-పేరాల బాలకృష్ణ 
విశ్వనాథ వారు భోజన ప్రియులే కానీ ఎప్పుడూ తమ ఆరోగ్యం విషయంలో ఎక్కడా అశ్రద్ధ లేదు.
ఆనాడు పొద్దున నేను అమ్మమ్మగారికి మాఇంట్లో కాసిన దొండకాయలిద్దామని వెళ్ళా…
వరెండా దాటి మధ్య గదిలోకి వచ్చేసరికి, ఆ పక్క గదిలోంచి … అది తాతగారి పడగ్గది …. గట్టిగా బుస కొడుతున్న శబ్దం వినిపించి భయ భయంగా దగ్గరకేసున్న ఆ తలుపు నెమ్మదిగా తోసా….
అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తా ” అమ్మమ్మా! తాతగారికేదో అయింది ఆ గదిలో గోడ దగ్గర తలకిందులుగా నుంచున్నారు. బాగా ఆయాసంగా ఉందాయనకు…. బాబాయేడీ ?” గాభరా గాభరాగా అడిగా
ఆవిడ గట్టిగా నవ్వి, నాభుజం మీద చెయ్యేసి ఆయన దగ్గరకు తీసుకెళ్ళి…. “తాతగారు ఆసనాలేస్తున్నార్రా” అని చూపించారు…. అది శీర్షాసనం అన్నారు….
ఐదారు నిముషాలు అలాగే ఆ ఆసనం వేసి నెమ్మదిగా ముగించి కూర్చున్నారు. ఒక్క నిముషంలో ఆయాసం తగ్గి మామూలుగా అయ్యారు. శీర్షాసనం వల్ల రక్త ప్రసరణ చాలా బాగుంటుందిట ….. తాతగారే చెప్పేరు!
ఆయన…. నన్నుచూసి…. “ఏవిట్రా ఇంత పొద్దున్నే ఇటొచ్చావ్? …..మీనాన్నేమీ నా దగ్గరలేడే ” అంటూ చమత్కారంగా తన మంచం కిందకు తొంగి చూస్తూ నవ్వుతూ అడిగారు
హమ్మయ్య ఈయన బాగానే ఉన్నార్లే అనుకుని…. ‘మా దొడ్లో కాసిన దొండకాయలిచ్చి రమ్మని బామ్మ చెపితే వచ్చా…. నాన్న మా ఇంట్లోనే ఉన్నాడులే …. అయినా ఇదేమీ సాయంత్రం కాదుగా…. నాన్నిక్కడుండటానికి అన్నా’…. తాతగారితో నేనుకూడా
ఆయన అన్నంత చమత్కారంగా …..! ఆయన చేతులు నొక్కుతూ…. !
ఆయన నా చమత్కారానికి చిన్నగా ఓ మొట్టికాయ వేసి గట్టిగా నవ్వారు. ఆయన అంతలా నవ్వటం అదే నేను మొదటిసారి చూడటం.
తాతగారికి నేను అలా ఆయన చేతులు నొక్కటం హాయిగా అనిపించిందేమో ఇంకొంచం నా ముందుకు చాపి చేతులు నొక్కే అవకాశం నాకిచ్చి ఆ హాయిని అనుభవించారు అరమోడ్పు కళ్ళతో.
ఆ మాత్రపు చిన్న సేవకే ఆయన కళ్లలో కనపడ్డ ఆ సుఖంతో కూడిన ఆనందం, ఎంత బాగుందో చూట్టానికి.
అమ్మమ్మగారు ఆ దొండకాయల సంచీ తీసుకుని ” వసుంధరా….! భరత్శర్మ …. వాళ్ళింట్లో కాసిన దొండకాయలు బాలయ్యకిచ్చి పంపించాడు” అంటూ ఆవిడకిచ్చారు.
తాతగారు వసుంధరత్తయ్య వైపు చూస్తూ ” చక్రాలుగా తొరిగి ఏ వేపుడో చేయవాక, మగ్గించి ఏ తిరగమాతో తగలబెట్టి …. తిండి మీద ఇచ్ఛ పోయేట్టు చేయక! ఆ కాయల్ని …. నిలువుగా తోకలుగా తరిగి పులుసు, బెల్లం పెట్టి చెయ్యి. దానిమొహాన ఇంత ఇంగువ పోపు వెయ్యి…. కొరుక్కోవటానికి నాలుగు ఎండు మిరపకాయలు వేయించు…. మిరపకాయలు వేయించేటప్పుడు లోపలి గింజలు కూడా బాగా వేగేట్టుగా వేయించేడు” అన్నారు జపమాల తిప్పుకుంటూ
“డాక్టరు గారు కారాలు తగ్గించవయ్యా బాబూ అంటుంటే…. మీరేమో
కూరలో కొరుక్కోవటానికి ఎండుమిరపకాయలు వేయించు, అన్నంలో కలుపుకోవటానికి పండు మిరపకాయల కారం చెయ్యి…. అని తెగ గొడవ చేస్తున్నారు…. ఏమన్నా అర్థం ఉందా ….. ” అని కసురుకుంటూ, అమ్మమ్మ గారి దగ్గరినుంచి ఆ సంచీ తీసుకుంది …. అనటం కంటే లాక్కుంది …. వసుంధరత్తయ్య…!
సాయంత్రం గురువు గారింటి నుంచి వచ్చిన్తర్వాత రాత్రి భోజనాల దగ్గర కబుర్లలో నాన్నగారు చెప్పారు ” పొద్దున దొండకాయ పులుసు బెల్లం పెట్టి కూర చేసిందిట వసుంధర …. అమృతాయమానంగా ఉంది! మీ తల్లిగారి పుణ్యం…..! (మెడ పీక్కుపోయెట్టు చచ్చెట్టుగా ఆ దొండ పందిరి కింద నుంచుని కాయలు కోసింది నేను …. చూశారా…. కాంప్లిమెంటేమో బామ్మకి….! ఏదో….. చమత్కారానికి లేండి…!) అన్నారే మాష్టారు అని బామ్మతో….అంటూ ఏదేమైనా వసుంధర నోరు పెద్దదేగానీ వంట బాగా చేస్తుందోయ్ …. అన్నారని కూడా చెపుతూ…! మాష్టారిచ్చిన మునక్కాడలు అమ్మకిచ్చారు!
మాష్టారు చిన్న కొంకీ కట్టిన కర్రతీసుకుని మునక్కాడలు కోద్దామని వరెండా మెట్లు దిగుతుంటే అప్పుడే బయటినుంచి వస్తున్న పావని బాబాయ్ ఆ కర్ర తీసుకుని మునక్కాడలు కోసిచ్చాడు….. మీరు కోద్దామనే ….. ఆ ….. అంటూ ఆయన్ని కోప్పడుతూ…..!
వీధిగుమ్మం దగ్గరున్న ఆ మునగ చెట్టుకి కాయలెన్ని కాస్తాయో దానికి పదిరెట్లు గొంగళి పురుగులు. చెట్టంతా గొంగళి పురుగులు పరుచుకుని ఉంటాయి!
అబ్బో ఆ చెట్టు దగ్గర బొంగరాలు ఆడుకుంటుంటే ఎన్నిసార్లు పాకేయో నా మీద….దద్దుర్లు ఎక్కి, జిలపుట్టి గోకి గోకి కాళ్ళు చేతులు రక్కుకుపోయి నానా హింసగా ఉండేది వాటితో……!
ఏదో చెప్తానంటూ ఇంకేదో చెపుతున్నా కదూ….! ఆ…. ఆసనాలు….
నేనారోజు వాళ్ళింటికెళ్ళేసరికి తాత గారు
ఏదో నవల చెపుతుంటే నాన్నగారు రాస్తున్నారు.
మామూలుగా వేసుకునే
గుడ్డ బనీను కూడా వేసుకోలేదాయన. కాశీ తువాలు మాత్రం ఎడం భుజం మీద ఉంది !
వారు కూర్చునే వరండాలో నాలుగు పడక్కుర్చీలు, సింహాలు చెక్కిన కోళ్లతో చేసిన ఒక దివాను బల్ల ఉంటాయి.
ఆ దివాను బల్ల మీద ఒక తివాసీ పరిచి ఉంటుంది! తాతగారు ఆ పడక్కుర్చీలోనో లేదా ఆ దివాను బల్లమీదో కూర్చునేవారు.
ఆనాడు ఆ దివాను బల్లమీద మఠం వేసుకుని కూర్చున్నారు. చేతులు రెండూ వెనక్కి చాపి ఆ చేతులమీద వెనక్కి వాలి కూర్చున్నారు
….పాత రోజుల్లో టేబులు మీద పెట్టుకునే మొహం చూసుకునే చిన్న అద్దానికి వెనకవైపుండే స్టాండు లాగా తన బలమంతా ఆ చేతులమీద మోపి గోడకి ఆనుకోకుండా కూర్చున్నారు … కుడి చేతి వేళ్ళ మధ్యలో పొడుం డబ్బా పట్టుకుని.
నాన్నగారికి ఏదో చెపుతున్నవారు హఠాత్తుగా ఆపేసి పొట్టను లోపలికి అక్కళించి… గిరగిరా తిప్పారు.
నేను అవాక్కైపోయా…. పల్చటి పొట్ట. గురువుగారికి నుదుటిమీద విభూది రేఖల్లాగా గీతలు ఉంటాయి. అలాగే వారి పల్చటి పొట్ట మీద కూడా సన్నటి ముడుతలు ఉండేవి.
నూజివీడు పెద్దరసం మామిడి పండు టెంకలా పల్చగా ఉండేది తాతగారి పొట్ట. ఆ పొట్టను వారు అలా లోపలికి అక్కళించి గిర గిరా తిప్పుతుంటే …. అదికూడా సవ్య, అపసవ్య దిశల్లో తిప్పుతుంటే …. నేను చాలా ఆశ్చర్యంగా ఉగ్గపట్టి చూస్తూ ఉండిపోయా….
ఆ పొట్టను అలా అక్కళించే సరికి పొట్ట ఒక చిన్న ఇత్తడి గిన్నెలా కనిపించి చాలా తమాషాగా అనిపించింది
గుప్పెడు కండ కూడా లేని పహిల్వాన్ పొట్ట లోపలికి బిగించి గుండెలుబ్బించి కండలు చూపిస్తున్నట్లు ఉంది ఆయన శరీరం పక్కటెముకలు కనపడుతూ…. !
ఇప్పుడు మనవాళ్ళు కపాల్ భాతి అంటారే అదేనేమో….. ఐనా ఈ రోజుల్లో మనవాళ్ళ కపాల్ భాతి ఏముంది లేండి పొట్ట కొంచం వెనక్కి ముందుకు కదల్చటమే గగనమై పోతోంది. గురువుగారి దగ్గర ఏభై, అరవై ఏళ్ల క్రితమే చూసా…. అసలు సిసలైన కపాల్ భాతి!
అసలు వారు వైద్య సలహాతో జాగ్రత్త పడవలసినంత అతిక్రమణ ఏనాడు చేయలేదు ఆరోగ్యం విషయంలో.
ఆయన నాకు గుర్తున్నంతవరకు చ్యవనప్రాశ పొద్దునొక చెంచా సాయంత్రం ఒక చెంచా తినేవారు. రాత్రిపూట ఒక చెంచా మాదీఫల రసాయనం తాగేవారు.
ఒకసారి చ్యవనప్రాస సీసాలోంచి తీసి ఉండ చేస్తూ ఈ చ్యవనప్రాశ …. దానికి మంచిది…. దీనికి మంచిది…. అని అంటారు. ఇది మనల్ని మభ్య పెడుతుంది. మనల్నదేదో ఉద్ధరిస్తుందని కక్కుర్తిగా తినేడుస్తాం …. అంటూ నర్మగర్భంగా నవ్వేరు.
ఆ నవ్వులో ఉన్న కొంటె తనానికి నాన్నగారు కూడా నవ్వు కలిపి నావంక చూసారు నేనెందుకు అక్కడ? అన్నట్లుగా…..
గురువుగారి లాగా నాన్నగారు కూడా చ్యవనప్రాశ తినేవారు. ఒకసారి నాకూ పెట్టారు. బానే ఉంటుంది రుచికి…. తియ్య తియ్యగా…. పుల్ల పుల్లగా. నాకు గుర్తున్నంత వరకూ అవే వారు తీసుకున్న ఆరోగ్య రక్షణ జాగ్రత్తలు.
మామూలుగా వారు నడవటం అంటే నాలుగు వీధుల తర్వాత ఉన్న మా ఇంటికి నడిచి రావటమే వారి నడక!
ఆసనాలు కాకుండా వేరొక వ్యాయామం అంటే …. గుడ్డ బనీను వేసుకునో, వేసుకోకో మోకాళ్ళ పైకి పంచ మడిచి దోపుకుని, భుజంమీద, ముక్కు పొడుం వాసనతో, వారినోటి వచ్చే లాలాజలంతో కొంచం తడి తడిగా ఉండే ఎర్ర కాశీ తువాలుతో మా ఇంటికి వచ్చే నడకే నడక!
అలా వారు రావటం మాకు గజారోహణ సన్మానమంత !
ఆయన అలా వచ్చారు అంటే అప్పటికి నాన్నగారు గురువు గారింటికి రెండ్రోజులుగా వెళ్ళకుండా డుమ్మా కొట్టారన్నమాట!
ఆనాడు ఇంటికొచ్చి వీధిలో నుంచే ‘ భరత్శర్మా అని పిలుస్తూ లోపలికి అడుగు పెట్టి, ఆమాటా ఈ మాట మాట్లాడి వంటేమిటమ్మా?’ అని అడిగారు అమ్మని.
తోట కూర వడియాలేసి పొడికూర, కొబ్బరి మామిడికాయ కలిపి పచ్చడి, వంకాయ కారపు కాయ పులుసు చేసి ఊరు మిరపకాయలు వేయించమన్నారండీ కూరలో కొరుక్కోవటానికి అన్నది అమ్మ
” వం…కా…య… కా…ర…పు… కా…య… పులుసా………!!!???? ఎలాచేస్తారమ్మా….? ” అని ఆశ్చర్యంగా అడిగారు.
“చిక్కటి బెల్లం పులుసుచేస్తాను…. వంకాయ నాలుగు పక్షాలుగా తొడిమల దాకా తరిగి, ఉల్లిపాయలు ఎండుమిరపకాయలతో రోటికారం నూరి కాయల్లో పెట్టి తొడిమ తోపాటుగా వేయించి వాటిని ఈ చిక్కటి బెల్లం పులుసులో నానేస్తాను బాబాయి గారూ. చాలా ఇష్టం ఆయనకు” అన్నది అమ్మ
” భరత్శర్మా ! నువ్వు భోగివయ్యా! అమ్మాయి చెపుతుంటేనే జిహ్వ ఆవురావురుమంటోంది అంటూ … అమ్మిచ్చిన కాఫీ తాగి మంచినీళ్లతో మూతి తుడుచుకుని మరో అరగంట కూర్చుని హాయిగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుని, సాయంత్రం వస్తావుగా …. అంటూ బయల్దేరి వెళ్ళేరు.
అదీ ఆ గురు శిష్యుల అరమరికలు లేని బాంధవ్యం …. అది నాన్నగారికి లభించిన గురు కటాక్షం అయితే …. నాకు దొరికిన తాతగారి బాంధవ్యం! ప్రేమానుబంధం ……!
