– పేరాల బాలకృష్ణ
. విజయవాడ అలంకార్ థియేటర్కెళ్లిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ !
సాయంత్రం ఐదయింది. నేను రోడ్డునపడి కాగితం రాకెట్లు ఎగరేస్తూ, పరుగులు పెడుతూ ఆడుకుంటున్నా……!
కొంచం దూరంగా గురువుగారు రిక్షాలో మాయింటి కొస్తూ కనిపించారు. ఆయన్ని చూడగానే ఆ రిక్షాకి ఎదురెళ్లి వెనకాల వేలాడుతూ నేనూ పరిగెడుతూ వచ్చా. రిక్షా దిగిన తాతగారి చెయ్యి పట్టుకుని ఆయనతో పాటు లోపలికొచ్చాను.
నాన్నగారు హడావిడి హడావిడిగా తయారవుతున్నారు.
గేటు తీస్తున్న చప్పుడుకి బయట మాష్టార్ని చూసి నాన్నగారు ఎదురెళ్ళారు.
నాన్నగారి మనసులో ఉన్న ప్రశ్న ఊహించి “వాళ్ళు కారు పంపించలేదు భరత శర్మా ! ఆలస్యం అవుతుందేమోనని రిక్షాలో వచ్చేసా” అంటూ లోపలికి నడిచారు.
“ఎందుకు మాష్టారూ….. వాళ్ళు కొంచం అటు ఇటూగా వస్తారుగా” అని నాన్నగారు అంటుండగానే మాఇంటి ముందొక కారు వచ్చి ఆగింది.
దాన్లోంచి ఒకాయన దిగి “భరత శర్మ గారి ఇల్లు ఇదేనాండి?” అంటూ అడిగారు.
వెంటనే నాన్నగారు” ఆ….. నేనే భరత శర్మ…. మీరు?” అని ప్రశ్నార్ధకంగా అడిగారు
“నన్ను అలంకార్ సినిమా హాలు ప్రొప్రైటర్ గారు పంపించారండీ! విశ్వనాథ సత్యనారాయణ గారింటికి వెళితే, వారు ఇక్కడున్నారని చెప్పారు వాళ్ళ వాళ్ళు….” అంటూ లోపలికొచ్చి నిలబడ్డారు.
ఇంతలో తాతగారు లఘు శంక తీర్చుకుని లోపలినుంచి వచ్చారు.
నాన్నగారు ఆయనకు గురువుగారిని చూపించారు.
ఆయన నమస్కారం చేసి తన వివరాలు చెప్పి గురువుగారినీ, నాన్నగారినీ కారెక్కించుకుని వెళ్ళిపోయేసమయానికి నేనూ కారు ముందు డోర్ తీసుకుని ఎక్కబోయా. మామూలే…. నాన్నగారు వద్దని కోప్పడ్డారు.
నా ఏడుపు మొహం చూసి తాత గారు …. రానీ ఏంబోయింది…. అనటం… నేను టపీ మని కారు ముందు సీట్లో కూచోవడం జరిగిపోయాయి.
కారు నేరుగా అలంకార్ టాకీస్ లోపల ప్రొప్రైటర్ ఆఫీస్ గది ముందు ఆగింది.
ఆయన బయటకొచ్చి నమస్కారం చేసి తన గదిలోకి తీసుకెళ్లారు.
వారిచ్చిన కాఫీ కొద్దిగా నోట్లో పెట్టుకుని, చప్పరించి తియ్యగా పానకంలా వుందని వదిలేసి సినిమా హాల్లోకి వెళ్లి బాల్కనీలో వాళ్ళు చూపించిన సీట్లలో కూర్చున్నారు. నాన్నగారి పక్క నేను. ఆ వరసలో ఇటు అటూ మరెవరూ కూర్చోలేదు. హాలు ప్రొప్రైటరు గారు మాత్రం వచ్చి గురువు గారి పక్కసీట్లో కూర్చున్నారు.
మామూలేగా …. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అవీ అయ్యాక INR ఇండియన్ న్యూస్ రివ్యూ పడింది…. బీహార్లో వరదలు…… ఆవు పాల దిగుబడి పెంచాలంటే…. తేనె మంచు తెగులు నుండి పంటల రక్షణ …..
లాంటి జాతీయ విషయాలు అయింతర్వాత …. మన ఆస్థానకవి ….. కవిసమ్రాట్, కళాప్రపూర్ణ, తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అన్న మాటలు వెనక ( బాక్ గ్రౌండ్ లో) వినపడుతుంటే ….. గురువుగారు హాయిగా, మామూలుగా వేసుకుని కూర్చునే గుడ్డ బనీను మీద బలవంతంగా వేసుకోవలసివచ్చిన లాల్చీతో, భుజాన కాశీ తువాలు, మోకాలు పైకి మడిచి కట్టిన పంచతో వస్తున్నదృశ్యం ….. వెనకాల బాక్ గ్రౌండ్ లో గురువుగారి గురించి చెపుతున్న కామెంటరీ ….. ఆ తర్వాత అక్కడే బయట నుంచుని ఉన్న వరలక్ష్మమ్మమ్మగారు, పావని బాబాయి, దుర్గత్తయ్యలతో తాతగారు, ఆ తర్వాత తమ్ములు రామచంద్రునకు తమ్ములు వేంకటేశ్వర్లుగారు, రామ్మూర్తి గార్ల పరిచయం….
అట్నుంచి నాన్నగారిని చూసి భుజం మీద చెయ్యి వేసి నడవటం ……
ఆ తర్వాత ఆరుబయట గురువుగారు, నాన్నగారు కూర్చుని కొంచం సేపు మాట్లాడుకోవటం, వారు చెపుతూ ఉంటే నాన్నగారు వ్రాయటం… మొత్తం మూడు, నాలుగు నిముషాలుంటుందేమో …… అదొక అందమైన అనుభూతి. ఇంతకీ ఈ న్యూస్ రివ్యూ చూపించినప్పుడు ఆడుతున్న సినిమా పేరు చెప్పలేదు కదూ …. ప్రేమనగర్. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు …..! జంటగా నటించిన సూపర్ హిట్టైన సినిమా.
గురు శిష్యులు న్యూస్ రివ్యూ గురించి మాట్లాడుకుంటూ….. “అంత సేపు షూటింగ్ చేసి అంత సినిమా తీసి చివరికి మొత్తం కట్ చేసేసారు మాష్టారూ….” అని నాన్నగారంటే,
“ఆమాత్రం చూపించేడ్చారు సంతోషించు భరత్శర్మా ….! వీడు కవిసమ్రాట్టైతేనేంటీ, అస్థానకవైతే నేంటి? వాళ్ళకదొక నిర్బంధ వార్తా ప్రసారం …. అంతే” …. అన్నారని నాన్నగారు భోజనాల దగ్గర మామ్మతో చెప్పారు కబుర్ల మధ్యలో.
విచిత్రం ఏమిటంటే గురువుగారికి కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ్ అవార్డుతో గౌరవించుకుంటే గానీ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థానకవిగా వారిని సమ్మానించుకోవాలని అనిపించక పోవటం!
గురువుగారు యేనాడూ ఈ అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నప్పుడు పొంగీపోలేదు, రానప్పుడు కుంగీ పోలేదు.
ఆయన ఎప్పుడూ ఇవేవీ తన మనసుకు పట్టనట్టే కళ్లజోడులోంచి ఎటో దూరంగా నిర్లిప్తంగా చూస్తూ ఉండేవారు. వారు చెపుతున్నప్పుడు నాన్నగారు వారి పుస్తకాలు లేఖకుడిగా వ్రాసేప్పుడు కూడా వారు అలా దూరంగా చూస్తూ …. చెప్పుకుంటూ పోయేవారే తప్ప నాన్నగారి వంక చూట్టం కానీ, వాక్యానికీ వాక్యానికీ మధ్య లేఖకుడి సౌలభ్యం కోసం ఆపటం కానీ ఉండేది కాదు.
అప్పుడు గురువుగారిని చూస్తుంటే …. వారు ఆకాశపు వెండి తెరమీద తన రచనను అక్షర రూప చలనచిత్రంలా దర్శిస్తూ, ఒక రంగుల దృశ్య కావ్యంగా వీక్షిస్తూ, వారి ఆలోచనామృతధార తెగకుండా తన కళ్లముందు ఆ దృశ్యాన్ని మననం చేసుకుంటూ నాన్నగారికి డిక్టేట్ చెసేవారా అనిపించేది నాకు.
నాన్నగారికి ప్రమోషన్ వచ్చి కడప ట్రాన్స్ఫర్ అయితే, సంతోషం కంటే గురువుగార్ని వదిలి దూరంగా వెళ్లాల్సి వస్తోందన్న దిగులే ఎక్కువ బాధించింది.
ప్రమోషన్ వద్దని చెప్పి ఇక్కడే ఉండిపోతానని గురువుగారితో చెపితే మాష్టారు ముక్క చివాట్లు పెట్టి నాన్నగారిని కడప పంపించారు.
ఆ సాహితీ విరాట్పురుషుడికి శిష్యుడైనడన్నాదే నాన్నగారికి అత్యంత ఆనందం కలిగించిన వాస్తవం! ఆ వాస్తవం ముందు లౌకికమైన పదోన్నతులు నాన్నగారికి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేదనిపించింది.
బెజవాడలో ఉన్నంతకాలం నాన్నగారు గురువుగారితో ఎన్ని సభలకు, ఎన్ని సమావేశాలకు వెళ్ళేరో ….
దగ్గర ఊళ్లైతే కారు, దూరమైతే ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం ఇద్దరికీ. ఆ సభానిర్వాహకులకు అది సమ్మతమైతేనే సభలకు గురువుగారు వెళ్ళేవారు.
గురువుగారితో చాలావరకు నాన్నగారు, లేదా పావని బాబాయి వెళ్ళేవారు. పరమగురువులతో గడపటమే గొప్ప విద్యాభ్యాసం …. వారితో కలిసి నడవటమే ….. జీవితంలో పదోన్నతి ….. వారి మాటలు వినటమంటేనే ….. ఆ సాహిత్య సముద్రం నుంచి దోసెడు విషయాలు అమృతాయమానంగా గ్రోలటం కదండీ!!! సముద్రం దగ్గరకు చెంబుతో వెళితే చెంబుడే నీళ్ళు, గుండిగతో వెళితే గుండిగడు….. అది నాన్నగారి భాగ్యం!
వారి దర్శనమే, స్పర్శనమే …. నాలాటివాడికి ….. రామ పాద స్పర్శతో పునీత మైన అహల్య భాగ్యమంత…..!
పరమగురు స్మరణ మనసునెక్కడికో లాక్కెళ్ళింది….
మళ్ళీ విషయంలోకొస్తే…..
ఆ ఆలంకార్ సినిమాహాల్లో చూసిన న్యూస్ రివ్యూ తో నాన్నగారికి కుతి తీరక విజయాటాకీసులో కూడా ఇదే న్యూస్ రివ్యూ అని ఎవరో చెపితే అప్పుడు తను మళ్ళా వెళుతూ మమ్మల్నందర్నీ కూడా తీసుకెళ్లారు.
అక్కడ అప్పుడాడుతున్న సినిమా తాసిల్దారుగారి అమ్మాయి. శోభన్ బాబు గారు డబల్ యాక్షన్, చంద్రకళగారు, ఇంకో ఆవిడ… ఎవరో గుర్తు లేదు…..వాణిశ్రీగారనుకుంటా. ఆనాడు న్యూస్ రివ్యూ చూస్తూ, ఈ న్యూస్ రివ్యూ మళ్ళా ఇంకోసారి వేస్తే బావుణ్ణని నాన్నగారు ఎన్నిసార్లనుకున్నారో….!
గురుసన్నిధిలో లేఖిణితో వ్యాసమహర్షికి గణపతిలా ఉన్న ఆ సన్నివేశం గురువు గారింట్లో రోజూ నిత్యకృత్యమే అయినా తనని తను అలా గురుసేవ చేసుకుంటున్న దృశ్యం చలన చిత్రమై కళ్లముందు చూసుకున్నప్పుడు నాన్నగారి పారవశ్యానికి అవధులు లేవు.
గురు శిష్య బంధానికి, గురు భక్తికి, శిష్య వాత్సల్యానికి తరతరాలకు గుర్తుండే మహోన్నత ధీ శిఖరాలు వారు!
                 
