“కట్టప్పా .. రాజ్యంలో ఏం జరుగుతుంది ? “భళ్లాలదేవ సూపర్ మార్కెట్ పెట్టి ఒక్క పుట్టగొడుగు ఐదు లక్షలకు అమ్ముతున్నాడు తల్లీ!”

Spread the love

“కట్టప్పా .. రాజ్యంలో ఏం జరుగుతుంది ?”

“భళ్లాలదేవ సూపర్ మార్కెట్ పెట్టి ఒక్క పుట్టగొడుగు ఐదు లక్షలకు అమ్ముతున్నాడు తల్లీ !”

” పుట్టగొడుగులు అనగానేమి కట్టప్పా ?”

” నాకూ తెలీదు తల్లీ .. చిన్నప్పుడు పొలం గట్టు వెంబడి వెళ్తుంటే చెట్ల మధ్యలో యేవో గొడుగులు చూపించి అవే పుట్టగొడుగులు అని మా తాత చుట్టప్ప చెప్పేవాడు తల్లీ !”

“అయినా ఆ గొడుగులు ఐదు లక్షలు పెట్టి కొనుక్కునే సామంత రాజులు ఇంకా ఉన్నారంటావా ?”

“వెర్రి వేయి విధాలు అన్నారు కదా తల్లీ .. అది క్యాచ్ చేసే మన భళ్లాలదేవ ఆ దుకాణం పెట్టాడు తల్లీ “

“సరే ఏదో మార్కెట్ అన్నావ్ ? భళ్లాలదేవ అక్కడేం చేస్తాడు ? “

“అమ్ముతాడు తల్లీ “

“ఎవర్ని?”

“ఇంకా ఎవరిజోలికీ వెళ్ళలేదు తల్లీ .. అవీఇవీ అని లేదు దొరికినవన్నీ ఇందులో అమ్మేస్తున్నాడు తల్లీ “

“అవునా కట్టప్పా ” భళ్లాలదేవుడికి చిన్నప్పటినుంచీ బిజినెస్సు మైండూ .. అన్నీ వాడి తాత పోలికలు వచ్చాయి .. సరే గొడుగులతో పాటు రైను కోటులు కూడా అమ్ముతున్నాడా ?”

“పొరబడుతున్నావ్ తల్లీ .. మన భళ్లాలదేవుల వారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గొడుగులూ .. రైను కోటులూ అమ్మట్లేదు తల్లీ .. మన రాజ్యంలోనే ఆ కొండలవీ ఉంటాయే బంజారాహిల్స్ లో దుకాణం పెట్టాడు తల్లీ “

“అవునా !ఆ దుకాణం నామధేయం ఏమి ?”

“ఫుడ్ స్టోరీస్ తల్లీ “

“పేరు కడు విచిత్రముగా ఉన్నది కట్టప్పా “

“అవును తల్లీ బాహుబలి వెళ్లిపోవడంతో స్టోరీలు లేక ఇలా ఫుడ్ స్టోరీస్ పెట్టాడు తల్లీ “

“భళా ! ఫుడ్ స్టోరీస్ లో ఏమి దొరుకును ?’

“ఏమి దొరకవు అని అడుగు తల్లీ .. బాబు అన్నీ దింపేసాడు .. కాకపోతే అన్నీ మన స్థాయికి తగ్గకుండా అమ్ముతున్నాడు తల్లీ .. పావు కిలో టమోటా 850 రూపాయలు మాత్రమే తల్లీ “

“ఔరా ! అంత ధరయా ? “

“ఆశర్యపోకు తల్లీ అది పక్కదేశం నెదర్లాన్డ్స్ నుంచి తెప్పించిన టమోటాలు .. కొబ్బరిబోండాం వెయ్యి రూపాయలు .. అది థాయిలాండ్ బొండాం తల్లీ “

“ఏమిటీ ధరవరలు కట్టప్పా .. సామాన్యుడు కొనగలిగేవేనా ? ఇటువంటి దుకాణాలు పెట్టి భళ్లాలదేవుడు మహిస్మృతి సామ్రాజాన్ని ఆ చైనా వాడికి తాకట్టు పెట్టే విధంగా ఉన్నాడే ?”

” తప్పు తల్లీ శుభం పల్కవలె .. బాబు తెలివితేటలు మీకు తెలియంది కాదు .. ఆయన దుకాణం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగటానికి మన సామంత రాజులు చాలు తల్లీ “

“సరే మన బాహుబలి ఎక్కడ ?’

“అనుష్కతో కొద్దిగా గ్యాప్ రావడంతో ప్రస్తుతం పొరుగు రాజ్యం యువరాణికి లైనేస్తున్నాడు తల్లీ “

“సరే .. ఇవాళ నీ పనులేంటి ?”

“ఖాళీనే తల్లీ .. మీరు ఎవడినన్నా వెనకనుంచి పొడిచి రమ్మంటే పొడిచోస్తా తల్లీ “

“నా మాటే శిలాశాసనం .. ఎవడ్ని పొడవాలో తర్వాత చెప్తా .. అందాక భళ్లాలదేవుడి దుకాణానికి వెళ్లి ఒక పది గొడుగులు పట్రా “

పది గొడుగులా ? అక్కడ బాబు ఒక్కో గొడుగు ఐదు లక్షలకు అమ్ముతున్నాడు అన్చెప్తుంటే ఈవిడేంటి పది గొడుగులు తెమ్మంటుంది .. తినడానికా ? పంచిపెట్టడానికా ? పైగా శిలాశాసనం అంటుందేంటీ ? ఇంకెక్కడి శిలాశాసనం .. ఎప్పుడో కిలో శాసనం అయిపోతేనూ అని మనసులోనే పరిపరి విధముల ఆలోచించుతూ కట్టప్ప గొడుగుల కోసం బయలుదేరెను

( ఇది వీరమల్లు మాదిరి కల్పిత కథ ..సరదాగా రాయబడింది .. ఇందులో పాత్రలూ , సన్నివేశాలు ఎవర్నీ ఉద్దేశించినవి కాదు..
చిత్తగించవలెను )

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!