Home » ఇంతకీ ఆ ఇద్దరిలో సీరియల్ కిల్లర్ ఎవరు ? ఇరుల్ మూవీ రివ్యూ

ఇంతకీ ఆ ఇద్దరిలో సీరియల్ కిల్లర్ ఎవరు ? ఇరుల్ మూవీ రివ్యూ

Spread the love

ఈ మధ్య కాలంలో మళయాళంలో విలక్షణమైన సినిమాలు చేసిన నటుల జాబితాలో ఫహాద్ ఫాసిల్ అండ్ సౌబిన్ సాహిర్ ప్రత్యేకంగా ఉంటారు

ఎందుకంటే తమకిచ్చిన పాత్ర ఎటువంటిదైనా కానివ్వండి , అందులో జీవించేస్తారు

ఒక సినిమాలో అమాయకత్వం ఒలకబోస్తే , ఇంకో సినిమాలో క్రూరత్వం ఒలకబోస్తారు

వీరిద్దరికీ నటనలో ఉన్న కామన్ లక్షణం ఏంటంటే ,

కొంతమంది నటుల మాదిరి ఒకే రకమైన ఇమేజ్ చట్రంలో కూరుకుపోకుండా ఎటువంటి పాత్రలో అయినా నటించి మెప్పిస్తారు

అటువంటి విలక్షణమైన పాత్రలు చేయడం ద్వారా తెలుగు వారిలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు

పుష్ప సినిమాలో నటనకు గాను ఫహాద్ ఫాసిల్ , కూలీ సినిమాలో నటనకు గానూ సౌబిన్ సాహిర్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతారు

ఇక మళయాళం మూవీలు చూసేవారికైతే వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

పొరపాటున ఒకవేళ థియేటర్లో చూడటం మిస్ అయినా సరే ఓటిటీల్లో వెతుక్కుని మరీ చూస్తారు

మళయాళం వాళ్లదాకా ఎందుకు ? నాలాంటి వాళ్ళు కూడా చూస్తారు

అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో రిలీజ్ అయిన సినిమా కంటపడితే ఒదులుతామా ?

అందులోనూ సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కావడంతో ఓ లుక్కేస్తే పోలా అనిపించింది

ఇరుల్ సినిమా ఐదేళ్ల క్రితమే రిలీజ్ అయి కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకుంది
తర్వాత మళయాళంలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ ఓటిటీ లో స్ట్రీమింగ్ కి వచ్చింది

ఆ తర్వాత ఇదే సినిమా అపరాధి పేరుతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ కి వచ్చింది

సైకలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారు చాలామంది ఈ సినిమాని ఈసరికే చూసి ఉంటారు

అయిననూ నేటికీ చూడని వాళ్ళకోసం ఈ రివ్యూ

ఇరుల్ కధేంటి ?

అసలుకు ఇరుల్ అంటే తెలుగులో డార్క్ లేదా చీకటి అని అర్ధం
టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా చాలావరకు చీకట్లోనే నడుస్తుంది

ఆ మాటకొస్తే చాలా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలావరకు చీకట్లోనే నడిచాయి. నడుస్తాయి కూడా

ఇప్పుడు కథలోకి వస్తే ,

అలెక్స్ ( సౌబిన్ సాహిర్ ) క్రైమ్ నవలలు రాసే రైటర్

అతడి గర్ల్ ఫ్రెండ్ అర్చన ( దర్శన రాజేంద్రన్ ) హైకోర్టులో క్రిమినల్ కేసులు చూసే లాయర్

ప్రొఫెషన్ పరంగా ఇద్దరికీ క్రైమ్ పట్ల పూర్తి నాలెడ్జ్ ఉంటుంది

ఓ రోజు అలెక్స్ తన గర్ల్ ఫ్రెండుతో కలిసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు

అయితే ఎప్పుడూ ఫోన్లతో బిజీగా ఉండే తన గర్ల్ ఫ్రెండుకు అతడు ఒక కండిషన్ పెడతాడు

అదేంటంటే , ఇద్దరూ ఫోన్లు ఇంట్లోనే వదిలేసి వీకెండ్ ట్రిప్ కి వెళ్ళాలి అంటాడు

దానికి అర్చన కూడా ఒప్పుకుని తన మొబైల్ ఫోనును ఇంట్లోనే వదిలేసి అతడితో బయలుదేరుతుంది

అలా ఓ వర్షం కురుస్తున్న రాత్రి ఇద్దరూ కారులో హిల్ స్టేషన్ వైపు ఘాట్ రోడ్ లో వెళ్తుంటారు

ఇంతలో సడెన్గా వాళ్ళ కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది

ఫోన్లు ఇంటిదగ్గరే వదిలేసి రావడంతో మెకానిక్ కి ఫోన్ చేసే అవకాశం కూడా లేదని ఇద్దరికీ అర్థమైపోతుంది

ఇప్పుడెలా అని భయంగా చుట్టూ చూస్తున్నప్పుడు అక్కడికి దగ్గర్లోనే లైట్లు వేసి ఉన్న ఓ బిల్డింగ్ కనిపిస్తుంది

ఆ బిల్డింగ్ లో వాళ్ళని ఫోన్ అడిగి మెకానిక్ ని పిలిపిద్దామని ఇద్దరూ వెళ్లి మెయిన్ డోర్ కొడితే ఓ అపరిచిత వ్యక్తి ఉన్ని ( ఫాహద్ ఫాసిల్ ) తలుపు తీస్తాడు

ఇక్కడ్నుంచే అసలు క్రైమ్ స్టోరీ మొదలౌతుంది

తలుపు తీసిన ఉన్నితో తమ కారు రిపేర్ వచ్చి రోడ్డు మీద ఆగిపోయింది కాబట్టి ఒకసారి మీ ఫోన్ ఇస్తే మెకానిక్ కు కాల్ చేస్తాం అని అర్చన అడిగితే అతడు ఆశ్చర్యంగా తాను మొబైల్ ఫోన్లు వాడనని చెప్తాడు
కావాలంటే వర్షం తగ్గేదాకా ఇంట్లో ఉండొచ్చని చెప్పడంతో ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు

అక్కడ ముగ్గురూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నప్పుడు అర్చన హైకోర్టు లాయరని , అలెక్స్ రైటరనీ అపరిచితుడికి తెలుస్తుంది

అలెక్స్ రాసిన ఇరుల్ నవల తాను చదివానని అందులో సైకో వరుసగా ఐదుగురు మహిళలను హత్య చేసినట్టు స్టోరీ నేరేషన్ ఉంది కానీ సీరియల్ కిల్లర్ ఆ హత్యలను ఎందుకు చేస్తాడో క్లారిటీగా రాయలేదని ఉన్ని చెప్తాడు

ఇదిలా ఉండగా సడెన్గా కరెంట్ పోవడంతో మెయిన్ బోర్డు చూడటానికి అలెక్స్ ఉన్నితో కలిసి బేస్మెంట్ కి వెళ్తాడు

అక్కడ గదిలో ఒక మహిళ డెడ్ బాడీ చూసి షాక్ అవుతాడు

అచ్చం అతడు తన నవలలో రాసినట్టు ఎవరో సీరియల్ కిల్లర్ ఆమెను హత్య చేసి గాల్లో తాడుకు కట్టి వేలాడదీస్తాడు

ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలౌతుంది

తన నవలలో రాసినట్టు అలెక్స్ సీరియల్ హత్యలు చేసాడని ఉన్ని అర్చనకు చెప్తాడు

కాదు ఉన్ని అబద్దం చెప్తున్నాడు , అతడే ఈ హత్యలు చేసాడని అలెక్స్ అర్చనతో చెప్తాడు

ఇప్పుడు అర్చన డైలమాలో పడుతుంది

ఇద్దరిలో ఒకరు సీరియల్ కిల్లర్
ఒకరు అబద్దం చెప్తున్నారు

ఈ ఇద్దరిలో అసలు హంతకుడు ఎవరు ?

ఉన్ని కి ఆ ఇంటికి ఏంటి సంబంధం ?

అసలు సీరియల్ కిల్లర్ ప్రత్యేకంగా మహిళలనే ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

సినిమా మొత్తం మనకి ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు

వారిలో ఫాహద్ ఫసల్ ఒకరు , సౌబిన్ సాహిర్ మరొకరు , దర్శన రాజేంద్రన్ మరొకరు అంతే

అది కూడా కథంతా ఒక రాత్రిలోనే , ఒక బిల్డింగులోనే ముగుస్తుంది

అలెక్స్ అండ్ అర్చన ఆ వర్షం కురిసిన రాత్రి రోడ్డుపక్కన కనిపించిన బిల్డింగులోకి ఎంటర్ అవడంతోనే అసలు క్రైమ్ స్టోరీ మొదలౌతుంది

ఆ ఇంటి వాతావరణం , ఇంట్లో ఉన్న ఫహద్ ఫాసిల్ గెటప్ చూసిన తర్వాత ముందు ఇదేదో దయ్యం సినిమా అనుకుంటాం

కానీ అలెక్స్ తన నవలలో సైకో సీరియల్ హత్యల గురించి రాసాడని తెలియడంతో కొంత క్లూ దొరికినట్లయింది

అచ్చం అతడు నవలలో రాసినట్టుగానే ఆ ఇంటి బేస్మెంట్లో ఒక మహిళ డెడ్ బాడీ ఉండటంతో ఉన్నినే (ఫహద్ ) ఈ హత్యలు చేసాడని అనుకుంటాం

అలా అనుకుంటే ఇక స్టోరీ ఏముంటుంది ?

అలెక్స్ నిజాలను దాస్తున్నాడని , అతడే సీరియల్ కిల్లరనీ ఉన్ని అర్చనతో చెప్తాడు
ఇది స్టోరీలో ఊహించని ట్విస్ట్

ఇప్పుడు ఇద్దరిలో ఒకరు సీరియల్ కిల్లరని అర్చనకు అర్థమైపోతుంది
కానీ ఎవరో కనుక్కోవడం ఎలా ?

ఇదే ప్రశ్న మూవీ చూస్తున్న మనకు కూడా వస్తుంది
ఇక్కడ్నుంచి సస్పెన్స్ టెంపో మొదలౌతుంది

ఇద్దరిలో ఎవరి వాదన చూసినా నిజమే చెప్తున్నారు అనిపిస్తుంది
కానీ అసలు హంతకుడు ఎవరో క్లైమాక్స్ దాకా బయటపడదు
అదే ఈ సినిమాకి గ్రిప్పింగ్

అయితే మనం క్లైమాక్స్ దాకా అసలు హంతకుడు ఎవరు అని అంత క్యూరియాసిటీగా చూస్తామా ?
దర్శకుడు మాత్రం క్లైమాక్సుని సింపుల్గా ముగించేస్తాడు

సెకండాఫ్ లో కొనసాగించిన టెంపోని చివరివరకు మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది

లాజికల్ గా చూసుకుంటే మూవీలో చిన్నచిన్న లోపాలు కూడా ఉన్నాయి

అంతటి క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఉన్న లాయర్ అర్చన కూడా కేవలం మూడు నెలల పరిచయంతోనే మొబైల్ కూడా వదిలేసి అలెక్స్ తో వీకెండ్ బయలుదేరడం , నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ముక్కు ముఖం తెలియని అపరిచితుడి ఇంట్లో ఫ్రీగా మూవ్ అవడం , ఆ ఇంట్లో తనకు నచ్చిన దుస్తులను సైతం సెలెక్ట్ చేసుకుని మార్చుకోవడం , వైన్ తాగడం కొంత అసహజంగా అనిపిస్తాయి

ఇద్దరిలో సీరియల్ కిల్లర్ ఎవరు అనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగించడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఎండింగులో మాత్రం తడబడ్డాడు

ఆ ఎండింగ్ ఏంటనేది ఇక్కడ చెప్పకూడదు
చెప్తే ఆ కాస్త క్యూరియాసిటీ కూడా పోతుంది

ఎవరెలా చేసారు ?

ముందే చెప్పినట్టు ఈ సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది

వారిలో అలెక్స్ పాత్ర పోషించిన సౌబిన్ సాహిర్ పూర్తి న్యాయం చేసాడు
సన్నివేశానికి తగ్గట్టు హావభావాలు ప్రదర్శించాడు

ఇక ఉన్ని పాత్రలో ఫాహద్ ఫసల్ కూడా చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు
కాకపోతే సినిమాలో మూడొంతులు అతడు ఒకే ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు
ఈ విషయంలో దర్శకుడు మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది

మూడో పాత్ర అర్చన , దర్శన రాజేంద్రన్ నటన బాగానే ఉంది
ఓవరాల్ గా ఇరుల్ మూవీలో ముగ్గురూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు

సాంకేతికత

హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే , హడలగొట్టే బీజీఎమ్ అండ్ డార్క్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోస్తాయి

ఆ పరంగా ఈ రెండు పాళ్లు సమపాళ్లలో పడ్డాయి

ముఖ్యంగా బిల్డింగులో కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలుగులు , చీకటి గదులను చూపించడంలో కెమెరా పనితనం బాగానే వాడారనిపిస్తుంది

క్లైమాక్స్ పరంగా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని దర్శకుడు మరింత క్లారిటీగా , కాస్త ఎలాబోరేట్ గా చెప్పి ఉంటే బాగుండేది

విశ్లేషణ :

హర్రర్ ,సస్పెన్స్ ,క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో మూవీలు ఇష్టపడేవారికి ఇరుల్ నచ్చుతుంది . తెలుగులో కూడా అపరాధి పేరుతో ఆహా ఓటిటీ లో చూడొచ్చు . సాధారణంగా హర్రర్ , క్రైమ్ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ , అశ్లీల దృశ్యాలు అన్నోఇన్నో ఉంటాయి . కానీ ఈ మూవీలో ఆ బెడద లేదు . ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిక్షేపంగా చూడొచ్చు . ఇద్దరిలో అసలు హంతకుడు ఎవరనే విషయంలో మూవీ చూస్తున్న మనం కూడా కొంత ఎగ్జైట్ అవుతాం . ఓవరాల్ గా మూవీ నిరాశ పరచదు

నటీనటులు : ఫాహద్ ఫసల్ , సౌబిన్ సాహిర్ , దర్శన రాజేంద్రన్ తదితరులు
విడుదల : నెట్ ఫ్లిక్స్ ( మళయాళం ) , ఆహా (అపరాధి తెలుగు )
రేటింగ్ : 2.75


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!