొక చిక్కు సమస్య వచ్చి పడింది
విశ్రాంతి పనిగంటలు పెంచితే ఆ మేరకు సిబ్బంది నియామకాలు కూడా పెంచాల్సివస్తుంది
విమానయాన రంగంలో ప్రత్యేకంగా పైలట్లకు ఉన్న జీత భత్యాలు , ఇతర అలవెన్సులు , డిమాండ్ దృష్ట్యా ఇది తమకు ఆర్థిక భారంగా పరిణమిస్తుందని ఎయిర్ లైన్స్ సంస్థలు భావించాయి
అయినా కొన్ని సంస్థలు పని గంటల విషయంలో సానుకూలంగా స్పందించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి
కొత్తగా అదనపు సిబ్బందిని నియమించుకుని సర్వీసులను యధాప్రకారంగా అందిస్తున్నాయి
మరోపక్క ఈ నిబంధనను అమలు చేయడానికి ఇండిగో సంస్థ మాత్రం మంత్రిత్వ శాఖను కొంత గడువు అడిగింది
అంతిమంగా గడువు ఇచ్చినప్పటికీ విమానయాన రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటూ’ విమానం ‘ లాక్కొస్తున్నఇండిగో కొత్తగా మరింతమంది పైలట్లను తీసుకోలేక చేతులెత్తేసింది
అది కూడా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా తమ సర్వీసులను రద్దు చేసింది
దాని ఫలితమే ప్రస్తుత సంక్షోభం
కేవలం ఇండిగోలోనే విమానాలు క్యాన్సిల్ అవడమేంటి ?
విమానయాన రంగంలో కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు పోటీ పడుతూ నడుపుతున్నాయనే సంగతి అందరికీ తెలుసు
పైలట్లకు పని గంటల నిబంధన వల్లనే సంక్షోభం వచ్చిందనుకుంటే అన్నిసంస్థలు తమ సర్వీసులను నిలిపివేయాలి కదా ?
మరి ఒక్క ఇండిగోనే తమ విమానాలను ఎందుకు క్యాన్సిల్ చేసింది ?
ఇది కాకతాళీయకంగా జరిగింది కాదా ?
ఉన్నపళంగా సర్వీసులను రద్దు చేస్తే ప్రయాణీకులు పడే ఇబ్బందులు ఆ సంస్థకు తెలియనివా ?
పోనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమన్నా చేసిందా ?
అంత పెద్ద సంస్థ ఇలాంటి విషయంలో ఎందుకంత అలసత్వం చూపించింది ?
ఈ వివాదంలో రకరకాల కారణాలు బయటికి వస్తున్నాయి
ఇండియాలో చౌకైన ఫేర్ లకు అత్యధిక సర్వీసులు నడుపుతున్న సంస్థగా ఇండిగోకి పేరుంది
మొత్తం విమాన సర్వీసులలో 60 శాతానికి పైగా సర్వీసులు ఈ సంస్థ చేతుల్లోనే ఉంది
సర్వీసులు ఎక్కువగా ఉండటం , ఫేర్ తక్కువగా ఉండటంతో ప్రయాణీకులు ఇండిగో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు
దేశీయ విమాన రంగంలో తమకు ఆక్యుపేషన్ ఎక్కువగా ఉందని ఈ సంస్థకు కూడా తెలుసు
అందుకే అదును చూసి పనిగంటల నిబంధనకు వ్యతిరేకంగా ఫ్లయిట్ క్యాన్సిల్స్ అస్త్రం ప్రయోగించింది
మొదటిరోజు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు
విమానాలు క్యాన్సిల్ అవడం సాధారణంగా జరిగేదే కాబట్టి రొటీన్ వ్యవహారం అనుకుంది
కానీ ఎప్పుడైతే ఇండిగో ఒకదాని వెంబడి మరోకటిగా తమ సర్వీసులను రద్దు చేస్తుందో , ఎప్పుడైతే సోషల్ మీడియాలో విమాన ప్రయాణీకుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయో అధికారులు అప్రమత్తం అయ్యారు
కానీ అప్పటికే ఆ శాఖకు , సంబంధిత మంత్రికి రావాల్సిన అప్రతిష్ఠత వచ్చేసింది
వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ 48 గంటల విశ్రాంతి నిబంధనను తాత్కాలికంగా నిలుపుదల చేసింది
ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా ?
వివాదంపై రామ్మోహన్ నాయుడి స్పందన చూసిన తర్వాత ఇతర కారణాలు కూడా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతుంది
ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు జరిపిస్తామని , ఒకవేళ ఇందులో కుట్ర కోణం ఉంటే మాత్రం తగిన రీతిలో చర్యలు కూడా ఉంటాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు
మరోపక్క కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడ్ని పదవి నుంచి తప్పించేందుకు కొంతమంది నాయకులు పధకం ప్రకారం కుట్రలు చేశారనే కధనాలు కూడా బయటికి వస్తున్నాయి
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కధనాలు చక్కర్లు కొట్టాయి
ఏపీ మంత్రి లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని వార్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేసారని కొన్ని మీడియా సంస్థలు డిబేట్లు కూడా నడిపించాయి
ఏది ఏమైనా దర్యాప్తు పూర్తి అయితే కానీ అసలు కారణం బయటికి రాదు
ఇదిలా ఉండగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవడం వల్ల అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
కొందరు ఎక్కువ రేట్ పెట్టి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చింది
మరికొందరు ఏడుస్తూ ఆ సంస్థ సిబ్బందిని శాపనార్థాలు పెట్టారు
ఓ తండ్రి కన్నీటి ఆవేదన
ఎయిర్ పోర్ట్ సంఘటనలు టీవీల్లో చూసిన చాలామందికి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి
అన్నటికన్నా ప్రయాణీకుల హృదయాలను కదిలించిన సంఘటన ఒకటి జరిగింది
అప్పటికప్పుడు చెప్పాపెట్టకుండా తమ విమానాలను క్యాన్సిల్ చేయడంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ లోని ఇండిగో సిబ్బందిపై ఆందోళనలకు దిగారు
ముందుగా ఏర్పాటుచేసుకున్న కార్యక్రమాలకు తప్పనిసరిగా అటెండ్ కావాలని కొంతమంది వాదనకు దిగగా , ఆరోగ్య కారణాల రీత్యా తాము ఖచ్చితంగా వెళ్లి తీరాలని మరి కొందరు ఆవేదనతో బతిమిలాడటం కనిపించింది
చంటి బిడ్డకు పాలు దొరక్క ఓ తల్లి అక్కడి సిబ్బందితో ఏడుస్తూ తన గోడు చెప్పుకోవడం చామందికి కన్నీరు తెప్పించింది
ఓ తండ్రి తన కూతురికి సానిటరీ న్యాప్కిన్ పాడ్ కావాలని దీనంగా వేడుకోవడం హృదయాలను మెలిపెట్టింది
ఈ పరిస్థితుల్లో ఇండిగో పైలట్ చేసిన విజ్ఞప్తి నెటిజన్ల హృదయాలను తాకింది
ఇంతకీ ఆయన చేసిన విజ్ఞప్తి ఏంటి ?
ప్రదీప్ కృష్ణన్ అనే యువ పైలట్ విమానంలో కూర్చున్న ప్రయాణీకులను ఉద్దేశించి,
“డియర్ ప్యాసింజర్స్..మా సంస్థ ద్వారా మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను .. మీలో చాలామంది అత్యవసర పనుల మీద ఇంటికి వెళ్లాలని నాక్కూడా తెలుసు .. ఎందుకంటే మీలాగే నేను కూడా వృద్ధులైన నా తల్లితండ్రులను చూసుకోవడానికి ఇంటికెళ్ళాలి .. మాకు విశ్రాంతి లేకపోయినా మీ అందర్నీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చటానికి చిత్తశుద్ధితో పని చేస్తాం .. ప్రస్తుతం మేము సమ్మెలో లేము .. దయచేసి అర్ధం చేసుకోండి .. గ్రౌండ్ స్టాఫ్ ని దూషించకండి .. ఎందుకంటే వాళ్ళు కూడా జీతం కోసం పనిచేస్తున్న ఉద్యోగులే .. నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు .మా విమానాలు క్యాన్సిల్ అవడంతో మీరు పడుతున్న ఇబ్బందులు సోషల్ మీడియాలో చూసి నాక్కూడా మనసు బాధతో నిండిపోయింది . ఎందుకంటే విమానాలు క్యాన్సిల్ అయితే ఒక్కోసారి అత్యవసరంగా కలుసుకోవాల్సిన కుటుంబ సభ్యులను కలుసుకోలేం . ఆ బాధ నాకు తెలుసు . అందరూ అర్ధం చేసుకుని సహకరించండి . కొద్ది రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని” ఆయన అభ్యర్ధించారు
ఇదే విషయాన్ని ఆయన తన ఇన్స్టా గ్రామ్ లో కూడా షేర్ చేసారు
పైలట్ చేసిన కన్నీటి అభ్యర్థన ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది
వయసులో చిన్నవాడైనా ఎంతో పరిణితితో , బాధ్యతతో మాట్లాడాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు
ప్రయాణీకుల పట్ల ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం పట్ల ఆగ్రహంగా ఉన్న ప్రజలు, అదే సంస్థలో పనిచేస్తున్న ఈ పైలట్ చేసిన అభ్యర్థన మాత్రం హార్ట్ టచింగ్ గా ఉందని సానుకూలంగా స్పందించారు !
